Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అదిరేటిస్టైల్‌ మీదైతే..!

* కెరియర్‌ గైడెన్స్‌ ఫ్యాషన్‌

లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌లపై ఓ కన్నేస్తుంటారా? సరికొత్త స్టైల్స్‌ ఇట్టే పట్టేస్తుంటారా? అందంగా కనిపించేలా చేయడం మీకు ఇష్టమా? సృజనాత్మకత అన్నా, కొత్త వాటిని రూపొందించడమన్నా ఆసక్తి ఉందా? వీటన్నిటికీ ‘అవును’ అనేది మీ సమాధానమయితే.. మీరు ఫ్యాషన్‌ కెరియర్‌కు ఓటేయొచ్చు. ఈ రంగంలో దుస్తుల డిజైన్‌ తెలిసిందేగా అనుకుంటున్నారా! అదొక్కటే కాదు, ఆక్సెసరీ డిజైనింగ్‌, జ్యూలరీ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, పర్సనల్‌ స్టైలింగ్‌.. ఇంకా బోలెడున్నాయ్‌. చదివేయండి!

వయసుతో తేడా లేకుండా అందరినీ ఆకర్షించేది ఫ్యాషన్‌ రంగం. మంచి వేతనంతోపాటు పేరు ప్రఖ్యాతులను తెచ్చే రంగమిది. అందుకే యువతలో ఈ కెరియర్‌ అంటే క్రేజ్‌! కొంత సృజనాత్మకత, శైలి, సహజత్వం, అందమైన వాటిని గుర్తించగల తత్వం వంటి లక్షణాలున్నవారు ఇందులో బాగా రాణిస్తారు. నూతనత్వానికి జీవం పోయాలనుకునేవారికి ఈ రంగం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. తరచి చూడాలే కానీ ఫ్యాషన్‌ రంగం అందించే అవకాశాలెన్నో. అందుకే చాలా సంస్థలు ఈ రంగానికి సంబంధించి వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి రంగానికి సంబంధించిన అవగాహనను కల్పిస్తాయి. కోర్సు, ఎంచుకున్న సంస్థను బట్టి కరిక్యులమ్‌ ఉంటుంది. ఆసక్తి, అర్హత, నైపుణ్యాల ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చినవాటిని ఎంచుకోవచ్చు.

ఆక్సెసరీ డిజైనింగ్‌
ఫ్యాషన్‌ రంగం వస్త్రాలకే పరిమితం కాలేదు. దానికి తగ్గట్టుగా వేసుకునే వివిధ అంశాలకూ ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో ఆక్సెసరీ డిజైనింగ్‌ ఫ్యాషన్‌ రంగంలో ఒక శాఖగా ఎదుగుతోంది. అందాన్ని పెంచడంలో వీటికీ ప్రాధాన్యం ఉంటోంది. ఫుట్‌వేర్‌, స్కార్ఫ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, బెల్ట్‌లు, సన్‌ గ్లాసెస్‌, నెక్‌ పీస్‌లు మొదలైనవన్నీ దీని కిందకి వస్తాయి. వీటిని స్కెచ్‌ రూపంలో గానీ, క్యాడ్‌ను ఉపయోగించి సిస్టమ్‌లోగానీ రూపొందిస్తారు. డిప్లొమా, డిగ్రీ (బ్యాచిలర్‌, బీఎస్‌సీ), పీజీ (మాస్టర్‌, పీజీ డిప్లొమా) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా కోర్సులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ కోర్సులకు డిగ్రీ అర్హత ఉండాలి. కొన్ని కోర్సులకు డిగ్రీలో సంబంధిత కోర్సును చదివుండటం తప్పనిసరి. చాలావరకూ సంస్థలు సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ‌
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, బెంగళూరులతో సహా దేశవ్యాప్తంగా సంస్థలు 16 చోట్ల ఉన్నాయి) ‌
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (దేశంలో చాలా ప్రదేశాల్లో ఇది అందుబాటులో ఉంది) ‌
* సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జ్యూలరీ డిజైన్‌, అహ్మదాబాద్‌
అవకాశాలు: అపారల్‌/ యాక్సెసరీ తయారీ సంస్థల్లో పనిచేయవచ్చు. సొంతంగా బ్రాండ్‌ సంస్థలను నిర్మించుకోవచ్చు. ఫిలిం, టెలివిజన్‌ రంగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి.

లగ్జరీ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌
ఫ్యాషన్‌ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నకొద్దీ విలాస వస్తువులకు ఆదరణ పెరుగుతోంది. లగ్జరీ బ్రాండ్‌ మేనేజర్లు తమ మార్కెటింగ్‌, బిజినెస్‌ నైపుణ్యాలను ఉపయోగించి తమ బ్రాండ్‌ వస్తువులకు గిరాకీ ఏర్పరుస్తారు. పెరుగుతున్న పోటీ దృష్ట్యా తమ బ్రాండ్‌లను మార్కెట్‌లో నిలబడేలా చేయడానికి నిపుణులు అవసరమవుతున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఈ విభాగంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. పెద్ద బ్రాండ్‌లతో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను తెలుసుకోవచ్చు. కాంపిటీటివ్‌ స్ట్రాటజీ, మేనేజింగ్‌ మల్టీ బ్రాండ్స్‌, ఆంత్రపాలజీ ఆఫ్‌ లగ్జరీ కన్సమ్‌ప్షన్‌, బ్రాండింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, మార్కెట్‌, కన్సూమర్లను అర్థం చేసుకోవడం, ప్రైసింగ్‌, బ్రాండ్‌ బిల్డింగ్‌ వంటి అంశాలను నేర్చుకుంటారు. డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ కోర్సులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ కోర్సులకు డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. కొన్ని సంస్థలు కామర్స్‌ నేపథ్యం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌
* ఎస్‌పీ జైన్‌ స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి ‌
* ముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ అడ్వర్టైజింగ్‌, అహ్మదాబాద్‌ ల్రగ్జరీ కనెక్ట్‌ బిజినెస్‌ స్కూలు, గుడ్‌గావ్‌, పెరల్‌ అకాడమీ, న్యూదిల్లీ, ముంబయి మొదలైనవి.
అవకాశాలు: వివిధ సంస్థలు వీరిని బ్రాండ్‌ మేనేజర్‌, ఫ్యాషన్‌ గూడ్స్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌, ఫ్యాషన్‌ రిటైల్‌ మేనేజర్‌, ఫ్యాషన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ స్పెషలిస్ట్‌, మార్కెటింగ్‌ అండ్‌ విజువల్‌ మర్చండైజింగ్‌ మేనేజర్‌ స్థానాల్లో నియమించుకుంటున్నాయి.

ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
ఫ్యాషన్‌, మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ల కలయిక. బ్రాండ్‌ విలువను పెంచడం, మీడియా, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా దానిపై అవగాహన కల్పించడం దీనిలో భాగం. సంబంధిత నిపుణులు మార్కెట్‌లో తమ వస్తువుకు గిరాకీ పెంచడానికి అవసరమైన కొత్త, సృజనాత్మక వ్యూహాలను రూపొందిస్తారు. ఇందుకు తాజా ట్రెండ్‌లను గమనించడం, వాటిపై పరిశోధన చేయడం ద్వారా విజయానికి అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తుంటారు. ఇందుకు మంచి కమ్యూనికేషన్‌ కూడా అవసరం అవుతుంది.
డిప్లొమా, డిగ్రీ (బీఏ), పీజీ (ఎంబీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఏదేని గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు. ఎంబీఏ కోర్సుకు ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ‌
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నొవేషన్‌, ముంబయి ‌
* ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె ‌
* వోగ్‌ ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ ‌
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నొవేషన్‌, ముంబయి ‌
* ఎఫ్‌డీడీఐ, చెన్నై, ముంబయి, కోల్‌కతా ‌
* ఆర్క్‌ అకాడమీ ఆఫ్‌ డిజైన్‌, జయపుర మొదలైనవి.
అవకాశాలు: అపారల్‌ బ్రాండ్‌లు, బొతిక్‌లు, రిటైల్‌ చైన్‌ అవుట్‌లెట్‌లు వీరిని నియమించుకుంటాయి. పీఆర్‌, ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌, బ్రాండ్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌గా అవకాశాలుంటాయి.

జ్యూలరీ డిజైన్‌
పండుగలు, ఫంక్షన్లు.. చిన్న కార్యక్రమమైనా ఆభరణాలవైపే దృష్టి మళ్లుతుంది. కస్టమర్ల దృష్టిని ఆకర్షించడంతోపాటు కొన్నేళ్లపాటు బోర్‌ కొట్టకుండా చేయడంపై వీరి విజయం ఆధారపడి ఉంటుంది. భారీ నుంచి తేలికపాటి వరకు అన్ని రకాల ఆభరణాలపై వీరు పని చేస్తుంటారు. అనుభవాన్ని బట్టి వీరికి అవకాశాలు పెరుగుతుంటాయి. వివిధ రకాల రాళ్లు, లోహాలపైనా అధ్యయనం చేస్తారు.
డిప్లొమా, డిగ్రీ (బ్యాచిలర్‌, బీఎస్‌సీ), మాస్టర్స్‌, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా కోర్సులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. పీజీ కోర్సులకు డిగ్రీ అర్హత ఉండాలి. చాలావరకూ సంస్థలు సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జ్యూలరీ, అహ్మదాబాద్‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యూలరీ, న్యూదిల్లీ
* మణిపాల్‌ యూనివర్సిటీ, జయపుర
* వోగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బెంగళూరు
అవకాశాలు: జ్యూలరీ, మాన్యుఫాక్చరర్లు, షోరూంలలో వీరికి అవకాశాలుంటాయి. రిటైల్‌ చైన్‌ సంస్థలూ వీరిని ఎంచుకుంటుంటాయి.

ఫ్యాషన్‌ టెక్నాలజీ
క్రియేటివిటీ, టెక్నాలజీల కలయిక ఇది. మారుతున్న సమయానికి అనుగుణంగా దుస్తుల, యాక్సెసరీల రూపకల్పనలో టెక్నాలజీకి ప్రాముఖ్యం ఇస్తారు.
ఈ విభాగంలో డిగ్రీ, పీజీ కోర్సులు- బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాలవ్యవధి సంస్థలను బట్టి మారుతుంది. చాలావరకూ సంస్థల్లో బ్యాచిలర్‌ కోర్సుకు నాలుగేళ్లు కాగా, కొన్నింటిలో మూడేళ్లు మాత్రమే. సెమిస్టర్లు ఉంటాయి. ఇంటర్‌ స్థాయిలో మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ (ఎంపీసీ) సబ్జెక్టులను కలిగి ఉన్నవారు అర్హులు. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ చేసినవారు లేదా ఏదేని బ్రాంచితో బీటెక్‌ చేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. కోర్సులో భాగంగా ఫ్యాషన్‌ పరిశ్రమకు అవసరమైన టెక్నిక్‌లు, మెథడ్స్‌, ఇన్‌స్ట్రుమెంట్ల గురించి తెలుసుకుంటారు. ఉన్న వస్త్రాల ఆధారంగా కొత్తరకాలను రూపొందించడం తెలుసుకుంటారు. తక్కువ ఖర్చులో ఎక్కువ నాణ్యమైన వాటిని రూపొందించడంపై దృష్టిపెడతారు. దీంతోపాటు రంగానికి అవసరమైన కొంత మేనేజ్‌మెంట్‌ అంశాలూ ఉంటాయి. ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌లకు సంబంధించి కాన్సెప్చువలైజింగ్‌, డిజైనింగ్‌, మేనేజింగ్‌, మార్కెటింగ్‌ అంశాలపై అవగాహన తెచ్చుకుంటారు.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ‌
* నిఫ్ట్‌
* సీఈటీ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐరాపురం ‌
* మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కొట్టాయం
అవకాశాలు: ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు వీరిని నిమమించుకుంటాయి. వివిధ బ్రాండ్‌లకు కన్సల్టేషన్‌ ఇవ్వడానికి వీరిని తీసుకుంటారు. ఫ్యాకల్టీగా అవకాశాలుంటాయి.

ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ
దుస్తులు, జ్యూలరీ ప్రమోషన్లు, అడ్వర్టైజింగ్‌లకు ప్రత్యేకమైన ఫొటోగ్రాఫర్లు అవసరమవుతుంటారు. వీరు ముఖ్యంగా మేగజీన్లు, పేపర్లు, హోర్డింగ్‌ల కోసం ఫొటోలు తీస్తుంటారు. ప్రచారం చేయాలనుకుంటున్న ప్రొడక్ట్‌పై కస్టమర్ల దృష్టి ఎక్కువగా పడేలా చేయడం వీరి విధి. అందుకు అవసరమైన రంగుల మేళవింపు, కోణాన్ని నిర్ధారించడం వంటివాటిపై పట్టు ఉండాలి. వీటన్నింటినీ కోర్సుల్లో భాగంగా నేర్చుకుంటారు. ఎక్కువగా డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాలవ్యవధి ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ ఉన్నాయి. చాలావరకూ సంస్థలు డిగ్రీ వారికి అవకాశమిస్తుండగా, కొన్ని సంస్థలు ఇంటర్‌ వారినీ తీసుకుంటున్నాయి.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, ముంబయి
* సింబయాసిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, పుణె
* దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, దిల్లీ మొదలైనవి.
అవకాశాలు: ఫ్యాషన్‌ మేగజీన్లు, ఫ్యాషన్‌ హౌజ్‌లు, కేటలాగ్‌, అడ్వర్టైజింగ్‌ సంస్థలు వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫ్యాషన్‌ డిజైనర్ల దగ్గరా చేరొచ్చు.

ఇమేజ్‌ కన్సల్టింగ్‌/ పర్సనల్‌ స్టైలింగ్‌
ఒక వ్యక్తి ఇమేజ్‌ను పూర్తిగా మెరుగ్గా మార్చేయడం వీరి విధి. దుస్తులు, స్టైలింగ్‌ వంటి అంశాలపై దృష్టి పెడతారు. వస్త్రాలు, యాక్సెసరీలకే పరిమితం కాకుండా వారి బాడీ లాంగ్వేజ్‌, తీరు తెన్నులు.. ఇంకా ఎన్నో అంశాలపై దృష్టి పెడతారు. మొత్తంగా ఒక పూర్తి వ్యక్తిగా తయారు చేస్తారు. కోర్సులో భాగంగా వీటికి సంబంధించిన అంశాలన్నింటిపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేకంగా డిగ్రీ కోర్సులేవీ అందుబాటులో లేవు. సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు వీటిని చేయొచ్చు. కోర్సుల కాలవ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది.
కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు:
* జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, ముంబయి
* ముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, అహ్మదాబాద్‌
* ఇమేజ్‌ కన్సల్టింగ్‌ బిజినెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో అందుబాటులో ఉంది)
* స్టెర్లింగ్‌ స్టైల్‌ అకాడమీ, ముంబయి
* ఇమేజ్‌ ఎడ్జ్‌ అకాడమీ, ముంబయి
* ఇంపాక్ట్‌- ఇమేజ్‌ స్టైలింగ్‌ అండ్‌ ఎటిక్విట్‌ కన్సల్టెంట్స్‌, గుడ్‌గావ్‌, బెంగళూరు, ముంబయి ‌
* ఫస్ట్‌ ఇంప్రెషన్‌, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌ మొదలైనవి.
అవకాశాలు: పబ్లిక్‌, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు వీరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇమేజ్‌ కన్సల్టింగ్‌ సంస్థల్లో చేరొచ్చు. ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ సేవలను అందించడం ద్వారా స్వీయ ఉపాధి పొందొచ్చు.

Back..

Posted on 27-08-2019