Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కోరుకున్న కొలువుకు కొట్టండి కోడింగ్‌!

* నియామకాల్లో నయా ట్రెండ్‌

* గూగుల్‌ పోటీలు

విద్యార్హతలతో పని లేదు.. గరిష్ఠ వయసుతో నిమిత్తం లేదు.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పోటీలో పాల్గొనవచ్ఛు బహుమతులు.. కొలువులు సాధించుకోవచ్ఛు కోడింగ్‌లో ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటే.. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అవే ఎదురు వస్తాయి. గూగుల్‌లాంటి ప్రసిద్ధ సంస్థలూ రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతాయి. సాంకేతిక ప్రతిభ, సరికొత్త ఆలోచనలు, ఉత్సాహం ఉంటే చాలు.. అంతర్జాతీయస్థాయిని అందుకోవచ్ఛు అందుకే నియామకాల్లో ఈ కోడింగ్‌ పోటీలు ఇప్పుడో ట్రెండ్‌గా మారాయి.

కంప్యూటర్‌ తెర మీద మనం చూసేవన్నీ మనకు కావాల్సినవే అయినా.. అలా కనిపించడానికి సహకరించేది ఎన్నో అంకెలు, సింబల్స్‌తో కూడిన కోడింగ్‌. ఆ కోడింగ్‌లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారికి కొన్ని కాంపిటిషన్లు సాయపడుతున్నాయి. అవి ప్రతిభను పరీక్షించడంతోపాటు చక్కని ఉద్యోగావకాశాలనూ అందిస్తున్నాయి. ఎన్నో ప్రముఖ సంస్థలు ఏటా వీటిని నిర్వహిస్తున్నాయి. దిగ్గజ సంస్థ గూగుల్‌ ఆధ్వర్యంలో జరిగే కోడింగ్‌ పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైంది. కోడింగ్‌ కాంపిటిషన్ల వల్ల సంస్థలకు నాణ్యమైన ఉద్యోగులను ఎంచుకునే వీలు కలుగుతోంది. అభ్యర్థులకు తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునే అవకాశం దక్కుతోంది.

కిక్‌ స్టార్ట్‌, కోడ్‌ జామ్‌, హాష్‌ కోడ్‌ అనే మూడు రకాల పోటీలను గూగుల్‌ నిర్వహిస్తోంది. వీటికి ప్రత్యేకమైన గుర్తింపు, నియమ నిబంధనలు, నమోదు ప్రక్రియలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ https://codingcompetitions.withgoogle.com/ ను ప్రారంభించారు. కోడింగ్‌లో తమ నైపుణ్యాలను పరీక్షించుకోవాలనుకునేవారూ, మెరుగుపరచుకోవాలనుకునేవారూ వీటిని ప్రయత్నించవచ్ఛు.

కెరియర్‌కు.. కిక్‌ స్టార్ట్‌
ఇది అంతర్జాతీయ స్థాయి పోటీ. గూగుల్‌లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్ఛు టెక్నికల్‌ కెరియర్‌కు అవసరమైన కోడింగ్‌ నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి అవకాశం. మొదటిసారి ప్రయత్నించే వారికీ అనుకూలం. ఏడాది పొడవునా రౌండ్లను నిర్వహిస్తారు. నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉంటాయి. మూడు గంటలపాటు సాగుతుంది. ప్రీ-క్వాలిఫికేషన్‌ పరీక్షల్లాంటివి లేవు. పోటీలో భాగంగా గూగుల్‌ ఇంజినీర్లు డిజైన్‌ చేసిన అల్గారిథమిక్‌, మేథమేటికల్‌ ప్రాబ్లమ్స్‌ను ఇస్తారు. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
మొత్తం 8 (ఎ-హెచ్‌) రౌండ్లు ఉన్నాయి. ఒకదానితో ఇంకోదానికి సంబంధం ఉండదు. ఒకసారి నమోదు చేసుకుంటే అందుబాటులో ఉన్న రౌండ్లలో దేనిలోనైనా, ఎన్నింటినైనా ప్రయత్నించే వీలుంది. పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఒకసారి నమోదు చేసుకుంటే చాలు. గూగుల్‌ అకౌంట్‌ లాగిన్‌తో భవిష్యత్‌ పోటీల్లోనూ పాల్గొనే వీలుంటుంది.
అర్హత: 18 సంవత్సరాలు, అంతకుమించిన వయసున్న వారెవరైనా పాల్గొనవచ్ఛు
నమోదు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రౌండ్‌ మార్చి 22, 2020న (సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు) జరుగుతుంది.

అయిదు రౌండ్ల.. కోడ్‌ జామ్‌
అంతర్జాతీయ స్థాయిలో దీర్ఘ కాలం జరిగే కాంపిటిషన్‌ ఇది. పోటీలో భాగంగా చాలెంజింగ్‌, అల్గారిథమిక్‌ పజిల్స్‌ను ఎదుర్కొంటారు. మొత్తం అయిదు రౌండ్లు ఉంటాయి.
ఎ- క్వాలిఫికేషన్‌ రౌండ్‌: ఇది 27 గంటలపాటు సాగుతుంది. కనీస క్వాలిఫయింగ్‌ పాయింట్లను వీలైనంత తక్కువ సమయంలో సాధించాల్సి ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారిని రౌండ్‌-1కు పంపుతారు.
రౌండ్లు- 1, 2, 3: ప్రతి రౌండ్‌లోనూ మళ్లీ సబ్‌ రౌండ్లు ఉంటాయి. కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. రౌండ్‌ పెరిగేకొద్దీ అభ్యర్థుల వడపోత ఉంటుంది. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసినవారిలో మొదటి 25 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. మొదటి నాలుగు రౌండ్లూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పాల్గొనే వీలుంది. ప్రతి రౌండూ దేనికదే ప్రత్యేకం. గత రౌండ్లలో సాధించిన పాయింట్లను తర్వాతి రౌండ్లతో కలపరు.
ఫైనల్‌: తుది రౌండ్‌కు ఎంపిక చేసిన 25 మంది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఆన్యువల్‌ కోడ్‌జామ్‌ వరల్డ్‌ ఫైనల్స్‌లో పాల్గొంటారు. ఈ ఏడాది జర్మనీలోని మ్యూనిక్‌లో నిర్వహిస్తున్నారు. ఎంపికైనవారి ప్రయాణ, నివాస ఖర్చులను సంస్థే భరిస్తుంది.
పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధ్రువపత్రాలను అందజేస్తారు. మొదటి 1000 ర్యాంకులు సాధించినవారికి టీషర్ట్‌లు అందజేస్తారు. ఫైనల్‌కు చేరిన 25 మందికీ నగదు బహుమతులు ఉంటాయి.మొదటి మూడు స్థానాలు సాధించినవారికి వరుసగా 15,000, 2,000, 1,000 డాలర్లూ, 4- 25 స్థానాల వారికి 100 డాలర్లు అందజేస్తారు.
అర్హత: 13 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారెవరైనా పాల్గొనవచ్ఛు కానీ ఫైనల్‌ రౌండ్‌కు 18 అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారినే అనుమతిస్తారు.
నమోదు: మార్చి 03, 2020 నుంచి ఏప్రిల్‌ 05, 2020 వరకు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.

బృంద పోటీ.. హాష్‌ కోడ్‌
బృందంతో పాల్గొనే ఈ పోటీని ఏడాదికోసారి నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. గ్రూప్‌లో ఇద్దరి నుంచి నలుగురు వరకు సభ్యులు ఉండవచ్ఛు రెండు రౌండ్లు ఉంటాయి. మొదటిది క్వాలిఫికేషన్‌ రౌండ్‌. రెండోది ఫైనల్‌ రౌండ్‌. ప్రతి రౌండ్‌లోనూ మళ్లీ రెండు రౌండ్లు ఉంటాయి. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పాల్గొనే వీలుంది. నాలుగు గంటలపాటు సాగుతుంది. దీనిలో అర్హత సాధించినవారు ఫైనల్‌ రౌండ్‌లో పాల్గొంటారు.దీనిని గూగుల్‌ హాష్‌కోడ్‌ క్లబ్‌ నిర్వహిస్తుంది. ఇచ్చిన సమస్యలకు బృందం తమకు నచ్చిన లాంగ్వేజ్‌, టూల్స్‌ ఉపయోగించి పరిష్కారం కనుక్కోవచ్ఛు అల్గారిథమిక్‌ చాలెంజ్‌లు ఉంటాయి. నిర్ణీత సమయం, మెమరీ లిమిట్‌ల ఆధారంగా వీటిని పూర్తిచేయాలి. దీనిలో పాల్గొనాలంటే ప్రాథమిక అరిథ్‌మెటిక్‌ నైపుణ్యాలతోపాటు అల్గారిథమ్స్‌, డేటా స్ట్రక్చర్చ్‌ మొదలైనవాటిపై పూర్తి అవగాహన ఉండాలి. ఫైనల్‌ రౌండ్‌లో విజయం సాధించిన మొదటి మూడు బృందాలకు నగదు బహుమతులు వరుసగా 4,000, 2,000, 1,000 డాలర్లు ఇస్తారు. పాల్గొన్నవారిలో కనీసం ఒక పాయింటు సాధించినవారికి ధ్రువపత్రాలూ, ఫైనల్‌కు చేరినవారికి బహుమతులూ ఉంటాయి. సాధారణంగా జనవరిలో నమోదు మొదలవుతుంది. ఈ ఏడాదికి ఆ ప్రక్రియ ముగిసింది.
అర్హత: 18 సంవత్సరాలు, అంతకుమించిన వయసున్న వారెవరైనా పాల్గొనవచ్ఛు.

ఎందుకు? ఎలా?
ఈ మూడు రకాల పోటీలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సుమారు 125 దేశాలకువారు పాల్గొనే వీలుంది. పోటీల్లో ప్రధానంగా అల్గారిథమిక్‌ పజిల్స్‌కి ప్రాధాన్యం ఉంటుంది. వాటిని సాధన చేయడం ద్వారా అభ్యర్థులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్ఛు ప్రతిభావంతులకు గూగుల్‌ సహా ఎన్నో సంస్థలు అవకాశాలను ఇస్తున్నాయి. విద్యార్థులే కాదు, కెరియర్‌లో ఎదగాలనుకునే ఉద్యోగులకూ ఇవి సాయపడతాయి.
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. సీ, సీ++, పైథాన్‌, జావా లాంగ్వేజీలకు ప్రాధాన్యం ఉంది. కనీసం రెండు లాంగ్వేజీల్లో నైపుణ్యం ఉండటం మంచిది. అల్గారిథమ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌పై పట్టు సాధించాలి. సంబంధిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. పోటీల దృష్ట్యానే కాకుండా సాధన కోసం గూగుల్‌ ఎంతో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి పోటీకి సంబంధించీ ప్రిపరేషన్‌ సెషన్లు ఉన్నాయి. ఇవి పోటీలకు సిద్ధమవడానికే కాకుండా మంచి కోడర్‌గా నైపుణ్యాలను పెంచుకోవడానికీ తోడ్పడతాయి.

Back..

Posted on 04-03-2020