Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పోటీకి ముఖ్యం స్ధానిక అవగాహన

     నియామకాల కోసం నిర్దేశించే పోటీ పరీక్షల సిలబస్‌పై తెలంగాణ అభ్యర్థులు రకరకాల సందేహాలతో ఉన్నారు. ప్రధానంగా మూడు అంశాల్లో సిలబస్‌లో మార్పులు జరగనున్నాయి. వీటిపై స్థూలంగా అవగాహన పెంచుకోవటం అవసరం!
పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు కాకతీయుల చరిత్ర నుంచి వస్తాయని గుర్తించాలి. రాజకీయ చరిత్ర, నాటి సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులే కాకుండా నాటి కట్టడాల, చెరువుల అధ్యయనం తప్పనిసరి.
తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయనే ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించబోయే పోటీ పరీక్షలన్నింటిలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యంతో కూడిన సిలబస్‌ను రూపొందించాలని భావించి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది కూడా.
తెలుగు రాష్ట్రాల్లో ఏ అభ్యర్థులైనా నోటిఫికేషన్లు, సిలబస్‌ కోసం ఎదురుచూడకుండా అధ్యయనం ప్రారంభించవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఉండే కొన్ని అంశాలున్నాయి. అవి-
* భారతదేశ చరిత్ర- సంస్కృతి, భారత స్వాతంత్య్రోద్యమం
* ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం
* సాధారణ శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానం
* భారత రాజకీయ వ్యవస్థ- భారత రాజ్యాంగం
* భారతదేశ ఆర్థిక వ్యవస
* విపత్తు నిర్వహణ
* జాతీయ- అంతర్జాతీయ ప్రాధాన్యంగల వర్తమాన విషయాలు
* సాధారణ మానసిక సామర్థ్యం ఉన్నాయి.
మొత్తం సిలబస్‌లో రెండు రాష్ట్రాల అభ్యర్థులూ 70% సిలబస్‌ను ఉమ్మడిగానే చదవవలసి ఉంటుంది. చరిత్రకు సంబంధించి కూడా దాదాపు 40- 50% సిలబస్‌ను ఉమ్మడిగానే చదవవలసి ఉంటుంది. ఉదాహరణకు శాతవాహనులు; కాకతీయులు- గోల్కొండ నవాబులు; అసఫ్‌ జాహి నవాబులు- మొదలైన అంశాలను కొంతవరకు ఉమ్మడిగానే చదవవలసి ఉంటుంది. అయితే చరిత్రలో ఆయా ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
చరిత్ర- సంస్కృతి: ప్రపంచంలోని ప్రాచీన ఆవాస ప్రాంతాల్లో దక్కన్‌ పీఠభూమిలోని తెలంగాణ ప్రాంతం ఒకటి. ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగం నాటి స్థానిక పురావస్తు ప్రదేశాలు, వాటి విశేషాలు ముఖ్యంగా ఆనాటి రాక్షసగుళ్ళు (సమాధులు), ఇతర ఆనవాళ్ళు తెలంగాణ ప్రాంత చరిత్ర విశేషాలను తెలియజేస్తున్నాయి.
చారిత్రక యుగంలో తెలంగాణ చరిత్రను అస్మిక జనపదం నుంచి ప్రారంభించి, శాతవాహనుల కాలాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. అయితే ఆ తరువాత శాతవాహనులు ధరణికోట/ అమరావతి రాజధానిగా పరిపాలించి, ఆ తరువాత నేటి మహారాష్ట్రలోని పైథాన్‌/ ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించడం వల్ల శాతవాహనుల గురించి మొత్తం చదవాల్సిందే. అంతేగానీ శాతవాహన చరిత్రను తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, ఆ తరువాత బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కుందూరి చోడులు మొదలైనవారు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను పాలించడం వల్ల ఈ రాజవంశాల అధ్యయనం అవసరం. ఇటీవల కాలంలో ఈ రాజవంశాల చరిత్ర పరిశోధన అధ్యయనాలపై ప్రాధాన్యం పెరిగిన దృష్ట్యా వివరంగా చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకు విష్ణుకుండినుల మొదటి రాజధాని ఇంద్రపాల నగరమనీ, ఇది నేటి నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం గ్రామమనీ ప్రాచుర్యంలోకి రావడం వల్ల ఆ ప్రాధాన్యం గ్రహించి చదవాలి.
కాకతీయులు: ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన చరిత్రలో మహాధ్యాయం కాకతీయ యుగం. ముఖ్యమైనదిగా గుర్తించి ఈ యుగ చరిత్రను సవివరంగా చదవాల్సి ఉంటుంది. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు కాకతీయుల చరిత్ర నుంచి వస్తాయని గుర్తించాలి. కాకతీయుల చరిత్రకు సంబంధించి రాజకీయ చరిత్ర, నాటి సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులనే కాకుండా నాటి కట్టడాలనూ, వారు నిర్మించిన చెరువులనూ గురించి అధ్యయనం తప్పనిసరి. నేడు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న 'మిషన్‌ కాకతీయ' పథకం కాకతీయులనాటి చెరువుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ముసునూరి నాయకులు, పద్మ నాయకుల గురించి కూడా చదవటం అవసరమే.
బహమనీ సుల్తానులు: తెలంగాణ ప్రాంతం బహమనీ రాజుల పాలనలో ఉండడంవల్ల వీరి గురించి కూడా చదవాలి. బహమనీ సుల్తానుల గురించి తెలుసుకోవటం వల్ల అది తెలంగాణ చరిత్ర పేపర్‌కే కాకుండా భారతదేశ చరిత్రకు కూడా ఉపయోగపడుతుంది.
గోల్కొండ- కుతుబ్‌షాహీల కాలం: కాకతీయుల తర్వాత ప్రాధాన్యం సంతరించుకున్నది కుతుబ్‌షాహీల కాలం. వీరు కూడా కాకతీయుల లాగానే తెలంగాణ ప్రాంతంతోపాటు సీమాంధ్రను కూడా పాలించారు. కాబట్టి పరీక్షలో ఈ కాలం ముఖ్యమైనదిగా గుర్తించి వారి రాజకీయ చరిత్ర, సామాజిక పరిస్థితులను అంటే- ముఖ్యంగా నాటి మత పరిస్థితులను, భాషా సాహిత్యాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా నేటి హైదరాబాద్‌ నగర నిర్మాణం వీరి కాలంలో జరిగిందని మరచిపోకూడదు.
విజయనగర కాలం: తెలంగాణ ప్రాంతం విజయనగర రాజ్యంలో లేనప్పటికీ దాని సమకాలీన బహమనీ, ఆ తరువాత గోల్కొండ రాజ్యాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి విజయనగర రాజ్యం గురించి చదివితే సమకాలీన చరిత్ర సమగ్రంగా అర్థం అవడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా భారతదేశ చరిత్ర కోసమైనా విజయనగర చరిత్రను చదవాల్సిందే.
మొఘలులు: కుతుబ్‌షాహీ పాలన 1687తో అంతమవడం వల్ల 1687 నుంచి 1724 వరకు అంటే అసఫ్‌ జాహీ వంశస్థాపన వరకు తెలంగాణ ప్రాంతం మొఘలుల పాలనలో ఉంది. ఈ కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన సర్వాయి పాపన్న తిరుగుబాటు మొదలైనవాటిని అధ్యయనం చేయవలసి ఉంటుంది.
హైదరాబాద్‌ రాజ్యం- అసఫ్‌ జాహి వంశం (1724- 1948): తెలంగాణ చరిత్రలో మరో ముఖ్యమైన కాలం- అసఫ్‌జాహిల కాలం. ఈ కాలచరిత్రలో కూడా రాజకీయ చరిత్రతోపాటు నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయవలసి ఉంటుంది.
తెలంగాణలో బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలు: అంటే హైదరాబాద్‌ రాజ్యంలో స్వాతంత్య్రోద్యమం- దీనిలో 1857 తిరుగుబాటును నాటి హైదరాబాద్‌ నిజాం బ్రిటీష్‌ వారిని సమర్థించి సహాయం చేయడం వల్ల దానికి నిరసనగా జరిగిన తిరుగుబాట్లు ముఖ్యంగా తుర్రేబాజ్‌ఖాన్‌, రాజా వెంకటప్ప నాయక్‌ మొదలైనవారిని గురించి సమాచారం ముఖ్యం. తరువాత తెలంగాణలో భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు నాటి ప్రముఖ వార్తాపత్రికలు, ఆ తరువాత తెలంగాణలో జరిగిన (నిజాం) ఆంధ్రజన సంఘం ఆంధ్ర మహాసభలు, తెలంగాణలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాల గురించి లోతుగా చదవాల్సి ఉంటుంది.
రజాకార్‌ ఉద్యమం: తెలంగాణ చరిత్రలో ఇది కూడా ఒక ప్రధాన ఘట్టమే. నాటి హైదరాబాద్‌ నిజాం సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన ఒక సైనిక శక్తే రజాకార్‌ ఉద్యమం. వీరు తెలంగాణ ప్రాంతంలో ప్రజలపై సాగించిన దోపిడీలు, హత్యలు, అత్యాచారాల వల్ల రాజ్యంలో శాంతి భద్రతలు క్షీణించి, భీకర వాతావరణం ఏర్పడింది.
హైదరాబాద్‌ భారత్‌లో విలీనం- యథాతథ ఒప్పందం: ఇది తెలంగాణ (హైదరాబాద్‌) చరిత్రలో చివరి ఘట్టం. విపులంగా చదవాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌ రాష్ట్రం: హైదరాబాద్‌ దేశంలో విలీనమైన తరువాత ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలను నాటి మద్రాస్‌, మైసూరు, బొంబాయి రాష్ట్రాల నుంచి వచ్చినవారికి ఇచ్చారు. కాబట్టి దీనికి నిరసనగా 1952లో హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేశారు. దీనికే మొదటి ముల్కీ ఉద్యమమని పేరు. ఆ తరువాత హైదరాబాద్‌ రాష్ట్రం, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడడంలో జరిగిన పరిణామాలు ముఖ్యం.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం: 1952లోనే ప్రారంభమైన ముల్కీ ఉద్యమంతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా మారి ఆ తరువాత 2001 నుంచి 2014 వరకు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలన్నింటినీ చదవవలసి ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడ్డాక జరిగే పరీక్షలు కాబట్టి తెలంగాణ చరిత్ర- సంస్కృతికి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల నుంచీ క్షుణ్ణంగా చదవడం మేలు.
తెలంగాణ సాయుధ (రైతాంగ) పోరాటం: రజాకార్లకు నాటి భూస్వాములు, జాగీర్దారులు సహకరించడంతో వీరి ఆగడాలకూ, అకృత్యాలకూ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ ఉద్యమాలు ఉద్ధృతమైనవి. భారతదేశపు రైతాంగ పోరాటాల్లో తెలంగాణ రైతులు జరిపిన పోరాటం ప్రపంచ ప్రఖ్యాతిచెందింది. భూమి కోసం- భుక్తి కోసం- విముక్తి కోసం 1946లో ప్రారంభమైన ఈ ఉద్యమం 1947 తరువాత తెలంగాణ సాయుధ పోరాటంగా మారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కాబట్టి తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టం కీలకమైనది.

posted on 13.4.2015