Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పిలుస్తున్నాయి... గురుకులాలు

* చదువు, వసతి,భోజనంఅన్నీ ఉచితమే
* ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం

మంచి చదువులు... మెరుగైన బోధన... రుచికరమైన భోజనం... ఆటలతోపాటు పోటీ పరీక్షలకు శిక్షణ... ఇంటిని మరిపించే సౌకర్యాలు... ఇవన్నీ కావాలంటే... లక్ష రూపాయలు జేబులో ఉంటే ఏ కార్పొరేట్‌ విద్యా సంస్థలోనైనా చేరిపోవచ్చు. అయితే లక్షలు లేకపోయినప్పటికీ ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఇలాంటి సౌకర్యాలే ఉచితంగా దక్కాలంటే?

తెలంగాణ‌
ఈ ప్రశ్నకు సమాధానమే గురుకులాలు... సమర్థులైన ఉపాధ్యాయులతో బోధన, మెరుగైన వసతి సౌకర్యాలు... మంచి పౌష్టికాహారం... ఆటపాటల్లో శిక్షణ... విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడేలా కార్పొరేట్‌ సంస్థలను మించిన ఏర్పాట్లు గురుకులాల సొంతం. ఇక్కడి విద్యార్థులు చదువులో రాణిస్తూనే కొత్త రికార్డులూ సృష్టిస్తున్నారు. ఎవరెస్టునీ అధిరోహించారు... విదేశాలనూ చుట్టొచ్చారు. ఇలాంటి అవకాశం మీ పిల్లలకూ దక్కాలని కోరుకుంటున్నారా? అయితే మీకోసమే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 497 గురుకుల పాఠశాలలు ఎదురుచూస్తున్నాయి. కేవలం ప్రతిభ, సామాజిక వెనుకబాటు, స్థానికత ప్రాతిపదికగా తెలంగాణ గురుకులాలు అయిదో తరగతిలో ప్రవేశానికి విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి.
కేటాయింపు ఇలా...
పాత జిల్లాలను యూనిట్‌గా చేసుకుని విద్యార్థులను ఎంపికచేస్తారు. సర్వేల్‌ గురుకులంలో మాత్రం రాష్ట్రస్థాయి ప్రతిభ ద్వారా ఎంపికచేస్తారు. అన్ని జిల్లాల విద్యార్థులూ ఇక్కడి సీట్ల కోసం పోటీ పడవచ్చు. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్‌, స్థానికత ప్రాతిపదికన విద్యార్థులను గురుకులాల్లోకి తీసుకుంటారు. కౌడిపల్లి గురుకులానికి మత్స్యకార వృత్తికి చెందిన అన్ని జిల్లాలవారు అర్హులు. ఎంపికైనవారిని అయిదో తరగతిలోకి ప్రవేశం కల్పిస్తారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 232 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 88 గిరిజన సంక్షేమ గురుకులాలు, 142 బీసీ సంక్షేమ గురుకులాలు, 35 టీఆర్‌ఈఐఎస్‌ జనరల్‌ గురుకులాల్లో ప్రవేశం లభిస్తుంది.
ప్రత్యేకతలివీ...
అమ్మలాంటి ఆప్యాయత, నాన్నలాంటి ఆదరణ...ఈ రెండింటి మేళవింపునకు ఆధునిక గురుకులాలు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇక్కడ సీటు లభిస్తే తల్లిదండ్రుల కల నెరవేరినట్టే.. విద్యార్థుల ఆశయం సాధ్యమైనట్టే. ఎందుకంటే ఇక్కడి ఉపాధ్యాయులు కేవలం పాఠశాల సమయానికే పరిమితం కాకుండా నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తారు. పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత ఆటలు, విరామం తర్వాత ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ అవర్స్‌ ఉంటాయి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి తరగతికీ హౌస్‌ టీచర్‌ ఉంటారు. వీరు విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. చదువులో వెనుకబడిన, ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. అలాగే చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉండదు అలాఅని చెప్పి నేర్పడంలో రాజీ పడరు. పై తరగతుల విద్యార్థులకు ఒలంపియాడ్‌, ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌...తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. ఆటల్లోనూ తర్ఫీదునిస్తారు. వీటన్నింటితోపాటు పోషక విలువలతో కూడిన భోజనం (మాంసాహారం, గుడ్లు, అరటిపళ్లు, చిరుతిళ్లు ఇవన్నీ అందిస్తారు), పుస్తకాలు, యూనిఫారంతోపాటు పాదరక్షలు, సబ్బు, దువ్వెన, పేస్టు ఇలా అవసరమైన సామగ్రి అంతా ఇస్తారు.
దరఖాస్తు చేసేటప్పుడు...
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల మొబైల్‌ నంబరు, ఆధార్‌ నెంబరు, జిల్లా పేరు తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఏవైనా తప్పులు దొర్లినట్లు గుర్తించినప్పటికీ మార్పులకు అవకాశం ఉండదు. అందువల్ల అప్‌లోడ్‌ చేయడానికి ముందే మరోసారి వివరాలు సరిచూసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 16, పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 8 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు
హాల్‌ టికెట్లు: పరీక్షకు పది రోజుల ముందు నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఫీజు: రూ.50.
వెబ్‌సైట్: http://tgcet.cgg.gov.in
ప్ర‌వేశం ల‌భించాలంటే...
అర్హత: ప్రస్తుతం విద్యార్థి 4వ తరగతి చదువుతుండాలి
వయసు: ఓసీ, బీసీలైతే 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే సెప్టెంబరు 1, 2007 - ఆగస్టు 31, 2009 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. అంటే సెప్టెంబరు 1, 2005 - ఆగస్టు 31, 2009 మధ్య జన్మించినవాళ్లు అర్హులు.
ఆదాయ పరిమితి: తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలవారైతే రూ.1,50,000 పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే రూ.2 లక్షల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా.
పరీక్ష ఇలా..
వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తెలుగు 20, ఇంగ్లిష్‌ 25, గణితం 25, పరిసరాల విజ్ఞానం 25, మెంటల్‌ ఎబిలిటీ 5 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. జవాబులను ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
ఎన్నో ప్రత్యేకతలు...
కార్పొరేట్ పాఠశాలల హవా నడుస్తోన్న ఈ రోజుల్లో గురుకులాలు వాటికి మించిన ఫలితాలు సాధిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులు ఎందరో ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. పాఠశాల సమయానికే పరిమితం కాకుండా ఇక్కడి ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తారు. తరగతుల అనంతరం ఆటలు, విరామం తర్వాత ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ అవర్స్ ఉంటాయి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి తరగతికీ హౌస్ టీచర్ ఉంటారు. వీరు విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. చదువులో వెనుకబడిన, ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అలాగే చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉండదు అలాఅని శిక్షణలో రాజీ పడరు. పై తరగతుల విద్యార్థులను ఒలంపియాడ్, ఐఐటీ, నీట్, ఎంసెట్... తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తారు. ఏ అంశంలోనైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే ప్రోత్సహిస్తారు. అందులో రాణించేలా ప్రత్యేక శిక్షణ సైతం అందిస్తారు. వీటన్నింటితోపాటు పోషక విలువలతో కూడిన భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫాం.. ఇలా అవసరమైన సామగ్రి అంతా ఇస్తారు. అందువల్ల విద్యార్థులు ఎలాంటి ఆర్థిక చింత లేకుండా మంచి వాతావరణంలో చదువుకోవచ్చు. ప్రతి జిల్లాలోనూ బాలబాలికలకు ప్రత్యేకంగా గురుకులాలు ఉన్నాయి. ప్రవేశం లభించినవాళ్లు అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, బీసీ వెల్ఫేర్, జనరల్ మొదలైన వాటి పరిధిలో 308 గురుకులాలు ఉన్నాయి. వీటిలో 24820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశం లభించిన విద్యార్థులకు అయిదో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. లైబ్రరీ, ల్యాబ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులు..మొదలైన సౌకర్యాలు ఉంటాయి.
సీట్ల కేటాయింపు ఇలా...
రాత పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్, జిల్లాల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. బాలురు, బాలికలకు విడిగా మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. విద్యార్థులు 3,4 తరగతులను చదువుకున్న జిల్లాకు స్థానికులవుతారు. ఆ జిల్లాలోని గురుకులాల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని గురుకులాలకు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యార్థులూ పోటీ వడవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 20
దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు. అన్ని వర్గాల విద్యార్థులూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 8 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు
హాల్‌టికెట్లు: ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తిచేసిన తర్వాత హాల్ టికెట్ ప్రింట్ తీసుకుని పరీక్ష కేంద్రానికి వెళ్లొచ్చు.
వెబ్‌సైట్: https://apgpcet.apcfss.in
పరీక్ష ఇలా...
యాభ్తె మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున యాభ్తె ప్రశ్నలు వస్తాయి. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (సైన్స్, సోషల్) అంశాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. తెలుగు 10, ఇంగ్లిష్ 10, మ్యాథ్స్ 10, సైన్స్ 10, సోషల్ 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. ఆయా జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంచుకోవచ్చు.
ప్రవేశం లభించాలంటే...
అర్హత: విద్యార్థులు ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నవారై ఉండాలి.
వయసు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే సెప్టెంబరు 1, 2005 - ఆగస్టు 31, 2009 మధ్య జన్మించినవారై ఉండాలి. ఓసీ, బీసీలు సెప్టెంబరు 1, 2007 - ఆగస్టు 31, 2009 మధ్య జన్మించాలి.
ఆదాయం: తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి.

Back..

Posted on 26-02-2018