Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
త్రిమూర్తుల సాయం విద్యార్థి విజయం!

అదే సిలబస్‌.. అంతే సమయం.. అవే ప్రశ్నలు అయినా మార్కుల్లో ఎన్నో మార్పులు. ఒకరు శిఖరంలో.. ఇంకొకరు పాతాళంలో.. మధ్యలో కొట్టుమిట్టాడేది ఇంకొందరు. సహజమైన తెలివితేటల వల్ల వచ్చే తేడాలను కాసేపు పక్కన పెడితే.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షల కాలంలో పిల్లలతో వ్యవహరించే తీరు ఫలితాలపై తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిని వదిలేసి.. పోలికలను మానేసి.. ప్రోత్సాహంతో ప్రేరణ ఇస్తే.. పిల్లలు మంచి గ్రేడ్‌ కచ్చితంగా కొట్టేస్తారు. టెన్త్‌, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నేపథ్యంలో అమ్మానాన్నలు, గురువులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలతోపాటు విద్యార్థులు అనుసరించాల్సిన మార్గాలూ తెలుసుకుంటే గరిష్ఠ మార్కుల సాధన సులభమవుతుంది.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల్లో తాపత్రయం, తమ విద్యార్థులను తీర్చిదిద్ది మంచి పేరు పొందాలని ఉపాధ్యాయుల ఆరాటం, మంచి ఫలితాలు సాధించి ఎక్కువ మందిని ఆకర్షించాలని యాజమాన్యాలు...అంతా కలిసి విద్యార్థుల్లో ఉన్న సహజ ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. పదో తరగతి విద్యార్థి ఉన్న ప్రతి ఇంటా ‘ఎ’ గ్రేడ్‌ నామస్మరణ! అలాగని ఇంటర్మీడియట్‌కు ఎలాంటి మినహాయింపూ లేదు. 99 శాతం సాధించినందుకు ప్రశంసించేవారి కంటే ఒక్క శాతం కోల్పోయినందుకు సానుభూతి తెలిపేవాళ్లే ఎక్కువయ్యారు. అంచనాలు తప్పితే విద్యార్థుల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా తల్లడిల్లిపోతున్నారు.

విద్యార్థి క్రికెట్‌లో తలపడే బ్యాట్స్‌మన్‌ అనుకుంటే తనతోపాటు బ్యాటింగ్‌ కోసం దిగిన సహచరుడు లాంటివారు తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడు అంపైర్‌ పాత్రలోనూ, బంధుమిత్రులు మ్యాచ్‌ చూసే వీక్షకులుగానూ ఉండాలి. పిచ్‌ ప్రశ్నపత్రం, బౌలర్‌ విసిరే బంతులే ప్రశ్నలు. బంతిని కొట్టగానే సహచర బ్యాట్స్‌మన్‌ రన్‌ మూవ్‌మెంట్‌ ఇచ్చినట్టుగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. బంధుమిత్రులు చప్పట్లు కొట్టాలి. తప్పులు చేస్తే హెచ్చరించడానికి అంపైర్‌ అనే ఉపాధ్యాయులు ఉండాలి. వీరందరి మధ్యా సమన్వయం ఉంటే మ్యాచ్‌లో విజయం తథ్యం!

అమ్మా.. నాన్నలకు..
పిల్లలను తోటి వారితో పోల్చడం తల్లిదండ్రులు మానేయాలి. పరీక్షల సమయంలో పుస్తకాలతో వాళ్లను గదుల్లోకి నెట్టేసి.. విందులు, వినోదాల్లో మునిగిపోకూడదు.
* పిల్లల మానసిక స్థితిని తెలుసుకోవాలి. పరీక్షలంటే భయపడినా, వాటి కారణంగా ఒత్తిడికి లోనైనా ధైర్యం చెప్పాలి. సానుకూలంగా వ్యవహరించాలి.
* రాత్రి వేళల్లో వారు పడుకునేవరకు మెలకువతోనే ఉండటం మంచిది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చదువును కొనసాగిస్తే మాత్రం ఆ రోజుకి చదివింది చాలని చెప్పాలి. మిగిలింది మరుసటి రోజు కొనసాగించుకోవచ్చని సూచించాలి. కనీసం ఏడు గంటలు నిద్రపోతేనే నేర్చుకున్న విషయాలు గుర్తుంటాయి.
* చదువుకోవడానికి మంచి వాతావరణమూ ముఖ్యమే. ఇందుకోసం ఇంట్లో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడాలి.
* నీరసించిపోకుండా ఉండడానికి తేలికగా జీర్ణమయ్యే బలవర్దకమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి.
* అవకాశం లభిస్తే కనీసం మొదటి రోజైనా పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం వాళ్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.

పోలికలు.. వ్యాఖ్యలు వద్దు!
* పిల్లలను ఎవరితోనూ పోల్చి చూడొద్దు. అక్కకు పదికి పది గ్రేడ్‌ పాయింట్లు వచ్చాయనో, పక్కింటి అబ్బాయి టాపర్‌గా ఉన్నాడనో చెబుతూ తక్కువచేసే పోలికలు చేయవద్దు.
* బాధ్యతలేదు, సమయాన్నంతా వృథాచేసుకుంటున్నావు ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు పిల్లల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి.
* పరీక్షల సమయంలో ఇంటివద్ద విందులు, చుట్టాలను పిలవడం లాంటి వాటిని విస్మరించాలి.
* ప్రీఫైనల్‌ పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి అసంతృప్తిని వ్యక్తం చేయకుండా మరింత మెరుగైన ప్రిపరేషన్‌కు సూచనలు చేయాలి.
* పిల్లల కోసం పడుతున్న కష్టాలు, త్యాగాలను వారితో ప్రస్తావిస్తే వాళ్లు అనవసరమైన ఒత్తిడికి గురవుతారు. అలాంటివి వదిలేయాలి.

గమ్యం చేర్చే గురువు!
‘ఈ సమస్యను నా పదేళ్ల సర్వీస్‌లో కేవలం ఒకే ఒక విద్యార్థి రెండు నిమిషాల్లో సాధించాడు’
‘ఈ సమస్యను ఒక విద్యార్థి రెండంటే రెండు నిమిషాల్లోనే పూర్తిచేశాడు’
సాధారణంగా ఉపాధ్యాయులు చేసే ఆ రెండు వ్యాఖ్యల్లో ఎంత భేదం ఉందో గ్రహించాలి. మొదటి వ్యాఖ్యతో పదేళ్లలో ఒక్కడా... అబ్బో మనవల్ల కాదులే అని పిల్లలు నీరసించిపోతారు. రెండో వాక్యానికి సంబంధించి.. రెండు నిమిషాల్లో చేశాడా... ఇంకా తక్కువ సమయంలోనే చేసేస్తా.. అంటూ ఉత్సాహంతో విద్యార్థులు ఉరకలు వేస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయత్నాలు చేస్తారు. విజయం సాధించానికి అవకాశాలూ ఉన్నాయి. మంచి ఫలితాలు అందుతాయి.
* విద్యార్థులకు ఇంకా ఏవైనా సందేహాలుంటే అర్థమయ్యేలా వివరించాలి.
* ప్రీ ఫైనల్‌ పరీక్షల జవాబుపత్రం ఆధారంగా ప్రతి విద్యార్థికీ విడిగా విలువైన సూచనలు అందించాలి. వాళ్లు ఎలా రాశారు, ఇంకా ఏవిధంగా రాయవచ్చు, ఏ అంశాల్లో వెనుకబడ్డారు, వాటిని ఉన్న వ్యవధిలో ఏ విధంగా అధిగమించవచ్చో విడమర్చి చెప్పాలి.
* చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలి. వారికోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. పరీక్షలో మరింత మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి తగిన సూచనలు చేయాలి. బాగా ముఖ్యమైనవాటిని మరోసారి చెప్పి, గుర్తుంచుకునేలా సాయపడాలి.
* కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ప్రేరణ కలిగించే విషయాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి.

మందలింపులు మరచిపోవాలి
* చదువులో వెనుకబడిన విద్యార్థులను కించపరచడం, మందలించడం చేయవద్దు.
* పని ఒత్తిడి ప్రభావం వాళ్లపై పడే విధంగా ప్రవర్తించకూడదు.
* ఇద్దరు విద్యార్థులను పోల్చడం, ‘పూర్వ విద్యార్థులే చాలా బాగు’ అనడం... వంటివి విస్మరించాలి.
ప్రీ-ఫైనల్‌ తర్వాత విద్యార్థులు ఏ అంశాల్లో ఏ విధంగా వెనుకబడ్డారో ఉపాధ్యాయులు వివరించాలి. లోపాలను సరిదిద్దుకోవడానికి తగిన సూచనలు చేయాలి.

విద్యార్థులూ... మీరిలా...
* ఏ రోజు పూర్తిచేయాల్సిన పునశ్చరణ ఆ రోజే విజయవంతంగా ముగించాలి. ఒకవేళ సమయం సరిపోక ఏవైనా పాఠాలు మిగిలిపోతే మరుసటిరోజే వాటిని పూర్తి చేసేయాలి.
* పరీక్షలకు ముందు ఒకే సబ్జెక్టుకు సంబంధించి వివిధ పుస్తకాల అధ్యయనం వద్దు. ప్రతి సబ్జెక్టులోనూ పరిమితమైన పుస్తకాలనే చదవాలి. తరగతిలో రాసుకున్న నోట్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ‌
* పరీక్షకు ముందు వీలైనంత వరకు కొత్త విషయాలేవీ నేర్చుకోకుండా, చదివిన అంశాలే పునశ్చరణ చేయాలి.
* ఎప్పటికప్పుడు స్వీయ సమీక్ష చేసుకోవాలి. అనుకున్న ప్రకారం అధ్యయనం, పునశ్చరణ కొనసాగుతోందా, ఎదురవుతోన్న అవరోధాలేంటి, ఎలా అధిగమించాలి, ఒకవేళ లక్ష్యం ఎక్కువైతే దాన్ని తగ్గించుకొని అనుసరించాలి.
* మార్కుల కోసమే కాకుండా సబ్జెక్టును ఇష్టపూర్వకంగా చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలాచేస్తే తక్కువ సమయంలోనే నేర్చుకోగలుగుతారు. ‌
* భావన (కాన్సెప్టు) అర్థం చేసుకుంటూ చదవాలి. దాని వల్ల ప్రశ్న ఏవిధంగా అడిగినప్పటికీ సమాధానం సులువుగా రాయగలుగుతారు. ప్రశ్న-జవాబు అనే కోణంలో చదివితే అదే ప్రశ్నను వేరే విధంగా అడిగితే జవాబు తెలిసినప్పటికీ రాయలేరు. ‌
* పాఠ్యాంశం చివరిలో ఉన్న సమ్మరీని బాగా చదవాలి. అక్కడున్న ఖాళీలు (బిట్లు) పూరించాలి. మాదిరి ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యమైన ఫార్ములాలు, సూత్రాలు, నియమాలను ప్రత్యేకంగా రాసుకోవాలి.
* ప్రీ ఫైనల్‌ పరీక్షల తర్వాత ఇంకా అంతకంటే మెరుగ్గా సమాధానాలను ఎలా రాయవచ్చు, అనవసరంగా చేసిన పొరపాట్లు ఏమిటి, లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి...లాంటివన్నీ బోధపడతాయి. కాబట్టి మీ సమాధానపత్రాన్ని నిశితంగా పరిశీలించుకోవాలి.
ఎగ్జామ్స్‌ టైమ్‌లో అయినా మొబైల్‌, సోషల్‌ మీడియా, సినిమాలు, ఆటలను పక్కన పెట్టకపోతే ఓటమిని ఒక జీవితకాలం భరించాల్సి ఉంటుందని విద్యార్థులు గుర్తుంచుకొని ప్రిపేర్‌ కావాలి.

ఆటలు.. వినోదాలు బంద్‌!
* తరగతిలోని తోటి విద్యార్థులతో పోల్చుకోవద్దు. ఎప్పటికప్పుడు నిన్నటి ప్రిపరేషన్‌ను గమనించి రేపటికి ఎలాంటి మార్పులు చేసుకోవాలో గ్రహించాలి.
* ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో సాధించిన మార్కులకు ప్రాధాన్యం ఇవ్వద్దు. తక్కువ మార్కులు వస్తే కుంగిపోకుండా.. ఏ అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి వాటికి ప్రాధాన్యమిస్తూ చదవాలి. అలాగే ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లు అన్నీ చదివేసినట్లు భావించడం సరికాదు. పబ్లిక్‌ పరీక్షల్లోనూ ఇవే ఫలితాలు రావాలంటే ఎప్పటిలాగే కష్టపడాలని గుర్తుంచుకోవాలి.
* ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాశ, నిస్పృహలను దగ్గరకు చేరనీయవద్దు.
* పరీక్షలు ముగిసినంత వరకు సోషల్‌ మీడియా, క్రికెట్‌, సినిమాలు.. వీటికి దూరంగా ఉండాలి.
పరీక్షలనేవి ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు ఎక్కడానికి ఉపయోగపడే నిచ్చెనలాంటివి. మధ్యలో ఎలాంటి అంతరాయానికీ అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలదే!


Back..

Posted on 21-02-2019