Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భాష బాగుంటే.. ఆఫర్‌ అందినట్లే!

* ఇంటర్వ్యూ గైడెన్స్‌ బాడీ లాంగ్వేజ్‌

ప్రతి ఒక్కరి శరీరానికి ఒక భాష ఉంటుంది. అది ఎలాంటి ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్లకు ఎన్నో విషయాలను చెప్పేస్తుంది. అందుకే కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. ఇంకొందరు ఏం చెప్పినా చిరాకొస్తుంది. ఇంటర్వ్యూలు, గ్రూప్‌ డిస్కషన్లలో ఈ ప్రభావం మరీ ఎక్కువ. బాడీ లాంగ్వేజ్‌ బాగోకపోతే ఆశించిన కొలువు అందకుండా పోతుంది. హావభావాలను మెరుగుపరుచుకుంటే అందరినీ ఆకట్టుకోవచ్చు. అనుకున్న ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు.

మాధవ్‌ మెరిట్‌ స్టూడెంట్‌. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంక్‌. బాగా చదువుతాడు. చక్కగా రాస్తాడు. మార్కులూ సాధిస్తాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్కటీ రావడం లేదు. యావరేజ్‌ పర్సంటేజ్‌తో పాసైన తోటి విద్యార్థి అరుణ్‌ అవలీలగా కొలువు సంపాదించాడు. కారణం మాధవ్‌ ఇంటర్వ్యూ అనగానే విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. ఏం చెబితే ఎదుటివాళ్లు ఏం అనుకుంటారో అని ఆందోళన పడతాడు. జవాబులు చెప్పేటప్పుడు దిక్కులు చూస్తాడు. చేతులు నలుపుతుంటాడు. జుట్టు సరిచేసుకోవడం లాంటివి చేస్తుంటాడు. అరుణ్‌ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ప్రశ్నలకు సమాధానం సూటిగా చెబుతాడు. తెలియకపోతే కంగారు పడకుండా తెలియదని చెప్పేస్తాడు. అనవసరమైన హావభావాలు ఉండవు. అందుకే మంచి ఉద్యోగం సాధించాలంటే మార్కులు అవసరమే అయినా అభ్యర్థుల శరీర భాష (బాడీ లాంగ్వేజ్‌) అంతకంటే ముఖ్యమని గ్రహించాలి.

మాటల ద్వారా ప్రకటించలేని ఎన్నో భావాలను మన శరీర భంగిమలు, కదలికలు వెల్లడిస్తాయి. ప్రముఖులు ప్రసంగించే విధానాన్ని గమనిస్తే.. వాళ్లు బాడీలాంగ్వేజ్‌ని ఎంత చక్కగా వినియోగించుకుంటారో అర్థమవుతుంది. నిటారుగా నిలబడి ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడతారు. మొహంలో చిరునవ్వు చెదరనీయరు. అవసరమైనప్పుడు తల ఆడిస్తారు. ప్రసంగాన్ని వినేవారిలో ఇవన్నీ అనుకూల భావాలను కలిగిస్తాయి. నోటితో చెప్పే విషయాన్ని బాడీ లాంగ్వేజ్‌ ద్వారా రుజువు చేయగలగాలి. అంతేకానీ మాట్లాడేది ఒక రకంగా, శరీర కదలికలు ఇంకో విధంగా ఉండకూడదు. సాధారణ జీవితానికే కాదు ఉద్యోగ సాధనకూ ఇది ఎంతో ముఖ్యం.

రోజువారీ జరిగేవే!
నిత్యజీవితంలో ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు నవ్వడం, చేతులు కదపడం, కనుబొమ్మలు ఎగరేయడం చేస్తుంటారు. ఇవన్నీ బాడీ లాంగ్వేజ్‌లో భాగమే. రోజువారీ కార్యక్రమాల్లో తెలియకుండానే వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ కౌన్సెలింగ్‌, ఇంటర్వ్యూ అంటే చాలు కొందరు బిగుసుకుపోతుంటారు. సహజంగా ఉండరు. ఉద్యోగ పరీక్షల్లో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందరూ తప్పకుండా అవగాహన పెంచుకోవాలి.
ఐ కాంటాక్ట్‌: మాటలతో చెప్పలేని చాలా విషయాలను, భావాలను కళ్ల ద్వారా వ్యక్తీకరించవచ్చు. ముఖ్యంగా ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కళ్లలోకి చూస్తూ సమాధానాలు చెప్పడం అభ్యర్థిలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది.
చేతులు కట్టుకుంటే..: ఒక వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడితే.. మిగతావాళ్లతో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడటం లేదన్నట్లు అర్థమని నిపుణులు చెబుతారు. ఎదుటివారికీ, అతడికీ మధ్య ఏదో అడ్డుగోడ ఉన్నట్లు భావిస్తున్నాడంటారు. చేతులు నలుపుతూ ఉంటే ఒత్తిడికి గురవుతున్నట్లు లెక్క.
కరచాలనం: ఇద్దరు కలసినప్పుడు కరచాలనం చేసుకోవడం సాధారణం. దీని ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. షేక్‌హ్యాండ్‌ బలంగా ఇవ్వడం దృఢమైన వ్యక్తిత్వానికి సంకేతం. బలహీనంగా కరచాలనం చేస్తే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు, ఎదుటివారి పట్ల అంత ఆసక్తి లేనట్లు. ఇవి అంత పట్టించుకోదగిన అంశాలుగా కనిపించనప్పటికీ ఉద్యోగ సాధనలో మాత్రం వీటికి ప్రాధాన్యం ఉంటోంది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి బలహీనంగా చేతిని అందిస్తే అతడికి అభ్యర్థి మీద సరైన అభిప్రాయం కలగకపోవచ్చు.
నిలబడే విధానం: అభ్యర్థి నిలబడే విధానం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. ఒంగిపోకుండా, అటూఇటూ కదలకుండా తిన్నగా నిలబడటం శక్తికీ, ఆత్మవిశ్వాసానికీ, తెలివితేటలకూ గుర్తు. ఇది ఎదుటివారికి సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. తిన్నగా కూర్చోవడం ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. కుర్చీ మీద చేతులు వేసి విశ్రాంతిగా కూర్చుని మాట్లాడితే ఇంటర్వ్యూ చేసేవారు ఇంప్రెస్‌కారు. సరిగా కూర్చోని వారిని చూడటం ఎవరికైనా విసుగనిపిస్తుంది.

ఇంటర్వ్యూల్లో చేసే పొరపాట్లు
ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు చేసే పొరపాట్లను కొన్ని సర్వేలు శాతాల్లో వెల్లడించాయి.

మెరుగుపరుచుకునే మార్గాలు
మాటల కంటే చేసే పనులే మన గురించి ఎక్కువ విషయాలను చెబుతాయి. ఇతరులను మొదట ఆకట్టుకునేది శరీర భాషే. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారనేది కూర్చునే విధానం తెలియజేస్తుంది. అప్రయత్నంగా పొరపాట్లు జరగకుండా ఉండటానికి మంచి బాడీ లాంగ్వేజ్‌ని అలవాటు చేసుకోవచ్చు. దీని కోసం కొన్ని మార్గాలూ ఉన్నాయి.
పరిజ్ఞానం: సంబంధిత పరిజ్ఞానం (నాలెడ్జ్‌) ఉంటే ఆత్మవిశ్వాసం వల్ల శరీరం అదుపులో ఉంటుంది. వివిధ విషయాలపై పట్టు ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలమనే ధీమా ఏర్పడుతుంది. దాంతో శరీరభాషలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అందుకే ఇంటర్వ్యూకు సంబంధించిన అంశాలపై నాలెడ్జ్‌ పెంచుకోవాలి. న్యూస్‌ పేపర్లు, మ్యాగజీన్‌లు, ఇంటర్‌నెట్‌ ఇవన్నీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడే మార్గాలు.
చిరునవ్వు: చిరునవ్వుతో పనులను సులువుగా సాధించుకోవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మెల్లగా నవ్వడానికి ప్రయత్నించాలి. దాంతో ఒత్తిడి కొంచెం తగ్గి వాతావరణం తేలికవుతుంది. ఎక్కువ టెన్షన్‌కి గురైతే లక్ష్యానికి దూరమైపోతారు. నవ్వడం అలవాటు చేసుకుంటే మనసు కుదుటపడి చక్కగా మాట్లాడగలుగుతారు.
ఇతరులతో కలవడం: బాడీ లాంగ్వేజ్‌ను మెరుగుపరుచుకోవాలంటే తరచూ ఇతరులను కలుస్తుండాలి. స్నేహితులు, పరిచయస్తులు, కొత్తవాళ్లు ఇలా ఎవరి దగ్గరకైనా వెళ్లి మాట్లాడటం వల్ల బిడియం పోతుంది. ఎవరితో, ఎలా, ఎంతవరకు మాట్లాడాలో అర్థమవుతుంది. వారితో చర్చించడం వల్ల కొత్త విషయాలూ తెలుస్తాయి. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన ఏర్పడుతుంది. దీంతో నమ్మకం పెరుగుతుంది. నడతలో మార్పూ కనిపిస్తుంది.
అత్యుత్సాహం: అత్యుత్సాహం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ ఉత్సాహంతో అటూ ఇటూ ఊరికే కదులుతుంటే ఎదుటివారు పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంటే.. నమ్మకంగా కనిపిస్తారు. మనసు ప్రశాంతంగా ఉండి చక్కగా ఆలోచించగలుగుతారు.

కాళ్లు: మనిషి ముఖమూ, చేతులే కాదు.. కాళ్లు పెట్టుకునే విధానమూ మనిషి మానసిక స్థితినీ, వ్యక్తిత్వాన్నీ తెలియజేస్తుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆలోచనలు బయటకు తెలియకుండా ఉండటానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు లెక్క. కాళ్లు దూరంగా పెట్టి నిలబడితే విశ్రాంతి స్థితిలో ఉన్నట్లు. కూర్చొని ఉన్నప్పుడు కాలి బొటన వేలితో నేలను నొక్కడం అసహనాన్నీ, విసుగునూ తెలియజేస్తుంది. ఇవేవీ లేకుండా జాగ్రత్త పడటం అలవాటు చేసుకోవాలి. చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోవడానికీ, ఇతరులకు అభ్యర్థులు సరిగా అర్థం కావడానికీ బాడీ లాంగ్వేజ్‌ ప్రధాన సాధనం. శరీర భాషను మెరుగు పరుచుకుంటే విజయానికి చేరువకావచ్చు.


Back..

Posted on 10-10-2019