Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విదేశీ విద్యకు ప‌రీక్షలివీ...

యూఎస్‌, యూకే, కెన‌డా, సింగ‌పూర్‌...ఎక్కువ మంది విద్యార్థులు క‌ల‌లు క‌నే దేశాలివి. ఉన్నత బోధ‌నా ప్రమాణాలు, నాణ్యమైన వ‌స‌తుల‌తో ఈ దేశాలు భార‌తీయ విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. గ‌త కొన్నేళ్ల నుంచి విదేశాల్లో చ‌ద‌వ‌డానికి వెళ్తున్న మ‌న‌వాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. ఒక‌ప్పుడు పీజీ కోర్సుల‌ను అభ్యసించ‌డానికి అమెరికా విమాన‌మెక్కేవారు. కానీ ఇప్పుడు యూజీ కోర్సుల‌కూ ఫారిన్‌ యూనివ‌ర్సిటీల గ‌డ‌ప తొక్కుతున్నారు. అయితే ఏ దేశంలో చ‌ద‌వాల‌న్నా ఏదో ఒక ప‌రీక్షలో మంచి స్కోర్ సాధించ‌డం త‌ప్పనిస‌రి. జీఆర్ఈ, జీమ్యాట్‌, ఐఈఎల్‌టీఎస్‌, ఎస్ఏటీ, టోఫెల్‌...ఇలా ప‌ర‌దేశీ చ‌దువుల కోసం ప‌రీక్షలెన్నో ఉన్నాయి. చ‌ద‌వాల‌నుకుంటున్న కోర్సు, వెళ్లాల‌నుకుంటున్న దేశాన్ని బ‌ట్టి ఏ ప‌రీక్ష రాయాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్షల స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

టోఫెల్‌
టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ కి సంక్షిప్త రూప‌మే టోఫెల్‌. ఈ స్కోర్‌ను ప్రపంచ‌వ్యాప్తంగా 9000 విద్యా సంస్థలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయి. దీంతో 130 దేశాల్లో చ‌దువుకోవ‌చ్చు. ఏటా సుమారు ప‌ది ల‌క్షల మంది ఈ ప‌రీక్షను రాస్తున్నారు. 165 దేశాల్లో 4500 టోఫెల్‌ టెస్టు సెంట‌ర్లు ఉన్నాయి. ప‌రీక్షను ఏడాది పొడవునా వివిధ తేదీల్లో సుమారు 40 రోజుల పాటు నిర్వహిస్తారు. సాధార‌ణంగా శ‌ని, ఆదివారాల్లో ప‌రీక్ష ఉంటుంది. భార‌త్‌లో 73 ప‌రీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇంట‌ర్నెట్ బేస్డ్‌, పేప‌ర్ బేస్డ్ రెండు విధాల‌గానూ టోఫెల్ నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేష‌న్ ఫీజు 170 డాల‌ర్లు. ప‌రీక్షలో 4 సెక్షన్లు ఉంటాయి. వ్యవ‌ధి నాలుగున్నర గంట‌లు. ఎన్ని సార్లైనా ప‌రీక్షను రాసుకోవ‌చ్చు. స్కోరు రెండేళ్లపాటు చెల్లుబాట‌వుతుంది. అమెరికా, కెన‌డా, బ్రిట‌న్...వంటి దేశాల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేర‌డానికి ఈ ప‌రీక్షను రాస్తుంటారు.
పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్‌: www.ets.org/toefl చూడొచ్చు.

ఐఈఎల్‌టీఎస్‌
ఇంట‌ర్నేష‌న‌ల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ కి సంక్షిప్త రూప‌మే ఐఈఎల్‌టీఎస్‌. ఈ స్కోర్‌తో 135 దేశాల్లోని 9000కు పైగా సంస్థల్లో చ‌దువుకోవ‌చ్చు. ఏటా సుమారు 14 ల‌క్షల మంది ప‌రీక్షను రాస్తున్నారు. వెయ్యికి పైగా టెస్టు సెంట‌ర్లు ఉన్నాయి. నెల‌కు 4 సార్లు మొత్తం ఏడాదిలో 48 సార్లు ప‌రీక్షను నిర్వహిస్తారు. భార‌త్‌లో 39 టెస్టు సెంట‌ర్లు ఉన్నాయి. ప‌రీక్షను సాధార‌ణంగా గురు, శ‌నివారాల్లో రాసుకోవ‌చ్చు. ప‌రీక్షలో 4 పార్టులు ఉంటాయి. లిజ‌నింగ్‌, రీడింగ్‌, రైటింగ్, స్పీకింగ్‌ అంశాల్లో అభ్యర్థి ప‌రిజ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు. ఐఈఎల్‌టీఎస్‌ను ఎన్నిసార్లైనా రాసుకోవ‌చ్చు. పేప‌ర్‌, కంప్యూట‌ర్ బేస్డ్ రెండు విధాల్లోనూ ప‌రీక్షను నిర్వహిస్తున్నారు. స్కోరు రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. బ్రిట‌న్ తోపాటు ఆస్ట్రేలియా, కెనడాల్లో వివిధ కోర్సులు చ‌ద‌వాల‌నుకునేవాళ్లు ఎక్కువ‌గా ఈ ప‌రీక్షను రాస్తుంటారు.
వెబ్‌సైట్‌: www.ielts.org

జీమ్యాట్‌
గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్‌ఆప్టిట్యూడ్ టెస్ట్ ని సంక్షిప్తంగా జీమ్యాట్ పేరుతో పిలుస్తారు. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాల‌యాల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చ‌ద‌వాల‌నుకునే విద్యార్థులు జీమ్యాట్ ద్వారా క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చు. ఈ ప‌రీక్షలో సాధించిన స్కోర్‌తో వంద‌కు పైగా దేశాల్లో 2000కు పైగా బీస్కూల్స్‌లో ప్రవేశం పొందొచ్చు. విదేశాల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చ‌ద‌వాల‌నుకునే ఎక్కువ మంది విద్యార్థులు రాస్తోన్న ప‌రీక్ష ఇదే. ప్రపంచంలో క‌ఠిన‌మైన‌, అత్యున్నత ప్రమాణాలున్న ప‌రీక్షగా జీమ్యాట్ పేరుపొందింది. ఆన్‌లైన్‌లోనే ప‌రీక్షను నిర్వహిస్తారు. ఎన‌లిటిక‌ల్ రైటింగ్‌, ఇంటిగ్రేటెడ్ రీజ‌నింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, వెర్బల్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. మొత్తం వ్యవ‌ధి 3 గంట‌ల 30 నిమిషాలు. ప‌రీక్ష మ‌ధ్యలో 30 నిమిషాల బ్రేక్ ఉంటుంది. దీంతో క‌లిపి ప‌రీక్ష వ్యవ‌ధి 4 గంట‌లు. స్కోర్ అయిదేళ్లపాటు చెల్లుబాట‌వుతుంది. మ‌న దేశంలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ విద్యార్థులు విదేశాల్లో ఎంబీఏ, ఎంఎస్ కోసం జీమ్యాట్ ప‌రీక్షను రాస్తున్నారు.
వెబ్‌సైట్‌: www.mba.com/india

జీఆర్ఈ
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్స్ కి సంక్షిప్త రూప‌మే జీఆర్ఈ. ఈ స్కోర్ తో 130కి పైగా దేశాల్లోని 6 ల‌క్షల‌కు పైగా గ్రాడ్యుయేట్ స్కూళ్లలో ప్రవేశం ల‌భిస్తుంది. ఏటా క‌నీసం 7 లక్షల మంది జీఆర్ఈకి హాజ‌ర‌వుతున్నారు. భార‌త్ నుంచే ఏడాదికి ల‌క్షమందికిపైగా ఈ ప‌రీక్ష రాస్తున్నారు. జీఆర్ఈని 160 దేశాల్లో వెయ్యి టెస్టు సెంట‌ర్లలో నిర్వహిస్తున్నారు.. ఈ ప‌రీక్షను ఎంబీఏతో స‌హా ప‌లు ర‌కాల‌ మాస్టర్ డిగ్రీ కోర్సులు, పీహెచ్‌డీ ల్లో ప్రవేశానికి రాస్తారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాల‌నుకునే ఔత్సాహిక విద్యార్థులంతా జీఆర్ఈ రాస్తుంటారు. ప‌రీక్షలో వెర్బల్ రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ రీజ‌నింగ్‌, ఎన‌లిటిక‌ల్ రైటింగ్ అంశాల్లో ప్రశ్నల‌డుగుతారు. ఇది కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష. ఆ స‌దుపాయం లేని కేంద్రాల్లో మాత్రమే పేప‌ర్ బేస్డ్ ప‌రీక్షను నిర్వహిస్తారు. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు. ప‌రీక్ష ఫీజు 190 డాల‌ర్లు. స్కోర్ అయిదేళ్ల వ‌ర‌కు చెల్లుబాటవుతుంది. ప‌రీక్షను ఎన్నిసార్లైనా రాసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: www.ets.org/gre

ఎస్ఏటీ
స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి సంక్షిప్త రూప‌మే ఎస్ఏటీ. ప్రపంచ‌వ్యాప్తంగా ఏటా సుమారు 70 ల‌క్షల మంది విద్యార్థులు ఈ ప‌రీక్షను రాస్తున్నారు. ఇది పూర్తిగా కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష. రీడింగ్‌, రైటింగ్‌, మ్యాథ్స్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌ల 45 నిమిషాలు. ఇందులో రీజ‌నింగ్ టెస్టు, స‌బ్జెక్టు టెస్టు ఉంటాయి. న‌చ్చిన స‌బ్జెక్టుల్లో విడివిడిగా ప‌రీక్ష రాసుకోవాలి. స్కోరు అయిదేళ్లపాటు చెల్లుబాట‌వుతుంది. ఎస్ఏటీతో యూఎస్ లో యూజీ కోర్సుల్లో చేరొచ్చు. విదేశాల్లో అండ‌ర్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు చద‌వాల‌నుకునే భార‌తీయ విద్యార్థుల‌ సంఖ్య పెరుగుతోంది. ఎస్ఏటీ స్కోర్‌తో బీటెక్‌(బీఎస్‌), ఇత‌ర గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరొచ్చు.
వెబ్‌సైట్‌: https://sat.collegeboard.org

పియ‌ర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్‌
ఈ ప‌రీక్ష ద్వారా 719 సంస్థల్లో 1780 ప్రొగ్రామ్ ల్లో ప్రవేశం ల‌భిస్తుంది. యూకేలో 323, యూఎస్ లో 232 సంస్థల్లోని కోర్సుల్లో ఈ స్కోరు చెల్లుబాట‌వుతుంది. 44 దేశాల్లో 155 టెస్టు సెంట‌ర్లు ఉన్నాయి. భార‌త్ లో 15 కేంద్రాల్లో ప‌రీక్షను రాసుకోవ‌చ్చు. ఇది కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష. వ్యవ‌ధి 3 గంట‌లు. ప‌రీక్షలో 4 పార్ట్‌లు ఉంటాయి. స్పీకింగ్‌, రైటింగ్‌, రీడింగ్‌, లిజ‌నింగ్ అంశాల‌కు సంబంధించి ప్రశ్నల‌డుగుతారు. ఈ ప‌రీక్షను సాధార‌ణ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాస్తుంటారు.
వెబ్‌సైట్‌: http://pearsonpte.com/

 

posted on 25.6.2015