Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సెక్యూరిటీస్‌ మార్కెట్లో ఉపాధి

ఫైనాన్షియల్‌ మార్కెట్లు నిరంతరం మార్పు చెందుతుంటాయి. కొత్త సమాచారాన్ని ఇముడ్చుకుంటూ, సరికొత్త సాంకేతికతను జోడించుకుంటూంటాయి. అందుకే ఉత్సుకత కలిగిన విద్యార్థులకూ, నైపుణ్యం వృద్ధి చేసుకోవాలనే ఆసక్తి కలిగినవారికీ ఎన్‌సీఎఫ్‌ఎం, ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్లు మంచి అవకాశం. ఈ ధ్రువీకరణ పరీక్షల గురించీ, ఉపాధి అవవకాశాల గురించీ పరిశీలిద్దాం.
సెక్యూరిటీస్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ- సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) 1992లో స్థాపితమైంది. భారత క్యాపిటల్‌ మార్కెట్లు సరికొత్తగా రూపుదిద్దుకోవడానికి ఇదెంతో దోహదపడింది. సెక్యూరిటీస్‌ మార్కెట్లు విస్తృతమవుతూ, ఆర్థికవ్యవస్థ ప్రపంచీకరణ చెందుతున్న క్రమంలో, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో భారతదేశ ఫైనాన్షియల్‌ మార్కెట్లు గణనీయమైన అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం విస్తృతమైన ఉద్యోగావకాశాలు, కెరియర్‌ నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నాయి.
ఆర్థికశాస్త్రం, గణితం, గణాంకశాస్త్రం, అకౌంటింగ్‌, న్యాయశాస్త్రం, కంప్యూటింగ్‌ మొదలైన శాస్త్రాల సమ్మిళితమైన అనువర్తనమే ఫైనాన్షియల్‌ మార్కెట్లలో చూడవచ్చు. దీనిమూలంగా ఫండ్‌ మేనేజర్లు, అనలిస్ట్‌లు, రిస్క్‌ మేనేజర్లు, మర్చంట్‌ బ్యాంకర్లు, స్టాక్‌ బ్రోకర్లు, డీలర్లు, రిలేషన్‌షిప్‌ మేనేజర్లు లాంటి ఉద్యోగావకాశాలు లభ్యమవుతాయి.
వీరికి స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్లు, మర్చంట్‌ బ్యాంకర్లు, క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు, అనలిటిక్స్‌- పరిశోధనా సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
సెక్యూరిటీస్‌ మార్కెట్లకు విస్తృత పరిధి ఉంటుంది. ఉదాహరణకు షేర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కంపెనీల బాండ్లు, ఈక్విటీ డెరివేటివ్స్‌ (ఇండెక్స్‌, ఫ్యూచర్స్‌, ఇండెక్స్‌ ఆప్షన్స్‌, స్టాక్‌ఫ్యూచర్స్‌, స్టాక్‌ ఆప్షన్స్‌), కరెన్సీ డెరివేటివ్స్‌, కమోడిటీ డెరివేటివ్స్‌, వడ్డీరేట్ల డెరివేటివ్స్‌, ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌, మ్యూచువల్‌ ఫండ్లు ఈ కోవలోకి వస్తాయి. కొత్త సాధనాలు మార్కెట్లలోకి ప్రవేశిస్తుంటాయి.
నాణ్యమైన సేవలందించడానికి ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఉద్యోగులు ఒక ప్రవర్తనా నియమావళిని అనుసరించడం, సరైన నైపుణ్యాలను ఒక పరీక్ష, ధ్రువీకరణ పద్ధతి ద్వారా కలిగివుండడం ఆవశ్యకం. మార్కెట్లలో మధ్యవర్తిత్వం చేయడానికి మానవ నైపుణ్యాలు కీలకం కాబట్టి, సెక్యూరిటీస్‌ వ్యాపారం పట్ల సరైన అవగాహన కలిగిన వ్యక్తులను తయారుచేసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అందువల్ల అంతర్జాతీయంగా మార్కెట్లలో మధ్యవర్తులకు సరైన ధ్రువీకరణ పరీక్షలు ఎంతో ఆదరణ, ప్రాచుర్యం పొందాయి.
మనదేశంలో ఇటువంటి పరీక్షలు, ధ్రువీకరణ పద్ధతి ఆవశ్యకతను గుర్తించి ఎన్‌ఎస్‌ఈ 1998లో ఎన్‌సీఎఫ్‌ఎంను ప్రవేశపెట్టింది. ఈ సర్టిఫికేషన్ల వ్యవస్థ మార్కెట్లు పూర్తిగా రూపాంతరం చెందే క్రమంలో ముఖ్యపాత్రను వహిస్తున్నాయని చెప్పవచ్చు.
ఎవరికి ఉపయోగం?
ఎన్‌సీఎఫ్‌ఎం ఒక ఆన్‌లైన్‌ పరీక్ష, ధ్రువీకరణ వ్యవస్థ. దీని ద్వారా అభ్యర్థులు ఫైనాన్షియల్‌ మార్కెట్లలో నైపుణ్యాన్నీ, ఆకర్షణీయమైన ఉద్యోగాలనూ పొందవచ్చు. ఎన్‌సీఎఫ్‌ఎం ప్రోగ్రామ్‌ అనేక మాడ్యూళ్లను కలిగివుంది.
ఉదాహరణకు క్యాపిటల్‌ మార్కెట్లు, ఈక్విటీ డెరివేటివ్స్‌, మార్కెట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌- ఇన్సూరెన్స్‌, కమర్షియల్‌ బ్యాంకింగ్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం మార్కెట్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఎనాలిసిస్‌ అండ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌, కరెన్సీ డెరివేటివ్స్‌, ఫండమెంటల్‌ ఎనాలిసిస్‌, టెక్నికల్‌ ఎనాలిసిస్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఆపరేషన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ట్రెజరీ మేనేజ్‌మెంట్‌, డిపాజిటరీ ఆపరేషన్స్‌, మెర్జర్స్‌ అండ్‌ అక్విజిషన్స్‌, బాక్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఈక్విటీ రీసెర్చ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ మొదలైనవి.
ఎన్‌ఎస్‌ఈ ఇప్పటివరకు 16 లక్షల పరీక్షలు 1998 నుంచి నిర్వహించింది. ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు విద్యార్థులు, మదుపర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సెక్యూరిటీస్‌ మార్కెట్లలో ఆసక్తి కలిగినవారెవరైనా తీసుకోవచ్చు. ఈ పరీక్షలకు అర్హత నిబంధనలు 10+2 మాత్రమే. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, స్టాక్‌ బ్రోకరేజీలు, రీసెర్చ్‌, ట్రేడింగ్‌, కేపీఓ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రాధాన్యం పొందుతారు.
ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్లు
ఎన్‌ఐఎస్‌ఎంను సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా స్థాపించింది. (ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఉద్యోగార్థులు ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్లలో ఉత్తీర్ణత చెందితే వారి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి).
ఎన్‌ఐఎస్‌ఎం సిరీస్‌ అనేక ప్రత్యేకతలతో పరీక్షలు నిర్వహిస్తుంది. కరెన్సీ డెరివేటివ్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, మర్చంట్‌ బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌, రీసెర్చ్‌ ఎనలిస్ట్‌, ఈక్విటీ సేల్స్‌ మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. వీటిలో కొన్ని సర్టిఫికేషన్లను సెబీ తప్పనిసరి చేసింది. ఉదాహరణకు ఈక్విటీ డెరివేటివ్స్‌, కరెన్సీ డెరివేటివ్స్‌, రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ మొదలైనవి.
ఎన్‌సీఎఫ్‌ఎం, ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్లు ఎకనామిక్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఒక అదనపు అర్హతను జోడించి వారి ప్రత్యేకతను చాటుతాయి. దీనివల్ల వారి ఉద్యోగావకాశాలు మెరుగుపడడమే కాకుండా, నైపుణ్యాలను సాధించడానికి ఇవి దోహదపడతాయని చెప్పవచ్చు.
పెరుగుతున్న మార్కెట్ల పరిధి, ఆవశ్యకత
దేశీయ మార్కెట్లు తమ పరిధిని విస్తృతపరచుకుంటూ, మారుమూల ప్రాంతాలకు సైతం స్టాక్‌ మార్కెట్‌ మదుపును తీసుకెళుతున్నాయి. సాంకేతికత ద్వారా మార్కెట్లలో ప్రజాస్వామీకరణ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రపంచ ర్యాంకింగ్‌ల్లో కూడా స్టాక్‌ ఆప్షన్స్‌లో ఎన్‌ఎస్‌ఈ ముద్ర ప్రస్ఫుటంగా ఉంది. ఇది పెరుగుతున్న స్టాక్‌ మార్కెట్ల పరిధి, విస్తృతికి ఒక సంకేతం, యువ విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ రంగంలో ఎన్నో అవకాశాలకు ఒక సూచికగా చెప్పవచ్చు. ఈ సర్టిఫికేషన్ల పూర్తి వివరాలకు www.nseindia.com, www.nism.ac.in సందర్శించవచ్చు.
ఉద్యోగావకాశాలు
ఎన్‌సీఎఫ్‌ఎం, ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్లు ద్వారా అభ్యర్థులు డీలర్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఆపరేషన్స్‌ లేదా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌, రీసెర్చ్‌ అనలిస్ట్‌లుగా కెరియర్‌ను ప్రారంభించవచ్చు. వీరికి ప్రారంభ సగటు వేతనాలు సంవత్సరానికి 2- 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. దీనికి తోడు ప్రోత్సాహకాలు కూడా 5 - 10% లభిస్తాయి. ఈ సర్టిఫికేషన్ల ద్వారా అభ్యర్థులు పొందే ముఖ్యమైన ఉద్యోగావకాశాలు:
1. డీలర్‌:
డీలర్లు మదుపర్ల తరపున వివిధ రకాలైన ఆర్థిక సాధనాలను అమ్మడం, కొనడం చేస్తారు. డీలర్లు వారి సంస్థల ప్రమాణాల మేరకు మార్కెట్‌ అభిప్రాయాలు, మదుపు సలహాలు క్లయింట్లకు అందిస్తారు. అభ్యర్థికి విశ్లేషణాత్మక, గణిత నైపుణ్యాలు అవసరం. వీరి విధుల్లో ముఖ్యమైనవి ట్రేడింగ్‌ టెర్మినల్‌ను అమర్చడం, మదుపరుల చిట్టాను నవీకరించడం, మార్కెట్‌లో నైపుణ్యం, సలహా సామర్థ్యం పెంపొందించుకోవడం, నిర్వాహక విధులు నిర్వర్తించడం ముఖ్యమైనవి. డీలర్లు ట్రేడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం, కొత్త మదుపర్లను చేర్చుకోవడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, మార్కెట్‌ నివేదికలను రీసెర్చ్‌ విభాగం నుంచి పొందడం, మదుపరుల ప్రశ్నలకు సమాధానాలివ్వగలిగిన స్థితిలో ఉండడం ముఖ్యమైనవి. దీనికి ఎన్‌సీఎఫ్‌ఎం (డీలర్స్‌) మాడ్యూల్స్‌, ఎన్‌ఐఎస్‌ఎం (సిరీస్‌-8) సర్టిఫికేషన్‌ అవసరమవుతాయి.
2. రిలేషన్‌షిప్‌ మేనేజర్‌:
రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ముఖ్యపాత్ర ట్రేడింగ్‌, డి-మ్యాట్‌ అకౌంట్‌లను అమ్మి కొత్త మదుపరులను చేర్చుకోవడం, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో రిలేషన్‌షిప్‌ మేనేజర్లు మదుపర్లను ఫండ్‌ స్కీముల్లో చేర్చుకోవడం వారి ముఖ్యమైన విధి. దీనికి ఎన్‌ఐఎస్‌ఎం (సిరీస్‌- 11) ఈక్విటీ సేల్స్‌ సర్టిఫికేషన్‌ ఉపయోగకరం.
3. రిస్క్‌ మేనేజర్‌:
స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల్లో రిస్క్‌ మేనేజర్లు ముఖ్యపాత్ర వహిస్తారు. వీరి విధుల్లో ముఖ్యమైనవి-
1. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ లేదా అంతర్గత నియంత్రణ
2. సంస్థ రోజువారీ రిస్క్‌ను నియంత్రించడం
3. మదుపరుల నిధులను పర్యవేక్షించడం
4. మదుపరుల ఫిర్యాదులను పరిష్కరించడం.
రిస్క్‌ మేనేజర్లు సెబీ నియంత్రణ నియమాల మీద అవగాహన, భారత సెక్యూరిటీ మార్కెట్‌లోని వివిధ రకాలైన సాధనాలు, మార్కెట్‌లో పాల్గొనే వివిధ రకాల మదుపర్లు, వారి పాత్రల మీద జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఒక స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలోని ఫ్రంట్‌ ఆఫీసు, మిడిల్‌ ఆఫీసు, బ్యాక్‌ ఆఫీసుల విధుల మీద అవగాహన, రిస్క్‌లను నియంత్రించడంలో పాటించవలసిన పద్ధతులు, క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ ప్రక్రియలను రిస్క్‌మేనేజర్‌ అవగాహన చేసుకోవాలి.
దీనికి ఎన్‌ఐఎస్‌ఎం (సిరీస్‌-7)- సెక్యూరిటీస్‌ ఆపరేషన్స్‌ అండ్‌ రిస్క్‌మేనేజ్‌మెంట్‌ సర్టిఫికేషన్‌ ఉపయోగకరంగా ఉంటుంది.
4. రీసెర్చ్‌ అనలిస్ట్‌:
సంస్థలను విశ్లేషించడం, నివేదికలు తయారుచేయడం, వార్తల ప్రభావాన్ని షేర్ల మీద అంచనా వేయడం, ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయడం, సంస్థల ఫలితాలను విశ్లేషించడం, షేర్లు, పారిశ్రామిక రంగాలమీద అభిప్రాయం ఏర్పరచుకోవడం రీసెర్చ్‌ అనలిస్ట్‌ విధుల్లో ముఖ్యమైనవి. అనలిస్ట్‌లు సంస్థల ఆర్థిక నమూనాలను తయారుచేయడం, వాటి విలువను అంచనా వేయడం, సంస్థల నిర్వాహకులతో సంభాషించడం చేస్తారు. వీరికి సెబీ (రీసెర్చ్‌ అనలిస్ట్‌) రెగ్యులేషన్‌ 2014 యాక్ట్‌ ప్రకారం ఎన్‌ఐఎస్‌ఎం (సిరీస్‌-15) రీసెర్చ్‌ అనలిస్ట్‌ సర్టిఫికేషన్‌ పరీక్షను తప్పనిసరి చేశారు.

Posted on 21.10.2015

Back