Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గూగుల్‌ పోటీలో గెలిచేద్దామా?

* విద్యార్థుల సత్తాకు సైన్స్‌ ఫేర్‌ సవాల్‌

ప్రతి ఆలోచనకూ ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంటుంది. సమాజాన్ని మెరుగు పరిచేందుకు అలాంటి అత్యుత్తమ ఆలోచనలను అందజేసే కుతూహలం, ప్రతిభ ఉన్న విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ‘గూగుల్‌ సైన్స్‌ ఫేర్‌’ ఆహ్వానం పలుకుతోంది. 13-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థులు దీనిలో పాల్గొనవచ్చు. తమ ఊహలకు ఊపిరి పోసి, పదునుపెట్టి ప్రాజెక్టులు చేయవచ్చు. విజ్ఞానశాస్త్ర రంగంలో తమ ముద్ర వేసేందుకు ప్రయత్నం చేయవచ్చు!

గూగుల్‌ సైన్స్‌ ఫేర్‌-2019కు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది సెప్టెంబరులోనే ఆరంభమయ్యాయి. డిసెంబరు 12, 2018 రాత్రి 11.59 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. స్టేట్‌ అవార్డ్‌ విజేతల ప్రకటన మార్చి 2019లో, రీజనల్‌ ఫైనలిస్టుల ప్రకటన ఏప్రిల్‌ 2019లో, గ్లోబల్‌ ఫైనలిస్టుల ప్రకటన మే 2019లో ఉంటుంది.
ఏ విద్యార్థి అయినా ప్రాథమిక విద్య స్థాయిలో విషయ సంగ్రహణకు ప్రాధాన్యం ఇస్తాడు. అంటే 13 సంవత్సరాలలోపు ఉపాధ్యాయులు బోధించినది గ్రహిస్తాడు తప్పించి విశ్లేషణ ఎక్కువగా చేయలేడు. ఆ సమయంలో తమకు తెలిపిన అంశాలను గుర్తుంచుకునే దిశలోనే ఉంటాడు. 13 ఏళ్లు దాటాక తెలిసిన అంశాన్ని విశ్లేషించి, తర్కించే స్వభావాన్ని ఏర్పరుచుకొంటారు. తర్కంలోనే నూతనత్వానికి పునాదులు ఏర్పడతాయి. అందుకే ఈ వయసు విద్యార్థుల ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు వేదిక అయ్యేందుకు గూగుల్‌ 2011 జనవరిలోనే ‘సైన్స్‌ ఫేర్‌’ను ప్రవేశపెట్టింది.
ఈ పోటీని ఒక విధంగా ఒలింపియాడ్‌ పరీక్షలతో పోల్చవచ్చు. ఈ సైన్స్‌ ఫేర్‌లో పాల్గొనటానికి విద్యార్హతలు ముఖ్యం కాదు. ఈ పోటీని ఏ సంస్థ స్పాన్సర్‌ చేసినప్పటికీ విధివిధానాలను పూర్తిగా నిర్దేశించేది గూగుల్‌ సంస్థ మాత్రమే. 2018 కంటే ముందు జరిగిన గూగుల్‌ సైన్స్‌ ఫేర్‌ విజేతలకు ఈ పోటీ¨లో పాల్గొనే అవకాశం లేదు.
డిసెంబరు 12, 2018 నాటికి 13 సంవత్సరాలు నిండి సెప్టెంబరు 13, 2018కి 18 సంవత్సరాల లోపు వయసున్నవారు పోటీలో పాల్గ్గొనవచ్చు. తలిదండ్రులు/సంరక్షకుల నుంచి పోటీకి సుముఖంగా ఉన్నట్లు లేఖ ఇవ్వాల్సివుంటుంది.
మొదటిగా ఒక సామాజిక సమస్యను ఎంపిక చేసుకొని దానికి సరైన పరిష్కారంతో పోటీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ముగింపు తేదీ వరకు ఈ సమాచారం మార్చుకోవచ్చు. చివర్లో ఏ అంశం ఉంటుందో దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. గత సంవత్సరాల తుది విజేతల ప్రాజెక్టులను పరిశీలనలోనికి తీసుకుంటే ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చో అవగాహన ఏర్పడుతుంది. కి¨ంది వాటిలో ఒక ప్రధాన టాపిక్‌, రెండు ఉప అంశాలను ఎంచుకొని పోటీలో పాల్గొనవచ్చు.

* ఫ్లోరా అండ్‌ ఫానా
* ఫుడ్‌ సైన్స్‌
* ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
* ఇన్వెన్షన్స్‌ అండ్‌ ఇన్నొవేషన్స్‌
* ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌
* రోబోటిక్స్‌
* బయాలజీ
* కెమిస్ట్రీ
* ఫిజిక్స్‌
* బిహేవియరల్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌
* ఎనర్జీ అండ్‌ స్పేస్‌
* ఆస్ట్రో ఫిజిక్స్‌
* కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌

టాపిక్‌ ఆధారంగా రెండు కేటగిరీలుగా విభజిస్తారు.
1. ఎక్స్‌పరిమెంటింగ్‌ కేటగిరీ: దీనిలో బిహేవియరల్‌ సోషల్‌ సైన్సెస్‌, బయాలజీ, కెమిస్ట్రీ ఎన్విరాన్‌మెంటల్‌, ఫ్లోరా అండ్‌ ఫానా, ఫుడ్‌ సైన్స్‌ వస్తాయి.
2. ఇంజినీరింగ్‌ కేటగిరీ: దీనిలో ఆస్ట్రో ఫిజిక్స్‌, ఎనర్జీ అండ్‌ స్పేస్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్వెన్షన్స్‌ అండ్‌ ఇన్నొవేషన్స్‌, రోబోటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌ వస్తాయి. ఈ విభజనను గూగుల్‌ సంస్థే నిర్ధారించి ఆ ప్రాజెక్టును సంబంధిత జడ్జిల ప్యానెల్‌కు పంపిస్తుంది.

ఎలా పాల్గొనవచ్చు?
వివిధ దేశాల నుంచి ఏ విద్యార్థి అయినా పోటీలో పాల్గొనవచ్చు. ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ గ్రూపులలో లేదా వ్యక్తిగతంగా పాల్గ్గొనటానికి దరఖాస్తు చేస్తే తొలి దరఖాస్తునే తుది పోటీకి పరిశీలనలోనికి తీసుకుంటారు. అంటే ఒక విద్యార్థి ఒక ప్రాజెక్టు రూపంలోనే పాల్గొనాలి కానీ వేర్వేరు విధానాలుగా పాల్గొనటానికి ప్రయత్నించరాదు. విద్యార్థి దరఖాస్తు చేసుకుంటే గూగుల్‌ సంస్థ ఆ విద్యార్థి వయసు ఆధారంగా 13- 15 సంవత్సరాలు; 16- 18 సంవత్సరాల కేటగిరీలలో ఒకదానిలో చేరుస్తుంది. దేశం ఆధారంగా 3 కేటగిరీల్లో ఒకదానిలో చేరుస్తుంది.
విద్యార్థికి గూగుల్‌ అకౌంట్‌ (జీమెయిల్‌) ఉండాలి. లేకపోతే కొత్తగా అకౌంట్‌ను ఏర్పరచుకోవాలి. తర్వాత www.googlesciencefair.com వెబ్‌సైట్‌లో వివరాల ద్వారా లాగిన్‌ అవ్వాలి. గూగుల్‌ కాంపిటిషన్‌ పేజీలో రిజిస్ట్రేషన్‌ సంబంధిత విషయాలను, తలిదŸండ్రుల అంగీకార పత్రాన్ని, ఇతర అంశాలను పొందుపరచి సబ్మిట్‌ చేయాలి.
అన్ని పరిశీలనల తర్వాత కేటగిరి అవార్డులలో తుది దశకు వచ్చిన ఒక ప్రాజెక్టును గ్రాండ్‌ ప్రైజ్‌ విజేతగా ప్రకటిస్తారు.

సమకాలీన సమస్యలకు ప్రాధాన్యం

ఈ సైన్స్‌ఫేర్‌ గత ప్రాజెక్టులను పరిశీలిస్తే ... సమకాలీన పరిస్థితులకు స్పందించి చేసినవాటికి అధిక ప్రాధాన్యం లభిస్తున్నట్టు అర్థం అవుతుంది.
ఒక సంవత్సరం తుది ఎంపికలో నిలిచిన ఒక విద్యార్థి ప్రాజెక్టును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అతడి తాతగారు పెద్ద వయసు కారణంగా లేచి నిలబడలేకపోయేవారు. దగ్గర్లో ఎవరూ లేనపుడు నిల్చునే ప్రయత్నం చేస్తే పడిపోయి, ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆ విద్యార్థి దీనికి పరిష్కారం ఆలోచించాడు. తాతగారు నిలబడడానికి ప్రయత్నించినపుడు ఆయన కాళ్లకు ఉన్న సాక్స్‌లోని ప్రెజర్‌ గేజ్‌ యాక్టివేట్‌ అయి మొబైల్‌ ఆప్‌ ద్వారా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేసేలా ఏర్పాటు చేశాడు. సైన్స్‌పరంగా ఇది సులభమైన ప్రాజెక్టు అయినప్పటికీ విద్యార్థికి కుటుంబ సభ్యునిపై ఉన్న శ్రద్ధ, చేసిన కృషి మూలంగా అతడిని విజేతగా ఎంపిక చేశారు.
మరో ఏడాది ప్లాస్టిక్‌ నిరోధంపై ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఇంకో సంవత్సరం నేల కోత (భూ క్షయం) వల్ల పంటలు పండకపోతే దానికి చూపిన పరిష్కారం బహుమతిని సాధించింది. ఈ ప్రాజెక్టులన్నీ అంతర్జాలంలో యూట్యూబ్‌లో అందుబాటులోనే ఉన్నాయి. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వీటిని పరిశీలిస్తే వారికి మన పరిస్థితులకు అనుగుణంగా మంచి అంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. నల్గొండలో తాగునీటిలో అధికంగా ఉన్న ఫ్లోరైడ్‌ను తగ్గించడానికి పరిష్కారాలు చూపటం లాంటి ప్రాజెక్టులు విజయం సాధించే అవకాశం ఉంది. ఇలా మనచుట్టూ ప్రజలను సతమతం చేసే సమస్యల్లోంచి ఒకటి తీసుకుని దానికి పరిష్కారం ఇవ్వగలిగితే ఆ ప్రాజెక్టు విజయవంతమవుతుంది.
కేవలం పోటీలో నెగ్గటం, బహుమతి గెల్చుకోవటం మాత్రమే ముఖ్యం కాదు. గూగుల్‌ వంటి విశ్వవిఖ్యాత సంస్థలు నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో పాల్గొనటం ద్వారా, తమ ప్రాజెక్టులు ఎంపికవటం ద్వారా విద్యార్థులకు కలిగే ఆత్మ స్థైర్యం ఎంతో కీలకమైనది. ఆ ప్రభావం వల్ల వారు విజ్ఞానశాస్త్ర రంగంలో రాణించి, జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలుగుతారు.
- అభిలేఖ్‌, డైరెక్టర్‌, మెలూహ

నాలుగు దశల్లో...
విద్యార్థి విడిగా గానీ, ముగ్గురు సభ్యులున్న మిత్రబృందంగా గానీ ఈ సైన్స్‌ఫేర్‌కు పోటీ పడవచ్చు!
1.పరిష్కరించదలిచిన సమస్యను గుర్తించడం
2. ఆలోచనలు చేసి, వాటిలోంచి అత్యుత్తమమైనది ఎంచుకోవడం
3. పరీక్షించి పరిష్కారాన్ని వెదకడం
4. కనుగొన్న ఫలితాన్ని వెల్లడించడం

ఏయే అవార్డులు?
లోకల్‌ అవార్డ్స్‌ (యూఎస్‌ రెసిడెంట్స్‌ మాత్రమే): ఈ అవార్డు అమెరికాలోని వివిధ స్టేట్‌లలో, వాషింగ్టన్‌ డి.సి., సంబంధిత ప్రాంతాల్లో నివసించేవారి నుంచి వచ్చిన ప్రాజెక్టుల్లో ఒక విజేతను ప్రకటిస్తారు. ఈ విజేత రీజనల్‌ ఫైనలిస్ట్‌ కాంపిటీషన్‌కి చేరుకుంటారు.
ఎ. రీజనల్‌ ఫైనలిస్ట్‌లు: దీనిలో 100 మందిని ఎంపిక చేస్తారు. వాటిలో వయసు గ్రూపు ఆధారంగా 13-15 , 16-18 నుంచి ప్రతి కేటగిరీలో 8 మంది చొప్పున మూడు రీజియన్లలో ప్రతి రీజియన్‌ నుంచి మొత్తం 48 మందిని ఎంచుకుంటారు. ఎక్స్‌పెరిమెంటింగ్‌ కేటగిరీ నుంచి 48 మంది, ఇంజినీరింగ్‌ కేటగిరీ నుంచి 48 మంది.. మొత్తం 96 మందిని రీజనల్‌ ఫైనలిస్టులుగా ప్రకటిస్తారు.
ఇవి కాక రెండు కేటగిరీలలో ఇద్దరు చొప్పున వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలలో ఎంపిక చేస్తారు. ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో మూడు రీజియన్ల నుంచి ప్రతి కేటగిరీలో అత్యుత్తమ మార్కులు సాధించిన తొలి ఇద్దరిని కూడా వైల్డ్‌ కార్డ్‌లో తీసుకుంటారు. అంటే 96+2+2... మొత్తం వంద మందిని రీజనల్‌ ఫైనలిస్టులుగా ప్రకటిస్తారు.

బి. గ్లోబల్‌ ఫైనలిస్టులు: గ్లోబల్‌ ఫైనలిస్టులుగా 20 మందిని ఎంపిక చేస్తారు. గ్లోబల్‌ ఫైనలిస్టు అయినవారు రీజనల్‌ ఫైనలిస్టుగా ఉంటే వారి పేరు తీసేసి తర్వాత స్థానంలో ఉన్న విద్యార్థిని రీజనల్‌ ఫైనలిస్టుగా ప్రకటిస్తారు.
ఈ గ్లోబల్‌ ఫైనలిస్టు 20 మందిలో ప్రతి వయసు గ్రూప్‌ నుంచి నలుగురు చొప్పున రెండు కేటగిరీలలో 16 మందిని తీసుకుంటారు. అలాగే ప్రతి కేటగిరీలో ఇద్దరి చొప్పున మొత్తం నలుగురిని వైల్డ్‌ కార్డ్‌లో తీసుకుంటారు. మొత్తం కలిపి 20 మందిని తీసుకుంటారు.

సి. కేటగిరీ అవార్డ్స్‌: ఎక్స్‌పరిమెంటరీ కేటగిరీ: సైంటిఫిక్‌ అమెరికన్‌ అవార్డ్, ది నేషనల్‌ జియోగ్రాఫిక్‌ అవార్డ్‌. ఈ రెండింటినీ విడివిడిగా ఒక్కరి చొప్పున ఈ కేటగిరీ నుంచి విజేతలుగా ప్రకటిస్తారు.
ఇంజినీరింగ్‌ కేటగిరి: ది లెగో ఎడ్యుకేషన్‌ అవార్డ్డ్, ది వర్జిన్‌ గాలక్టిక్‌ అవార్డ్‌. ఈ రెండు అవార్డులనూ ఇంజినీరింగ్‌ కేటగిరిలో ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంపిక చేస్తారు.

డి. గ్రాండ్‌ ఫ్రైజ్‌ విన్నర్‌: కేటగిరి అవార్డులలో తుది దశకు వచ్చిన ఒక ప్రాజెక్టును గ్రాండ్‌ ప్రైÆౖజ్‌ విన్నర్‌గా ప్రకటిస్తారు.

ఇ. అడిషనల్‌ అవార్డ్స్‌: కేటగిరికి సంబంధం లేకుండా విద్యార్థులను సైన్స్‌ ఫేర్‌ కాంపిటిషన్‌కి ప్రోత్సహించిన అధ్యాపకునికి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. రిజిస్ట్రేషన్‌ జరిగేటప్పుడు ప్రతి విద్యార్థీ ఒక ఉపాధ్యాయుని గురించి, అతడు వారిని ప్రోత్సహించిన విధానాన్ని గురించీ తెలియజేయాలి. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉపాధ్యాయునికి అవార్డుని ఇస్తారు.

Back..

Posted on 03-12-2018