Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరీక్షా సమయం...ఇవి పాటిద్దాం!

     పండగలొస్తున్నాయంటే పిండి వంటలూ, కొత్త బట్టలూ ఎలా మామూలో... పరీక్షలొస్తున్నాయంటే భయం, ఆందోళన, ఒత్తిడి, కలవరం, సందేహాలు సర్వసాధారణం! కళాశాల విద్యార్థులూ, పోటీ పరీక్షల అభ్యర్థులూ ఈ తరుణంలో ఎదురయ్యే అవరోధాలను దాటితేనే మెరుగైన ఫలితం సాధ్యం. ఇందుకు ఉపకరించే నిపుణుల సూచనలు ఇవిగో!
అర్జెంటుగా స్వీటు కావాలమ్మా' అన్నాడు వినోద్‌. 'ఇప్పటికిప్పుడు ఎలా తీసుకురాను?' ప్రశ్నించింది అమ్మ. 'అదంతా నాకు తెలియదు. స్వీట్‌ కావాలంతే'.
సరే! ఓ రెండు మూడు రోజులు తింటాడులే- అని అమ్మ గులాబ్‌జామ్‌ చేసింది. తయారైన వెంటనే తినడం మొదలుపెట్టాడు వినోద్‌. అతిగా తిన్నాడు. కొద్దిసేపు నిద్రపోయి తర్వాత లేచి చదువుతానన్నాడు.
'అదేం తిండిరా? అన్నీ తినేశావేంటి?' అంది అమ్మ.
'తినాలనిపించింది. తినేశా. దిష్టి పెట్టకు' అన్నాడు వినోద్‌. రెండు గంటల నిద్ర తర్వాత లేచాడు. ఇదంతా విపరీత ధోరణిలా అనిపించింది అమ్మకు.
నిజమే! మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి అతిగా తినాలనిపిస్తుంది. లేదా అసలు తినాలనిపించదు.
బాగా చదివి కూడా పరీక్షల ముందు టీవీని ఎక్కువసేపు చూస్తున్నారంటే అది మానసిక ఒత్తిడికి కారణంగా చెప్పుకోవచ్చు.
* విపరీత ధోరణితో ఉండడం. అంటే- అతిగా తినడం/ అసలు తినకపోవడం. అతిగా నిద్రపోవడం/ అసలు నిద్ర లేకుండా కలత నిద్రలో గడపడం.
* విసుగు, కోపం ప్రదర్శించడం.
* పరీక్షలంటే భయం.
* గొంతు తడి ఆరిపోవడం.
* శరీరంలో నొప్పులున్నట్లు అనిపించడం.
* ఉన్నట్టుండి ఏడవడం.
* ఏదో విధంగా వాదనలు పెట్టుకుని చదువును వాయిదా వేయడం.
* తలనొప్పి.
* తియ్యని పదార్థాలు తినాలనిపించడం.
ఒక స్థాయిలో ఒత్తిడి అవసరమే అని చెప్పవచ్చు. ఒత్తిడి ఉంటేనే మనిషి లక్ష్యంవైపు పరుగులెడతాడు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం- శరీరంలో బ్లడ్‌ ప్రెజర్‌ (బీపీ) ఉంటే రక్తం అన్ని భాగాలకూ సరఫరా అవుతుంది. ఇది ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. తక్కువైతే మనిషి నిస్సత్తువగా అయిపోతాడు. ఎక్కువైతే ఆందోళన, కలవరం. లాభసాటిగా ఉండే ఒత్తిడిని EUSTRESS అనీ, హాని కలిగించే ఒత్తిడిని DISTRESS అనీ అంటారు.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివితేటలు, గ్రహణశక్తి, సమయానుగుణంగా తక్షణం స్పందించడం (స్పాంటేనిటీ)... ఇవన్నీ పుట్టుకతోనే వస్తాయనే భ్రమలో ఉంటారు చాలామంది. ఎవరికి వారు వీటిని పెంపొందించుకోవాలి.
* మనకు ప్రస్తుతం ఉన్న జ్ఞాన సంపద
* కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస
* నేర్చుకున్న విషయాలను తెలియజేయాలనే తపన... ఈ మూడు కారణాల వల్లా మన శక్తియుక్తులు ప్రదర్శితమవుతాయి.
చేయవలసినవి...
పరీక్ష అనేది జీవితానికి కాదు. చదువుకున్న సిలబస్‌కు మాత్రమే. ఈ పరీక్షల్లో ఎంతోమంది నూటికి నూరు శాతం/ 98 శాతం సాధిస్తున్నారు. కాబట్టి ఇది సాధ్యపడే విషయమేనని ఒప్పుకోవాల్సిందే. ముందుగా చేయాల్సిన విషయాల గురించి..
1. చదువుకునే వాతావరణం: గాలి, వెలుతురు ఎంతో అవసరం. చదువుకునే ప్రదేశంలో మనసును ఇబ్బందిపెట్టే వస్తువులు ఉండకూడదు. తక్కువ పుస్తకాలు ఉండాలి. ఘాటులేని సువాసన వెదజల్లే ఆహ్లాదకరవాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
2. ఆత్మవిశ్వాసం: సిలబస్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అడుగుతారనేది అందరికీ తెలిసిందే. అందువల్ల చదివిన విషయాలను ధీమాతో పరీక్షలో రాయాలి. కొన్ని పరీక్షల్లో అన్ని ప్రశ్నలకూ జవాబు రాసే అవసరం లేదు. చాయిస్‌ ఉండనే ఉంటుంది. అందుకని ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్లాలి. లేని పక్షంలో భయం, ఒత్తిడికి గురి కావడం, దాని ద్వారా చదువుకున్న విషయాలు పరీక్షహాలులో మరచిపోయే అవకాశముంది. ఇది జ్ఞాపకశక్తి సమస్య కాదు. ఎందుకంటే.. పరీక్షహాలు నుంచి బయటకు వచ్చిన తరువాత మరచిపోయామనుకున్న విషయాలు అప్రయత్నంగా గుర్తుకొస్తాయి.
ఇక్కడ గమనించాల్సింది- పరీక్షహాల్లో మానసిక ఒత్తిడికి గురైనపుడు ఆ సమాచారం గుర్తు రాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఒత్తిడీ లేనపుడు అదే సమాచారం గుర్తుకువచ్చింది. ఈవిధంగా తాత్కాలికంగా మరచిపోవడాన్ని Blockade of retrieval process అంటారు.
3. భయం: ఆత్మవిశ్వాసానికి ఇది వ్యతిరేకం. భయం అనేది కేవలం వ్యక్తి వూహించుకున్నదే. ఒక విషయానికి ఒక వ్యక్తి భయపడుతూ ఉండొచ్చు. అదే విషయంలో అందరికీ భయం ఉండదు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టు అంటే భయం. అది కేవలం ఆ విద్యార్థి పెంచుకున్నదే. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇంగ్లిష్‌లో ఈ పదాన్ని ఒక ఏక్రోనిమ్‌గా చెప్పుకుందాం. F - Fictious E - Experience A - Appearing R - Real
అంటే... 'కల్పితమైన అనుభవం వాస్తవంలా కనిపించడం'. ఈ వూహించుకున్న భయాన్ని దూరం చేసుకోవడానికి DESENSITIZATION అనే ప్రక్రియను సాధన చేయాలి. భయాలూ, అలవాట్లూ పుట్టుకతో రావు కాబట్టి భయం పెంచుకున్నదే. ఈ భయం విషయంలో ఉన్న సున్నితత్వాన్ని పోగొట్టుకుని, మానసికంగా దృఢంగా మారడం అన్నమాట. పరీక్ష హాలు వాతావరణాన్ని వూహించుకుని పాత ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం అలవాటు చేసుకోవాలి. ఈ సాధన భయాన్ని తప్పకుండా దూరం చేస్తుంది.
4. VAK పద్ధతి: మనకున్న పంచేంద్రియాల్లో మూడు ఇంద్రియాలను ఉపయోగించి చదివే పద్ధతి ఇది. వి- విజువల్‌ (కళ్లు), ఎ- ఆడిటరీ (చెవులు), కె- కైనెస్థిటిక్‌ (ముట్టుకోవడం) ద్వారా ఉద్వేగంతో భావించడం. అంటే చర్మం ద్వారా. కళ్లతో చూస్తూ, వినిపించే స్థాయిలో తక్కువ స్వరంలో పైకి చదువుతూ, చదివే పదాల కింద చూపుడువేలు పెట్టి ముందుకు కదుపుతూ చదివితే ఏకాగ్రతను కట్టి పడేయవచ్చు.
5. మ్యాపింగ్‌ పద్ధతి: చదువుకునే సమయంలో పక్కనే ఒక కాగితం పెట్టుకుని సబ్జెక్టును అర్థం చేసుకుంటూ మ్యాప్‌ గీయాలి. ఉదాహరణకు- భూమి నుంచి పైకి వచ్చిన చెట్టు మొదలు, దాని నుంచి అనేక శాఖలు వచ్చినట్లు. ముందుగా సబ్జెక్టును చెట్టు మొదలు అనుకుని ఒక వృత్తంలో ఆ టాపిక్‌ రాయాలి. ఆ వృత్తం నుంచి ఎన్ని దిశల్లో ఎన్ని శాఖలు వచ్చాయో రాసుకుంటూ చదివితే, ఆ మ్యాప్‌ బాగా గుర్తుండిపోయి జవాబును సులభంగా రాయగలుగుతారు.
6. జ్ఞాపకశక్తి: ఇదో మానసిక ప్రక్రియ. దీనిలో నాలుగు దశలుంటాయి. అవి: 1. రికగ్నైజింగ్‌ 2. ఎనలైజింగ్‌ 3. స్టోరింగ్‌ 4. రీకాలింగ్‌. ఈ నాలుగు దశలున్న ఈ ప్రక్రియ ఏ దశలో ఆగిపోయినా సమాచారం గుర్తుకు రాదు. ఈ ప్రక్రియను ఆసక్తి, ఏకాగ్రత, పునశ్చరణలతో పూర్తి చేస్తే జ్ఞాపకశక్తి సొంతమవుతుంది.
బట్టీ విధానం... గుర్తుచేసుకోవడానికి మంచిది కాదు. సబ్జెక్టును అర్థం చేసుకుంటూ చదవడం అలవాటు చేసుకుంటే అది ఎప్పటికైనా మంచిదే.
7. తెలివితేటలు: మెదడు వృద్ధి చెందని అతి కొద్దిమంది (మెంటల్లీ చాలెంజ్‌డ్‌) తప్ప అందరికీ తెలివితేటలు బాగానే ఉంటాయి. మనకున్న పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా ప్రదర్శించడమే తెలివితేటలు. పరిజ్ఞానం లేనివాడిని తెలివైనవాడిగా గుర్తించరు. కాబట్టి తెలివితేటల గురించి సందేహాలు పెట్టుకోకుండా విజ్ఞానాన్ని పెంచుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి.
8. ఆరోగ్యం: పరీక్షలు రాసేవాళ్లు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. సమయానికి తినడం, నిద్రించడం, మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచించడం ఎంతో మంచిది. పోషకపదార్థాల పాత్ర ఎంతో ముఖ్యం. రోజుకొక అరటిపండు చాలా మేలు చేస్తుంది. పండ్లు, పండ్ల రసాలు ఎంతో ముఖ్యం.
9. పునశ్చరణ: ఒక విషయాన్ని తెలుసుకున్నపుడు అది మనకు ఇంతకుముందే తెలుసుంటే పునశ్చరణ చేయాల్సిన పనిలేదు. కాబట్టి విషయజ్ఞానాన్ని బట్టి ఎన్నిసార్లు పునశ్చరణ అనేది ఆధారపడి ఉంటుంది.
10. చదవడానికి అనుకూల సమయం: ఉదయం పూట చదివితేనే మంచిదన్న అభిప్రాయం ఒకటుంది. కానీ ఆధునిక ప్రవర్తనా శాస్త్రవేత్తల అభిప్రాయం వేరుగా ఉంది. ఒక్కొక్కరికి శక్తి స్థాయులు (ఎనర్జీ లెవల్స్‌) ఒక్కో రకంగా ఉంటాయి. ఎవరికి ఏ సమయంలో బాగుంటుందో ఆ సమయంలో చదవడం మేలు. కానీ రాత్రిపూట 6 గంటలపాటు విశ్రాంతి తీసుకున్న తరువాత ఉదయం లేచి చదివితే మెదడు ఎంతో నిర్మలంగా ఉంటుందనేది ఒక అభిప్రాయం.
11. నిద్ర: ఎవరికైనా ఆహారంలాగానే నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 6 గంటల నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికీ, చదువుకూ, ఏకాగ్రతకూ మంచిది. ప్రతిరోజూ ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్రను అలవాటు చేసుకోవాలి.
12. మధ్యలో విశ్రాంతి: ప్రతి గంటకూ అయిదు నిమిషాల వ్యవధి విశ్రాంతికి కేటాయించాలి. దీని వల్ల విసుగు లేకుండా చదువు కొనసాగించే వీలుంటుంది. 5 నిమిషాల తరువాత మళ్లీ క్రమశిక్షణతో చదువు మొదలుపెట్టాలి. ఒకసారి చదివే స్థలం నుంచి లేస్తే 5 నిమిషాల్లో తిరిగి చదవలేకపోతున్నామని కొంతమంది విద్యార్థులు అంటుంటారు. పరీక్షల సమయంలో పరీక్షహాలు నుంచి వాష్‌రూమ్‌కు వెళ్ళి తిరిగి పరీక్షహాల్లోకి ఎలా వెళ్తామో అలాగే క్రమశిక్షణతో చదవాలి.
13. చదివే సమయంలో ఏవైనా గుర్తుకొస్తే: చదివే సమయంలో పక్కనే ఒక తెల్ల కాగితం, పెన్ను ఉంచుకోవాలి. ఏమైనా గుర్తుకొస్తే ఆ పేపర్‌ మీద రాసుకోవాలి. కానీ ఆలోచిస్తూ కూర్చోకూడదు. ప్రతి గంటకో అయిదు నిమిషాల విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ పేపర్‌ మీద రాసిన విషయాల గురించి 5 నిమిషాలు మాత్రమే ఆలోచించాలి.
14. ప్రజంటేషన్‌: పరీక్షలో ముందుగా మీకు బాగా వచ్చిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు చేయాలి. దీనివల్ల జవాబుపత్రాన్ని దిద్దేవారికి మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. సబ్‌హెడ్డింగ్‌లను కలర్‌ పెన్సిల్‌తో అండర్‌లైన్‌ చేసి, అవసరమైనచోట్ల బొమ్మలు వేసి మంచి దస్తూరీతో రాస్తే జవాబుపత్రం ఆకర్షణీయంగా ఉంటుంది.
పరీక్ష ముందు రోజు ఎటువంటి ఆందోళనా, ఒత్తిడీ లేకుండా చూసుకోవాలి. పరీక్ష హాలు ఎక్కడుందో చూడడానికి తల్లిదండ్రుల సాయం తీసుకోవాలి.
పరీక్ష రోజు: పరీక్ష రోజు హాలుకు గంట ముందు చేరుకోవాలి. విశ్రాంతిగా ఉండాలి. ప్రతి సంవత్సరం పరీక్ష హాలుకు ఆలస్యంగా వచ్చేవారి ఫొటోలను దినపత్రికల్లో చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని అశ్రద్ధ చేయకూడదు.
చదివే సమయంలో నిద్ర వస్తే?: చేతి మణికట్టుకు గడియారం పెట్టుకున్నట్లు ఒక రబ్బర్‌ బ్యాండ్‌ను పెట్టుకోవాలి. నిద్ర వచ్చిన సమయంలో దాన్ని లాగి వదిలితే ఆ మెత్తని దెబ్బకు నిద్రమత్తు వెంటనే వదిలిపోతుంది.
సమయాన్ని నిర్ధారించుకోవడం: పరీక్షలో చిన్న, పెద్ద జవాబులుండే ప్రశ్నలు రెండూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సరైన సమయం కేటాయించడం విషయంలో కొంత సాధన చేయాలి. లేనిపక్షంలో సమయాన్ని వాడుకోవడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది.
రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌: విద్యార్థులూ, పోటీ పరీక్షల అభ్యర్థులూ మనసుకు విశ్రాంతినిచ్చే కసరత్తులు చేయాలి. వీటివల్ల ఎన్నో లాభాలున్నాయి. 'స్కై వాకింగ్‌' అనే ఎక్సర్‌సైజ్‌ చాలా సులభం. తలను కొంచెం పైకి ఎత్తి పైకప్పు వైపు చూస్తూ గదిలో ఒక పక్క నుంచి మరొక ప్రక్కకు వడివడిగా నడవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయాలను ఆలోచిస్తూ ఇలా నడవడం వల్ల ఎంతో లాభం ఉంటుంది.
రాయడం సాధన: చాలామంది విద్యార్థులు చదువుతారు. కానీ రాయడం సాధన చేయరు. అటువంటివారికి పరీక్షహాలులో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక అరగంటసేపు రాయడం సాధన చేయాలి.
విజువలైజేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఒక కుర్చీపై కూర్చుని కళ్లు మూసుకుని సానుకూల దృక్పథంతో వూహించుకోవాలి. పరీక్ష చాలా బాగా రాస్తున్నట్లు, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వూహించుకుంటే ఫలితాలొస్తాయి.
ఫ్లాష్‌ కార్డ్స్‌: ముఖ్యమైన సూత్రాలనూ, నిర్వచనాలనూ ఫ్లాష్‌ కార్డ్స్‌ తయారు చేసుకుని... చదివే టేబిల్‌కు దగ్గరగా గోడమీద కానీ తలుపు మీద కానీ ఉంచుకోవాలి. వీలైనన్నిసార్లు వాటిని చదువుతుండాలి.
ఇవి చేయకూడదు
చెయ్యవలసిన పనులు ఎంత ముఖ్యమో, చెయ్యకూడనివి కూడా తెలుసుకుని, జాగ్రత్త తీసుకోవడం అంతే ముఖ్యం.
ఆందోళన వద్దు
పరీక్ష ముందు ఆందోళన చెందడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. కాబట్టి పరీక్షల ముందు ఆదుర్దా, ఆందోళన పడకూడదు. రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌ వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పరీక్ష హాలు దగ్గర పునశ్చరణ
చాలామంది పరీక్షహాల్లోకి వెళ్లే వరకూ చదువుతూనే ఉంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ సమయంలో చదివినపుడు సరిగా గుర్తుకు రాకపోతే ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు. అంతేకాకుండా ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది.
టీవీ/ క్రికెట్‌
క్రికెట్‌ వీరులకు కూడా మార్చి-ఏప్రిల్‌ నెలల్లో పరీక్ష సమయం అన్నట్లు అదే సమయంలో అనేక క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తుంటారు. టీవీ చూడడం వల్ల పరీక్ష హాల్లో మార్కులు తక్కువ వస్తే ఆ మార్కుల జాబితా మాత్రం ఒక డాక్యుమెంటులా ఉండిపోతుంది. కాబట్టి పరీక్షల ముందు టీవీ, క్రికెట్‌లు చూడకుండా నిగ్రహించుకోవాలి.
చదువుకు ప్రదేశం
చదవడానికి అనువుగా ఉండాలంటే గదిలో సినీనటుల, క్రీడాకారుల పోస్టర్లు; పత్రికలు లేకుండా చూసుకోవాలి. టీవీ, కంప్యూటర్‌, డీవీడీ ప్లేయర్‌, ఫోన్‌ వంటివి కూడా అందుబాటులో లేకుండా జాగ్రత్త వహించాలి.
మానసిక ఒత్తిడి
ప్రతికూల ఆలోచనల వల్లే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వేరే విద్యార్థుల, అభ్యర్థుల గురించి ఆలోచించకూడదు. టీనేజ్‌ ఆకర్షణలు, ఇతర వ్యాపకాలంటూ ఒత్తిడిని పెంచుకోకుండా అన్నింటినీ పక్కన పెట్టేయటం అవసరం.
వేరే వారితో పోల్చుకోవడం
పరీక్షల ముందు వేరే వారితో పోల్చుకుని కుంగిపోకూడదు. పోటీ పడడంలో తప్పు లేదు. కానీ నిరాశ చెందడం మంచిది కాదు.
వాయిదా అలవాటు
వాయిదాలు వేయడం వల్ల సమయం వృథా అవడమే కాకుండా విలువైన అవకాశాలను పోగొట్టుకున్న వాళ్లమవుతాం. వాయిదాల వల్ల ఆదుర్దా, తరువాత ఆందోళన, ఆ తరువాత ఒత్తిడీ ఏర్పడతాయి.
ర్యాంకు
ర్యాంకుల గురించి ఆలోచించకూడదు. మీకెంత ర్యాంకు వస్తుందనేది మీ పోటీదారులపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిత్యం కృషి చేయడమే మీ వంతు. మీ కళాశాల/ సంస్థ నుంచి మాత్రమే కాకుండా అనేక ప్రదేశాల్లో ఉండే కళాశాల/ సంస్థ నుంచి ఎంతోమంది పరీక్ష రాస్తారు. కాబట్టి ర్యాంకు గురించి ఆలోచించడం మాని చదువుపై దృష్టి పెట్టడం మేలు.
జ్ఞాపకశక్తి
మెమరీ ప్రదర్శనలను చూసి మీకు అటువంటి శక్తి లేదేమోననే అపోహను పెంచుకోకండి. ప్రదర్శనలో కొన్ని పేర్లు, వస్తువులు, ముఖాలు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని చిట్కాలను వాడతారు. వాటివల్ల పేరాగ్రాఫ్‌లు, పేజీలు గుర్తుండవు. కాబట్టి మీ జ్ఞాపకశక్తి గురించి అనవసరంగా ఆందోళన పడవద్దు.
చర్చలు వద్దు
పరీక్ష రోజున ఎవరితోనూ చర్చించకూడదు. తెలియని విషయాలను ఎదుటివారు చెబుతుంటే మీలో నిరాశ కలిగే అవకాశముంది. ఇది ఏ విధంగానూ లాభం చేకూర్చదు.
పరీక్ష తరువాత
పరీక్ష రాసిన తర్వాత పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చి వేరే విద్యార్థులతో చర్చించడం కూడా మంచిది కాదు. మీరు రాసిన జవాబు తప్పు అని ఎవరైనా అంటే మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అంతేకాదు.. దాని ప్రభావం మర్నాడు జరిగే పరీక్ష మీద పడుతుందని గుర్తుంచుకోవాలి.
చివరగా.. మీ కష్టానికీ, ప్రతిభకూ పట్టం కట్టే రోజే పరీక్ష రోజు. కాబట్టి సానుకూల ఆలోచనలతో పరీక్షలు రాస్తే మెరుగైన ఫలితం సులువుగా దక్కుతుంది!

posted on 02.03.2015