Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎక్స్‌టర్న్‌షిప్‌

* చూడూ.. రెండోవైపూ చూడు!

ఒకటి వింటారు.. మరొకటి అనుకుంటారు.. ఇంకో పది తెలుస్తాయి. ఏది ఎంచుకోవాలో తెలియక తికమకపడి సతమతమవుతుంటారు. అదే అయోమయంలో చివరకు ఏదో తేల్చేస్తారు. అది వాళ్లకు సరిపోతే పర్లేదు. కాకపోతే డిప్రెస్‌ అయిపోతారు. కెరియర్‌కి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా ఎదురవుతుంది. ఈ సమస్యకు ఇప్పుడిప్పుడే మన దేశంలో పరిష్కారం దొరుకుతోంది. అదే ‘ఎక్స్‌టర్న్‌షిప్‌’. సంపూర్ణ పరిజ్ఞానంతో సరైన ఉద్యోగంలోకి చేరడానికి సాయపడే నయా ట్రెండ్‌. ఇంటర్న్‌షిప్‌ అంటే పనిలో భాగస్వాములై తెలుసుకోవడం ఒక కోణం అయితే, ఎక్స్‌టర్న్‌షిప్‌లో బయట ఉండి అవగాహన పెంచుకోవడం రెండో కోణం.

గౌరవ్‌, వైభవ్‌ బీటెక్‌ చేస్తున్నారు. ఇద్దరికీ ప్రోగ్రామింగ్‌లో మంచి నైపుణ్యం ఉంది. ఇంటర్న్‌షిప్‌ చేయడానికి సిద్ధమయ్యారు. గౌరవ్‌ ప్రోగ్రామింగ్‌లోనే ఇంటర్న్‌షిప్‌కి చేరాడు. వైభవ్‌కి అనుకోకుండా టెస్టింగ్‌ గురించి తెలిసింది. అది అతడికి ఆసక్తిగా అనిపించింది. దాంట్లోనే ఇంటర్న్‌షిప్‌ చేరాడు. మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాడు. దాంతో తర్వాత కాలంలో గౌరవ్‌ కంటే మెరుగైన జీతంతో అదే సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఇక్కడ ఇద్దరి నైపుణ్యాలు సమానం. ఇద్దరి అవకాశాలూ సమానం. కానీ ఒకరు మంచి వేతనంతో, తనకు ఇంట్రెస్ట్‌ ఉన్న స్థానంలోకి వెళ్లారు. ఇదంతా వర్క్‌ప్లేస్‌లోని ఇతర విభాగాల గురించి తెలియకపోవడం వల్ల జరిగింది. ఇప్పుడిప్పుడే ఇలాంటి సమస్యలకు ‘ఎక్స్‌టర్న్‌షిప్‌’ రూపంలో పరిష్కారం లభిస్తోంది. కంపెనీలు అభ్యర్థులకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. విద్యార్థులూ చొరవచూపి ‘ఎక్స్‌టర్న్‌షిప్‌’ కోసం సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే కొత్త ట్రెండ్‌. ఫాలో అవడానికి ప్రయత్నించదగిన మార్గం.

అనుభవం... అవగాహన
కెరియర్‌ను ఎంచుకునేదశలోనే అందులో అభ్యర్థులు ఎంతవరకూ ఇమడగలరో తెలుసుకోవడానికి ఎక్స్‌టర్న్‌షిప్‌ సాయపడుతుంది. దీని ద్వారా వివిధ వృత్తుల, విభాగాల వివరాలను తెలుసుకోగలుగుతారు. ఉదాహరణకు- ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై ఆసక్తి ఉందనుకుంటే, దానిలో అనేక విభాగాలుంటాయి. ప్లానింగ్‌, బడ్జెటింగ్‌, డిజైనింగ్‌ తదితరాలు. మొదట అభ్యర్థికి వీటన్నింటిపై థియరిటికల్‌ పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఎక్స్‌టర్న్‌షిప్‌ చేస్తే సంస్థలోని ప్రతి విభాగాన్ని, ఆయా నిపుణులను పరిశీలించవచ్చు. ఈ అనుభవం ద్వారా తనకు అనుకూలమైనదాన్ని విద్యార్థి ఎంచుకోగలిగే మంచి అవకాశం దక్కుతుంది.
అనుభవపూర్వకంగా నేర్చుకునే అవకాశమే ఈ ఎక్స్‌టర్న్‌షిప్‌. ఉద్యోగాలు, సంస్థలు, కెరియర్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వాటిని రూపొందించారు. కలినరీ, బిజినెస్‌, మెడికల్‌, లా, నర్సింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌.. ఇలా ఏ సంస్థ, ఉద్యోగం, పరిశ్రమకైనా అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంచుకున్న రంగంలో పనికి సంబంధించిన అవగాహనను ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కెరియర్‌ మార్గాన్నీ, ఉద్యోగాన్వేషణ ప్రణాళికనూ సిద్ధం చేసుకోవచ్చు.

వైద్య, న్యాయ విద్యల్లో....
ఇంకా సులువుగా చెప్పాలంటే.. ఎక్స్‌టర్న్‌షిప్‌ అంటే అభ్యర్థి తాను ఎంచుకునే రంగంలోని వృత్తి నిపుణుడిని దగ్గరగా పరిశీలించడమే. మనదేశంలో మెడిసిన్‌ చేసే వారికి ఇలాంటి అనుభవం ఉంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా వాళ్లు ఎక్స్‌టర్న్‌షిప్‌ను అనుసరిస్తున్నారు. దీన్ని మెడికల్‌ విభాగంలో సాధారణంగా నాలుగో సంవత్సరంలో చేస్తారు. భవిష్యత్తులో ఏ స్పెషలైజేషన్‌ తమకు అనువైనదో తెలుసుకోవడానికి ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందుకుగానూ హాస్పిటల్‌, ప్రైవేటు క్లినిక్‌ లేదా ఏదైనా హెల్త్‌కేర్‌ విభాగాల్లో వివిధ డిపార్ట్‌మెంట్ల ప్రాక్టీసింగ్‌ ఫిజీషియన్లను అనుసరిస్తారు.
మన దగ్గర న్యాయరంగంలోనూ కొన్నిచోట్ల ఎక్స్‌టర్న్‌షిప్‌లను అనుసరిస్తున్నారు. కొన్ని విదేశీ విద్యాసంస్థలు ప్రత్యేకంగా తమ విద్యార్థులకు మన దగ్గర ఎక్స్‌టర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి. మనదేశంలో మిగతా రంగాల్లోకీ ఈ ఎక్స్‌టర్న్‌షిప్‌ సంప్రదాయం ప్రవేశిస్తోంది. కాబట్టి, విద్యార్థులు దీనిపై అవగాహన కల్పించుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

ఎక్స్‌టర్న్‌షిప్‌ ప్రకటనల కోసం విద్యార్థులు ఎదురు చూడాల్సిన పని లేదు. తాము కోరుకున్న కంపెనీకి తమ వివరాలను పంపి అభ్యర్థించవచ్చు.

ఏం చేస్తారు?
విద్యార్థి/ అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సంస్థ ప్రతినిధి విద్యార్థి కోరుకున్న విభాగంలో రోజువారీ కార్యకలాపాల గురించి వివరిస్తారు. దగ్గరుండి చూసే అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తారు. ఆఫీసు పరిశీలన, కంపెనీ ప్రాజెక్టులపై అవగాహన తెచ్చుకోవడం, సహోద్యోగులను కలవడం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. తరగతి గదుల్లో నేర్చుకున్న వాటిని ప్రాక్టికల్‌గా ఎలా వినియోగించాలో తెలుసుకుంటారు.

దరఖాస్తు ఎలా?
ఇంటర్న్‌షిప్‌లకు అన్నిచోట్లా ప్రత్యేక వేదికలు ఉన్నట్లే విదేశాల్లో ఎక్స్‌టర్న్‌షిప్‌లకూ కొన్ని వేదికలున్నాయి. కొన్నిసార్లు సంస్థలే వీటికి ప్రకటనలు విడుదల చేస్తాయి. మనదగ్గర ఎక్స్‌టర్న్‌షిప్‌లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇప్పటికి వీటికి సంబంధించిన ప్రత్యేకమైన వేదికలేమీ ఇక్కడ లేవు. విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే నేరుగా ఆయా సంస్థలను సంప్రదించడం మేలు. విద్యార్థి తన వివరాలు, కళాశాల నుంచి బోనఫైడ్‌, అనుమతి పత్రాన్ని తీసుకుని, దాన్ని జతచేస్తూ, ఆసక్తిని తెలిపేలా వెబ్‌సైట్‌లోని ఈ-మెయిల్‌కు మెయిల్‌ పంపొచ్చు. విద్యార్థి అభ్యర్థనను బట్టి సంస్థలే సంప్రదిస్తాయి.

విదేశాల్లో ఎప్పటి నుంచో..
విదేశాల్లో ఎక్స్‌టర్న్‌షిప్స్‌ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు తాము ఎంచుకున్న కెరియర్‌లో విధుల నిర్వహణ ఎలా ఉంటుందో పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని విద్యాసంస్థలు కల్పిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తి పరిధిని ఇంకా పెంచవచ్చనేది వారి ఉద్దేశం. సాధారణంగా విదేశీ విద్యార్థులు వీటిని వారి వేసవి లేదా శీతాకాల సెలవుల్లో చేస్తారు. స్కూలు స్థాయి నుంచి కూడా వారికి ఇది అందుబాటులో ఉంది. కొన్నిసార్లు విద్యాసంస్థలే విద్యార్థుల తరఫున కోరిన సంస్థకు దరఖాస్తులు పంపుతాయి. కొన్ని సంస్థలు స్కూల్‌ క్రెడిట్‌ అవకాశాన్ని కల్పిస్తున్నప్పటికీ, చాలావరకు విద్యార్థికి పరిశ్రమ అనుభవాన్ని కలిగించడానికే పరిమితమవుతున్నాయి.

మనదేశంలో..
చెన్నైకి చెందిన సత్యం సినిమాస్‌ (ఎస్‌పీఐ సినిమాస్‌) విద్యార్థులకు ఎక్స్‌టర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. విద్యార్థులు తమకు నచ్చిన డిపార్ట్‌మెంట్‌, ప్రాజెక్టును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే ఇక్కడ విద్యార్థి తాను చదువుతున్న కోర్సులో భాగంగానే ఎక్స్‌టర్న్‌షిప్‌ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రెండు వేర్వేరు రంగాల కోర్సులు.. ఉదాహరణకు- టెక్నాలజీ, మార్కెటింగ్‌; కొంచెం దగ్గరి సంబంధమున్నవి.. హెచ్‌ఆర్‌, కస్టమర్‌ సర్వీస్‌ ఇలా కాంబినేషన్లను కూడా ఎంచుకునే వీలుంది. ఇక్కడ ఉండే మెంటర్లు ప్రత్యేకంగా విద్యార్థులతో ఉండి, వారు సరైన దిశలో వెళ్లేలా మార్గనిర్దేశం కూడా చేస్తున్నారు.
దిల్లీలోని ఇండియన్‌ ఆస్ట్రోబయాలజీ రిసెర్చ్‌ సెంటర్‌ ‘లైఫ్‌ ఇన్‌ స్పేస్‌’లో 2014లో వర్చువల్‌ ఎక్స్‌టర్న్‌షిప్‌ను అందించింది.
కొన్ని లా సంస్థలు దేశీయంగా, విదేశాల్లో ఎక్స్‌టర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సీటెల్‌, లూయిస్‌ అండ్‌ క్లార్క్‌ లా స్కూల్‌ వంటి న్యాయవిద్యాసంస్థలూ తమ విద్యార్థులకు మనదేశంలో ఎక్స్‌టర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

లాభాలేంటి?
* ఎక్స్‌టర్న్‌షిప్‌ విద్యార్థి తాను ఎంచుకున్న రంగం/ వృత్తి తనకు తగినదో కాదో తెలుసుకోవడానికి తోడ్పడుతుంది.
* తక్కువ సమయంలో ఎక్కువ విభాగాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చు.
* వృత్తి నిపుణులను పరిశీలించడం ద్వారా ఆసక్తిగల ఉద్యోగం, విధుల గురించి తెలుస్తుంది. అంతే కాకుండా, ఆ నిపుణుల దినచర్యపై అవగాహన కలుగుతుంది.
* ఎంచుకున్న రంగంపై సందేహాలన్నీ తీరతాయి. అకడమిక్‌ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుస్తుంది.
* తక్కువ పరిధిలో ఎక్కువ పరిచయాలు కలుగుతాయి. నెట్‌వర్క్‌ పరిధి పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఇంటర్న్‌షిప్‌, పార్ట్‌టైం జాబ్‌, ఉద్యోగావకాశాలకీ తోడ్పడుతుంది.
* సంస్థలు కూడా ఇంటర్న్‌లను, పార్ట్‌టైం ఉద్యోగులను తీసుకునేప్పుడు పని గురించి అవగాహన ఉన్నవారికే ప్రాధాన్యమిస్తాయి.
* కెరియర్‌ మారాలనుకున్నపుడు సాయపడుతుంది. బీరెజ్యూమెలో ఈ అనుభవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవచ్చు.

రెంటికీ ఏమిటి తేడా?
ఎక్స్‌టర్న్‌షిప్‌, ఇంటర్న్‌షిప్‌లకు కొన్ని పోలికలున్నప్పటికీ తేడాలూ ఉన్నాయి.
ఇంటర్న్‌షిప్‌
* సాధారణంగా ఇంటర్న్‌షిప్‌ను కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాలపాటు చేస్తారు.
* ఎంపిక చేసుకున్న సంస్థ కేటాయించిన విభాగంలో అభ్యర్థి పనిచేయాల్సి ఉంటుంది.
* ఇంటర్న్‌లు పనిలో భాగస్వాములవుతారు.
* ఒకసారి ఒక ఇంటర్న్‌షిప్‌నే చేసే అవకాశం ఉంటుంది.
* ఇందులో విద్యార్థికి స్టైపెండ్‌ లభిస్తుంది.
* టెక్నికల్‌ విద్యార్థులకు అకడమిక్‌ స్కోరూ ఇస్తారు.
* దీన్ని విద్యార్థులు ఎక్కువశాతం తమ సెలవుల్లోనే చేయాల్సి ఉంటుంది.
ఎక్స్‌టర్న్‌షిప్‌
* ఒకరోజు నుంచి రెండు వారాల్లో ముగుస్తుంది.
* దీనిలోనూ సంస్థకి అభ్యర్థి ప్రత్యక్షంగా వస్తారు. కానీ, విధుల్లో భాగస్వామి అవ్వాలనేం లేదు.
* వీరు వృత్తినిపుణులను దగ్గరగా పరిశీలించడానికే పరిమితమవుతారు. చూసి నేర్చుకోవడం, పరిశీలనానుభవం మాత్రమే ఇందులో ఉంటాయి.
* ఒకేసారి వివిధ సంస్థలనూ, విధులనూ పరిశీలించే అవకాశం ఉంటుంది.
* ఈ అభ్యర్థులకు స్టైపెండ్‌ ఉండదు.
* అకడమిక్‌ పరంగా ఎలాంటి స్కోరూ ఇవ్వరు.
* ఎక్స్‌టర్న్‌షిప్‌ చేయడానికి సెలవుల వరకూ వేచి ఉండాల్సిన పనిలేదు. చదువును కొనసాగిస్తూనే వారాంతాల్లో చేసుకోవచ్చు. అయితే విద్యార్థి తన రెజ్యూమెకు అదనపు విలువగా దీన్ని జోడించుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయాల్లోనూ, ఇంటర్న్‌షిప్స్‌, ప్రాజెక్టు వర్క్‌లకు దరఖాస్తు చేసుకున్నప్పుడు విద్యార్థికి రంగంపై ఉన్న ఆసక్తిని ఎక్స్‌టర్న్‌షిప్‌ వ్యక్తీకరిస్తుంది.

Back..

Posted on 15-11-2018