Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
హ్యాపీ న్యూ కెరిఇయర్‌!

* ఈ తీర్మానాలు అమలు చేస్తే మేలు

ఏదైనా మంచి అలవాటు చేసుకోవాలన్నా, భవిష్యత్తుకు పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా నూతన సంవత్సరం ఓ చక్కని సందర్భం. ఆటోమేషన్‌, అవుట్‌ సోర్సింగ్‌లు పెరుగుతూ ఉద్యోగ సాధన, దాన్ని నిలుపుకోవటం క్లిష్టంగా మారుతున్న కాలమిది. ఈ పోటీ ప్రపంచంలో కెరియర్‌ను తీర్చిదిద్దుకుని చక్కగా రాణించాలంటే అదనపు నైపుణ్యాలు పెంచుకోవటంతో పాటు సరికొత్త అంశాలపై అవగాహన, నెట్‌వర్కింగ్‌ పెంచుకోవటంలాంటి అంశాలపై దృష్టిపెట్టాలి. ఈ నిర్ణయాలను ఆచరించటానికి 2020ను శుభారంభంగా భావిద్దాం!

ఉద్యోగాల స్వభావాల్లో పెనువేగంతో మార్పులు వస్తున్నాయి. నిరంతరం నేర్చుకుంటూ, పరిజ్ఞానం పెంచుకోవటం అనివార్యమైపోయింది. విద్యార్థులైనా, ఉద్యోగులైనా పదిమందిలో ఒకరుగా ఉంటే ఫలితం ఉండదు. ప్రత్యేకత చూపిస్తేనే మనుగడ! వ్యక్తిగతంగా ఎదుగుతూ, కెరియర్‌పరంగా చక్కని పునాది వేసుకోవటానికి తోడ్పడే తీర్మానాలు చేసుకోవటం ఒక ఎత్తయితే, వాయిదా వేయకుండా ఆ నిర్ణయాలను అమలు చేయటం మరో ఎత్తు! నూతన సంవత్సరంలో దృష్టిపెట్టి ఆచరించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటో చూద్దాం.

నిరంతర నెట్‌వర్కింగ్‌
ప్రతి విద్యార్థీ, ఉద్యోగార్థీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన నైపుణ్యమిది. విద్యార్థి దశలో, ఉద్యోగాన్వేషణ తరుణంలో నెట్‌ వర్కింగ్‌ ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పాత మిత్రులకే పరిమితం కాకుండా విభిన్న నేపథ్యాల కొత్త స్నేహితులను ఏర్పరచుకోవటం, వారితో తరచూ మాట్లాడుతుండటం అలవాటు చేసుకుంటే వ్యక్తిగతంగా, కెరియర్‌పరంగానూ ప్రయోజనకరమవుతుంది. భావ వ్యక్తీకరణ శక్తిని మెరుగుపరుస్తుంది.

నెట్‌వర్క్‌ విస్తృతమైతే అదనపు నైపుణ్యాలను పెంచుకోవటం సులువు అవుతుంది. ఎంచుకున్న పరిశ్రమకు సంబంధించిన సెమినార్లు, వర్క్‌షాపులు, వెబినార్లు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూవుండాలి. ఇలా చేస్తే అనుభవజ్ఞులైనవారిని కలుసుకుని, వారి పరిజ్ఞానం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. ఇదంతా ఎన్నో ఉద్యోగావకాశాలను దగ్గర చేస్తుంది.

నైపుణ్యాల నవీకరణ
ఒకప్పటిలా కొలువుల్లో స్థిరత్వం తగ్గిపోయింది. ఉద్యోగభద్రత ప్రశ్నార్థకమవుతూ అనిశ్చితి సర్వసాధారణమైంది. ఏ కారణం వల్లనైనా సిబ్బందిని తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తే మొదట వేటుపడేది అతి తక్కువ నైపుణ్యాలవారిపైనే! ఈ పరిస్థితుల్లో వీలైనంత ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే ఎంచుకున్న రంగంలో తాజా అంశాల పరిజ్ఞానం, సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. పోటీలో వెనకబడి కనుమరుగు కాకుండావుండాలంటే నైపుణ్యాలను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటూ ఉండాల్సిందే. కంపెనీకి అవసరమైన నైపుణ్యాలన్నిటిపైనా మీకు అవగాహన ఉందని తెలిసేలా చేయాలి. మీ పరిశ్రమలో తాజా మార్పులన్నీ గ్రహించటం, వాటిలో ఎక్కువ అంశాలపై అవగాహన పెంచుకోవటం నిరంతరం సాగాలి. దీనివల్ల ఏ పరిస్థితుల్లోనూ మీ స్థానానికి ప్రత్యామ్నాయం ఉండదు.

కొత్త అంశాలు నేర్చుకోవడం, నూతన అవకాశాల కోసం అన్వేషించే అలవాటు ఎన్నో మంచి పరిణామాలకు కారణం కావొచ్చు. ఈ క్రమంలో మీకు ఆసక్తిని కలిగించి మిమ్మల్ని ఉత్సుకతకు గురిచేసే విభిన్న విషయాలను తెలుసుకునే అవకాశముంది. ఉదాహరణకు మీది డేటా సైన్స్‌ రంగం అయితే అనలిటిక్స్‌లో కోర్సు చేసి, ఫలితంగా బిగ్‌ డేటా వైపు మీ ఉత్సాహం, ప్రతిభావిశేషాలను కేంద్రీకరించే వీలు ఉండవచ్చు. సంబంధిత రంగంలో మార్కెటింగ్‌, సేల్స్‌ వైపు కూడా మరలే అవకాశం రావొచ్చు.

ఉద్యోగార్హతల జోడింపు
సుశిక్షితులైన ప్రతిభావంతులను నియమించుకోవడానికే సంస్థలు మొగ్గు చూపుతుంటాయి. ప్రసిద్ధ విద్యాసంస్థలో చదివి కేవలం డిగ్రీ తెచ్చుకున్నంతమాత్రానే ఉద్యోగం ఇవ్వటానికి కంపెనీలు ఆసక్తి చూపవు. వారికి కావాల్సింది- విభిన్న నైపుణ్యాలున్న అభ్యర్థులు. ఓ సంస్థలో డేటా అనలిస్టు పోస్టు కోసం ఇద్దరు ఫ్రెషర్లు దరఖాస్తు చేశారనుకుందాం. వారిలో ఒకరికి అత్యుత్తమ మార్కులతో డిగ్రీ, డేటాసైన్స్‌పై ప్రాథమిక అవగాహన; మరొకరికి డిగ్రీ, డేటాసైన్స్‌లో తగినంత పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, తగిన సర్టిఫి·కేషన్లు కూడా ఉంటే నిశ్చయంగా రెండో అభ్యర్థికే ఉద్యోగం దక్కుతుంది. అందుకే ఎంచుకున్న రంగంపై తగిన పరిజ్ఞానం పెంచుకుని, సర్టిఫికేషన్లు చేస్తూ ఉద్యోగార్హత నైపుణ్యాలను పెంచుకోవాలి!

సోషల్‌ మీడియాకు స్వల్ప సమయం
నిద్ర లేవగానే ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాలు అకౌంట్లు చెక్‌ చేసుకోవడం, రోజులో ఎక్కువ భాగం దానిలోనే గడపటం చాలామంది విద్యార్థుల, ఉద్యోగార్థులకు అలవాటు. ఇది వారి విలువైన సమయాన్ని హరించివేస్తోంది. వీలైనంత తక్కువ సమయం దానిలో గడపాలనే నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం. దీన్ని సరిగ్గా అమలు చేస్తే.. కొత్త పరిజ్ఞానం పెంచుకోవటానికీ, నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికీ తగినంత సమయం చిక్కుతుంది.

Back..

Posted on 30-12-2019