Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తర్వాత కాదు... నేడే చదవండి!

* వాయిదాను వదిలించుకుంటేనే పరీక్షల్లో విజయం

ఫలానా తేదీ నుంచి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలనుకుంటారు. కానీ అది ఆచరణలోకి రాదు. రోజులు దొర్లిపోతూనే ఉంటాయి. పునశ్చరణ కోసం పుస్తకాలు ముందేసుకు కూర్చుంటారు. ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్‌ మీదకో, తాజా క్రికెట్‌ స్కోరు మీదకో మనసు మళ్లుతుంటుంది. రివిజన్‌ ముందుకు సాగదు. సకాలంలో పూర్తికాదు. ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అని తమకు తాము నచ్చచెప్పుకుంటూ ఎడతెగని తాత్సారం చేస్తుంటారు. ‘వచ్చే వారం నుంచి పక్కాగా, పద్ధతిగా చదివేసెయ్యాలి’ అనుకుంటూనే ఉంటారు. ఈలోపు పరీక్షల సమయం ముంచుకొచ్చేస్తూ.. లేనిపోని హైరానా! విద్యార్థుల్లో ఇది తరచూ కనిపించే సమస్యే. మరి ఈ ‘వాయిదా’ భూతం బారి నుంచి తప్పించుకోవటం ఎలా?

‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అయినా ఇంకా సమయం ఉంది కదా? ఇవాళ వద్దుగానీ.. రేపట్నుంచీ చదివెయ్యాలి’- రాకేశ్‌ స్థిరంగా అనుకున్నాడు. అయితే ఆ నిర్ణయం ఏదో ఒక కారణంతో నీరుగారిపోతోంది, నాలుగైదు రోజుల్నుంచీ. ‘మెరుగ్గా ఆరంభిస్తే సగం పూర్తయినట్లే’ అని సామెత. కానీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టటమే రాకేశ్‌ లాంటి ఎందరో విద్యార్థులకు పెద్ద సమస్య. ఒకవేళ ఎలాగో మొదలుపెట్టినా ఆసక్తిగా, శ్రద్ధగా చదవకుండా ఒక్కో చాప్టర్‌ సాగదీస్తూ తాత్సారం చేస్తుంటారు.

పరీక్షల సన్నద్ధతను వీలైనన్నిరోజులు వాయిదా వేయటం తాత్కాలికంగా హాయినిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది అసౌకర్యాన్నీ, ఆందోళననూ పెంచేస్తుంది. మరింత ఒత్తిడిని కలుగజేస్తుంది. దీంతో మెరుగైన మార్కులటుంచి, కనీస మార్కులూ రాకపోయే ప్రమాదం సంభవిస్తుంది.

ఓ అధ్యయనం ప్రకారం కళాశాల విద్యార్థుల్లో 75 శాతం మంది తమకీ లక్షణం ఉందని ఒప్పుకున్నారు. ఇది తమ అభివృద్ధికి అవరోధంగా ఉందని 50 శాతం మంది అంగీకరించారు. విద్యాపరమైన అంశాల్లో వాయిదా జపం చేసేవారిలో ఎక్కువమంది నిత్య వ్యాయామానికి దూరంగా ఉండటం యాదృచ్ఛికం కాదు. వీరిలో చాలామందిలో అనారోగ్యకరమైన నిద్ర, ఆహారపు అలవాట్లున్నట్లు తేలింది.

ప్రతి ఒక్కరిలోనూ వాయిదా వేసే లక్షణముంటుంది. కాకపోతే వాటిలో హెచ్చుతగ్గులుంటాయి. విద్యార్థుల విషయానికొస్తే వాయిదా లక్షణాన్ని నియంత్రించుకోగలిగితేనే ఒత్తిడి లేకుండా చదివి పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ చదివే కోర్సులో రాణించి ఉన్నతస్థానంలో నిలవగలుగుతారు.

ఇవి పాటిస్తే ..సరి!
విద్యార్థులు తమ వాయిదా మనస్తత్వం వదిలించుకోవటానికి కొన్ని మెలకువలు పాటించవచ్చు.
1. తప్పించుకోలేనప్పుడు స్వీకరించు
ఎవరికైనా కష్టమైనవీ, ఆసక్తి లేనివీ వెంటనే చేయాలనిపించదు. పరీక్షల ప్రిపరేషన్‌/రివిజన్‌ ఇలాంటిదే అనుకుంటే... దీన్ని తప్పించుకునే వీలుందా అని ప్రశ్న వేసుకోవాలి. లేదు కదా? అందుకని దాన్ని సానుకూలంగా స్వీకరించాలి. ఎంత తొందరగా చదవటంలో మునిగిపోతే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. మిగతావారికంటే ముందుండే అవకాశం ఉంటుంది.
2. చిన్నచిన్న భాగాలు చేయాలి
కష్టంగా భావించిన సిలబస్‌ మొత్తాన్నీ ఒకేసారి చదవాలని ప్రయత్నించొద్దు. దాన్ని చిన్న భాగాలుగా చేసి సిద్ధమయితే సులువుగా, చకచకా పూర్తవుతాయి. ఉదాహరణకు రోజుకు 500 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు సాధన చేయాలనుకోవటం బదులు రోజుకు వాటిలో సగమో, పావు వంతో చేస్తూపోవాలి. ఇలా అలవాటయ్యాక క్రమంగా వీటి సంఖ్యను పెంచుకోవచ్చు.
3. ముఖ్యమైనవాటికి ప్రాధాన్యం
పరీక్షల కోణంలో ముఖ్యమైన పాఠ్యాంశాలు కొన్ని సందర్భాల్లో ఆసక్తికరంగా ఉండవు. ఆ కారణంతో వాటిని చదవటాన్ని పక్కన పెట్టటం పరిష్కారం కాదు. సాధారణంగా ఉదయపు వేళల్లో విద్యార్థుల శక్తి, ఏకాగ్రత స్థాయులు అధికం. ఆ సమయంలో ముఖ్యమైన, కష్టమైన సబ్జెక్టులు/ అధ్యాయాలు చదివేలా అంతకుముందు రాత్రే ప్రణాళిక వేసుకుని అమలు చేయాలి.
4. రోజంతా వృథా కాకుండా...
రోజంతా వృథా అవుతుంటే దాన్ని నియంత్రించటం ముఖ్యం. మధ్యాహ్నం భోంచేశాక పొద్దున్నుంచీ ప్రయోజనకరంగా గడిచిందో లేదో సమీక్షించుకోవాలి. వ్యర్థంగా గడిచిందని విచారించకుండా మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చదవటానికి ఆసక్తిగా అనిపించకపోతే కాసేపు కునుకు తీసి, టీ/కాఫీˆ తాగి ఉత్సాహంతో ప్రిపరేషన్‌ ఆరంభించవచ్చు.
5. అవాంతరాలున్నాయా?
స్నేహితులతో బాతాఖానీ, ఫోన్‌ సంభాషణలు, సోషల్‌ మీడియా సంచారం, టీవీ వీక్షణం మొదలైనవి.. చదవటానికి అవసరమైన వాతావరణాన్ని పాడుచేస్తాయి. ప్రిపరేషన్‌పై దృష్టి నిలవకుండా చేసి, అంతిమంగా వాయిదా వేసేలా చేస్తాయి. అందుకే పరీక్షల సన్నద్ధత సవ్యంగా సాగాలంటే ఇలాంటి అవాంతరాలేమీ లేకుండా జాగ్రత్తపడాలి.
6. 15 నిమిషాల మంత్రం
ఎన్నో గంటలపాటు సుదీర్ఘంగా చదవాలనే ఆలోచనల భారం మనసులో పెట్టుకోవద్దు. ప్రిపరేషన్‌ మొదలుపెట్టెయ్యండి. కేవలం 15 నిమిషాలు చదువుతానని అనుకోండి. తర్వాత రెండు నిమిషాల విరామం ఇవ్వండి. మరో 15 నిమిషాల పఠనం సాగించండి. ఆరంభ సమస్యల నుంచి బయటపడి సన్నద్ధతలో పూర్తిగా నిమగ్నం అవటానికి ఇది వీలు కల్పిస్తుంది.
7. మిమ్మల్ని నిందించుకోవద్దు
చదవటం, పునశ్చరణ, సాధన... ఏదైనా సకాలంలో చేయలేకపోతున్నాననీ, వాయిదా జాడ్యం వదిలించుకోలేకపోతున్నాననీ మీపై మీరు కోపం తెచ్చుకుని, నిందించుకోవద్దు. ప్రతి ఒక్కరిలో ఈ లక్షణం ఏదో ఒక స్థాయిలో ఉంటుందని మర్చిపోవద్దు. ఏం చేయాలో దానిపై దృష్టిపెట్టండి. చదవాల్సిన చాప్టర్‌/ సబ్జెక్టు మొదలుపెట్టి ముందుకుసాగితే సంతృప్తిగా ఉంటుంది. సంతోషం వస్తుంది.

సాకులు ఎన్నో...
* సబ్జెక్టు పరిజ్ఞానం పెంచుకుని పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒకే కారణం చాలు, చదవటానికి. కానీ వాయిదాకు మాత్రం ఎన్నో కారణాలు. ఇవి చాలామంది విద్యార్థులకు సాకులని తోచదు. ‘సరైనవే’ అనిపిస్తుంటాయి.
* మన ఫ్రెండ్స్‌ ఎవరూ ఇంకా మొదలుపెట్టనే లేదు. హడావుడి ఎందుకు?’
* ‘మా కజిన్‌ సంవత్సరమంతా పుస్తకమే ముట్టుకోలేదు. కానీ పరీక్షలకు ముందు కదలకుండా చదివి మంచి మార్కులు తెచ్చేసుకున్నాడు, తెలుసా? మనమూ అలా చేద్దాం’
* ‘స్టడీ మెటీరియల్‌ పూర్తిగా మన దగ్గర్లేదు. అదొచ్చాక స్టార్ట్‌ చేద్దాం’
* ‘తర్వాత చదవచ్చులే... ముందు స్నాక్స్‌ తినేద్దాం’
* ‘కాసేపు టీవీ చూసి రిలాక్స్‌ అయి చదువుకుంటే బాగా ఎక్కుతుంది’
* ‘ఓ అరగంట టీవీ చూసి పడుకుని తెల్లవారుజామునే లేచి చదువుతా’
* ‘నిద్ర చాలా ముఖ్యం కదా? తొందరగా పడుకుంటే పొద్దున్నే నిద్ర లేవొచ్చు. చక్కగా ప్రిపేర్‌ కావొచ్చు’
* ‘ఆ ప్రశ్న మొన్న మొబైల్‌లో చూశాను. చాలా తేలిగ్గా వచ్చేసింది. ఇక చదవాల్సిన అవసరమే లేదు’
* ‘కష్టమైన ప్రశ్నలు/సబ్జెక్టులు చివర్లో చదివితే గుర్తుంటాయట. ఇప్పుడు చదివినా ఉపయోగం లేదు. పరీక్షల ముందు చూసుకోవచ్చులే’

దేని నుంచి ఏది?
వాయిదా అనేది విజయానికి శత్రువు. పరీక్షల సన్నద్ధత.. పునశ్చరణ, సాధన...ఇలా ఏదైనా వాయిదా వేస్తే కలిగే సంతోషం తాత్కాలికమే. దానివల్ల తప్పు చేసిన భావన..ఫలితంగా మనసులో బాధ పెరుగుతాయి. దాంతో ఏవేవో సాకులు చెప్పుకోవటం, మళ్లీ వాయిదా వేయటం జరుగుతాయి. మళ్లీ అపరాధ భావన.. ఈ క్రమం ఇలా సాగుతూ విలువైన సమయాన్ని హరించివేస్తుంది.

తాత్సారం ఎందుకని?
తాత్సారం చేసేవారికి కింది లక్షణాల్లో కొన్నయినా ఉంటాయి.
* ప్రతి పనీ లోపరహితంగా చేయాలనే తాపత్రయం (పర్ఫెక్షనిజం)
* పరీక్షల్లో విఫలమవుతామనే ఆందోళన
* ఏం చదవాలో, ఎలా ముందుకుసాగాలో బోధపడని తికమక
* శ్రద్ధగా చదివేందుకు ప్రేరణ లేకపోవడం
* సబ్జెక్టు అర్థం కాక దాన్ని కష్టంగా భావించటం
* చదివే అంశాలపై ఆసక్తి లేకపోవటం
* ఏకాగ్రత చూపలేకపోవటం
* ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలో స్పష్టత లేకపోవడం.

Back..

Posted on 10-02-2020