Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలంగాణ‌లో తొలిసారిగా బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు

- బైపీసీ విద్యార్థుల‌కు అవ‌కాశం

తెలంగాణలో తొలిసారిగా అటవీశాస్త్రంలో నాలుగేళ్ల వృత్తి విద్య కోర్సు(బీఎస్సీ ఫారెస్ట్రీ)కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఫారెస్ట్రీలో ప్రవేశాలకు అటవీ శాఖ ప్రకటన జారీ చేసింది. బైపీసీలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జూన్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇంట‌ర్ బోట‌నీ, జువాల‌జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు క‌ల్పిస్తారు. హైదరాబాద్ నగర శివారులోని దూలపల్లి అటవీ అకాడమీలో తరగతులను నిర్వహించనున్నారు. మెదక్ జిల్లా ములుగులో అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్ఐ) ఏర్పాటు చేయనున్నారు. భవనాల నిర్మాణం పూర్తైన తర్వాత సంస్థ చిరునామా అక్కడికి మారుతుంది.
కోర్సు స్వరూప‌మిలా...
భార‌త‌ వ్యవ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ (ఐసీఏఆర్), భార‌త అట‌వీ ప‌రిశోధ‌న‌, విద్యాసంస్థ(ఐసీఎఫ్ఆర్ఈ) ప్రమాణాల మేర‌కు పాఠ్యాంశాలుంటాయి. అట‌వీశాస్త్రం కోర్సులో జంతువృక్షశాస్త్రాలు, ప‌ర్యావ‌ర‌ణం, సోష‌ల్ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్ సైన్స్‌ అంశాలు ఉంటాయి. సెమిస్టర్ విధానంలో విద్యాబోధ‌న ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. ఎనిమిదో సెమిస్టర్‌ను ప్రొజెక్టు వ‌ర్క్‌కి కేటాయించారు. ఇందులోభాగంగా విద్యార్థి 21 రోజులు ఉత్తర‌ భార‌త‌దేశానికి స్టడీ టూర్‌కి వెళ్లాలి. అట‌వీ అనుభ‌వాల‌ను స‌మ‌ర్పించాలి. ఇది పూర్తిగా రెసిడెన్షియ‌ల్ ప్రోగ్రాం. అంటే నాలుగేళ్లు హాస్టల్‌లో ఉండి చ‌దువుకోవ‌డం త‌ప్పనిస‌రి. సెమిస్టర్లు, స‌బ్జెక్టుల‌వారీ సిల‌బ‌స్‌ను సంస్థ వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చారు. ప్రవేశాల‌కు ఎంపికైన జ‌న‌ర‌ల్ అభ్యర్థులు రూ. 23,550; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.23,050 చెల్లించాలి.
సీట్ల కేటాయింపు. ...
బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ఈ విద్యా సంవ‌త్సరానికి 50 సీట్లు కేటాయించారు. వీటిలో 85 శాతం సీట్లను స్థానికుల‌తో భ‌ర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు మెరిట్ ప్రాతిప‌దిక‌న ప్రవేశాలు ఉంటాయి. అంటే ఈ సీట్లకు లోక‌ల్‌, నాన్ లోక‌ల్ ఎవ‌రైనా పోటీ ప‌డొచ్చు.
రిజ‌ర్వేష‌న్లు ఇలా: బీసీల‌కు 29 (ఎ- 7, బి -10, సి -1, డి -7, ఇ- 4) శాతం సీట్లు కేటాయించారు. ఎస్సీల‌కు 15, ఎస్టీల‌కు 6 శాతం సీట్లు ద‌క్కుతాయి. ప్రతి కేట‌గిరీలోనూ 33.33 శాతం సీట్లు మ‌హిళ‌ల‌కు కేటాయించారు. డిఫెన్స్ 2 శాతం, ఎన్‌సీసీ 1 శాతం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అర శాతం, దివ్యాంగుల‌కు 3 శాతం సీట్లు ఉన్నాయి.
ఉన్నత విద్యకూ అవ‌కాశం...
బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు పూర్తిచేసివ‌నాళ్లు ఎమ్మెస్సీ పారెస్ట్రీ కోర్సులో చేర‌వ‌చ్చు. తెలంగాణ రాష్ట్రం 2020-21 సంవ‌త్సరంలో ఈ కోర్సును ప్రారంభిస్తుంది. 36 మందిని కోర్సులోకి తీసుకుంటారు. అనంత‌రం ఫారెస్ట్రీలో పీహెచ్‌డీలోనూ చేరొచ్చు. 2022-23 నుంచి కోర్సు అందుబాటులోకి వ‌స్తుంది. 18 మందికి అవ‌కాశం క‌ల్పిస్తారు.
బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని అటవీ కళాశాల పర్సన్ ఇన్‌ఛార్జి డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు 040-23097163; మొబైల్ నంబరు: 8332975516లో సంప్రదించాలని సూచించారు.
అర్హత: ఇంట‌ర్‌లో క‌నీసం 45 (ఎస్సీ, ఎస్టీలు 40) శాతం మార్కుల‌తో బైపీసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
వ‌యోప‌రిమితి: 2016 డిసెంబ‌రు 31 నాటికి క‌నీసం 17 ఏళ్లు నిండాలి. గ‌రిష్టంగా 22 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 25, దివ్యాంగులు 27 ఏళ్లలోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.250
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: జూన్ 15, 2016
మెరిట్ లిస్టు: జూన్ 30, 2016
కౌన్సెలింగ్‌: జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు జులై 15న‌, స్పెష‌ల్ కేట‌గిరీల‌కు చెందిన‌వారికి జులై 20న ఉంటుంది. రెండో విడ‌త కౌన్సెలింగ్: జులై 27న నిర్వహిస్తారు.
మొద‌టి సెమిస్టర్ రిజిస్ట్రేష‌న్‌: జులై 30
చిరునామా: ఆఫీస‌ర్ ఇన్‌ఛార్జ్ అడ్మిష‌న్స్ -2016, పారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడెమీ, దూల‌ప‌ల్లి, హైద‌రాబాద్ -500014
వెబ్‌సైట్: www.fcrits.in


Back..

Posted on 20-05-2016