Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నిశ్చింతగా... సన్నద్దత!

     ఉద్యోగ నియామక ప్రకటనలు వచ్చినపుడే రాతపరీక్షలకు చదవటమంటే విజయాన్ని చేజేతులా దూరం చేసుకోవడమే! ఎందుకంటే పరీక్ష సన్నద్ధతకు అప్పుడు ఎక్కువ సమయం ఉండదు. అందుకే గ్రూప్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులూ కీలక సబ్జెక్టులపై, మౌలిక అంశాలపై దృష్టి పెట్టాలి. తెలంగాణ అభ్యర్థులు- గ్రూప్స్‌ పరీక్షల సిలబస్‌లో జరిగే మార్పు స్వల్పమేనని గ్రహించాలి!
మనదేశంలో అన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలో తప్పనిసరిగా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అది టీఎస్‌పీఎస్‌సీ అయినా, ఏపీపీఎస్‌సీ అయినా అభ్యర్థులందరినీ ఈ అంశాల్లో తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్టులు...
1. భారతీయ రాజకీయ వ్యవస్థ- రాజ్యాంగం
2. భారతదేశ చరిత్ర- సంస్కృతి
3. భారత స్వాతంత్రోద్యమం
4. ప్రపంచ, భారతదేశ భౌగోళికాంశాలు
5. విపత్తు నిర్వహణ
6. భారతదేశ ఆర్థిక వ్యవస్థ- ఆర్థికాభివృద్ధి- ప్రణాళికలు
7. శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానం (సైన్స్‌ & టెక్నాలజీ) వాటి అనువర్తనాలు
8. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలు
9. మానసిక సామర్థ్యం
10. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ- జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు- భూతాప ప్రక్రియ.
గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఇతర ఉద్యోగాలను ఆశించే తెలంగాణ అభ్యర్థుల్లో కొందరు 'సిలబస్‌ తెలియకుండా చదవలేం కదా!' అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటివారు సిలబస్‌ కోసం వేచి చూడకుండా పై అంశాలను ముందుగా అధ్యయనం చేస్తే తమ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నవారు అవుతారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఏర్పడగానే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే వివిధ పరీక్షల విధానం, సిలబస్‌ రూపకల్పనకు వివిధ రంగాల నిపుణులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఈ సంవత్సరంలో జరిగే పరీక్షల విధానంలో పెద్దగా మార్పు ఉండబోదనీ, కానీ పాఠ్యాంశాల్లో (సిలబస్‌) మార్పు ఉంటుందనీ తెలియజేసింది. జనవరి 17న టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో సిలబస్‌ కమిటీ భేటీ అయింది. ఏపీ చరిత్ర, ఎకానమీల స్థానంలో తెలంగాణ చరిత్ర, ఎకానమీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
అందరూ చదవాల్సిందే
భారత రాజకీయ వ్యవస్థ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకూ ఉన్న 10 కీలక అంశాలూ దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతి ఉన్నతస్థాయి పోటీ పరీక్షలన్నింటిలో తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో కూడా కొనసాగించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతి; సామాజిక పరిస్థితులు; రాజకీయ పరిణామాలు; వివిధ భౌగోళికాంశాలు, వివిధ వనరులు- వాటి వినియోగం, ఆర్థికవ్యవస్థ- ఆర్థికాభివృద్ధి చదవాల్సి ఉంటుంది.
నిజానికి ఈ అంశాలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిలబస్‌లో కూడా చేర్చారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి చెందినవి అవడంచేత తెలంగాణ అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేసి ప్రతి అంశాన్నీ క్షేత్రస్థాయిలో విపులంగా చదవవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం- తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు- భౌగోళిక, ఆర్థిక వనరులు- మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. మార్కుల కేటాయింపులో కొత్తగా చేర్చే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండవచ్చు.
మార్కుల ప్రాధాన్యం
మార్కుల ప్రాధాన్యం ఎంతవరకూ ఉండవచ్చనేది నిపుణుల కమిటీ త్వరలో నిర్ణయిస్తుంది. నిజానికి ఏదైనా ఒక అంశాన్ని సిలబస్‌లో చేర్చినట్లయితే పరీక్షలో ఆ అంశం నుంచి 15 ప్రశ్నలు వచ్చినా 75 ప్రశ్నలు వచ్చినా సిలబస్‌ మొత్తాన్ని క్షుణ్ణంగా చదవాల్సిందే. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో ఎలాంటి చాయిస్‌ ఉండదు. అందుకే ఒక్క ప్రశ్నను కూడా వదిలేయడానికి వీలులేదు. పరీక్షలోని ప్రతి ఒక్క ప్రశ్నా విజయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే ప్రశ్నల పరంగా, మార్కుల పరంగా ఆలోచించకుండా సిలబస్‌లో చేర్చిన ప్రతి అంశాన్నీ కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. రాజకీయ వ్యవస్థను పరిశీలిస్తే- గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో వచ్చే 15- 20 ప్రశ్నలకు కూడా గ్రూప్‌-2లో వచ్చే 75 ప్రశ్నలకు ఏమి చదవాలో, ఎంత చదవాలో అంతే చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను 75 మార్కులకు ఎంత చదవాలో 15 మార్కులకు కూడా అంతే చదవాల్సిందే.
కొత్త సిలబస్‌పై ఆందోళన వద్దు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాధాన్యాలను పూర్తి సిలబస్‌ను ప్రకటించిన తరువాత శాస్త్రీయంగా ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయవచ్చు. మారనున్న సిలబస్‌ ఏవిధంగా ఉంటుంది? వాటిలో ఏయే అంశాలు ఉంటాయి? అనే విషయాలపై ఆందోళనకూ, ఆదుర్దాకూ గురికాకూడదు. వాటికి ఎన్ని ప్రశ్నలు, ఎన్ని మార్కులు కేటాయిస్తారనేదాని గురించి ఆలోచించవద్దు.
ఈ లోపు భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థికవ్యవస్థ, ప్రపంచ- భారతదేశ భౌగోళికాంశాలు, సాధారణ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వివిధ సబ్జెక్టులనూ; విపత్తు నిర్వహణ, వర్తమాన అంశాలను శ్రద్ధగా అధ్యయనం చేయండి. నిర్భయంగా, నిశ్చింతగా ఈ అంశాల ప్రాథమిక భావనలను లోతుగా చదవాలి. అంతేకానీ నూతన సిలబస్‌ ప్రకటించేవరకూ వేచి చూస్తూ సమయం వృథా చేసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు కూడా మౌలిక అంశాల అధ్యయనం ప్రకటనలకు ముందే ముగించేలా కృషి కొనసాగించాలి.
ఏ స్థాయిలో చదవాలి?
ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ అధ్యక్షుడు, నిపుణుల కమిటీ సూచనప్రాయంగా తెలియజేసిన విషయాలన్నింటి బట్టి ఆలోచిస్తే పరీక్షలోని ప్రశ్నలు యూపీఎస్‌సీ తరహాలో కఠినంగానే ఉంటాయని భావించవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలను ప్రామాణికంగా, పటిష్ఠంగా నిర్వహించి దేశంలోని అన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లకు ఆదర్శంగా ఉండాలని యోచిస్తోంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
ఇతర పరీక్షల సంగతేంటి?
గ్రూప్స్‌ పరీక్షలకే పరిమితం కాకుండా జూనియర్‌ లెక్చరర్స్‌; డిగ్రీ కళాశాల లెక్చరర్స్‌; నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలకు చెందిన ఏఈఈలు, ఏఈలు; అటవీశాఖలోని ఎఫ్‌ఆర్‌ఓలు, ఫారెస్ట్‌ రేంజర్లు, ఏసీఎఫ్‌లు; రాష్ట్ర రవాణా శాఖల్లోని ఏఎంవీఐలు; రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో కూడా అందరికీ ఉమ్మడిగా తప్పనిసరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఉంటుందా! అనే అనుమానం చాలామంది అభ్యర్థుల్లో ఉంది.
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యంతో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఒకటి తప్పకుండా ఉంటుందని భావించవచ్చు. పైన పేర్కొన్న ఈ పరీక్షలన్నింటిలో ఒక జనరల్‌ స్టడీస్‌ పేపర్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు కూడా ఉంటాయి. కాబట్టి కొత్త సిలబస్‌ కోసం వేచి చూడకుండా వెంటనే అభ్యర్థులు తమ సబ్జెక్టులను చదువుకోవడం మంచిది.
సిలబస్‌లో లేని అంశాలను కొత్తగా చదవడం
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు గ్రూప్‌-2 పరీక్షకు గత రెండు, మూడు సంవత్సరాలుగా సన్నద్ధమవుతూ ఉన్నారు. వారందరిలో ఇప్పటి సందిగ్ధత మారబోయే సిలబస్‌పైనే. కాబట్టి వారు కొత్త సిలబస్‌ గురించి ఆందోళన చెందకుండా ముందుగా భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత గ్రూప్‌-2 సిలబస్‌ ప్రకారం కాకుండా మొత్తం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ చరిత్రతో ప్రారంభించి, రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని స్ట్రక్చరల్‌, ఫంక్షనల్‌ కోణాల్లో వివరంగా అధ్యయనం చేయాలి. ప్రస్తుత సిలబస్‌లో రాజ్యాంగ చరిత్రకానీ, రాజ్యాంగ రూపకల్పనకానీ చేర్చలేదు. అలాగే రాజ్యాంగంలోని పెక్కు అంశాలు ఆ సిలబస్‌లో పేర్కొనలేదు. చాలామంది సిలబస్‌లో లేవని వదిలి వేశారు. ఇప్పుడు వాటిన్నింటినీ చదవాల్సిందే.
* భారత ఆర్థికవ్యవస్థ: దీన్ని కూడా సమగ్రంగా చదవాలి. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలతో మొదలుపెట్టి ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు- వాటా- వాటి అభివృద్ధికి చెందిన అన్ని అంశాల నుంచి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వరకు, అంటే ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐటీఐ ఆయోగ్‌ వరకు, ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలన్నింటినీ సమగ్రంగా చదవాలి.
* సైన్స్‌ & టెక్నాలజీ: సాధారణ శాస్త్ర- సాంకేతిక విషయాలకు సంబంధించి వివిధ సైన్స్‌ సబ్జెక్టుల్లో మౌలిక భావనలను అర్థం చేసుకుని నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను సోదాహరణంగా చదవాలి. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన, అణు విజ్ఞాన శాస్త్రం, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నానో టెక్నాలజీ మొదలైన సబ్జెక్టులను నిత్యజీవితంలో వాటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాల్సి ఉంటుంది.
* భారతదేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశ స్వాతంత్రోద్యమం అనే అంశాలను అన్ని పోటీపరీక్షలకు సన్నద్ధమైనట్లుగానే చదవాలి.
ప్రపంచ భౌగోళికాంశాలను - భారతదేశ భౌగోళికాంశాలను వాటి భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలతోపాటు ప్రపంచ, భారతదేశ జనాభా తీరు తెన్నులను కూడా అధ్యయనం చేయాలి. భౌగోళికాంశాలతోపాటు విపత్తు నిర్వహణకు చెందిన అంశాలూ ముఖ్యమే.
ప్రత్యేక అంశాల అధ్యయనం సులభతరం
అభ్యర్థులందరూ గుర్తించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే- భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సమగ్రమైన అవగాహన ఉంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. భారతదేశ భౌగోళికాంశాలపై అవగాహన ఉంటే రాష్ట్ర భౌగోళికాంశాల అవగాహన చాలా సులభం.
ఇక భారతదేశ చరిత్రపై అవగాహన ఉంటే చారిత్రక క్రమం ప్రకారం తెలంగాణ చరిత్రను తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కాకతీయులు చదివేటపుడు దిల్లీ సుల్తానుల చరిత్రపై అవగాహన ఉండాలి. అదేవిధంగా గోల్కొండ సుల్తానుల గురించి చదివేటపుడు బహమనీ సుల్తానుల గురించీ, విజయనగర రాజుల గురించీ అవగాహన అవసరం. తెలంగాణ చరిత్రలో ఆసఫ్‌ జాహివంశ నవాబుల గురించి చదివేటపుడు ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌ ఇండియా సంస్థల అవగాహన ఉండాలి. ఈ విధంగా తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి నాటి సమకాలీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకే భారతదేశ చరిత్రను చదివితే నిర్దేశించిన సిలబస్‌ను ముందే చదవడంతోపాటు తెలంగాణ చరిత్రను తేలికగా అర్థం చేసుకోవచ్చు.
ఏ పోటీ పరీక్షలోనైనా తప్పనిసరిగా ఆవశ్యకంగా ఉండే అంశాలు మానసిక సామర్థ్యం, వర్తమాన విషయాలు. కాబట్టి కొత్త సిలబస్‌తో సంబంధం లేకుండా మెంటల్‌ ఎబిలిటీ అంశాలను ముందుగానే సన్నద్ధం కావచ్చు. వర్తమాన విషయాలను ప్రతిరోజు చదివి ప్రత్యేకంగా నోట్సు సిద్ధం చేసుకోవాలి.
ఈ విధంగా కొత్తగా చేర్చే తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం గల వివిధ అంశాలు మొత్తం సిలబస్‌తో పోలిస్తే స్వల్పంగానే ఉండవచ్చు. కానీ మార్కుల దృష్ట్యా ప్రాధాన్యం ఎక్కువగా ఉండవచ్చు.
లోతుగా విశ్లేషణాత్మకంగా..
తాము నిర్వహించబోయే పోటీ పరీక్షలు యూపీఎస్‌సీ తరహాలో ప్రామాణికంగా ఉంటాయని టీఎస్‌పీఎస్‌సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి సూచనప్రాయంగా తెలియజేశారు. దీన్ని బట్టి అభ్యర్థులు ప్రతి అంశాన్నీ లోతుగా, విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. సబ్జెక్టులను పైపైన చదివితే సరిపోదని గుర్తించడం అవసరం!