Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధి దారిలో పాదరక్షలు

* ఎఫ్‌డీడీఐ కోర్సుల ప్రకటన విడుదల

కాళ్లకు రక్షణ కల్పిస్తూనే, హుందాతనాన్ని పెంపొందించేలా తోడ్పడుతున్నాయి పాదరక్షలు. ఆకర్షణీయ డిజైన్లలో పాపాయి నుంచి పెద్దాయన వరకూ అందరినీ ఇవి ఆకట్టుకుంటున్నాయి. పర్వాలేదు అనుకున్నవారికి పై స్థాయిలో, లేనివాళ్లకు అందుబాటు ధరల్లో ఇప్పుడివి అన్నిచోట్లా దొరుకుతున్నాయి. వీటిని సౌకర్యవంతంగా అవసరాలకు తగ్గట్టుగా తయారుచేయడానికి ఎంతోమంది నిపుణులు అవసరం. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) ఈ రంగంలో జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన సంస్థ. తాజాగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎఫ్‌డీడీఐ ప్రకటన వెలువడింది. ఆ వివరాలు చూద్దాం...

పాదరక్షల తయారీలో నాణ్యమైన మానవ వనరులను సృష్టించి ఎక్కువమందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 1986లో ఏర్పాటయింది. ఈ సంస్థకు హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పాదరక్షలకు సంబంధించి బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీలను అందిస్తున్నారు.
కోర్సులో భాగంగా వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు ఎలా తయారుచేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పిస్తారు. వీటితోపాటు టైల్‌ మేనేజ్‌మెంట్‌, కన్జూమర్‌ బిహేవియర్‌, రిటైల్‌ కమ్యూనికేషన్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ ఆపరేషన్‌, మార్కెటింగ్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, సేల్స్‌ మేనేజ్‌ మెంట్‌, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌...మొదలైనవన్నీ నేర్పుతారు.
ఈ సంస్థలో డిజైన్‌ కోర్సులు చేసినవారికి ఎక్కువగా పాదరక్షల తయారీ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఎంబీఏ కోర్సు చదివినవారికి పాదరక్షలు విక్రయించే సంస్థల్లో ఏరియా మేనేజర్‌, ఫ్లోర్‌ మేనేజర్‌, స్టోర్‌ మేనేజర్‌ మొదలైన ఉద్యోగాలుంటాయి. చెప్పుల తయారీ ఉద్యోగాలు, విక్రయించే కొలువులు ఈ రెండూ ఇక్కడి విద్యార్థులకు దక్కుతాయి. అడిడాస్‌, యాక్షన్‌, బాటా, ఫ్యూచర్‌ గ్రూప్‌, గ్లోబస్‌, ఖాదిమ్స్‌, లైఫ్‌ స్టైల్‌, ల్యాండ్‌ మార్క్‌, మ్యాక్స్‌, రీబక్‌, లిబర్టీ, రిలయన్స్‌ రీటైల్‌, వెస్ట్‌సైడ్‌, ఉడ్‌ల్యాండ్‌..మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఇక్కడి విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష
జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ప్రవేశాలుంటాయి. 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌ నెస్‌, బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పీజీ కోర్సులకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు.

కోర్సులు, అర్హతలు
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో-780, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌లో-330, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌లో-525, ఫ్యాషన్‌ డిజైన్‌లో 870 సీట్లు ఉన్నాయి. కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌ విద్యార్హతతో చేరవచ్చు.
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో 75 సీట్లు ఉన్నాయి.ఫుట్‌వేర్‌ / లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌ / ఫ్యాషన్‌ / ఇంజినీరింగ్‌ / ఫైన్‌ ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌ల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు చదివినవారు అర్హులు.
ఎంబీఏ (రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌): దీనిలో 435 సీట్లు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చేరవచ్చు.
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (క్యాడ్‌/ క్యామ్‌): దీనిలో 60 సీట్లున్నాయి .ఫుట్‌వేర్‌ / లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌ / ఫ్యాషన్‌ / ఇంజినీరింగ్‌ / ఫైన్‌ ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌ల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు చదివినవారు అర్హులు.
యూజీ, పీజీల్లో కలుపుకుని అన్ని సంస్థల్లోనూ 3075 సీట్లు ఉన్నాయి. మరో 304 ఎన్‌ఆర్‌ఐ, స్పాన్సర్డ్‌ సీట్లు లభిస్తున్నాయి.

క్యాంపస్‌లు: నోయిడా, రోహ్‌తక్‌, కోల్‌కతా, ఫుర్సత్‌ గంజ్‌, చెన్నై, జోధ్‌పుర్‌, చిండ్వారా, పట్నా, చండీగఢ్‌, గుణ, హైదరాబాద్‌, అంకలేశ్వర్‌ (గుజరాత్‌)

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20
పరీక్ష తేదీ: మే 19
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: www.fddiindia.com


Back..

Posted on 29-01-2019