Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రేపటికి రెడీనా?

* ఫ్యూచర్‌ జాబ్‌ మార్కెట్‌ స్కిల్స్‌

మార్పు సహజం.. అనివార్యం. రేపు ఎప్పటికీ నిన్నటిలాగా ఉండదు. జాబ్‌ మార్కెట్‌ కూడా అంతే. ఆటోమేషన్‌ మహిమతో రోజు రోజుకీ అప్‌డేట్‌ అవుతూనే ఉంది. కొత్త అభ్యర్థులు కొలువు సాధించుకోవాలంటే కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్నవాళ్లూ దాన్ని కాపాడుకోవాలంటే స్కిల్స్‌ పెంచుకోవాల్సిందే. అందుకే కాలేజీ రోజుల నుంచే రేపటి సవాళ్లకు దీటుగా సిద్ధం కావాలి.
కొన్నేళ్ల క్రితం వరకూ ఉద్యోగం అంటే నిలకడగా, దీర్ఘకాలం ఒకేచోట పనిచేయడం ప్రధాన లక్షణంగా ఉండేది. విద్యా వ్యవస్థా అందుకు తగిన విధంగానే విద్యార్థులను తీర్చిదిద్దేది. అందుకే ఒక వ్యక్తి విద్యాభ్యాసం పూర్తవగానే ఏ సంస్థలో చేరతాడో దాదాపుగా అందులోనే పదవీ విరమణ చేయడం కనిపించేది. ఇంటర్నెట్‌ యుగ ప్రారంభ దశలో ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. జీవితాంతం ఒకేచోట పనిచేయడం అనే దృక్పథంలో మార్పులు మొదలయ్యాయి. అప్పట్లో అభ్యర్థులు మొదటి ఉద్యోగానికైనా అవసరమైన నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. సాధారణంగా ఉద్యోగం ఇచ్చిన సంస్థలే తగిన శిక్షణ ఇచ్చేవి. దీర్ఘకాలం తమతో ఉండే విధంగా చూసుకునేవి.

ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ చాలా మారిపోయింది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ వినని కొత్త జాబ్‌రోల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు విభిన్న విషయాలపై అవగాహన అవసరం అవుతోంది. అలాగే తమ విభాగంతో ఏమాత్రం సంబంధం లేనివాటితోనూ కలిసి పనిచేయాల్సి వస్తోంది. సమీప భవిష్యత్తులో రోబోలతో పనిచేయడమూ తప్పనిసరి కానుంది. దీంతో అభ్యర్థుల నుంచి సంస్థలు మరిన్ని నైపుణ్యాలను ఆశిస్తున్నాయి.

పైగా ఇప్పుడు ఫ్రీలాన్స్‌ సర్వీసెస్‌, తక్కువ వ్యవధిలో సేవలందించేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సంస్థలూ ప్రతి చిన్నదానికి ఏళ్లపాటు జీతాలిచ్చే వారిని తీసుకోవడానికి సుముఖంగా లేవు. కాబట్టి, వచ్చిన ప్రతి అవకాశమూ అభ్యర్థికి విలువైనదే అవుతుంది. భవిష్యత్తు స్పష్టంగా తెలియని స్టార్టప్‌, మార్కెట్‌లో ఇప్పటికే బలంగా స్థిరపడిన సంస్థ.. ఇలా సంస్థ ఏదైనప్పటికీ నేరుగా సేవలు అందించేలా అభ్యర్థి ఉండటం తప్పనిసరి అయింది. కాబట్టి, ఉద్యోగ వేట ప్రారంభానికి ముందే భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.

ఒంటరైనా.. బృందమైనా!
ఉద్యోగ విషయంలో లైఫ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఆటోమేషన్‌తో సంబంధం లేకుండానే వీటికి ప్రాధాన్యం ఎక్కువ. మామూలుగా సంస్థ అన్నాక నలుగురితో పనిచేయాల్సి వస్తుంది. భిన్నమైన మనస్తత్వాల వారితో కలిసి ప్రభావవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. దీని అవసరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఓపిక, సమయపాలన, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వంటివి ఎన్నో అవసరమవుతాయి. వాటిని అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఇదొక్కటే సరిపోవడం లేదు. ఇంకా కొన్ని జీవన నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా జాబ్‌ రెడీనెస్‌కు ఎంత ప్రాధాన్యముందో తెలిసిందే. కాబట్టి, బృందంతో పనిచేయడంతోపాటు స్వీయ ప్రదర్శనకూ ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందుకు అభ్యర్థిలో స్వీయ నాయకత్వం, స్వతంత్ర లక్షణాలు అవసరమవుతున్నాయి. అంటే తనకు తానే బాస్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, టెక్నాలజీ ఆఫీసర్‌.. అవసరాన్ని బట్టి తనకు తాను మారాలి.

ఉదాహరణకు- ఏదైనా పనిని చేయాల్సి వచ్చినపుడు తనకు తాను గడువు నిర్ణయించుకునే బాస్‌ లక్షణం; తన ఆలోచనను మార్కెటింగ్‌ చేసుకోగలగడం; భవిష్యత్‌కు తోడ్పడుతుందనుకునే టెక్నాలజీలను ముందుగా నేర్చుకోవడం ఇలా తన భవిష్యత్తును తాను నిర్మించుకునేలా తయారవ్వాలి. నేర్చుకోవడం, తనను తాను మలచుకోవడం, లక్ష్యంగా దిశగా నడిపించుకోవడం వంటివన్నీ అలవరచుకోవాలి. మొత్తంగా ఈ లైఫ్‌స్కిల్స్‌తో కళాశాల నుంచి బయటకు రాగలగాలి.

ప్రాక్టికల్‌ పరిజ్ఞానముందా?
ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటాం. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, వంటకాలు వంటి వాటి గురించి నెట్‌ సాయంతో వెతికేస్తాం. ఎక్కువమంది సిఫారసు చేసినవాటికి ప్రాధాన్యమిస్తాం. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటాం. ఇదివరకు కొన్నవారి అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలుసుకుంటాం. నచ్చితే అప్పుడు కొంటాం. కదా! ఇదే పద్ధతి కెరియర్‌లోనూ ఉపయోగపడుతుందని తెలుసా?

పరీక్షలో పాస్‌ మార్కులు వచ్చినా, డిస్టింక్షన్‌ మార్కులు వచ్చినా పొందేది ఒకే డిగ్రీ. సబ్జెక్టుపై ఎంత పట్టు ఉందనేదే ముఖ్యం. పాస్‌ అయిన ప్రతి ఒక్కరి చేతిలోనూ డిగ్రీ ఉంటుంది. మార్కుల్లో తేడా కొంత ప్రభావం చూపినా సబ్జెక్టుపై ఎంత అవగాహన ఉందనేదానికే తుది ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, మార్కులపై కాకుండా విషయం తెలిసినవారిని ఎంచుకోవడానికి సంస్థలు సుముఖంగా ఉంటాయన్నది గుర్తించాలి. కేవలం చదవడానికే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా అది ఎంతవరకూ ఉపయోగపడుతుందన్న దానిపై ఎక్కువ ఆసక్తి చూపాలి. పరీక్షలు నెగ్గటంపై కాకుండా నిజంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటివారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిసష్‌ిప్‌, ఆన్‌లైన్‌ ఉద్యోగాలు ఇలా ఎన్నో అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా ప్రతి రంగంలో ఈ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అందుకోగలగాలి.

ఇతర సబ్జెక్టులూ ముఖ్యమే
ప్రతి రంగంలోనూ ఏటా ఎన్నో ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ సబ్జెక్టుల పరిజ్ఞానం ఉన్నపుడే ఇది ఎక్కువగా సాధ్యమవుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఈమధ్య కాలంలో దీనికి సానుకూలంగా చాలామంది మాట్లాడుతున్నారు. విద్యార్థులను ఆపరంగా నడిపేలా కృషి చేస్తున్నారు కూడా! ఇంటర్‌ డిసిప్లినరీ భావన దీనికి సంబంధించినదే. కాబట్టి, కేవలం ఎంచుకున్న సబ్జెక్టుకే పరిమితం కాకుండా వేరే వాటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణ చెప్పాలంటే.. జీపీఎస్‌, గూగుల్‌ మ్యాప్‌లు, జియో లోకేషన్లు.. నూతన ప్రదేశాల, చిరునామాలు కనుక్కునే ప్రక్రియను సులభతరం చేస్తున్నాయని మనందరికీ తెలిసిందే. మేథమేటిక్స్‌, జాగ్రఫీల కలయికతో రూపొందిందిది.

ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన వాటితోపాటు ఇతర సబ్జెక్టులను నేర్చుకోవడానికీ ప్రయత్నించండి. దగ్గరి సంబంధమున్న సబ్జెక్టులైనా, విభిన్నమైనవి అయినా సరే దేన్నైనా ఎంచుకోవచ్ఛు ఇది సబ్జెక్టుకే పరిమితం కాదు. విభిన్న మనస్తత్వాలను అర్థం చేసుకోవడానికీ పనికొస్తుందని ఒక భావన. సంస్థ తాను బృందాలుగా చేసి ఇస్తే పనిచేసే వారికంటే అందరిపై అవగాహన ఉండి, ఎవరికి వారు కలిసి త్వరితగతిన ఉత్పాదకతను ఇచ్చేవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకూ వివిధ అంశాల పరిజ్ఞానం అవసరమవుతుంది.

నేర్చుకోవడానికి సంసిద్ధత
చదువుకుంటున్నప్పుడే తమ రంగానికి సంబంధించిన పరిశ్రమ, అందులో తరచుగా వస్తున్న మార్పులపై అధ్యయనం చేస్తుండాలి. సంబంధిత రిపోర్టులు, వార్తలు, అధ్యయనాలు అన్నింటినీ అనుసరిస్తుండాలి. వాటిని సేకరించుకుని దగ్గరపెట్టుకోవాలి. వివిధ సెమినార్లకు సంబంధించిన వీడియోలను గమనిస్తుండాలి. సంబంధిత టెక్నాలజీపైనా దృష్టిపెట్టాలి. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుండాలి.

వాటిలో దీర్ఘకాల అవసరమున్న వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సంబంధిత కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని, నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్‌ సంస్థలు ఉచిత కోర్సులను అందిస్తున్నాయి. వాటిని ప్రయత్నించవచ్ఛు సంబంధిత రంగంలో పరిచయమున్న వారి సూచనలూ పనికివస్తాయి.

పద్ధతి ఏదైనా కావొచ్ఛు కానీ నేర్చుకోవడానికి మాత్రం ఎప్పుడూ సుముఖంగా ఉండాలి. నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టే మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే చదివి, విని నేర్చుకున్నదాని కంటే చేయడం ద్వారా నేర్చుకున్నదానికి ఎక్కువ విలువ ఉంటుంది. మొత్తంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే రంగానికి సంబంధించిన వివిధ సంస్థల ప్రణాళికలను గమనిస్తుండాలి. పరిశ్రమలు తమ ఉద్యోగుల కోసం చేపడుతున్న కార్యక్రమాలనూ తెలుసుకుంటుండాలి. మీరు నేర్చుకుంటున్నవీ, వారికి కావాల్సినవీ ఒకేలా ఉన్నాయో లేదో బేరీజు వేసుకుంటుండాలి. చివరగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అవసరం ఏదైనా మీ అంతట మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే సంస్థ నేర్పిస్తుందిలే అన్న భావనలో ఉండొద్దు!

Back..

Posted on 29-08-2019