Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గురుకులంలో.. సాంకేతిక సౌరభాలు

* రాయదుర్గం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల సత్తా
* ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధిస్తున్న పేదింటి బిడ్డలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: వారందరిదీ పేద కుటుంబ నేపథ్యం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా.. పట్టుదల, క్రమశిక్షణతో చదువుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారు. గురుకులం నుంచి సాంకేతికతకు నిలయాలైన ఐఐటీల్లో అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లూ ఐఐటీ సీట్లంటే కార్పొరేట్‌ కళాశాలలకే పరిమితమనే భ్రమను సమూలంగా తుడిపేస్తున్నారు. ఆ విద్యార్థుల విజయాలకు ఆలంబనంగా నిలుస్తూ తన ఒడిలో నిలుపుకొని ప్రోత్సాహం అందిస్తోంది గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ, ఎంసెట్‌ అకాడమీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌-ఐఐటీ ఎల్‌టీసీడీ) శిక్షణ సంస్థ.
1999లో పేద విద్యార్థులకు ఎంసెట్‌, ఐఐటీల్లో శిక్షణ ఇచ్చేందుకు నాటి ప్రభుత్వం ఈ అకాడమీని నాగోలులో ప్రారంభించింది. ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల నుంచి వేల మంది విద్యార్థులు జేఈఈ పరీక్ష రాస్తే పదుల సంఖ్యలో సీట్లు సాధిస్తారు. ఈ సంస్థ నుంచి పదుల సంఖ్యలో పరీక్ష రాసినా రెండంకెల సంఖ్యలో విద్యార్థులు సీట్లు సాధించి ఉన్నత స్థానాలు చేరుకుంటున్నారు. ఈ సంవత్సరం 72 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ రాయగా 56 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. అడ్వాన్స్‌డ్‌లోనూ సత్తా చాటి 21 మంది ర్యాంకులు సాధించారు. మొత్తంగా 56 మంది ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందారు. మూడేళ్ల క్రితం ఎంసెట్‌ మెడిసిన్‌ కోసం శిక్షణ ప్రవేశపెట్టారు. అందులోనూ 80 మంది విద్యార్థుల్లో 30 మంది వరకు ఉచితంగా మెడిసిన్‌ సీట్లు సాధిస్తున్నారు.

అక్కడి నుంచి ఇక్కడికి..
సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ, ఎంసెట్‌ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ అకాడమీ తొలుత నాగోలులో ప్రారంభించినా.. తర్వాత 2013లో గౌలిదొడ్డికి మార్చారు. ఈ సంస్థ ప్రారంభించాక గురుకుల విద్యార్థులు ఐఐటీ గడప తొక్కడం ప్రారంభించారు. చదువుకు పూర్తయ్యాక ప్రముఖ కంపెనీల్లో ఉన్నతోద్యోగాలు పొంది రూ.లక్షల ప్యాకేజీతో వేతనం అందుకుంటున్నారు. అంతేకాక సొంత వ్యాపారాలు మొదలుపెట్టి పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు.

రాష్ట్రస్థాయిలో సత్తా చాటితేనే..
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉత్తమంగా నిలిచే 160(ఎంపీసీ, బైపీసీల్లో చెరో 80) మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారిలో బాలబాలికలు సమాన సంఖ్యలో ఉంటారు. వారు ఎంపికయ్యాక క్రమశిక్షణతో బోధన చేపడతారు. నిపుణులైన 16 మంది అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు నలుగురేసి అధ్యాపకులు ఉంటారు.

ఉదయం 4.30కు మొదలు
ఉదయం 4.30 గంటల నుంచి విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. తొలి అరగంట కాలకృత్యాలు ముగించుకున్నాక 5 నుంచి ఆరు గంటల వరకూ యోగా నేర్పిస్తారు. ఆ తర్వాత 6 నుంచి 8 వరకూ తరగతులు నిర్వహిస్తారు. గంట అల్పాహారం తదితరాలు ఉంటాయి. ఆ తర్వాత 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 తరగతలు, గంట పాటు మధ్యాహ్న భోజనం విశ్రాంతి, 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ తరగతులు ఉంటాయి. 5.30 నుంచి 6 వరకూ క్రీడాభ్యాసం చేయిస్తారు. రాత్రి 7.30 నుంచి 10.30 వరకూ స్వీయ విద్యాభ్యాసం ఉంటుంది. ఆ సమయంలో షిఫ్టుల ప్రకారం ఇద్దరు అధ్యాపకులు విద్యార్థుల చదువులను పర్యవేక్షిస్తారు.

సాంకేతికతనను వినియోగించి..
* ఐఐటీ శిక్షణలో అనుభవం ఉన్న అధ్యాపకుల ద్వారానే కాకుండా సరికొత్త పద్ధతులూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
* విద్యార్థులు ఒత్తిడి జయించి స్వేచ్ఛగా చదువుకునేలా ఐఐటీ సాధించడంపై సమాయత్తం చేసేందుకు మానసిక వైద్య నిపుణులు, నిపుణులతో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.

సబ్జెక్టు నిపుణులతో గెస్ట్‌ లెక్చర్లు ఇప్పిస్తారు.
పూర్వ విద్యార్థులు తరచూ సందర్శించి ఐఐటీకి ఎలా సంసిద్ధం కావాలి.. చదువులు కొనసాగించడంపై తమ అనుభవాలను చెబుతారు. ఇలా చేయడం విద్యార్థులకు ఉపయుక్తంగా నిలుస్తోంది. కంప్యూటర్‌లతో ఆడియో, విజువల్‌ ప్రోగ్రామ్స్‌ వినియోగించి పాఠాలు సులువుగా అర్థమయ్యేలా తర్ఫీదు ఇస్తారు. ముఖ్యంగా క్రమశిక్షణ, విలువలతో బోధన సాగుతుంది. ఇ-లర్నింగ్‌లో భాగంగా వివిధ ఐఐటీ సంస్థల మెటీరియల్‌నూ విద్యార్థులకు అందజేస్తారు. ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు నిత్యం అందుబాటులో ఉంటాయి.

ముగ్గురితో ప్రారంభం
తొలి బ్యాచ్‌లో ముగ్గురు విద్యార్థులతో ఈ సంస్థ ఐఐటీ సీట్లు సాధించే ప్రస్థానం ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2004-2005 బ్యాచ్‌లో 14 మంది విద్యార్థులు ఐఐటీ, ఇద్దరు ఎన్‌ఐటీ లో సాధించారు. 2011-2012లోనైతే 18 మంది విద్యార్థులు ఐఐటీల్లో, 21 మంది విద్యార్థులు ఎన్‌ఐటీలో సీట్లు సొంతం చేసుకున్నారు. ఇలా విద్యార్థులు ప్రతిభ చాటుతూ సీట్లు పొందుతున్నారు. 2015-16 వంకు మొత్తం 112 మంది విద్యార్థులు ఐఐటీ, 195 మంది విద్యార్థులు ఎన్‌ఐటీ సీట్లు సాధించారు. ఎంతో మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీల్లో చేరారు. మూడేళ్ల క్రితం ఎంసెంట్‌ మెడిసిన్‌ ప్రవేశపెట్టగా 2013-14లో ఆరు గురు, 2014-15లో 10 మంది, 2015-16లో 16 మంది మెడిసిన్‌ సీట్లు సాధించి సత్తా చాటారు. ఏటా వారి సంఖ్య పెరుగుతోంది.

పేదరికం నుంచి ఉన్నతస్థానాలకు..
ఇక్కడ చదివిన విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, రోజు కూలీలు, సెంట్రింగ్‌ పనులు చేసే వారే అధికంగా ఉంటారు. ఏరోజుకారోజు పనిచేస్తేనే ఆకలి తీరుతుంది. చదువుల్లో మాత్రం దిట్టలు కావడంతో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ప్రముఖ సంస్థలో పనిచేయడమేకాక దేశవిదేశాల్లో ఉన్నతోద్యోగాలు, సొంత వ్యాపారాలు చేస్తున్నారు.
* రామదాసు అనే విద్యార్థి ఐఐటీ చేసి బాలానగర్‌ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
* చిరంజీవి అనే విద్యార్థి దిల్లీ ఐఐటీలో చదివారు. ప్రస్తుతం ఒక ప్రముఖ విద్యా సంస్థలో రసాయన శాస్త్రం అధ్యాపకుడిగా జేఈఈ శిక్షణ ఇస్తున్నారు. నగరంలోనే పేరున్న అధ్యాపకుల్లో ఒకరుగా నిలుస్తున్నారు.
* 2010లో ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసిన గీత అనే విద్యార్థిని ఫ్రాన్స్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. అందులో బంగారు పకతం సాధించింది. ఇప్పుడు ఆమె సొంత సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసింది.

విశాల ప్రాంగణం
ఈ సంస్థకు 24 ఎకరాల ప్రాంగణం ఉంది. భారీ వృక్షాలు, పచ్చదనంతో అలరారే క్యాంపస్‌లో.. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకుంటున్నారు. తగినన్ని తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల శారీరక దారుఢ్యం కోసం మైదానం అందుబాటులో ఉంది. 24 గంటల భద్రతా సిబ్బంది ఉంటారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు నర్సులు ఉన్నారు. తరచూ వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.

విశ్వ వ్యాప్తం చేయడం లక్ష్యం - గీత దుబ్బ, పూర్వ విద్యార్థిని, బ్రాహ్మణ వెల్లంల, నల్గొండజిల్లా
నాన్న సన్నకారు రైతు. అమ్మ గృహిణి. 2010లో నేను మద్రాస్‌ ఐఐటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. కొంత కాలం యూబీఎస్‌లో ఉద్యోగం చేశా. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ మాస్టర్స్‌ పూర్తి చేశా. తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచాను. నగరానికి వచ్చి జీ అండ్‌ జీ సంస్థను ఏర్పాటు చేశాను. ఇది ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ. ఫ్రాన్స్‌ ప్రభుత్వ ఆర్డర్‌ పొందాం. త్వరలోనే మరిన్ని ఆర్డర్‌లు రానున్నాయి. కంపెనీని విస్తరించి విశ్వవ్యాప్తం చేయాలనేదే లక్ష్యం.

వూరికి వెళితే గౌరవంగా చూస్తారు.. - ముత్యం, పోటీ పరీక్షల వెబ్‌ పోర్టల్‌ వ్యవస్థాపకులు, గొప్పారం, నిర్మల్‌ జిల్లా
మాది నిర్మల్‌ జిల్లా గల్మల్‌ గొప్పారం గ్రామం. నాన్న రైతు కూలీ. ఆరుగాలాలు కష్టపడి నన్ను చదివించారు. నేను ఏ కండక్టర్‌నో.. చిన్న ఉద్యోగినో అయ్యే వాణ్ని. నేను చదివిన పాఠశాల హెచ్‌ఎం అకాడమీ ప్రవేశ పరీక్ష రాయమని, ఐఐటీ అకాడమీలో సీటు లభ్యమైతే జీవితమే మారిపోతుందని సలహా ఇచ్చారు. 2003లో ఐఐటీ సీటు సాధించి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. ఒక ప్రభుత్వ సంస్థలో మేనేజర్‌ స్థాయి పోస్టు ఉద్యోగం చేసి మానేశాను. ఆ తర్వాత మరో ప్రైవేటు సంస్థలో పని చేశా. ఇప్పుడు నేనే సొంత వ్యాపారం ప్రారంభించాను. భారత్‌లోనే తొలిసారి జేఈఈ, నీట్‌, ఎంసెట్‌, సివిల్స్‌ తదితర అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేసే వెబ్‌పోర్టల్‌తో కూడిన సంస్థను స్థాపించాను. అందులో తగిన ఫీజు చెల్లించి నిర్ణీత కాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వూరికి వెళితే ఎంతో గౌరవమిస్తున్నారు.


Back..

Posted on 14-06-2017