Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
జీప్యాట్‌-2019

* ఫార్మసీ పీజీకి జాతీయ రహదారి

ప్రఖ్యాత సంస్థల్లో పీజీ కచ్చితంగా ప్రత్యేకమే. అక్కడ చదివిన అభ్యర్థులకు అటు కంపెనీలూ ఇటు పరిశోధన సంస్థలూ పెద్దపీట వేస్తాయి. ఫార్మసీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో జీప్యాట్‌ నిర్వహిస్తారు. ఈ ర్యాంకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ అడ్మిషన్‌ లభిస్తుంది. వాటిలో కొన్ని ఉపకారవేతనాలను అందిస్తున్నాయి. ఇంకొన్ని పీహెచ్‌డీ ప్రవేశానికి కూడా జీప్యాట్‌ ర్యాంకునే ప్రాతిపదికగా చేసుకొని రూ. పాతికవేల వరకూ స్కాలర్‌షిప్‌ ఇస్తున్నాయి.

జీప్యాట్‌ (గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)ను కిందటి ఏడాది వరకూ ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిర్వహించింది. ఇప్పుడు 2019 నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది. బీఫార్మసీ చదివినవారు బెనారస్‌, పంజాబ్‌, మణిపాల్‌, జేఎస్‌ఎస్‌, కాకతీయ, ఆంధ్రయూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ చదవాలని కోరుకుంటుంటారు. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చి (నైపర్‌)లలో ఫార్మా ఎంఎస్‌లో సీటు పొందాలని కలలు కంటారు. ఈ అభిలాషలు తీరాలంటే జీప్యాట్‌లో మంచి ర్యాంకు సాధించాల్సివుంటుంది.
జీప్యాట్‌ ర్యాంకు ఆధారంగా దేశంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతోపాటు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన 714 ఫార్మా కళాశాలల్లో ఎంఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. ఈ కళాశాలల్లో మొత్తం 20,054 ఎంఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. జీప్యాట్‌ స్కోరు మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.

బహుళ ప్రయోజనాల పరీక్ష
* జీప్యాట్‌లో అర్హత సాధించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కళాశాలల్లో పీజీలో చేరిన ప్రతి విద్యార్థికీ నెలకు రూ.12,400 చొప్పున రెండేళ్లపాటు ఉపకారవేతనం లభిస్తుంది.
* సీఎస్‌ఐఆర్‌, యూజీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు ఎంఫార్మసీ/ ఎంఎస్‌ తరువాత పీహెచ్‌డీ చేయాలంటే జీప్యాట్‌లో పొందిన స్కోరు ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.25,000 వరకూ ఉపకారవేతనం అందిస్తారు.
* నైపర్‌లో అడ్మిషన్‌ కోసం నైపర్‌ జేఈఈ పరీక్ష రాయాలన్నా జీప్యాట్‌లో ర్యాంకు తప్పనిసరి. నైపర్‌లో పీజీ చేసినవారికి ఫార్మా పరిశ్రమ పెద్ద పీట వేస్తుంది.
* ప్రముఖ ఫార్మా కళాశాలలు, యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా జీప్యాట్‌లో మంచి ర్యాంకు పొందినవారికి ప్రాధాన్యమిస్తారు.
* బహుళజాతి ఫార్మా సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగుల నియామకానికి ఈ ర్యాంకునే పరిగణిస్తాయి.
విద్యార్హతలు: 10+2 తరువాత నాలుగేళ్ల బీఫార్మసీ చదివినవారు (లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులతో సహా) జీప్యాట్‌-2019 రాయడానికి అర్హులు. బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదివేవారు కూడా రాయొచ్చు. మూడో సంవత్సర విద్యార్థులు అనర్హులు.

తీరుతెన్నులు..
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో జరుగుతుంది. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను 3 గంటల వ్యవధిలో గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది. అర్హత సాధించాలంటే జనరల్‌, ఓబీసీకి చెందినవారు కనీసం 135 మార్కులు సాధించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారు 67 మార్కులు, వికలాంగులు 117 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 84 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 7 కేంద్రాలు (విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు), తెలంగాణలో 2 కేంద్రాలు (హైదరాబాద్‌, వరంగల్‌) ఉన్నాయి. ప్రతి అభ్యర్థీ తనకు నచ్చిన 4 పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవచ్చు. పరీక్ష కేంద్రాన్ని ఈ ప్రాధాన్యక్రమం ఆధారంగానే కేటాయిస్తారు.
పరీక్ష ఫీజుగా రూ.1400 ఆన్‌లైన్‌ ద్వారా లేదా నగదుగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగులు, స్త్రీలకు ఫీజు రూ.700.

ముఖ్య తేదీలు
* ఆన్‌లైన్‌ నమోదు చివరితేదీ: నవంబరు 30, 2018
* హాల్‌టికెట్‌ ప్రింట్‌ లభ్యమయ్యే తేదీ: జనవరి 7, 2019
* ఆన్‌లైన్‌ పరీక్షతేదీ: జనవరి 28, 2019
* ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 8, 2019
* వెబ్‌సైట్‌:www.ntagpat.nic.in

గత ఫలితాల సంగతి?
గత ఏడాది దేశవ్యాప్తంగా 34,743 మంది హాజరవగా వీరిలో కటాఫ్‌ మార్కులు- 137 సాధించి అర్హత సాధించిన వారి సంఖ్య కేవలం 2858 మందే. అంటే 8.2 శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారంటే ఈ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. 2018లో మొదటి ర్యాంకు పొందిన వ్యక్తికి 336 మార్కులు రాగా రెండో అభ్యర్థికి 318, మూడో ర్యాంకర్‌కు 306 మార్కులు వచ్చాయి. 8 మంది మాత్రమే 300 మార్కులు సాధించి 60% మైలురాయిని దాటారు.
జనవరి 7 నుంచి అడ్మిట్‌ కార్డు/హాల్‌ టికెట్‌ను వెబ్‌సైట్‌ నుంచి ప్రింట్‌ తీసుకోవచ్చు. ఈ అడ్మిట్‌ కార్డులో అభ్యర్థి పేరు, ఫొటో, సంతకం, జీప్యాట్‌ రోల్‌ నంబర్‌, పరీక్ష తేదీ, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రం వివరాలూ, సూచనలూ ఉంటాయి.
జనవరి 28న పరీక్ష రోజు కనీసం 2 గంటల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకుని సెక్యూరిటీ చెక్‌, ఐడెంటిటీ ధ్రువీకరణ, ఇతర పత్రాల వెరిఫికేషన్‌ చేయించుకోవాలి. అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా తీసుకువెళ్లాలి.

విజయం సాధించాలంటే..
జీప్యాట్‌లో రాణించాలంటే పుస్తక పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, అనలిటికల్‌ థింకింగ్‌, సైంటిఫిక్‌ రీజనింగ్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఏ ప్రశ్నకూ నేరుగా సమాధానం లభించదనే చెప్పాలి. ఎక్కువశాతం ప్రశ్నలు ఇండైరెక్ట్‌ పద్ధతిలో అభ్యర్థి మేధను పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉంటేనే దీనిలో మంచి ర్యాంకు సాధించడం సాధ్యమవుతుంది.

ప్రతి సబ్జెక్టునూ వేరువేరుగా కాకుండా ఇతర సబ్జెక్టులతో అనుసంధానించి చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపై మంచి పట్టు లభిస్తుంది. ఉదాహరణకు- మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీలకు సంబంధించి వివిధ ఔషధాల గురించి చదివేప్పుడు వాటి ఫార్మకాలజీ, అవి పనిచేసే విధానం, ఫార్మకో కైనెటిక్స్‌, ఫార్మకోడైనమిక్స్‌ వాటి రసాయనాలకు, ఔషధ గుణాలకు సంబంధాలను లోతుగా విశ్లేషించడం వల్ల సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. ప్రశ్నలు ఎలా ఇచ్చినా సరైన సమాధానాలు గుర్తించే వీలుంటుంది.

ఫార్మస్యూటికల్‌ అనాలిసిస్‌ చదివేప్పుడు ప్రతి విశ్లేషణ ప్రక్రియతోపాటు దానిలో జరిగే రసాయనిక చర్యలను అవగాహన చేసుకోవడం ద్వారా ఈ సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.కంప్యూటర్‌ ఆధారిత పరీక్షపై అవగాహన కల్పించే నిమిత్తం వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే ప్రశ్నలసరళిపై మరింత అవగాహన వస్తుంది.

జీప్యాట్‌ సిలబస్‌ 8 ముఖ్య విభాగాలుగా ఉంటుంది.
1. ఫార్మకాలజీ
2. ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ ఫార్మసీ
3. ఆర్గానిక్‌ అండ్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ
4. ఫార్మాస్యూటిక్స్‌
5. జ్యురిస్‌ ప్రుడెన్స్‌
6. ఫార్మకోగ్నసీ
7. ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌
8. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ.
వీటిలోని ముఖ్యాంశాలు చదవాలి. ఫార్మాస్యూటిక్స్‌లో ఫార్మా యూనిట్‌ ఆపరేషన్లపై తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు క్లినికల్‌ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీ, అనాటమీ, ఫిజియాలజీ, మైక్రో బయాలజీలపై కూడా శ్రద్ధ చూపటం అవసరం. ప్రతి ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో కనీసం రెండు సరైనవి అనిపించేలా ఉండొచ్చు. కాబట్టి, సమాధానాన్ని గుర్తించేముందు ఒకటికి రెండుసార్లు విశ్లేషించి కచ్చితంగా సరైనది అనుకున్న తరువాతే గుర్తించాలి. తొందరపడితే రుణాత్మక మార్కుల రూపంలో సాధించిన మార్కుల్లో కోత పడుతుంది.

Back..

Posted on 14-11-2018