Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కలివిడిగానా? విడివిడిగానా?

ప్రతి సబ్జెక్టులో ఎంతో సిలబస్‌... ఏకధాటిగా చదువుతూపోతే సరిపోతుంది కదా? వాటిని మళ్లీ ఇంకోసారి చదవాలా? దానిబదులు మరో చాప్టర్‌ కవర్‌ చేయొచ్చుగా? ఒంటరిగా ప్రిపేరవటం కంటే గ్రూప్‌ స్టడీ మంచిదేనా? పరీక్షల సమయంలో ఇలాంటి సందేహాలెన్నో విద్యార్థులను సతమతం చేస్తుంటాయి. వీటిపై నిపుణులు ఏమంటున్నారు? పకడ్బందీగా సన్నద్ధమవుతూ మంచి మార్కులు తెచ్చుకోవటానికి ఏం సూచనలు ఇస్తున్నారు?

పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. రోహిత్‌కి టెన్షన్‌ పట్టుకుంది. అన్ని సబ్జెక్టులూ చదువుతూనే ఉన్నా, కొన్ని అర్థం కానట్టు తోస్తున్నాయి. ప్రతిదీ ముఖ్యమైంది గానే అనిపిస్తోంది. మూడు పాఠ్యాంశాలు చదివాక, మొదటిది మర్చిపోయినట్టు అనిపిస్తోంది. ఇన్నేసి అంశాలు గుర్తుపెట్టుకోగలనా అని భయంగా ఉంది. ఒకటో రెండో వదిలేస్తే..? అనిపిస్తోంది గానీ, అవే పరీక్షలో వస్తేనో అని భయంగా కూడా ఉంది. చదువుతుంటే ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయి. పరీక్షలు ఎలా రాస్తానో అనే ఆందోళన. పోనీ గ్రూప్‌ స్టడీకి మిగతా స్నేహితులతో కల్సి వెళ్దామా అంటే సమయం వృథా అవుతుందేమోనని అదొక భయం!

విద్యార్థుల్లో ఇటువంటి పరిస్థితి సహజమే. అయితే సరైన మార్గం గ్రహించి, ఆచరిస్తే కంగారుపడాల్సిన పనే ఉండదు. పునశ్చరణ (రివిజన్‌) విషయంలో కొద్దిపాటి శ్రద్ధ చూపి, అవసరం మేరకు గ్రూప్‌స్టడీని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి భయాలూ లేకుండా హాయిగా పరీక్షలు రాయొచ్చు. పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ కొంత ఆందోళన ఉన్నా, అది పరీక్షలు మొదలయ్యేరోజు చాలావరకు తగ్గిపోతుంది. పరీక్షలను ఆ రోజు ఎదుర్కోడానికి మానసికంగా సిద్ధమై ఉండటమే అందుకు కారణం. సరైన ప్రణాళిక, సమయానికి సంతులిత ఆహారం, తగినంత విశ్రాంతి ఉంటే పునశ్చరణ గానీ, పరీక్షలకు సిద్ధం కావడం కానీ సమస్యలు కావు.

పునశ్చరణ ఎలా?
క్రమపద్ధతిలో పాఠ్యాంశాలన్నిటినీ తిరిగి చదవటం ఫైనల్‌ పరీక్షలప్పుడు చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి చదివినా, పునశ్చరణ చేయకుండా వదిలేస్తే ఏదీ సరిగా పరీక్షల్లో గుర్తు రాదు. నిజానికి చాలామంది ఏడాది పొడుగునా పునశ్చరణకు ప్రాముఖ్యం ఇవ్వక, పరీక్షల సమయానికి హడావుడి పడుతుంటారు.
నేర్చుకున్న అంశాలను నిర్దిష్ట కాలవ్యవధుల్లో మననం చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. చదివిన ఏ విషయమైనా బాగా గుర్తుండిపోవాలంటే కొద్ది విరామాలతో మళ్లీ మళ్లీ చదివి, మననం చేసుకోవాలి.
నోట్స్‌ చదవటం, మెటీరియల్‌ కాపీ చేయటం లాంటివి ‘పాసివ్‌ రివిజన్‌’లో భాగం. అది మాత్రమే సరిపోదు. చదివే విషయాల గురించి స్పష్టంగా ఆలోచించటం, అవగాహన చేసుకోవటం, నేర్చుకుంటున్న అంశాలను ఇప్పటికే నేర్చుకున్నవాటితో అనుసంధానం చేసుకోవడం ‘యాక్టివ్‌ రివిజన్‌’ అవుతుంది. ఇది చాలా ముఖ్యం. ఒక చాప్టర్‌ పూర్తయ్యాక ‘ఇప్పుడు ఏం నేర్చుకున్నాను?’, ‘పరీక్షలో వస్తే దీన్ని జవాబుగా ఎలా రాస్తాను?’ అని ప్రశ్నించుకుంటూ చదవటం మేలు చేస్తుంది.
* ఏ రోజు ఏమి పునశ్చరణ చేసుకోవాలో వివరంగా ప్రణాళిక వేసుకోవాలి. కచ్చితంగా ఆచరించాలి.
* రోజుకు 8 గంటల పాటు, తగినంత విరామం తీసుకుంటూ పునశ్చరణ చేయవచ్చు.
* పాఠ్యాంశ సారాంశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. తర్వాత మౌలిక భావనలను (బేసిక్‌ కాన్సెప్ట్‌) గుర్తుంచుకుంటే, వాటిని విస్తృతŸపరిచి పరీక్షలో రాయవచ్చు.
* నోట్స్‌ నుంచి ముఖ్యమైన పాయింట్లు గుర్తించి, వాటినుంచి ముఖ్యమైన పదాలను నోట్స్‌ కింద రాసి ఉంచుకుంటే, దాని ఆధారంగా జవాబును విస్తృతపరచడం సులభం.
* సులభంగా పాయింట్లు గుర్తుంచుకోవటానికి మైండ్‌ మ్యాపింగ్‌ కూడా ఉపయోగపడుతుంది.
* నమూనా ప్రశ్నపత్రాలకు నిర్దిష్ట సమయంలో జవాబులు మొత్తం రాసేలా సాధన చేయాలి.

ఇలా చేయొద్దు
ఏకబిగిన చదువుకుంటూ పోవడం సరికాదు. ప్రతి ముప్పావు గంటకూ, లేదా గంటకూ కాసేపు విరామం తీసుకోవాలి. విరామం అంటే చదువు ఆపేసి వెళ్ళి టీవీ చూడటం, గేమ్స్‌ ఆడటం కాదు. కొద్దిసేపు నడవటం, పచ్చని చెట్లను చూడటం లాంటివి. వీలైతే విరామంలో కూడా చదివింది మననం చేసుకోవడం మంచిది.
* కష్టమైనవి చివరి వరకూ చదవకుండా పక్కనపెట్టటం నష్టదాయకం. అప్పుడవి మరింత కష్టంగా తోచి, సమయం చాలదేమో అన్న ఆందోళన పెరుగుతుంది. ముందు చదివిన సులభతరమైనవి కూడా మర్చిపోయే ప్రమాదం వస్తుంది. అందుకే కష్టంగా తోచే పాఠ్యాంశాలను ముందుగా రివిజన్‌లో ముగించి, సులభమైనవి చివర్లో చదవాలి.

కంబైన్డ్‌ స్టడీ మంచిదేనా?
చదువు మీద శ్రద్ధ ఉన్న కొందరు విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి, పాఠ్యాంశాలు అధ్యయనం చేస్తే, తరగతిలో నేర్చుకున్నదానికంటే ఎక్కువే నేర్చుకోగలరని విద్యా మనోవిజ్ఞానశాస్త్రజ్ఞులు చెపుతారు. కానీ ఈ పరీక్షల తరుణంలో గ్రూప్‌ స్టడీ/కంబైన్డ్‌ స్టడీ కాకుండా ఎవరికి వారే చదువుకోవడం మంచిది. అయితే బోధపడని, జటిలమైన అంశాల వరకూ కంబైన్డ్‌ స్టడీని పరిమితం చేయవచ్చు. బృందంలో చర్చించినపుడు, అప్పటివరకూ గ్రహించని విషయాన్ని ఆకళింపు చేసుకోవటం తేలికవుతుంది. ఇతర విద్యార్థుల ప్రిపరేషన్‌ పద్ధతులు తెలుస్తాయి. ఒక్కోసారి అవి మనకూ ఉపయోగపడతాయి. తరగతిలో సందేహాలు అడగటానికి వెనుకాడేవారు మిత్రుల వద్ద సందేహాలను వ్యక్తీకరించి, నివృత్తి చేసుకోగలుగుతారు. సరదా వాతావరణంలో ఉత్సాహంగా ప్రిపరేషన్‌ కొనసాగించగలుగుతారు.

నిబంధనలు పెట్టుకోవాలి..
* గ్రూప్‌లో ఎంతమంది ఉండాలనేది ముందే నిర్ణయించుకోవాలి. మరీ ఇద్దరే అయితే ఎక్కువ చర్చకు అవకాశం ఉండదు. అయిదుగురి కంటే ఎక్కువమంది అయితే, గ్రూప్‌ సభ్యుల మధ్య కమ్యూనికేషన్‌ ప్రభావశీలంగా ఉండదు.
* అందరూ బాగా చురుకైన విద్యార్థులు, లేదా అందరూ మందకొడిగా ఉండే విద్యార్థులూ కాకుండా, ఇరు పక్షాల మేలు కలయికగా ఉండేలా చూసుకోవాలి.
* గ్రూప్‌కి ఒక నాయకత్వం ఉండేలా, అందరూ దాన్ని ఆమోదించేలా ఉండాలి.
* నేర్చిన అంశాన్ని తాము అర్థం చేసుకున్నరీతిలో తమ మాటల్లో చిన్న నోట్సుగా రాసుకోవాలి. దాని సారాంశాన్ని ఇతరులకు బోధించాలి. ఒకసారి ఎదుటి వ్యక్తికి వివరించŸగల్గిన విషయాన్ని మర్చిపోవడం అంత సులభం కాదు.

జాగ్రత్త సుమా!
* సరిగా చదవలేమేమో, ప్రశ్నపత్రం కష్టంగా ఉంటుందేమో..అనే ప్రతికూల ఆలోచనా ధోరణి ఉన్నవారు బృందంలో ఉండకుండా జాగ్రత్తపడాలి.
* కబుర్లు పెరిగి, చదువు వెనకబడకుండా, అనవసరమైన చర్చలూ, వాదోపవాదాలూ పెరక్కుండా చూసుకోవాలి.
* అందరూ చేరవలసిన సమయం, చర్చించాల్సిన పాఠ్యాంశాలు ముందుగానే నిర్ణయించుకోవాలి.


Back..

Posted on 18-02-2019