Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బాపూ తోటలో కొలువుల బాటలు!

అహింస అత్యంత శక్తిమంతమైన ఆయుధమని ప్రపంచానికి చాటిన మన మహాత్ముడి మార్గం ఎన్నో ఆలోచనలకు, తత్వాలకు మూలమైంది. సరైన శిక్షణతో సంపూర్ణమైన మనిషిని నిర్మించడమే అసలైన విద్య అని ఆయన చెప్పిన మాటలను ఆధారం చేసుకొని పలు సంస్థలు కొన్ని కోర్సులను అందిస్తున్నాయి. పరిపూర్ణ పౌరులుగా, సామాజిక కార్యకర్తలుగా స్థిరపడాలనుకునే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. వీటిని పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రయివేటు, సేవాసంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. కార్పొరేట్‌ సంస్థలు కూడా గాంధీయిజాన్ని అధ్యయనం చేసిన అభ్యర్థుల సానుకూల దృక్పథానికి స్వాగతం పలుకుతున్నాయి.

అశాంతి, ఉద్రేకాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలకు బాపూజీ మార్గం ప్రేరణగా నిలిచింది. అందుకే తరాలు మారినా జాతిపిత ఔన్నత్యం అఖండ జ్యోతిలా వెలుగుతూనేవుంది. అలాంటి గాంధీగిరీపై అధ్యయనం చేయాలనుకుంటున్న నేటితరం విద్యార్థుల కోసం ఎన్నో విశ్వవిద్యాలయాలూ, సంస్థలూ కోర్సులు రూపొందించాయి.
సన్మార్గంలో ప్రయాణించి, నమ్మిన సిద్ధాంతాలను నిబద్ధతతో ఆచరించడం వల్లే గాంధీజీ కీర్తిప్రతిష్ఠలు విశ్వవ్యాప్తమయ్యాయి. 150 వసంతాలు పూర్తయినా ఆయన ప్రాధాన్యం చెక్కుచెదరలేదు. ఆయన బాట ఎందరికో అనుసరణీయం అవుతోంది. గాంధీ అంటే ఆదర్శ జీవనం సాగించిన వ్యక్తి మాత్రమే కాదు; విద్యార్థి ఎలా ప్రవర్తించాలి, వకీలు ఏ విధంగా వ్యవహరించాలి, శ్రామికుడు ఏం చేయాలి, సామాజిక కార్యకర్త ఆచరించాల్సిన విధివిధానాలు...ఇలా అన్నిటికీ ఆయన మార్గం చూపారు. అందుకే ఆయన ఆలోచన, ఆచరణల అధ్యయనానికి ప్రాముఖ్యం ఏర్పడింది.
విదేశాల్లోనూ పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ (శాంతి, సంఘర్షణ) స్టడీస్‌ను ఎన్నో విద్యాసంస్థలు అందిస్తున్నాయి. ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో విశ్వశాంతి దిశగా కృషిచేయడానికి ఈ కోర్సులు 1950ల్లో ఆవిర్భవించాయి. అహింసామార్గంలో ఉద్యమించిన గాంధీజీ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌, నల్ల సూరీడు నెల్సన్‌ మండేలా లాంటివారెందరికో ఆరాధనీయుడు. వీరందరూ గాంధీగిరీకి జైకొట్టినవారే.
అందువల్లే భారత విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ‘పీస్‌ స్టడీస్‌’ అని కాకుండా ‘గాంధియన్‌ స్టడీస్‌’ పేరుతోనే కోర్సులు నిర్వహిస్తున్నాయి. విదేశీ సంస్థలు ఆదర్శాలను సిలబస్‌లో చేర్చుకుంటే మన దగ్గర గాంధీ నిజజీవితంలో ఆచరించిన విధానాలను యథార్థ సంఘటనలతో సిలబస్‌లో పొందుపరిచారు.
గ్రాడ్యుయేట్లు గాంధియన్‌ స్టడీస్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. రెగ్యులర్‌ విధానంలో చదవడానికి వివిధ యూనివర్సిటీలు మార్చి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. కోర్సుల్లో చేరడానికి ప్రవేశపరీక్షలు రాయాల్సి ఉంటుంది. పీజీ కోర్సు వ్యవధి రెండేళ్లు. పీజీ డిప్లొమా వ్యవధి ఏడాది.

ప్రాంతీయ భాషల్లో స్వల్పకాలిక కోర్సులు
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాంధియన్‌ స్టడీస్‌... విద్యార్థులు, యువత కోసం స్వల్ప వ్యవధి కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లో రూపొందించారు.
* యూనివర్సిటీ విద్యార్థుల కోసం గాంధీ తత్వం, విధానం, మానవత్వంతో వాటి అనుసంధానంపై స్వల్ప వ్యవధి కోర్సులను అందిస్తోంది.
* గ్రామీణ సమస్యలపై అధ్యయనం చేసి వాటిపై నిర్మాణాత్మక పరిష్కారాలను చూపుతున్న క్షేత్రస్థాయి వ్యక్తులకోసం రెండు నెలల కోర్సు ఉంది.
* ఆధ్యాత్మిక దిశగా అడుగులేస్తున్న వివిధ మతాలకు చెందిన వారికోసం ప్రత్యేకంగా కొన్ని స్వల్పకాలిక కోర్సులున్నాయి.
* వైద్యవిద్యార్థులకు ప్రత్యేకంగా గాంధియన్‌ థాట్‌పై షార్ట్‌ టర్మ్‌ ఓరియెంటేషన్‌ కోర్సు అందుబాటులో ఉంది.
* ట్రేడ్‌ యూనియన్లు, గ్రామీణ సంస్థలు, శ్రామికలోకానికి సంబంధించి ‘గాంధియన్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ఫిలాసఫీ’ పేరుతో ప్రత్యేక కోర్సును తయారుచేశారు.
* పంచాయతీ వర్కర్లు, పంచాయతీల్లోని మహిళా సభ్యుల కోసం ప్రత్యేక కోర్సులు అందిస్తున్నారు.
* ఎన్జీవోలు, సామాజిక కార్యకర్తల కోసం సోషల్‌ సర్వీస్‌ స్పెషల్‌ కోర్సు బోధిస్తున్నారు.
గాంధీజీ ఆలోచనలు, శాంతియుత విధానాలు, అహింస ఉద్యమం, వివాదం పరిష్కార విధానాలు మొదలైనవాటిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు, స్టడీ కోర్సులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. గాంధీ థీమ్స్‌పై ఏటా మెమోరియల్‌ లెక్చర్లు ఉంటాయి. పునరుత్పాదక శక్తి, నీటి పొదుపు, పర్యావరణంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించారు. న్యాయం, శాంతి, పర్యావరణం, మానవత్వం దిశగా కృషిచేస్తున్న ప్రజా సంఘాలకు ఈ సంస్థ తోడ్పాటు అందిస్తుంది. ఇవే కాకుండా పలు కోర్సులను వ్యక్తులు, ఆయా సమూహాల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్నారు.

దూరవిద్యలో...!
* ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) ఎంఏ గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, పీజీ డిప్లొమా ఇన్‌ గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌, పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్‌లలో ఏడాదికి రెండుసార్లు (జనవరి, జులై సెషన్లు) ప్రవేశాలు కల్పిస్తుంది. ‌
* పంజాబ్‌ యూనివర్సిటీ ఏడాది వ్యవధి ఉండే పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ గాంధియన్‌ స్టడీస్‌ కోర్సును అందిస్తోంది. ‌
* వర్ధమాన్‌ మహావీర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ గాంధియన్‌ అండ్‌ పీస్‌ స్టడీస్‌ అందుబాటులో ఉంది.‌
* ముంబయి‌ యూనివర్సిటీలోని మహాత్మాగాంధీ పీస్‌ సెంటర్‌ ‘పీస్‌ స్టడీస్‌’లో ఆరు నెలల స్వల్పకాల కోర్సు అందిస్తోంది. రెండు వారాలకు ఒకసారి శనివారం సాయంత్రం 4 నుంచి 8 వరకు తరగతులు ఉంటాయి.
* గీతం స్కూల్‌ ఆఫ్‌ గాంధియన్‌ స్టడీస్‌, విశాఖపట్నం క్యాంపస్‌లో గాంధియన్‌ లిటరేచర్‌లో సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తున్నారు. ఇంటర్‌ విద్యార్థులు అర్హులు. కోర్సు వ్యవధి 3 నెలలు. యశ్వంత్‌ రావ్‌ చౌహాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ ‘గాంధియన్‌ విచార్‌ దర్శన్‌’ లో డిప్లొమా కోర్సు అందిస్తోంది.

కోర్సులు - అందించే సంస్థలు
గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌: ఎంఏ, ఎంఫిల్‌- గాంధియన్‌ స్టడీస్‌ అండ్‌ పీస్‌ స్టడీస్‌
పంజాబ్‌ యూనివర్సిటీ: ఎంఏ గాంధియన్‌ అండ్‌ పీస్‌ స్టడీస్‌, ఎంఫిల్‌ గాంధియన్‌ స్టడీస్‌
బెంగళూరు యూనివర్సిటీ: గాంధియన్‌ స్టడీస్‌లో సర్టిఫికెట్‌, పీజీ డిప్లొమా
అన్నామలై యూనివర్సిటీ: ఎంఏ గాంధియన్‌ స్టడీస్‌
మధురై కామరాజ్‌ యూనివర్సిటీ: ఎంఏ గాంధియన్‌ థాట్‌
మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌: ఎంఏ గాంధియన్‌ స్టడీస్‌
తిలకా మాంఝీ భాగల్పుర్‌ యూనివర్సిటీ: ఎంఏ గాంధియన్‌ థాట్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాంధియన్‌ స్టడీస్‌

మహారాష్ట్ర వార్ధాలో ఉన్న ఈ సంస్థ ‘గాంధియన్‌ థాట్‌’లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ఏడాది వ్యవధితో రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తోంది. గాంధీ జీవితం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించిన విధానాలపై సమగ్రంగా కోర్సు రూపంలో వివరిస్తారు. సైకాలజీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, జండర్‌ స్టడీస్‌, లీగల్‌ స్టడీస్‌, లేబర్‌ వెల్ఫేర్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, జాగ్రఫీ, సోషల్‌ వర్క్‌...తదితర విభాగాల అంశాలు దీనిలో అంతర్భాగం. సర్వోదయ, సత్యాగ్రహ, గాంధీ జీవన విధానం, ఆచరించిన నియమాలు...ఇవన్నీ సిలబస్‌లో భాగమే.
కోర్సులో భాగంగా సాంఘిక జీవనం, శుభ్రత, సంప్రదాయ పనులు, వ్యవసాయం, నేతపని, ఆధ్యాత్మిక సంగీతం, క్షేత్రస్థాయి పని తదితరాల గురించీ నేర్పుతారు. గాంధీ తత్వంపై అవగాహన ఉన్నవారూ, విద్యావేత్తలూ ఈ కోర్సు బోధిస్తారు. కోర్సులో చేరినవారు మానసికంగా, శారీరకంగా పరిణతి చెందుతారు. వ్యక్తిగత క్రమశిక్షణతో తమ పనులు తామే చేసుకోవడానికి అలవాటుపడతారు.
గ్రాడ్యుయేట్లు ఈ కోర్సుకు అర్హులు. వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. 15 సీట్లు అందుబాటులో ఉన్నాయి. థియరీ, ప్రాక్టికల్స్‌ రెండూ కలిపి కోర్సులో పొందుపరిచారు. కోర్సు పూర్తిచేసినవారికి గ్రేడ్‌ పాయింట్లు కేటాయిస్తారు. ఇందుకోసం ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ అసెస్‌మెంట్లు ఉంటాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా డిగ్రీని ప్రదానం చేస్తారు. మిగిలిన విద్యార్థులకు కోర్సుకు హాజరైనట్లు సర్టిఫికెట్‌ అందిస్తారు.
ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన పనిలేదు. వసతి పూర్తిగా ఉచితం. భోజన ఛార్జీల కోసం నెలకు రూ.1100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్థికంగా వెనుకబడినవారికి నెలకు రూ.1500 చొప్పున సంస్థ స్టయిపెండ్‌ చెల్లిస్తుంది. మేలో ప్రకటన వెలువడుతుంది. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి అర్హులకు జూన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జులై మొదటి వారంలో కోర్సు ప్రారంభమై, ఏప్రిల్‌ మధ్యలో పూర్తవుతుంది. ఈ క్యాంపస్‌ లైబ్రరీలో గాంధీ తత్వంపై 25000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. బజాజ్‌ ఫౌండేషన్‌ తరఫున ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.

ఉద్యోగావకాశాలు
పీజీ స్థాయిలో గాంధీ స్టడీస్‌ కోర్సులు చదువుకున్నవారు సేవా సంస్థలు, ఫౌండేషన్లు, ఎన్జీవోలు, మీడియా సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో శిక్షకులు, కౌన్సెలర్లుగా రాణించవచ్చు. గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థలు, ప్రపంచ శాంతి దిశగా కృషిచేస్తున్న విభాగాల్లో వీరు తమ ప్రతిభ చూపే వీలుంటుంది.
ప్రస్తుతం చాలా అంశాలు సమాజం, పర్యావరణం, రాజకీయాలతో ముడిపడి ఉంటున్నాయి. సున్నితమైన అంశాల్లో సమస్యను పరిష్కరించడంలో పీస్‌ స్టడీస్‌ చదివినవారు చాకచక్యంగా వ్యవహరించగలరు. అందువల్ల కార్పొరేట్‌ సంస్థలు సైతం ఈ కోర్సులు చదివినవారిని నియమించుకోవడం మొదలైంది. సామాజిక కార్యకర్తలుగా స్థిరపడాలనుకునేవారికి వందశాతం సరిపోయే కోర్సులు ఇవి. శ్రామిక సంక్షేమం, శిశు సంక్షేమం, సామాజిక భద్రత మొదలైన విభాగాల్లో సేవలు అందిస్తోన్న సంస్థల్లో అవకాశాలుంటాయి. కొన్ని సంస్థలు వీరిని కన్సల్టెంట్లుగానూ నియమించుకుంటున్నాయి.
ఈ కోర్సులో పీజీ చదివిన విద్యార్థులు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌ (సబ్జెక్టు కోడ్‌ 60)) రాసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అవకాశం వచ్చినవారు ప్రతినెలా రూ.25,000 స్టైపెండ్‌, వసతితో గాంధియన్‌ స్టడీస్‌పై పరిశోధనలు చేసుకోవచ్చు.

Back..

Posted on 02-10-2018