Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
4 కొత్త కోర్సులు

* హెచ్‌సీయూ వృత్తి విద్య

ఉద్యోగాలను ఎక్కువగా అందిస్తున్న రంగాల్లో వైద్యం, విద్య, గ్రామీణాభివృద్ధి ప్రధానమైనవి. వీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్‌సీయూ వృత్తి విద్యలో సాధారణ డిగ్రీ అభ్యర్థులు చేయదగిన నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. హస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాలను పెంచుకోడానికీ, విద్యారంగంలో సరికొత్త టెక్నాలజీ వినియోగాన్ని అందిపుచ్చుకోడానికీ, గ్రామీణాభివృద్ధిలో సమర్థంగా భాగస్వాములు కావడానికీ ఈ కోర్సులు దోహదపడతాయి. వేగంగా ఉపాధినీ అందిస్తాయి.
వైద్యం, బోధన, పాలన, గ్రామీణాభివృద్ధి రంగాల్లో హెచ్‌సీయూ దూరవిద్యా విభాగం కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

బోధనలో..: కళాశాలలు, పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఇప్పటికీ చాలామంది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ లోటును భర్తీ చేసే విధంగా ‘ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌’ కోర్సును రూపొందించారు. బ్లాక్‌బోర్డు విధానం తెరమరుగైన నేపథ్యంలో కొత్త విధానాలకు అనుగుణంగా బోధకుల్లో ఎటువంటి మార్పులు అవసరమో గుర్తించి వాటిని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. ఇది ఏడాది కోర్సు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నార్మ్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చ్‌రల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌)లోని టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎవరైనా ప్రవేశాలు పొందవచ్చు. కళాశాలల్లో, పాఠశాలల్లో పనిచేసే విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు టీచింగ్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పాఠాలు ఎలా బోధించాలనేది వివరిస్తారు. నార్మ్‌లో ఉన్న అత్యంత మెరుగైన ‘ఈ-లెర్నింగ్‌ ల్యాబ్‌’ ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ కోర్సును బోధిస్తారు. దేశంలో ఎటువంటి విశ్వవిద్యాలయమూ ఇప్పటివరకు ఇంతటి నైపుణ్యాలతో కూడిన కోర్సును దూరవిద్య ద్వారా అందించటం లేదని కోర్సు నిర్వాహకులు తెలిపారు. కోర్సు ఫీజు- రూ.25 వేలు (సెమిస్టర్‌కి 12,500).

పాలన, గ్రామీణాభివృద్ధి..: ‘డిప్లొమా ఇన్‌ పంచాయతీరాజ్‌ గవర్నెన్స్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌’ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, గ్రామాల అభివృద్ధిని ఎలా చేసుకోవాలి, అందుకు తగిన వనరులను ఎలా సమకూర్చుకోవాలి.. అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. గ్రామాల్లో పనిచేసే అనేక సంస్థలు, ఉద్యోగులు, ఈ కోర్సు ద్వారా మరింత నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చు. లబ్ధి పొందవచ్చు. ఎన్‌జీవోల ఉద్యోగ, వృత్తి అవకాశాలు మెరుగుపడతాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలతో ఒప్పందాలు చేసుకొని కోర్సును రూపొందించారు. ఈ కోర్సుకు ఏడాదికి ఫీజు రూ.10 వేలు (సెమిస్టర్‌కి రూ.5 వేలు).

ఈ కోర్సులకు కనిష్ఠ వయసు- 18 సంవత్సరాలు. గరిష్ఠ వయః పరిమితి లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ వృత్తిలో నైపుణ్యాలు మెరుగుపరిచే విధంగా ఈ పాఠ్యాంశాలను తయారు చేశారు. ఈ కోర్సు మెటీరియల్‌ను మూడు విభాగాలుగా చేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. సాఫ్ట్‌, హార్డ్‌ కాపీల రూపంలో విద్యార్థులు వీటిని పొందవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు గడువు: 2019 జనవరి 31
ఆలస్య రుసుము గడువు: ఫిబ్రవరి 15, 2019

ఏ డిగ్రీ చదివిన వారైనా అర్హులే..
దూరవిద్య ద్వారా హెచ్‌సీయూ అందిస్తున్న కోర్సులు చేసేందుకు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినవారైనా అర్హులే. దరఖాస్తు రుసుము రూ.300లు. 2017లో 1500 మంది దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో పరిశీలన అనంతరం 900 మందికి ప్రవేశాలు కల్పించాము. అదనపు వివరాలకు అబిడ్స్‌లోని హెచ్‌సీయూ దూరవిద్య కార్యాలయంలో సంప్రదించవచ్చు. 8897436905, 040-24600264 ఫోన్‌ నంబర్ల ద్వారా, యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా అదనపు వివరాలు పొందవచ్చు.
- జిలానీ, దూరవిద్య కేంద్రం ప్రిన్సిపల్‌

వైద్యరంగంలో..
అపోలో మెడ్‌ స్కిల్స్‌తో ఒప్పందం చేసుకొని ‘పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌’, ‘పీజీ డిప్లొమా ఇన్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సులను అందిస్తున్నారు. ఈ రెండు కోర్సుల పాఠ్యాంశాలను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా రూపొందించారు. కొత్తగా డిగ్రీలు పూర్తి చేసినవారు ఈ కోర్సు పూర్తిచేస్తే వెంటనే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసుపత్రుల్లో పనిచేసేవారు ఈ కోర్సులు చేసి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. సెమిస్టర్‌కి ఫీజు రూ.30 వేలు. డిగ్రీ కనీస అర్హతగా నిర్ణయించారు. ఆంగ్లంలోనే బోధన ఉంటుంది.

- సీహెచ్‌.మురళీకృష్ణ, ఈనాడు, హైదరాబాద్‌


Back..

Posted on 08-01-2019