Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఇంటర్‌తో ఉద్యోగం.. ఉన్నత విద్య!

అవసరమైన నైపుణ్యాలను నేర్పించి.. కొలువు ఇచ్చి.. కావాల్సిన డిగ్రీని ఇప్పిస్తాం అంటోంది హెచ్‌సీఎల్‌ సంస్థ. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి ఆహ్వానం పలుకుతోంది. మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగంతోపాటు ఉన్నత విద్యనూ అందుకునే చక్కటి అవకాశం ఇది.

కార్పొరేట్‌ సంస్థలు తమకు కావాల్సిన నిపుణులను తయారు చేసుకోడానికి ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతున్నాయి. దీంతో ఉద్యోగాలతోపాటు మంచి భవిష్యత్తును అందుకునే అవకాశం అభ్యర్థులకు లభిస్తోంది. అలాంటి అవకాశం ఇప్పుడు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు వచ్చింది. హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) ఇంటర్‌ ఉత్తీర్ణులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ-ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను ఇందులో అందిస్తారు. 2019 సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దేశంలో నొయిడా, చెన్నై, లఖ్‌నవూ, మధురై, నాగ్‌పూర్‌, బెంగళూరు హెచ్‌సీఎల్‌ కార్యాలయాల్లో ఈ కోర్సును అందిస్తున్నారు.

ఐటీ ఇంజినీర్లుగా..
ఇంటర్మీడియట్‌లో తప్పనిసరిగా గణితం/ వ్యాపార గణితం ఒక సబ్జెక్టుగా కలిగి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. 2018, 2019 సంవత్సరాల్లో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌ కాలపరిమితి ఒక సంవత్సరం. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఫండమెంటల్స్‌, సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌, లైఫ్‌స్కిల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. మొదటి తొమ్మిది నెలలు తరగతిలో, చివరి మూడు నెలలు ప్రాక్టికల్‌ పద్ధతిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ప్రత్యక్షంగా కంపెనీ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. శిక్షణ పూర్తిచేసినవారు హెచ్‌సీఎల్‌లో ఐటీ ఇంజినర్లుగా ఉద్యోగం పొందుతారు.
హెచ్‌సీఎల్‌ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రామ్‌లో చేరిన ప్రతి విద్యార్థికి నెలకు రూ.10,000 స్టైపెండ్‌ లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కి రెండు లక్షల ఫీజు ఉంటుంది. బ్యాంక్‌ రుణ సదుపాయం ఉంది. ఉద్యోగంలో చేరిన మొదటిసంవత్సరం నుంచి ఈఎమ్‌ఐ ద్వారా లోన్‌ తీర్చుకోవచ్చు.

ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ ఎబిలిటీస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్‌సీఎల్‌ కార్యాలయాల వద్ద ప్రతి వారాంతం నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రవేశ ప్రక్రియ 2019 జులై చివరి వరకు జరుగుతుంది.
మరింత సమాచారం కోసం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, ఆక్స్‌ఫర్డ్‌ హౌస్‌ ఫోర్త్‌ఫ్లోర్‌, రుస్తంబాగ్‌ లేఅవుట్‌, మణిపాల్‌ హాస్పిటల్‌ పక్కన, బెంగళూరు - 560017, కర్ణాటక చిరునామాలో సంప్రదించవచ్చు.
వెబ్‌సైట్‌: www.hcltechbees.com

కోరుకున్న పట్టా..!
హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను చదవవచ్చు. బిట్స్‌ పిలానీ, శస్త్ర యూనివర్సిటీల భాగస్వామ్యంతో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థలతో హెచ్‌సీఎల్‌కు ఒప్పందం ఉంది. బిట్స్‌ పిలానీలో నాలుగేళ్ల బీఎస్సీ (డిజైనింగ్‌ అండ్‌ కంప్యూటింగ్‌), రెండేళ్ల ఎంఎస్సీ, ఎంటెక్‌ కోర్సులు చేయవచ్చు. శస్త్ర యూనివర్సిటీ మూడేళ్ల బీసీఏ, ఎంసీఏ ప్రోగ్రాములను అందిస్తోంది. ఉద్యోగులు తమకు నచ్చిన కోర్సు చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే ప్రాంతంలోనే తరగతులు ఉంటాయి. చదువుకు అయ్యే ఖర్చు మొత్తం కంపెనీయే భరిస్తుంది.


Back..

Posted on 13-06-2019