Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అన్వేషకులకు అవకాశాలు!

భూకంపాలు.. సునామీలు.. అగ్నిపర్వతాల పేలుడు.. కొండచరియలు విరిగి పడటం.. వీటిని ముందుగా పసిగట్టడం ఎలా? ప్రమాదాలను తప్పించేది ఎవరు? అలాంటి పరిజ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం చదవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం జియాలజిస్టులు. అలాగే పర్వతాలు ఏర్పడే తీరును, వజ్రాలు దొరికే ప్రాంతాలను, చమురు బావుల చిరునామాలనూ వీళ్లే చెప్పగలుగుతారు. భూగర్భశాస్త్రంపై ఆసక్తి, వాస్తవాల కోసం అన్వేషించే సహనం ఉన్నవాళ్లు ఈ కెరియర్‌ను ఎంచుకోవచ్చు.

భూమిపై ప్రధానంగా జరిగే ప్రమాదాలు, భూగర్భ రహస్యాల అధ్యయనంపై అభిరుచి, ఆసక్తి ఉన్నవారికి జియాలజిస్టు తగిన ఉద్యోగం. భూమిపైన లేదా భూమి లోపలి పదార్థ పరమార్థాలను గ్రహించి వాటిని మానవ శ్రేయస్సుకు ఉపయోగించడమే వీరి ప్రధాన కర్తవ్యం. డీఆర్‌డీవో, ఇస్రో, ఎన్‌జీఆర్‌ఐ, బార్క్‌ మొదలైన ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. యూపీఎస్సీ లేదా ఆయా సంస్థలు ప్రత్యేకంగా విడుదల చేసిన ప్రకటనల ద్వారా వీటిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. డిఫెన్స్, పారామిలటరీల్లోనూ జియాలజిస్టులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ గనుల శాఖ, భూగర్భ, జల విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, నాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్, బీపీసీఎల్‌ మొదలైన పబ్లిక్‌ సెక్టార్‌ రంగాల్లో ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఎక్కువ సంస్థలు గేట్‌ స్కోర్‌ లేదా ప్రత్యేక ప్రకటన ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇవన్నీ మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలే. సంస్థను బట్టి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, ఆ పైన వేతనం లభిస్తుంది. జియాలజీ లేదా అనుబంధ విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.

బ్రోకెన్‌ హిల్, రియో టినాట్, డి బీర్స్, కెయిర్న్, రిలయన్స్‌ ఎనర్జీ, షెల్, ఎస్సార్‌ ఆయిల్‌..తదితర ప్రైవేటు సంస్థల్లోనూ జియాలజిస్టుల నియామకాలు జరుగుతున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌లో చమురు అన్వేషణ జియాలజిస్టులకు వరంగా మారింది. విమానాశ్రయాలు, డ్యామ్‌ లు, పైపు లైన్లు నిర్మాణానికి జియాలజిస్టుల అవసరం విదేశాల్లో ఎక్కువగా ఉంది.

డిగ్రీలో సబ్జెక్టుగా....
భూగర్భశాస్త్రాన్ని డిగ్రీలో ఒక సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఇంటర్‌ సైన్సు విద్యార్థులు ఈ కోర్సు చదవడానికి అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జియాలజీ కోర్సు అందుబాటులో ఉంది. డిగ్రీ అనంతరం విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చు. పీజీలో జియాలజీతోపాటు అప్లైడ్‌ జియాలజీ, హైడ్రో జియాలజీ, మెరైన్‌ జియాలజీ...ఇలా పలు రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంటెక్‌ లోనూ అప్లైడ్‌ జియాలజీ, మెరైన్‌ జియాలజీ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి.

విభిన్న స్పెషలైజేషన్లు
మెరైన్‌ జియాలజిస్టులు: సముద్ర వాతావరణాన్ని అధ్యయనం చేస్తారు. రిమోట్‌ సెన్సర్ల ద్వారా అందులోని పురాతన శిలాజాలు, మొక్కలను అన్వేషిస్తారు. వాటి ప్రభావం సముద్రం, పర్యావరణంపై ఏ విధంగా ఉంటుందో అంచనా వేస్తారు.

పెట్రోలజిస్టులు: చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఇంకా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి పరిశోధన చేస్తారు. ఈ పరిశోధనలు సముద్రంలోపల, సముద్రం బయట నుంచి కొనసాగుతాయి. నిక్షేపాలు ఎక్కడైనా గుర్తిస్తే తవ్వకాలు మొదలుపెట్టడానికి ముందే భూ భౌతిక సర్వే చేస్తారు. భూకంపాలకు అవకాశం ఉందా అనే అంశాన్నీ పరిశీలిస్తారు.

మినరాలజిస్టులు: రాళ్లలోని ఖనిజాలపై పరిశోధిస్తారు. సీ బెడ్స్‌ లో ఏమున్నాయో తెలుసుకుంటారు.

జియోహైడ్రాలజిస్టులు: నీటి వనరుల కోసం అన్వేషిస్తారు. లభ్యం కావడానికి అవకాశం ఉన్న చోట్ల ప్రయోగాలు నిర్వహిస్తారు. అలాగే ఆ జలం కాలుష్య కారకాలపై అంచనా వేస్తారు.

పాలియాంటాలజిస్టులు: శిలాజాల గురించి తెలుసుకుంటారు. చనిపోయిన జీవులు, మొక్కలపై అధ్యయనం చేస్తారు. వాటి వయసును నిర్ధారిస్తారు. అవి ఎలా ఆవిర్భవించాయి, ఆ సమయంలో భూమండలం ఎలా ఉండేది, వాటి అంతానికి కారణం ..మొదలైనవి అంచనా వేస్తారు.

సిస్మాలజిస్టులు: భూకంపానికి కారణమైన భూమిలోపల ఉన్న ఫలకాలపై అధ్యయనం చేస్తారు. వాటి కదలికలను పసిగడతారు. ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తారు. భూకంప శాస్త్రవేత్తలు వీరే.

సర్వేయర్లు: భూమి, సముద్రం... వీటి సమాచారం సేకరించి వివరాలు భద్రపరుస్తారు. గత డేటాను వర్తమాన సమాచారంతో పోలుస్తారు. డేటాలో మార్పులపై అధ్యయనం చేస్తారు.

కోర్సు అందించే సంస్థలు
దిల్లీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, జాదవ్‌ పూర్‌ యూనివర్సిటీ, మద్రాస్‌ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కేరళ; కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పంజాబ్‌ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలు జియాలజీ కోర్సులను అందిస్తున్నాయి.

ఐఐటీల్లో: ఐఐటీ బాంబే, ఐఐటీ ధన్‌బాద్‌ (ఐఎస్‌ఎం), ఐఐటీ రూర్కీలు ఎమ్మెస్సీ అప్లైడ్‌ జియాలజీ కోర్సు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ భువనేశ్వర్‌లో ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు ఉంది. వీటిలో ప్రవేశం ఐఐటీలు నిర్వహించే జామ్‌తో లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో: ఆంధ్రా, ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, కాకతీయ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ జియాలజీ కోర్సులు అందిస్తున్నాయి. వీటికి ఇంటర్‌ సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులు అర్హులు. ఈ రెండు సంస్థల్లోనూ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

తాజా ఉద్యోగాలు
యూపీఎస్సీ ఏటా నిర్వహించే కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ అండ్‌ జియాలజిస్ట్‌ పరీక్ష ప్రకటన వెలువడింది. జియాలజీ లేదా అనుబంధ విభాగాల్లో పీజీ పూర్తయిన వారు ఏప్రిల్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఓఎన్‌జీసీ ఇటీవల వెలువరించిన ప్రకటనలో 68 జియాలజిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. ఎమ్మెస్సీ జియాలజీ/ అప్లయిడ్‌ జియాలజీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. గేట్‌-2019 స్కోర్‌తో భర్తీ చేస్తారు.


Back..

Posted on 14-04-2019