Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తేడా గ్రహిస్తే.... తిరుగులేని గెలుపు

ఇంటర్‌ పరీక్షల్లో 95 శాతానికి మించి మార్కులు తెచ్చుకున్న రాజు జేఈఈలో ఐదంకెల ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. కానీ ఇంటర్లో 80 శాతం ఎప్పుడూ దాటని సునందకు మాత్రం జేఈఈలో వందలోపు ర్యాంకు వచ్చింది. తేడా ఎక్కడుంది? విద్యార్థి... పోటీ పరీక్షార్థిగా తనను మల్చుకోకపోవటం, మల్చుకోవటంలోనే!
టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ... ఇలా ఇవన్నీ విద్యాపరమైన పరీక్షలు. జేఈఈ, ఎంసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌... ఇవన్నీ పోటీ పరీక్షలు. ఈ రెండింటి స్వరూప స్వభావాలను సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల ఎందరో విద్యార్థులకు వైఫల్యాలు ఎదురవుతున్నాయి. అర్థం చేసుకున్న కొందరు మాత్రమే అసాధారణ విజయాలు సాధిస్తున్నారు.
విద్యాపరమైన పరీక్షల- పోటీ పరీక్షల మధ్య కొన్ని వ్యత్యాసాలున్నాయి. వీటిపై స్పష్టత తెచ్చుకుంటే విద్యార్థి, పోటీ పరీక్షార్థిగా రూపాంతరం చెందవచ్చు.
నిర్వహణ ఉద్దేశం
విద్యావిషయక పరీక్షలు అర్హత పరీక్షలు. పై తరగతికి వెళ్లేందుకు ప్రవేశ ద్వారాలు. వీటికి హాజరయ్యేవారి సంఖ్యకు పరిమితి ఉండదు. అలాగే ఎంతమందైనా ఉత్తీర్ణులు కావచ్చు. తన క్లాసులో ఎక్కువమంది ఉత్తీర్ణులు కావాలని అధ్యాపకులు కృషి చేస్తారు. తమ కళాశాల నుంచి ఎక్కువమంది పాసవ్వాలని యాజమాన్యాలు ఆకాంక్షిస్తాయి. ప్రతి ఏడాదీ అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ, ప్రభుత్వాలు కోరుకుంటాయి.
అంతటా ప్రోత్సాహక పరిస్థితులే తప్ప అవరోధాలు పెద్దగా ఉండవు. విద్యార్థి ఎంతగా కృషి చేస్తే అంతగా ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలం. విద్యా విషయక పరీక్షల ప్రయోజనం విస్తృతమైంది. సాధ్యమైనంత ఎక్కువమంది విద్యావంతులను చేయడమే అంతిమ లక్ష్యం.
పోటీ పరీక్షల లక్ష్యం దీనికి భిన్నమైనది. ఉన్నత విద్యాకోర్సుల సీట్లు కానీ, ఉద్యోగ పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య కానీ పరిమితం.
సన్నద్ధత పరంగా...
* విద్యావిషయక పరీక్షలైన టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పరీక్షలకు పాఠ్యపుస్తకాలే ఆధారం. విద్యార్థులు చదువుకున్న పాఠ్యపుస్తకాల నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. ప్రతి సబ్జెక్టుకూ ఏ పాఠం నుంచి ఏ తరహా ప్రశ్నలు ఇవ్వాలన్న బ్లూప్రింట్‌ ఆధారంగానే ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ఏడాదీ ప్రశ్నపత్రం అదే పంథాలో ఉంటుంది కాబట్టి ఒక సిలబస్‌ ప్రకారం ఐదారు అకడమిక్‌ పరీక్షలు అవ్వగానే అధ్యాపకులూ, విద్యార్థులూ పరీక్షల్లో తరచు వచ్చే ప్రశ్నలను గుర్తించగలుగుతారు. కొంతమంది అవే చదువుకెళతారు. పరీక్షలను సునాయాసంగా రాయగలుగుతారు.
* అకడమిక్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రం నుంచి కొన్ని ప్రశ్నలనే ఎంపిక చేసుకుని మరికొన్నింటిని వదలివేసే ‘ఛాయిస్‌’ ఉంటుంది. అందుకే ఏ సబ్జెక్టునయినా మొత్తం కాదనకుండా కొన్ని అధ్యాయాలు మాత్రమే చదివి వెళ్లి పరీక్షల్లో గట్టెక్కవచ్చు.
* విద్యా విషయక పరీక్షల్లో ఎక్కువ భాగం సాంప్రదాయిక వ్యాసరూప జవాబులు రాయాల్సి ఉంటుంది. లఘు ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, దీర్ఘ పద పరిమితి గల ప్రశ్నలు... ఇలా వేర్వేరు స్వరూప ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీనివల్ల పాఠంపై కాస్త పట్టువస్తే చాలు సమాధానాలు ‘తెలివిగా’ రాసి బయటపడవచ్చు. వ్యాసరూప జవాబులు రాయడంలో నైపుణ్యం అలవర్చుకుంటే సబ్జెక్టుపై పూర్తిగా అవగాహన లేకపోయినా జవాబులు రాసే అవకాశం ఉంటుంది.
* పోటీపరీక్షలు ఇందుకు పూర్తి తేడాతో ఉంటాయి. కొన్ని పోటీ పరీక్షలకు సిలబస్‌ ప్రకటించిననప్పటికీ నిర్దిష్ట పాఠ్యపుస్తకాలు ఉండవు. కేవలం రెఫరెన్సు పుస్తకాలు అనుసరించాల్సి ఉంటుంది .సిలబస్‌కు లోబడి ప్రశ్నలు ఇస్తారన్న హామీ ఉండదు. కొన్ని పోటీ పరీక్షలకు సబ్జెక్టు వివరాలు ఇస్తారే తప్ప సిలబస్‌ అంటూ ఉండదు.
అంటే అకడమిక్‌ పరీక్షలకు విద్యార్థి అధ్యయనం పరిమితంగా ఉంటే పోటీ పరీక్షలకు సన్నద్ధత విస్తృతంగా ఉండాలి.
పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు తరచూ మారుతుంటాయి. పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాల సూచికగా ఉపకరిస్తాయే తప్ప అవే ప్రశ్నలు పునరావృతం కావు. జేఈఈ ప్రశ్నపత్రంలో ఏటా ప్రశ్నల సరళినీ, మార్కుల కేటాయింపులనూ మారుస్తుండటారు.
* సాధారణంగా ఏ పోటీ పరీక్షలోనూ ప్రశ్నల ఎంపికలో ఛాయిస్‌ ఉండదు. పైగా అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించగలిగినవారే పరుగు పందెంలో నిలబడగలుగుతారు. ఏ మారుమూల నుంచి ప్రశ్నలు ఇచ్చినా జవాబులు రాయగలగాలి.
* విద్యావిషయ పరీక్షలు వ్యాసరూపంలో ఉంటే- పోటీ పరీక్షల్లో సింహభాగం బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. ఒకవేళ, ఏదైనా పోటీపరీక్షలో వ్యాసరూప ప్రశ్నపత్రం ఉంటే అది తొలిదశ వడపోత దాటిన తర్వాత మాత్రమే ఉంటుంది. చాలా పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహాలోనే జరుగుతాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. రెప్పపాటు సమయంలో ప్రశ్నను చదవగలగడం, నాలుగు జవాబుల్లో సరైనదాన్ని గుర్తించడం అవసరం. సబ్జెక్టుపై పూర్తి ‘పట్టు’ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
పరీక్షించే నైపుణ్యాల పరంగా...
* ప్రశ్నపత్రాల లక్ష్యం కూడా అకడమిక్‌ పరీక్షల- పోటీపరీక్షల విషయంలో వేర్వేరుగా ఉంటుంది. విద్యావిషయక పరీక్ష అర్హత సాధించేందుకు సోపానమైతే- పోటీ పరీక్ష వడపోత అనే పరమపద సోపాన పటం. విద్యావిషయక పరీక్షాపత్రం ఎన్ని లక్షల మందినైనా పై మెట్టుకు చేరుస్తుంది. కానీ పోటీ పరీక్ష ఎన్నో లక్షల మంది నుంచి వందల మందిని వడపోస్తుంది.
స్థూలంగా చెప్పాలంటే... అకడమిక్‌ పరీక్ష ఎంపిక పరీక్ష కాగా పోటీ పరీక్ష తిరస్కార సాధనం (రిజక్షన్‌ ప్రాసెస్‌). విద్యావిషయక పరీక్షలో పదుల మార్కుల తేడా గ్రేడ్స్‌ వ్యత్యాసంతో పై తరగతికి అనుమతిస్తే పోటీ పరీక్ష ఒకటీ అరా మార్కుల వ్యత్యాసంతో వేల ర్యాంకులు వెనక్కి తీసుకు వెళుతుంది.
* విద్యావిషయక పరీక్షల్లో జ్ఞాన, అవగాహన, అనువర్తన అనే మూడు శ్రేణుల నైపుణ్యాలను పరీక్షించాల్సివుంటుంది. సాధారణంగా ఎక్కువ భాగం జ్ఞాన/సమాచార ఆధారంగా విద్యార్థిని మదింపు చేసి ఉత్తీర్ణుల్ని చేసేస్తారు. అయితే పోటీ పరీక్షల్లో మాత్రం పోటీపడే అభ్యర్థుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రశ్నపత్రం కరుకుదేలుతుంది. ఎక్కువ ప్రశ్నలు అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న అవగాహనను పరీక్షిస్తాయి. లేదా గ్రహించిన జ్ఞానాన్ని ఏమేరకు అనువర్తింపజేయగల సామర్థ్యం గలవారో తెలుసుకునేలా ప్రశ్నపత్రం ఉంటుంది.
అందుకే విద్యావిషయక పరీక్షల్లో మార్కులు/గ్రేడ్లు గరిష్ఠంగా ఉంటే...పోటీపరీక్షల్లో ‘కటాఫ్‌’ మార్కులు 40-50 శాతానికి మించవు.
* అకడమిక్‌ పరీక్షల్లో ప్రశ్నలు నేరుగా విద్యార్థి వద్ద ఉన్న సమాచారం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యం, అవగాహన శక్తి, సమస్యా పరిష్కార నైపుణ్యం వంటి ప్రత్యేక అంశాలను పరీక్షించేలా ఉంటాయి. ఈ తరహా ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొనేవారికే పోటీపరీక్షల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.
* మానసిక సామర్థ్యం (మెంటల్‌ ఎబిలిటీ), తార్కిక సామర్థ్యం (రీజనింగ్‌ ఎబిలిటీ), జనరల్‌ అవేర్‌నెస్‌ వంటివి నేరుగా అకడమిక్‌ కోర్సుల్లో ఉండవు. కానీ ఉన్నతవిద్యా లేదా ఉద్యోగ ఎంపికలకు అవసరమైనందున ఈ నైపుణ్యాలను పరీక్షిస్తున్నారు.
* సమయపాలన విషయంలో విద్యావిషయక పరీక్షల్లో కొంత వెసులుబాటు ఉంటుంది. మొత్తం ప్రశ్నపత్రానికి కలిపి గరిష్ఠంగా సమయం కేటాయించడం వల్ల జవాబులు రాయడంలో ఒత్తిడి పరిమితమవుతుంది. అదే పోటీ పరీక్షల్లో సమయపాలన ఒక సవాల్‌. ప్రశ్నలను అర్థం చేసుకోవడంలోనే కాలహరణానికి ఆస్కారం గలవాటిని ప్రశ్నపత్రంలో ఉండేలా చూస్తారు. దీనివల్ల కొన్ని ప్రశ్నలు అభ్యర్థి సమయాన్ని హరించివేస్తాయి. దానితో మిగతా ప్రశ్నల దగ్గరకు వచ్చేసరికి అభ్యర్థి తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా సరైన జవాబులు గుర్తించగలిగినవారే విజేతలుగా నిలుస్తారు!
పాటించదగ్గ సూచనలివిగో...
* విద్యావిషయక పరీక్షలు సులభమనీ- పోటీపరీక్షలు కఠినమనీ కాదు. రెంటినీ త్రాసులో పెట్టి తులాభారం వేసి విద్యావిషయకంగా మెరుగ్గా ఉన్న విద్యార్థులు పోటీ పరీక్షల స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ద్వారా విజయావకాశాలను ద్విగుణీకృతం చేసుకోగలగాలి.
* పోటీపరీక్షల సబ్జెక్టులకు కేవలం సమాచారపరంగానే చదవకుండా విశ్లేషణ, తార్కిక కోణం నుంచి పరిశీలిస్తూ అధ్యయనం చేయడం అవసరం. ఇందుకు గత ప్రశ్నపత్రాలు సూచికగా ఉపకరిస్తాయి. ప్రవేశపరీక్ష లేదా రాయబోయే ఉద్యోగ పరీక్ష గత సంవత్సర ప్రశ్నపత్రాలను సేకరించి వాటిలోని ప్రశ్నలను సమాచారం, అవగాహన, అనువర్తన (అప్లికేషన్‌) ప్రశ్నలుగా వర్గీకరించుకోవడం ద్వారా ప్రిపరేషన్‌ పంథాపై స్పష్టత తెచ్చుకోవచ్చు.
* గత అనేక సంవత్సరాల నుంచి విద్యావిషయక పరీక్షల్లో సులభంగా మార్కులు తెచ్చుకున్నామన్న భావనను వదిలి పోటీపరీక్షలో ఉండే క్లిష్టత, తిరస్కార ప్రక్రియ (రిజెక్షన్‌ ప్రాసెస్‌)ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల పోటీ పరీక్షను పటిష్ఠ సన్నద్ధతతో ఎదుర్కోవాలన్న సంకల్పం ఏర్పడుతుంది.
* పోటీపరీక్షల నమూనా ప్రశ్నలను బహుళైచ్ఛిక విధానంలో సాధన చేయడం మరువరాదు. దీనివల్ల ప్రశ్నల సరళిపై వాస్తవిక అవగాహన, సమయపాలనపై దృష్టీ ఏర్పడతాయి.

Posted on 21-03-.2016