Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తగిన మార్పులతో మున్ముందుకు!

     లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌-1, 2 పరీక్షలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కదలిక మొదలైంది. తెలంగాణలో సిలబస్‌ సమీక్ష కమిటీ కసరత్తు పూర్తికావడంతో అభ్యర్థులు తమ సన్నద్ధత వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన పరిస్థితి. తాజా పరిస్థితుల్లో గ్రూప్స్‌ పరీక్షలకు సమగ్రంగా తయారయ్యే వ్యూహం పరిశీలిద్దాం!
రెండు రాష్ట్రాల్లోనూ లక్షల మంది ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్‌ ఇది. తెలంగాణ రాష్ట్రంలో సిలబస్‌ మార్పులు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా కసరత్తు జరగకపోయినా అనివార్యంగా గణాంక సమాచారం, భౌగోళిక సమాచారం, ఇతర వాస్తవికాంశాల్లో అనివార్యంగా మార్పులుంటాయి. అందువల్ల పాత సమాచారం ఆధారంగా సన్నద్ధమవడం సమంజసం కాదు. నూతన సమాచారం అనుసంధానించుకోవాల్సిందే!
తెలంగాణ గ్రూప్‌-2 విషయానికి వస్తే 3 పేపర్ల ఆబ్జెక్టివ్‌ విధానం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే 3 పేపర్ల సిలబస్‌ల్లో కొన్ని మార్పులు ఉంటాయి.
పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌)
భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు గతంలో మాదిరిగానే తయారవ్వాలి. బయోసైన్స్‌, భౌతికశాస్త్ర అంశాలు కూడా గత పరీక్షలకు తయారైనట్లుగానే మౌలిక అంశాలు, అనువర్తనాలపై దృష్టిపెడితే సరిపోతుంది. అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ వెయిటేజీలో మార్పు రావచ్చు. కానీ సన్నద్ధత తప్పక కొనసాగించాలి.
రెండు రాష్ట్రాల్లోనూ..
* జనరల్‌ నాలెడ్జ్‌ సంబంధిత అంశాల్లో మార్పులు చేసుకోవాలి. ప్రధానంగా రాష్ట్రస్థాయి జీకేలో విస్తృత మార్పులు తప్పవు.
* వర్తమానాంశాలు కూడా రాష్ట్ర పరిధికి లోబడి వస్తాయి. కాబట్టి పరిధిని దృష్టిలో పెట్టుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ కోణంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.
* భౌగోళిక అంశాలకు సంబంధించి అనేక మార్పులు ఉంటాయి. రాష్ట్ర సంబంధిత పంటలు, ఖనిజాలు, జనాభా, జల వనరులు, ఇంధనశక్తి వనరులు, మౌలిక భౌగోళిక అంశాలు, పర్యాటకం, అడవులు, పారిశ్రామిక వ్యాప్తి లాంటి అనేక అంశాల్లో గణాంక సమాచారంతోసహా అనేక విషయాల్లో మార్పులు గమనిస్తూ తయారవ్వాలి.
* రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పరిణామం, సామాజిక అంశాల్లో ఆయా రాష్ట్ర అభ్యర్థులు అనుగుణమైన మార్పులను సమాచారంలో పొందుపరచుకోవాలి.
తెలంగాణ అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌లో భాగంగా అడిగే... రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి. కాకతీయ ప్రభువులకు ముందున్న చారిత్రక అంశాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అదేవిధంగా స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలంగాణ చారిత్రక పరిణామాలపై పట్టు సాధించాలి. తెలంగాణ సాంస్కృతిక, సామాజిక అంశాలపై కూడా జనరల్‌ దృష్టితో సిద్ధపడాలి.
* విపత్తు నిర్వహణ ఎప్పటి మాదిరిగానే సిలబస్‌లో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి రకరకాల విపత్తుల్ని ఎదుర్కునేందుకు నిర్దేశిత వ్యూహాలపై పట్టు బిగించాలి.
పేపర్‌- 2
రెండు రాష్ట్రాల్లోనూ పాలిటీ విభాగం ఎప్పటి మాదిరిగానే కొనసాగనుంది. అందులోనూ స్కోరింగ్‌ విభాగం కాబట్టి రాజ్యాంగ అంశాలపై విశ్లేషణాత్మకంగా తయారైతే మంచి ఫలితం ఉంటుంది. పాలిటీ ఆధారిత జీకేకి ప్రాధాన్యం తక్కువ. ఈ తేడాను గమనించి సన్నద్ధమవాలి.
* తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర: ఈ విభాగంలోనే భారీ మార్పులు ఉంటాయి. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య సామాజిక అంశాలు ప్రధానంగా తెలంగాణ పరీక్షల్లో ఉంటాయి. తెలంగాణ భూభాగానికి సంబంధించని రాజ్యపాలనలు గతంలో సిలబస్‌లో ఉండేవి. వాటిని వదిలేయడం ఉత్తమం. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి అంశాలూ రెండు రాష్ట్రాల సిలబస్‌లో ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో తప్ప మిగతా విషయాల్లో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
తెలంగాణ సాంస్కృతిక అంశాలు వెలుగులోకి రానున్నాయి. వాటిపై పట్టు సాధించాలి. ముఖ్యంగా తెలంగాణ స్వాతంత్య్రం తదుపరి ఉద్యమాలు, ప్రస్తుత స్థితి వరకు కొనసాగిన పరిణామాలు సింహభాగం పొందే అవకాశం ఉంది. తెలంగాణ సాహిత్య గుబాళింపులపై పట్టు సాధించాలి.
ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు గత ధోరణిలోనే సన్నద్ధతను కొనసాగించవచ్చు. గతంలో హైదరాబాద్‌ రాజ్య చారిత్రక పరిణామాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పటి పరిస్థితిలో ఉండకపోవచ్చు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ఆంధ్ర భూభాగ పరిణామాలు ప్రాధాన్యాన్ని పొందే అవకాశం స్పష్టంగా ఉంటుంది. స్వాతంత్య్ర అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భూభాగాల్లో వచ్చిన ఉద్యమాలూ, ప్రభావాలూ చదువుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 వరకు ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
మొత్తం మీద రెండు రాష్ట్రాల అభ్యర్థులూ తమ తమ భూభాగాలకు సంబంధించిన చారిత్రక అంశాలకు తగిన ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉమ్మడి చారిత్రక అంశాలను వారి భూభాగ ప్రాధాన్యాన్ని బట్టి అధ్యయనం చేయాలి.
పేపర్‌-3 (ఆంధ్రప్రదేశ్‌ / తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు)
రెండు రాష్ట్రాల అభ్యర్థులకు తయారీలో సవాల్‌గా తయారైన అంశం ఇదే అని చెప్పవచ్చు. విస్తృతమైన గణాంక సమాచారం (మార్పులు) సేకరించుకోవాలి. ఆర్థిక పరిణామాలను ఆయా రాష్ట్రాలకు తగిన రీతిలో అర్థం చేసుకోవాలి. వివిధ ఆర్థిక రంగాల్లో పరిధినీ, పరిమితినీ నిర్ణయించుకుని అధ్యయనం చేయాలి. రాష్ట్రాల వారీగా తక్కువ సమాచారం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్ని అధ్యయనం చేయడం క్లిష్టమే అయినా అనివార్యం.
ముఖ్యంగా ప్రణాళికల ఆధారంగా గత 60 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి రాష్ట్ర కోణంలో చదవడం తక్షణ కర్తవ్యం.
సహకార, పంచాయతీరాజ్‌ లాంటి అనేక చట్టాలు ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకూ పాతవే వర్తిస్తాయి. కాబట్టి వాటిని యథాతథంగా చదవవచ్చు. పారిశ్రామిక, పర్యాటక, ఐటీ, సైన్స్‌ విధానాల్ని గతంలో ఉన్న రీతిలో చదువుతూనే తాజా విధాన ప్రకటనలు విడుదలైతే అధ్యయనం చేయాలి. త్వరలో తెలంగాణ పారిశ్రామిక విధానం విడుదలవుతుంది. భూసంస్కరణల్లో వచ్చిన మార్పులు కీలకం.
ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి వర్తమాన ఆధారిత ఆర్థిక అంశాలకు 2008 పరీక్ష మాదిరిగానే పెద్దపీట వేసే అవకాశం ఉంది. అందువల్ల రెండు రాష్ట్రాల బడ్జెట్‌ (2015-16)లు, ఆర్థిక సర్వేలు (2014-15) మొత్తం మీద ప్రధాన భూమికను పోషించవచ్చు. వాటి ద్వారానే ఆర్థిక గణాంక సమాచారానికి విశ్వసనీయత సమకూరుతుంది. అందువల్ల రానున్న బడ్జెట్‌లు, ఆర్థిక సర్వేల అధ్యయనం మెరుగైన ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఆర్థిక మూల వనరులు, తాజా గణాంకాలతోపాటు తులనాత్మక గణాంకాల అధ్యయనం కూడా మేలు చేస్తుంది. ఎప్పటి మాదిరిగానే సామాజిక ఆర్థిక విషయాలు, ఎకనమిక్‌ జాగ్రఫీ తగిన ప్రాధాన్యాన్ని తప్పక పొందే అవకాశం ఉన్నందువల్ల తమ రాష్ట్రాలకు సంబంధించిన సమాచారంపై అభ్యర్థులు దృష్టి నిలపాలి.
గ్రూప్‌-1 సంగతేమిటి?
వెలువడుతున్న సమాచారం మేరకు గ్రూప్‌-1 పరీక్ష నిర్మాణాంశాల్లో మార్పులు లేనప్పటికీ సిలబస్‌లో గట్టి మార్పులే తెలంగాణ సిలబస్‌ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
ప్రిలిమ్స్‌లో చిన్న చిన్న మార్పులున్నాయి. తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, చారిత్రక అంశాలు ప్రాధాన్యాన్ని పొందాయి. అందువల్ల ఆ మార్పులకు అనుగుణంగా స్పందించాలి.
మెయిన్స్‌లో మొదటి పేపర్‌ వ్యాసరచనలో తెలంగాణ సంబంధిత అంశాలపై ఒక వ్యాసం వచ్చే అవకాశముంది. రెండో పేపర్‌లో తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక అంశాలు సగానికి పైగా మార్కుల వెయిటేజి పొందవచ్చు. తెలంగాణ భౌగోళిక అంశాలపై సమాధానాలు కోరే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి, అధికంగా సన్నద్ధతలో మార్పులు రావాల్సి ఉంటుంది.
మూడో పేపర్‌లో పాలిటీ, సాధారణ పాలనా నియమాలు, సామాజిక అవగాహన సిలబస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేవలం 50 మార్కులకే పరిమితమైన పాలిటీని సాధారణ పాలన నియమాల్లో అనుసంధానించడం వల్ల ఉద్యోగంలో చేరకముందే పాలన అవగాహన పెరుగుతుంది. అలాంటి అవగాహన పెంచుకునేలా అధ్యయనం చేయాలి.
నాలుగో పేపర్‌లో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అంశాలను పేర్కొన్నారు. దీన్నిబట్టి ఈ పేపర్‌లో కూడా తెలంగాణ స్థితిగతులే ప్రధాన భూమికను పోషించే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక అంశాల అధ్యయనంపై ప్రత్యేక దృష్టిని నిలపాలి.
ఐదో పేపర్‌ సైన్స్‌ ఖీ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అవడం ద్వారా ప్రస్తుత పరీక్షలో సైన్స్‌ ఖీ టెక్నాలజీ పాత్ర తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో 300 మార్కులకు ఉండే ఈ సిలబస్‌ 150 మార్కులకు మారిన నేపథ్యంలో సన్నద్ధతకు కేటాయించిన సమయాన్ని మార్చుకోవాలి.
పరీక్ష విధానంలో మార్పుల్లేవు
తెలంగాణ సిలబస్‌ కమిటీ పేర్కొన్నట్లుగా ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానం కొనసాగనుంది. అందువల్ల గ్రూప్‌- 1, 2, 4 అభ్యర్థులు యథాతథంగా తమ సన్నద్ధతను కొనసాగించవచ్చు. అంటే గ్రూప్‌-1లో ప్రిలిమ్స్‌, రాతపరీక్ష (మెయిన్స్‌), ఇంటర్వ్యూ 3 అంచెల పద్ధతి యథాతథం. గ్రూప్‌-2లో కూడా ప్రస్తుతం ఉన్న 3 పేపర్ల ఆబ్జెక్టివ్‌ విధానం, గ్రూప్‌-4లో ప్రస్తుతం ఉన్న 2 పేపర్ల ఆబ్జెక్టివ్‌ విధానం కొనసాగనున్నాయి. జేఎల్‌, డీఎల్‌ లాంటి పరీక్షలు కూడా అంతే.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరీక్ష విధానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు.
మీమాంస విడిచి సన్నద్ధత...
2012 నాటి గ్రూప్‌-1 పరీక్షపై నిర్ణయం తీసుకోకుండా కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యమా అనే మీమాంసను విడిచిపెట్టి సన్నద్ధతకు సిద్ధపడాలి. 2012 నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఏ దశలోనైనా పరీక్షను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎలానూ ఖాళీ పోస్టుల సంఖ్య భారీగానే ఉంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పోస్టులు పొందాలంటే ఇప్పటినుంచే సన్నద్ధత ప్రారంభించాలి. పైగా సీనియర్‌ అభ్యర్థులతో పోటీ కూడా.
కొత్త అభ్యర్థులకు గత సన్నద్ధత అనే అవరోధం లేదు కాబట్టి కొత్త సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేయడం ప్రారంభించాలి. సీనియర్లు అతి విశ్వాసం లేకుండా సున్నా నుంచి ప్రారంభిస్తున్నట్లుగా భావించి తయారైతే ఏర్పడిన గ్యాప్‌ నుంచి బయటపడవచ్చు. మార్కెట్లో తెలంగాణ చరిత్ర ఆర్థిక అంశాలపై లభిస్తున్న పుస్తకాలను నిశిత పరిశీలన అనంతరమే ఉపయోగించుకోవడం మంచిది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణలు విడుదల అవుతున్నాయి. వాటిని అధికారిక సమాచార పుస్తకాలుగా గుర్తించాలి. విశ్వవిద్యాలయాలు, అకాడమీ పుస్తకాలు కూడా కచ్చితమైన సమాచార వనరులు. సర్వీస్‌ కమిషన్‌ కూడా రిఫరెన్స్‌ పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉన్నందున వాటిపై అధికంగా ఆధారపడాలి.
సిలబస్‌ గురించిన సూక్ష్మ అంశాలు పూర్తిగా అందిన తరువాత మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు. అయితే పోటీ తీవ్రత దృష్ట్యా ఇప్పటి నుంచే సమాయత్తం అవడం మంచిది.

posted on 03.02.2015