Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరీక్షల ఒత్తిడిని ఓడిద్దాం!

     తల్లిదండ్రుల బలవంతంతో ఇష్టంలేని గ్రూప్‌ తీసుకున్నా.. అందమైన ఆకర్షణల మధ్య సర్దుకున్నాడు సతీశ్‌. ప్రణాళిక లేకుండా చదవడంతో రివిజన్‌ విషయం పట్టించు కోలేదు. అన్నీ వచ్చేసినట్లే ఉన్నా ఏదీ గుర్తుకు రావడం లేదని ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి దాటినా నిద్రపట్టదు. పగలు కునుకులేస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. ఇవన్నీ ఒత్తిడి లక్షణాలు. వీటిని సరైన సమయంలో గుర్తించి సానుకూల దృక్పథంతో వ్యవహరించకపోతే పరిస్థితి ప్రతికూలంగా మారిపోతుంది.
శ్రద్ధగానే చదువుతున్నా విద్యార్థులందరిలోనూ అలాంటి పరిస్థితే ఎంతోకొంత కనిపిస్తుంటుంది. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలూ, ఎంసెట్‌, నీట్‌, జేఈఈ, ఇంకా డీమ్‌డ్‌ యూనివర్సిటీల ప్రవేశపరీక్షల కోసం సిద్ధమయ్యేవారూ, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులూ ఓ పక్క ప్రిపరేషన్లో మునిగిపోతూ మరో పక్క పరీక్షల ఆలోచనల ఒత్తిడితో సతమతమవుతుంటారు. ఈ ఒత్తిడి మితిమీరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. పరీక్షలు బాగా రాసి, ఆశించిన మార్కులు తెచ్చుకోవాలంటే ఇది తప్పనిసరి.
తలనొప్పి, ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతి అయ్యేలా ఉండటం, ఎక్కువ తినెయ్యటం, నిద్రలేమి, అలసట..ఇవన్నీ ఒత్తిడిని సూచించే లక్షణాలు. మానసికంగా చూస్తే... కోపం, అసహనం, నిరాశ, ఆత్మవిశ్వాసం లేకపోవటం, మూడ్‌ తరచూ మారిపోతుండటం లాంటివి గమనించవచ్చు.
పరీక్షల ఒత్తిడి, దానివల్ల ఏర్పడే భయాలకు కొన్ని మూల కారణాలుంటాయి. వాటిని మొదట అర్థం చేసుకోవాలి. ఆపై కొన్ని సులభమార్గాలతో అధిగమించవచ్చు.
జ్ఞాపకశక్తి లోపం
చాలామంది విద్యార్థులు ఎంత చదివినా, చదివిందేదీ గుర్తుండటం లేదని బాధపడుతుంటారు. నిజానికి వీళ్లు పరీక్షలు బాగానే రాస్తారు. కానీ ఎంత చదివినా గుర్తు ఉండకపోవడమనేది పరీక్షల ముందు రోజుల్లో ఎదురయ్యే భయం.
పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని ‘నేర్చుకునే పద్ధతి’ (లెర్నింగ్‌ మోడ్‌)లో చదివితే మర్చిపోవడం కష్టం. అర్థమైన విషయాన్ని ఎవరూ మర్చిపోరు. సబ్జెక్టు మీద ఇష్టంతో, ఆసక్తితో చదివినపుడు పాఠ్యాంశాన్ని మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇష్టమైన సినిమాలో ప్రతి దృశ్యాన్నీ ఎలా గుర్తు పెట్టుకోగలుగుతున్నాం? దానికి పెద్దగా ప్రయత్నం కూడా చేయడం లేదే? ఇది కూడా అంతే!
కాస్త వ్యాయామం... సానుకూలత
* కొద్దిసేపు సైక్లింగ్‌, చిన్నపాటి శారీరక వ్యాయామం చేయటం ఒత్తిడిని తగ్గిస్తాయి.
* బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌, పాజిటివ్‌ సజెషన్స్‌ ఇచ్చుకోవడం, ధ్యానం, అవసరమైతే వైద్యులను సంప్రదించి కొద్దిపాటి మందులు వాడుతూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
* కొన్నిసార్లు విటమిన్ల లోపం కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
* చుట్టూ ఉన్న పరిసరాల్లోని చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కలిగించి ఒత్తిడిని దూరం చేసేవి చాలా ఉంటాయి. ఉదయిస్తున్న సూర్యుడు, వికసిస్తున్న పూలు, ఆడుకుంటున్న పిల్లలను చూడటం, చల్లగాలిని ఆస్వాదించడం, శ్రేయోభిలాషులతో కాసేపు మాట్లాడటం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేసేవే.
* సానుకూల దృక్పథంతో ఉండాలి. ఆ దిశగా ఆలోచనలను మళ్లించాలి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి అన్నింటికంటే బాగా పనిచేసే మందు.
ఏకబిగిన గంటలతరబడి చదవకుండా 40-45 నిమిషాలకోసారి 5-10 నిమిషాల విరామం ఇస్తూ చదవటం వల్ల సబ్జెక్టును చక్కగా ఆకళింపు చేసుకోవచ్చు. బాగా గుర్తుంటుంది కూడా! బట్టీ పద్ధతిలో చదివితే ఒక పాయింట్‌ మధ్యలో గుర్తుకు రాకపోతే ఇక మిగిలిన పాయింట్లన్నీ కూడా దాని వెనకే మాయమైపోతాయి. విద్యార్థి అయోమయంలో పడతాడు. అందుకే, ప్రతి పాఠ్యాంశాన్నీ శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటే చదివినదాన్ని మర్చిపోయే సమస్య రాదు.
నిద్రలేమి
చాలామంది అర్ధరాత్రి దాటాక కూడా చదువుతూ పగలు కునికిపాట్లు పడుతుంటారు. అలాగే వివిధ పోటీపరీక్షలకు సైతం అమితంగా శ్రమించడం వల్ల తరచూ నిద్రలేమికి గురవుతుంటారు. అటువంటి సమయంలో అలసటకు లోనై ఆలోచనలు బలహీనపడతాయి. పరీక్షలు సరిగా రాయలేమేమో అని భయం కలుగుతుంది.
ఎక్కువ సమయాన్ని చదువుకోసం కేటాయించడం వల్ల నిద్రలేమి సమస్య బాధిస్తుండటం సహజమే! మరికొంత మంది ఒత్తిడి వల్ల ఎక్కువ నిద్రపోలేరు. దీనికి కనీస సమయమైనా నిద్రపోవడం తప్ప వేరే మార్గం లేదు. నిద్రలేమి ప్రభావం మానసిక, శారీరక ఆరోగ్యాల మీద తప్పకుండా పడుతుంది. కాబట్టి విద్యార్థులు వారి వయసునిబట్టి తగినన్ని గంటలపాటు నిద్రపోవాలి. ఒత్తిడితో, ఆందోళనతో నిద్ర పట్టనివారు ఒత్తిడిని జయించే కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల దీన్ని అధిగమించవచ్చు.
ప్రణాళిక లేకుండా చదవడం
ప్రణాళిక లేకుండా చదవడం వల్ల ఏ పాఠ్యాంశం మీదా పట్టుని సాధించలేక, ఏ ఒక్కదాన్నీ పూర్తి చేయలేకపోయామని పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ కంగారు మొదలవుతుంది. ఆ కంగారులో మరిన్ని పొరబాట్లు చేస్తారు.
ప్రణాళికబద్ధంగా చదివితే పరీక్షలనాటికి చాలా సిలబస్‌ను రివిజన్‌ కూడా చేసి పరీక్షలకు సంసిద్ధంగా ఉండగలుగుతారు. చాలామంది సులభంగా ఉండే ప్రశ్నలు లేదా లెక్కలు ముందుగా ప్రిపేరవుతూ కష్టమనుకున్నవి చివర్లో చదవొచ్చని వాయిదా వేస్తారు. కష్టమైన అధ్యాయాన్నో, అంశాన్నో చివరివరకూ అట్టిపెట్టుకుంటే ఆ సమయంలో దాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఒత్తిడి పెరుగుతుంది. దాని ప్రభావం సులభమైన మిగతా పాఠ్యాంశాల మీద కూడా పడొచ్చు. ఏ రోజు ఏ సబ్జెక్టును ఎంత పరిమాణంలో చదవాలనేది ముందుగానే నిర్దేశించుకుని పరీక్షల తేదీ రావడానికి ముందే రివిజన్‌ మొదలుపెట్టాలి.
ఒత్తిడి
శారీరకం
* తలనొప్పి
* కండరాలు పట్టేసినట్టుండటం
* తరచూ ఇన్‌ఫెక్షన్లు
* అలసట
మానసికం
* గజిబిజి ఆలోచనలు
* పీడకలలు
* తొందరపాటుతనం
* ప్రతికూల భావనలు
భావోద్వేగాలు
* ఆత్మవిశ్వాసం లోపించటం
* మొండిపట్టు
* ఒంటరితనం
* చిరాకుపడటం
ప్రవర్తన
* నిద్రపట్టకపోవటం
* ఆకలి తగ్గిపోవటం
* అసహనం
* ధూమపానం లాంటి అలవాట్లు
రివిజన్‌ ప్రాధాన్యం గ్రహించకపోవడం
చాలామంది పరీక్షల సమయం ముంచుకొస్తే తప్ప రివిజన్‌ జోలికే వెళ్లరు. పరీక్షలు దగ్గరపడ్డాక చదవాల్సింది కొండంతగా కనబడి, భయకంపితులవుతారు.
రివిజన్‌ను కూడా ప్రణాళిక ప్రకారం చేయాల్సిందే! పాఠ్యాంశం మొత్తం మళ్ళీ చదవటం కాకుండా నోట్సునూ, హైలైట్‌ చేసుకున్న ముఖ్యాంశాలనూ చదువుతూ వెళ్ళటమే రివిజన్‌ అవుతుంది. ఒక చాప్టర్‌ను చదివాక అది పూర్తిగా వచ్చేసిందన్న భరోసాతో విద్యార్థులు చాలారోజుల వరకూ దాన్ని మళ్లీ ముట్టుకోరు. వారం తరువాత దాన్ని చూస్తే.. మొత్తం మళ్లీ చదవాల్సి వస్తుంది. విద్యార్థి శ్రద్ధగా చదివిన ఒక అంశాన్ని 24 గంటల తరువాత తిరిగి చెప్పమని అడిగితే అందులో 16 శాతం మాత్రమే గుర్తుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే-
* ఏ పాఠ్యాంశమైనా మొదటిసారి చదివిన 24 గంటలలోపు మరోసారి చదవాలి.
* తర్వాత 7 రోజులకూ, 15 రోజులకూ, 30 రోజులకూ కూడా దాన్ని చదవాలి.
* ఇలా చేస్తే ఆ పాఠ్యాంశాన్ని మర్చిపోవటమనేది ఉండదు.
అందుకే రివిజన్‌ చార్ట్‌ తయారుచేసుకుని పాటిస్తుండాలి. ముఖ్యంగా పరీక్షలు దగ్గరపడ్డాక రివిజన్‌ను ఏమాత్రం విస్మరించకూడదు.
కెరియర్‌ సంబంధ ఆలోచనలు
సుదూర భవిష్యత్‌ గురించిన ఆలోచనలు విద్యార్థులను తరచూ భయపెడుతుంటాయి. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు చదువు ఒత్తిడితోపాటు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన, భయాలు ఉంటాయి. ఏ ర్యాంకు వస్తే ఎలాంటి కాలేజీలో సీటు వస్తుంది, ఏ కోర్సు ఎంచుకోవాలి, దానికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి.. వంటి ఆలోచనలు వేధిస్తుంటాయి.
ఈ సందేహాలు తీర్చుకోవటానికి పరీక్షలకు ముందే విద్యార్థులు కెరియర్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమాలకు హాజరుకావొచ్చు. ఎప్పుడో చేయబోయే ఉద్యోగాల గురించి ఇప్పుడు అనవసర ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ‘వంతెన దగ్గరకు చేరుకున్నాకే దాన్ని దాటాలి’ అనే సూక్తిని విద్యార్థులు ఒంటబట్టించుకుంటే మంచిది.
కౌమార దశ భావోద్వేగాలు
హార్మోన్ల కారణంగా యువతీయువకుల మధ్య కలిగే పరస్పర ఆకర్షణలు చదువుమీద నుంచి ధ్యాస మళ్లడానికి చాలావరకూ కారణమవుతాయి. కొందరైతే అటువంటి భావనలు కలగడం నైతికంగా తప్పనే అపరాధ భావనతో ఉంటారు.
టీనేజ్‌ దశలో పరస్పర ఆకర్షణలు సహజమే అయినా, వాటి ప్రభావంతో చదువు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువసేపు ఫోన్లలో కబుర్లతో గడపడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఊహల్లో విహరించడం.. వీటన్నిటి ప్రభావం చదువుమీద తప్పకుండా పడుతుంది. ప్రస్తుతం తమ ముందు ఉన్న ప్రాధాన్యాల్లో ముఖ్యమైనదాన్ని, సరైనదాన్ని ఎంచుకునేలా వారిని తల్లిదండ్రులూ, కౌన్సెలర్లూ ప్రభావితం చేయగలగాలి. ఆకర్షణలూ, లైంగిక భావనలూ కలగడం తప్పు కాదు కానీ ప్రస్తుతం అది విద్యార్థుల ప్రాధాన్యం కాకూడదు.
ఇష్టంలేని గ్రూప్‌ తీసుకుని ఉండటం
కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల ఇష్టప్రకారం గ్రూప్‌ తీసుకుని, తరువాత దాంట్లో ఆసక్తిలేక చదువులో రాణించలేరు. అటువంటి సందర్భంలో వారు చదువు మీద, తరగతిలో ఏమాత్రం ఏకాగ్రత చూపించలేరు. ఫలితంగా, సబ్జెక్టు కష్టంగా ఉండటం, చదివింది గుర్తు ఉండకపోవడం, పరీక్షలు దగ్గరకు వస్తుండగానే ఉత్తీర్ణులం కాలేమనీ, తల్లిదండ్రులకు మొహం చూపించలేమనీ ఆందోళనలతో సతమతమవుతుంటారు.
ఆసక్తిలేని సబ్జెక్టును శ్రద్ధగా చదవడం ఎవరికైనా సమస్యే! గ్రూప్‌ తీసేసుకున్నారు. కాబట్టి శ్రద్ధగా చదివి ముందుకు నడిచి కోర్సు పూర్తిచేయడమే తక్షణ కర్తవ్యం. తమ అభిరుచుల ప్రకారం పై చదువులు చదవడానికి ఏ గ్రూప్‌లోనైనా అవకాశాలు ఉన్నాయనేది గ్రహించి భవిష్యత్తు మీద ఆశ కల్పించుకోవటం ముఖ్యం. అదే సమయంలో ఎటువంటి పైచదువులకైనా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడం అవసరమేననేది విద్యార్థులు గ్రహించాలి.

- సుజాత వేల్పూరి, ఎడ్యూకేష‌న్ కౌన్సెల‌ర్‌

posted on 30.01.2018