Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అదిరే... కళ్లు చెదిరే ఆహార్యం!

ఆటగా.. ఆసక్తిగా.. హాబీగా జీవితం సాగితే ఎలా ఉంటుంది? ఆహా.. అంతకంటే ఆనందం ఏముంటుంది? నిజమే! సరిగ్గా అలాంటిదే డిజైనింగ్‌. వాస్తవానికి ఉద్యోగమే అయినా మన హాబీకి కొనసాగింపుగా కనిపిస్తుంది. ఒక డిజైనర్‌ లేదా ఒక ఆర్టిస్టు తన జాబ్‌లో ఎలా ఉంటాడో... ఊహిస్తే ఒక అందమైన చిత్రమే కళ్ల ఎదుట నిలుస్తుంది. అది కేవలం ఉద్యోగంలా అనిపించదు. అందుకే డిజైనింగ్‌ ఒక డిజైరబుల్‌ కెరియర్‌గా ఎదుగుతోంది. సృజనాత్మకత ఉన్నవాళ్లు ఇందులోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం నిఫ్ట్‌, యూసీడ్‌, సీడ్‌ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ కోర్సుల్లో చేరితే అభ్యర్థులు తమ హాబీలను ఉద్యోగాలుగా మార్చుకోవచ్చు.

ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. పంచరంగుల ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని యువతీ యువకులు ఆకాంక్షిస్తుంటారు. ఈ ఆసక్తి ఉన్నవారు సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, రంగులు, ట్రెండ్‌, ఫ్యాబ్రిక్‌.. వీటన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. సృజనాత్మకత ఉండాలి. దాంతోపాటు ఆలోచనలకు సంబంధించిన ఊహా చిత్రాన్ని చేతితో గీయడం, కంప్యూటర్‌లో దానికి రూపాన్నివ్వడం.. ఈ రెండింటిలో దేన్నైనా తెలుసుకోవాలి. ఫ్యాషన్‌, డిజైన్‌ రెండింటి మధ్య తేడాలూ, సారూప్యాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆలోచనల్లో నవ్యత, శైలిలో వైవిధ్యం చూపాలనుకునేవారికి ఈ కెరియర్‌ అద్భుత అవకాశాలనిస్తుంది. నిరంతరం మార్పునకు గురవుతూ ఆకర్షణీయంగా ఉండే ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొని అద్భుత ప్రతిభను ప్రదర్శించటంతో పాటు నిర్వహణ సామర్థ్యాలనూ చూపగలిగినవారే దీనిలో రాణిస్తారు. ఈ రంగంలో ప్రవేశించాలంటే డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. పార్ట్‌టైమ్‌, స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేసినవారు దుస్తుల రూపకల్పనకు సంబంధించి అన్ని దశల్లోనూ (డిజైనింగ్‌ దగ్గర్నుంచి పాటర్న్‌ మేకింగ్‌ వరకూ, ఉత్పత్తి, మార్కెటింగ్‌..) ప్రావీణ్యం సంపాదిస్తారు.

ఏ అవకాశాలు?
ఫ్యాషన్‌ పరిశ్రమ మనదేశంలో అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఓ సర్వే ప్రకారం- మనదేశ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పరిశ్రమ వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో రూ. 180 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు వృద్ధి చెందబోతోంది. భారతీయ ఫ్యాషన్‌ విదేశాల్లోనూ ప్రసిద్ధికెక్కింది. అంతర్జాతీయ గిరాకీకి అనుగుణంగా నాణ్యమైన ఫ్యాషన్‌ ఉత్పత్తులూ, యాక్సెసరీస్‌ను ఎందరో భారతీయ డిజైనర్లు రూపొందిస్తున్నారు. భారతీయ దుస్తులూ, చీరలకు విదేశాల్లో ఎంతో ఆకర్షణ ఉంది. ‘డిజైనర్‌ వేర్‌’కు నానాటికీ డిమాండ్‌ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో సంబంధిత కోర్సులు చేసి, కొత్త ఆలోచనలతో కష్టపడే స్వభావం ఉన్న ప్రతిభావంతులకు ఈ రంగం ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఎక్స్‌పోర్ట్‌ హౌజులు, గార్మెంట్‌ స్టోర్‌ చెయిన్స్‌, టెక్స్‌టైల్‌ మిల్స్‌, లెదర్‌ కంపెనీలు, బొటిక్స్‌, ఫ్యాషన్‌ షో నిర్వహణ సంస్థలు, జ్యూవెలరీ కంపెనీలు, మీడియా సంస్థల్లో భిన్న హోదాల్లో ఉపాధి లభిస్తోంది. వస్త్ర కంపెనీల్లో ఫ్యాషన్‌ డిజైనర్లు, టెక్స్‌టైల్‌ డిజైనర్లు, మోడల్స్‌, రిటైలర్స్‌, బయర్స్‌, మర్కండైజర్స్‌ లాంటి వైవిధ్యభరితమైన ఉద్యోగాలుంటాయి.
ఎంట్రీ స్థాయిలో నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకూ మాత్రమే ఉన్నప్పటికీ అనుభవం, నైపుణ్యాలు పెరిగినకొద్దీ నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకూ వేతనం ఇస్తారు. ఈ రంగంలో తమదైన ముద్ర చూపగలిగితే పేరు ప్రతిష్ఠలు, ఊహించనంత ఆదాయం పొందవచ్చు. స్వయం ఉపాధికి అపారమైన ఆస్కారం ఉన్న రంగమిది.

టెక్నాలజీ, డిజైన్‌ రెండింటికీ నిఫ్ట్‌
నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిజైన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులను నిఫ్ట్‌లు అందిస్తున్నాయి.హైదరాబాద్‌తో పాటు దేశంలోని 16 ప్రాంతాల్లో నిఫ్ట్‌లు ఉన్నాయి.
అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులకు ఇంటర్‌ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ తో ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిప్లొమా ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల్లో ఆఖరి సంవత్సరం చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు అక్టోబరు 1, 2018 నాటికి 23 ఏళ్లలోపు ఉండాలి.
పీజీ కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ. వీటికి అర్హత- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్‌ లేదా నిడ్‌ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేయటానికి నిఫ్ట్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌ టెక్‌) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ/ బీటెక్‌ ఉండాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
* అన్ని నిఫ్ట్‌ల్లోనూ కలిపి యూజీ, పీజీ సీట్లు 3547 ఉన్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌కు సంబంధించి ఫ్యాషన్‌ డిజైన్‌లో 531, లెదర్‌ డిజైన్‌లో 140, యాక్సెసరీ డిజైన్‌లో 496, టెక్స్‌టైల్‌ డిజైన్‌లో 461, నిట్‌వేర్‌ డిజైన్‌లో 246, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌లో 495 సీట్లు ఉన్నాయి.
* బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో అపెరల్‌ ప్రొడక్షన్‌ విభాగంలో 425 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పీజీ కోర్సులైన మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌లో 141, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో 496, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో 116 సీట్లు ఉన్నాయి.
పరీక్ష ఇలా...
* బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్టు (సీఏటీ), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ) నిర్వహిస్తారు. అనంతరం సిచ్యువేషన్‌ టెస్టు ఉంటుంది. జనరల్‌ ఎబిలిటీ టెస్టులో భాగంగా...క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 20, కమ్యూనికేటివ్‌ ఎబిలిటీ 25, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 25, అనలిటికల్‌ ఎబిలిటీ 15, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు.
* బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌) కోర్సులో జనరల్‌ ఎబిలిటీ టెస్టు (జీఏటీ)లో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. వీటిని మూడు గంటల్లో పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 30, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 45, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ నుంచి 25, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్‌ స్టడీకి 25 మార్కులు.
క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌: అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు. రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు, పరిశీలనాశక్తి ఏ విధంగా ఉంది, కొత్తదనం ఏమైనా ఉందా, ఇలస్ట్రేషన్‌, కళాత్మక నైపుణ్యం..తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది.
కేస్‌ స్టడీ: అభ్యర్థి మేనేజీరియల్‌ నైపుణ్యం పరిశీలిస్తారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలతోపాటు బృందచర్చ, ముఖాముఖి నిర్వహిస్తారు.
విదేశాల్లోనూ అవకాశం
నిఫ్ట్‌ విద్యార్థులు కావాలనుకుంటే అమెరికాలోనూ చదువుకోవచ్చు. దీనికోసం న్యూయార్క్‌లోని ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఫిట్‌)తో నిఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు నిఫ్ట్‌లో రెండేళ్లు చదివిన తర్వాత ఫిట్‌లో ఏడాది పాటు విద్యనభ్యసించాలి. అనంతరం నిఫ్ట్‌లో చదువుకోవాలి. కోర్సు పూర్తయిన వెంటనే నిఫ్ట్‌, ఫిట్‌ రెండు సంస్థలూ డిగ్రీని ప్రదానం చేస్తాయి. అంటే ఏక కాలంలో డ్యూయల్‌ డిగ్రీని అందుకోవచ్చన్నమాట.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 28.12.2018. రూ.5000 ఆలస్య రుసుముతో 03.01.2019 వరకు చెల్లించవచ్చు.
ప్రవేశ పరీక్ష తేదీ: 20.01.2019
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.

డిజైన్‌ కోర్సులకు ఐఐటీల బాట
డిజైన్‌ కోర్సుల్లో రాణించాలనుకునే ఇంటర్‌ విద్యార్థులు రాయాల్సిన పరీక్ష.. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌). దీన్ని ఐఐటీ-బాంబే నిర్వహిస్తోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డిజ్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
2018లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ గ్రూపు విద్యార్థులైనా అర్హులే. (ఐఐటీ-గువాహటిలో ప్రవేశానికి ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి. మిగిలిన సంస్థల్లో సీట్లకు ఇంటర్‌/ ఒకేషనల్‌/ డిప్లొమా విద్యార్థులు పోటీ పడవచ్చు). అక్టోబరు 1, 1994 తర్వాత జన్మించినవారే అర్హులు.
పరీక్ష తీరు
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. మొత్తం 85 ప్రశ్నలు వస్తాయి. 300 మార్కులు.
సెక్షన్‌ ఎ (న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌): 20 ప్రశ్నలుంటాయి. 80 మార్కులు. ప్రశ్నలకు జవాబును నేరుగా ఖాళీపై పూరించాలి. ఆప్షన్లుండవు. కీబోర్డు ఉపయోగించి సమస్యను సాధించుకోవచ్చు. సరైన సమాధానానికి 4 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్‌ బి (మల్టిపుల్‌ సెలక్ట్‌ టైప్‌): వంద మార్కులు, 25 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లుంటాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు. సరైన ఆప్షన్లు గుర్తిస్తే 4 మార్కులు వస్తాయి. ఆ ప్రశ్నకున్న సరైన సమాధానాలన్నీ గుర్తిస్తేనే మార్కులు. సరైన సమాధానాల్లో ఒకటి విడిచిపెట్టినా, సరైన సమాధానాలతోపాటు ఒక సరికానిది గుర్తించినా మార్కులుండవు. గుర్తించిన ఆప్షన్లలో కొన్ని సరైనవి ఉన్నప్పటికీ పాక్షిక మార్కులు కేటాయించరు. రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్‌ సి (మల్టిపుల్‌ ఛాయిస్‌ టైప్‌): 120 మార్కులు, 40 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. అయితే వీటిలో ఒక ఆప్షన్‌ మాత్రమే సరైనది. మిగిలినవి సరికానివి. అందువల్ల ఈ విభాగానికి రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి సరైన జవాబుకూ 3 మార్కులు. తప్పు సమాధానం గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు.
పాత ప్రశ్నపత్రాలు-జవాబులు యూసీడ్‌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అవి చూస్తే పరీక్షపై అవగాహన వస్తుంది. సృజన, ఆలోచన, తార్కికతలపై ముడిపడి ప్రశ్నలను సంధిస్తారు.
ప్రవేశం కల్పించేవి: ఐఐటీ-బాంబేలో 30, హైదరాబాద్‌లో 10, గువాహటిలో 45, ఐఐఐటీ డీఎం-జబల్‌పూర్‌లో 30 సీట్లున్నాయి. ఐఐటీ-బాంబేలో చేరినవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడో సంవత్సరంలో ఇలా చేరితే డ్యూయల్‌ డిగ్రీ అయిదేళ్లలో పూర్తవుతుంది.
యూసీడ్‌ స్కోర్‌తో ప్రవేశం కల్పించే ఇతర సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్‌, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శ్రేష్ఠ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, మిట్‌, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌.

పీజీ, పీహెచ్‌డీలకు సీడ్‌
డిజైన్లో యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు పీజీలో ప్రవేశానికి సీడ్‌ ద్వారా అవకాశం కలుగుతుంది. ఈ పరీక్ష ద్వారా పీజీ విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సులో చేరవచ్చు. ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్‌, కాన్పూర్‌, ఐఐటీడీఎం జబల్పూర్‌లో డిజైన్‌కు సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
బీటెక్‌, బీఆర్క్‌, డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, బీఎఫ్‌ఏ వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు/ జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా (10+5 సం.) చదివినవారు సీడ్‌ పరీక్షకు అర్హులు. ప్రవేశం కల్పించే సంస్థలనుబట్టి వ్యత్యాసాలుంటాయి. వయసు పరిమితి లేదు.
ముఖ్యమైన తేదీలు (యూసీడ్‌, సీడ్‌)
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 9
పరీక్ష: జనవరి 19.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం

Back..

Posted on 25-10-2018