Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కోడింగ్‌ కొలువులకుకొత్త అడ్డా!

* నయాట్రెండ్‌ హ్యాకథాన్‌ పోటీలు

కోడింగ్‌ నైపుణ్యాలను ప్రామాణికంగా అంచనా వేయడానికి ఇప్పుడో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే హ్యాకథాన్‌. ప్రతిభావంతులైన అభ్యర్థులు పెద్ద సంస్థల దృష్టిలో పడటానికి ఇదో చక్కటి వేదిక. వీటికి హాజరైతే టాలెంట్‌ను రుజువు చేసుకోవడంతోపాటు ఉద్యోగాలను వేగంగా పొందవచ్ఛు అందుకే హ్యాకథాన్‌లకు ఆదరణ పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌, ఐహ్యాక్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

హ్యాక్‌.. అనే పదం వింటే దేన్నయినా హ్యాక్‌ చేయాలేమో అనుకుంటారు. కానీ నిజానికి అదో కోడింగ్‌ మారథాన్‌. ఒక ప్రొడక్ట్‌ను రూపొందించడం, అభివృద్ధి చేయడమే దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హ్యాకథాన్‌ పోటీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలోనే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొని తక్కువ సమయంలో మంచి ఫలితాన్ని సాధిస్తే పలు సంస్థలు చక్కటి వేతనంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. పోటీలో భాగంగా నిర్వాహకులు ఏదైనా సమస్యను ఇచ్చి పరిష్కారాన్ని సూచించమంటారు. వెబ్‌సైట్‌, వెబ్‌ యాప్‌, ఆండ్రాయిడ్‌/ ఐఓఎస్‌.. ఇలా దేన్నైనా రూపొందించవచ్ఛు వాటిల్లో ఉత్తమ పరిష్కారాన్ని ఎంపిక చేస్తారు. నిర్ణీత సమయంలో చేయాలి. బృందంగా ఏర్పడి సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో దీన్ని పూర్తిచేయాలి. ప్రోగ్రామర్‌, డిజైనర్‌, డెవలపర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు కలిసి ఒక మంచి ప్రొడక్ట్‌- సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్ట్‌ను డిజైన్‌ చేయాలి. దాన్ని రూపొందించాలి.

కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన ఉన్నవారెవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్ఛు కొన్ని కొందరికే ప్రత్యేకం. ఉదాహరణకు- కళాశాల విద్యార్థులు, అమ్మాయిలకు మాత్రమే నిర్వహించేవి. పోటీల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగే ఆన్‌లైన్‌ పోటీలకైనా ఎవరైనా దరఖాస్తు చేసుకొని పాల్గొనవచ్ఛు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నవాటికి ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది.

ప్రముఖమైనవి కొన్ని!
స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ (ఎస్‌ఐహెచ్‌): ఇది జాతీయస్థాయి పోటీ. ప్రపంచంలో అతిపెద్ద హ్యాకథాన్‌గా దీనికి పేరుంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మానవ వనరుల శాఖ దీన్ని నిర్వహిస్తోంది. రోజువారీ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన సంస్థలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ విద్యార్థులు దీనిలో పాల్గొనడానికి అర్హులు. కొన్ని థీమ్‌లను ఇచ్చి వాటికి సలహాలు పంపమంటారు. దీనికి ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వివరాలకు- https://www.sih.gov.in/ చూడవచ్ఛు.

ఐ హ్యాక్‌: ఐఐటీ బాంబే రెండేళ్లుగా దీన్ని నిర్వహిస్తోంది.ఇది 48 గంటల కోడింగ్‌ చాలెంజ్‌. విద్యార్థులతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ పాల్గొనవచ్ఛు వ్యక్తిగతంగానూ హాజరుకావచ్ఛు కానీ ముగ్గురు లేదా నలుగురితో బృందంగా ఏర్పడాలి. సాధారణంగా జనవరిలో దీన్ని నిర్వహిస్తారు. పోటీ ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గెలిచినవారికి నగదు బహుమతిని అందిస్తారు. https://ihack.ecell.in/

కోడ్‌స్పేస్‌: వీఐటీ (వెల్లూర్‌) విద్యార్థులు 2015 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆలోచనలకు ఒక వేదికను అందించడమే దీని ఉద్దేశం. పోటీపడుతున్న డొమైన్లు- ఫిన్‌టెక్‌, బ్లాక్‌చెయిన్‌, ఏఆర్‌/ వీఆర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఏఐ, డిజిటల్‌ లిటరసీ. https://csivit.com/#home

కోడ్‌ గ్లాడియేటర్స్‌: టెక్‌ గిగ్‌ దీన్ని నిర్వహిస్తోంది. మూడుదశల్లో హ్యాకథాన్‌ సాగుతుంది. అవి- స్క్రీనింగ్‌, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌. స్క్రీనింగ్‌ రౌండ్‌లో ఎంపికైనవారిని లీడర్‌గా పరిగణిస్తారు. వారికి తమ బృందాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. ముగ్గురి వరకూ బృందంగా ఉండవచ్ఛు ఆన్‌లైన్‌ దశలో ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్ఛు కానీ ఇచ్చిన సమయంలోగా పూర్తిచేయాలి. సాధారణంగా ఏప్రిల్‌, మేల్లో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌ నుంచీ విజేతలను నిర్ణయిస్తారు. https://www.techgig.com/codegladiators

ఏంజిల్‌ గ్లోబల్‌ సిరీస్‌ హ్యాకథాన్‌: గుర్తింపు పొందిన హ్యాకథాన్‌ల్లో ఇది ఒకటి. ఏంజిల్‌ హాక్‌ దీన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇన్‌ పర్సన్‌, వర్చువల్‌ అని రెండు రకాల హ్యాకథాన్లు ఉంటాయి. ఇన్‌పర్సన్‌ హ్యాకథాన్‌ను కొచ్చి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, దిల్లీల్లో జరుపుతారు. ఇది సాధారణంగా ఏప్రిల్‌ నుంచి జులై మధ్యలో ఉంటుంది. వర్చువల్‌ హ్యాకథాన్‌ ఆన్‌లైన్‌లో సాగుతుంది. ఇది సాధారణంగా మే నుంచి జూన్‌ వరకు ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి తన ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వాలి. బాగున్నవాటికి పెద్ద సంస్థల నుంచి పెట్టుబడి సాయమూ అందుతుంది. https://angelhack.com/

ఎల్‌ఎన్‌ఎం హ్యాక్స్‌: ఇది 24 గంటల హ్యాకథాన్‌. ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సృజనాత్మక ఆలోచనలను సూచించాలి. అభ్యర్థులు సమస్యకు వర్కింగ్‌ అప్లికేషన్‌ లేదా హార్డ్‌వేర్‌ ప్రోటోటైప్‌ను రూపొందించడం ద్వారా పరిష్కారం చూపించాలి. https:/lnmhacks.com/#about దేశవ్యాప్తంగా కొన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, వివిధ విశ్వవిద్యాలయాలూ హ్యాకథాన్‌లను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఏటా కొనసాగిస్తుంటే మరికొన్ని కొన్నిసార్లకే పరిమితమవుతున్నాయి.

డబ్ల్యూఎంఎన్‌: ఇన్‌అవుట్‌, ఈటీహెచ్‌ ఇండియా దీన్ని బెంగళూరులో నిర్వహిస్తాయి. 48 గంటల హ్యాకథాన్‌. 18 ఏళ్లు నిండినవారెవరైనా ఇందులో పాల్గొనవచ్ఛు 18 ఏళ్లలోపువారు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. వ్యక్తిగతంగా పాల్గొనే వీలు లేదు. కానీ బృందం అందుబాటులో లేనివారికి బృందంగా ఏర్పడే అవకాశాన్ని కల్పిస్తారు. https://wmn.community/

ఇంటర్నేషనల్‌ విమెన్‌ హ్యాకథాన్‌: హ్యాకర్‌ఎర్త్‌, స్క్లమ్‌బర్గర్‌ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. కోడింగ్‌ అనుభవం తప్పనిసరి కాదు. వ్యక్తిగతంగా లేదా బృందంగా ఇందులో పాల్గొనవచ్ఛు బృందంలో ముగ్గురికి మించి ఉండకూడదు. గెలిచినవారికి నగదు బహుమతి ఇస్తారు. https://www.hackerearth.com/challenges/hackathon/international-womens-hackathon-2019/

ఇవేకాకుండా ఏటా ఎన్నో సంస్థలు అమ్మాయిలకు ప్రత్యేకంగా హ్యాకథాన్‌లు నిర్వహిస్తున్నాయి. వండర్‌ కోడర్స్‌, అనితాస్‌ మూన్‌షాట్‌ కోడ్‌థాన్‌, విమెన్‌ హూ కోడ్‌, బార్క్‌లేస్‌ మొదలైనవి ఇప్పటివరకూ నిర్వహించిన వాటిలో కొన్ని. ఈ తరహా హ్యాకథాన్‌లను కొన్ని ఒకసారి నిర్వహించడానికే పరిమితం అవుతుండగా మరికొన్ని ఏడాదికోసారి, రెండేళ్లకోసారి కొనసాగిస్తున్నాయి. వీటి వివరాలకు- https://www.hackerearth.com/ వెబ్‌సైట్‌ను చూడవచ్ఛు.

బ్రాడ్‌రిడ్జ్‌: కోడ్‌ బీ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ రెండుసార్లు కోడ్‌ బీ, కోడ్‌ బీ 2.0 పేర్లతో జరిగాయి. 48 గంటల కోడింగ్‌ మారథాన్‌. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పోటీలో భాగంగా కోడింగ్‌ సంబంధిత ప్రోగ్రామింగ్‌ ప్రాబ్లమ్స్‌, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, సబ్జెక్టివ్‌ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి ముగ్గురు విజేతలకు రూ.లక్ష వరకూ నగదు బహుమతి ఇస్తారు. https://www.hackerearth.com/challenges/competitive/broadridge-code-bee-20/

అమ్మాయిలకు ప్రత్యేకం
కోడింగ్‌ డెవలప్‌మెంట్‌లో అమ్మాయిల శాతం ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ. మనదేశంలో 5 మిలియన్ల డెవలపర్లు ఉంటే అమ్మాయిల శాతం 18. యువతులను ఈ దిశగా ప్రోత్సహించడం, లింగ భేదాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని సంస్థలు వీరికి ప్రత్యేకంగా కోడింగ్‌ అవకాశాలను కల్పిస్తున్నాయి. వాటిలో కొన్ని..

లాభాలేంటి?
నెట్‌వర్కింగ్‌: పోటీ ప్రదేశంలో ఒకే ఆసక్తులున్న వారితోపాటు సంస్థల ప్రతినిధులతోనూ పరిచయాలు ఏర్పరచుకోవచ్ఛు తద్వారా నెట్‌వర్క్‌ను పెంచుకోవచ్ఛు భవిష్యత్తులో కెరియర్‌ మార్గాన్ని రూపొందించుకోవడానికి ఈ పరిచయాలు ఉపయోగపడతాయి.
రెజ్యూమెకు అదనపు విలువ: హ్యాకథాన్‌లలో పాల్గొన్నట్లుగా రెజ్యూమె/ సీవీల్లో ప్రస్తావించవచ్ఛు ఇది అభ్యర్థికి అదనపు విలువను చేకూరుస్తుంది. ప్రోగ్రామ్‌ నైపుణ్యాలతోపాటు అనుభవాన్నీ ఇది సూచిస్తుంది.
సృజనాత్మకత: హ్యాకథాన్‌ల్లో తరచూ ఎదురయ్యే సవాళ్లకు అప్పటికప్పుడు సమాధానాలు సూచించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థిలోని సృజనాత్మకత, త్వరగా స్పందించే గుణాలు పెంపొందుతాయి. ఒకే సమస్యపై వివిధ విభాగాలవారితో పనిచేయాల్సి వస్తుంది. కోరుకున్న ఫలితాన్ని తీసుకురావడానికి ఎవరి నుంచి ఏ సాయం అవసరమవుతుందో అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. కలిసి పని చేయడంపై అవగాహన ఏర్పడుతుంది.
ఉద్యోగావకాశాలు: ఇలాంటి పోటీలకు చాలా సంస్థల ప్రతినిధులు హాజరవుతుంటారు. విజయంతో సంబంధం లేకుండా అభ్యర్థి నైపుణ్యాల ఆధారంగా మంచి వేతనంతో ఉద్యోగావకాశాలను కల్పిస్తారు.


Back..

Posted on 12-12-2019