Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మర్యాద రామన్నలకు ఆహ్వానం!

బిజీ బిజీ జీవితాల్లో కాస్త విశ్రాంతి కోసం అలా ఎక్కడికైనా వెళ్లివద్దామని ఎప్పుడైనా అనిపించడం సహజం. అలా వెళ్లినప్పుడు సరైన వసతి సౌకర్యాలు లేక అవస్థలు పడాల్సి వస్తే.. అబ్బో చాలా కష్టం. సందర్శకులు అలాంటి కష్టాలపాలు కాకుండా కాపాడటానికే ఆతిథ్యరంగం అవతరించింది. విహారాలను వీలైనంత మనోహరంగా మారుస్తోంది. కొత్త కొత్త రుచులతో ఆహారాన్ని అందించి మళ్లీ మళ్లీ రమ్మని స్వాగతిస్తోంది. స్వదేశమైనా.. విదేశమైనా.. విహారమైనా.. విధినిర్వహణలో భాగమైనా.. అవసరాలకు అందుబాటులో ఉండి అన్ని వసతులతో అతిథులను ఆహ్వానించి ఆనందింపజేస్తున్నారు ఈ మర్యాద రామన్నలు. వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌లోని వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన నిపుణులు.

మన దేశంలో ఐటీ తర్వాత ఆతిథ్య రంగంలోనే ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ప్రపంచ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ ప్రకారం బిజినెస్‌ ట్రావెల్‌ డెస్టినేషన్‌లో భారత్‌ 18వ స్థానంలో ఉంది. మరికొన్నేళ్లలో అయిదో స్థానానికి చేరుకుంటుందని అంచనా. దేశీయ దిగ్గజాలైన లీలా, ఒబెరాయ్‌, తాజ్‌, ఐటీసీ హోటళ్లు విస్తరిస్తున్నాయి. స్టార్‌వుడ్‌, మారియట్‌ లాంటి విదేశీ సంస్థలు మన దేశంలో శాఖల సంఖ్యను పెంచుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌ చైన్‌లో కేఎఫ్‌సీ, మెక్‌ డొనాల్డ్స్‌, పిజా హట్‌, డోమినోస్‌...సత్తా చాటుతున్నాయి. జొమాటో, స్విగ్గీ, ఫుడ్‌ పాండా... తీరిక లేకుండా ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాయి. దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో చెఫ్‌, వెయిటర్‌, సర్వర్‌, హౌస్‌ కీపింగ్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌, గెస్ట్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌....ఇలా ఎన్నో రకాల నిపుణుల అవసరం పెరుగుతోంది. అందుకే ఆతిథ్య రంగంలో వస్తున్న ఈ అవకాశాలను అందుకోవాలంటే కొన్ని రకాల కోర్సులు పూర్తిచేయాల్సి ఉంటుంది.

ప్రవేశం ఇలా...
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ప్రధానమైన పరీక్ష. దీని ప్రకటన వెలువడింది. అలాగే ఐటీసీ, ఒబెరాయ్‌ గ్రూప్‌లు ప్రత్యేకంగా కోర్సులు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆతిథ్య కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రస్థాయి పరీక్ష రాయాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలావరకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా కోర్సుల్లో చేరే అవకాశం కల్పిస్తున్నాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులున్నాయి. ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు డిప్లొమా, యూజీ కోర్సుల్లో చేరవచ్చు. డిగ్రీ కోర్సులకు మూడేళ్లు, డిప్లొమాలకు 18 నెలల కాలవ్యవధి ఉంటుంది.

ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ సంస్థ తరఫున హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 63 హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్లలోకీ ఈ స్కోర్‌తోనే ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ స్కోర్‌తో తెలుగు రాష్ట్రాల్లో పలు సంస్థలు నేరుగా ప్రవేశం కల్పిస్తున్నాయి. హైదరాబాద్‌ (విద్యానగర్‌)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్ర సంస్థ. ఇక్కడ బీఎస్‌సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జనరిక్‌/ స్పెషలైజేషన్‌), పీజీ డిప్లొమా ఇన్‌ అకామడేషన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ పాటిస్సరీ/ ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, తిరుపతి, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌; ప్రైవేటు యాజమాన్యంలో శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌ (బేగంపేట) జేఈఈ స్కోర్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలన్నీ ఈ స్కోర్‌ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. పరీక్ష తేదీ ఏప్రిల్‌ 27.
వెబ్‌సైట్‌: http://nchm.gov.in

ఉద్యోగావకాశాలు
బీఎస్‌సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివినవారిని మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ లేదా ఎగ్జిక్యూటివ్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ అవుట్‌ లెట్లు, రిసార్టులు, రైల్వే, డిఫెన్స్‌, ఎయిర్‌ లైన్స్‌, క్రూయిజ్‌ లైన్స్‌, స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు, బహుళ జాతి కంపెనీలు...ఇలా ప్రతిచోటా ఉద్యోగాలు లభిస్తాయి. సొంతంగా ఫుడ్‌ కోర్టులు ప్రారంభించవచ్చు. పీజీతో ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నేషనల్‌ హాస్పిటాలిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత సాధిస్తే బోధన రంగంలో ఆకర్షణీయ వేతనాలు అందుతాయి. ప్రముఖ సంస్థల్లో ఆతిథ్యంలో బీఎస్సీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రారంభంలోనే నెలకు రూ.20,000- 25,000 వేతనం పొందవచ్చు. అయిదేళ్ల అనుభవంతో జీతం రూ.యాభై వేల వరకు చేరుతుంది. డిప్లొమా అభ్యర్థులకు ప్రారంభంలోనే రూ.12,000-15,000 వేతనం అందుతోంది.

ఐటీసీ హోటల్స్‌
కార్పొరేట్‌ హోటళ్లు కొన్ని ప్రత్యేకంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలను నెలకొల్పాయి. ఐటీసీ, ఒబెరాయ్‌ గ్రూప్‌లు యూజీ, పీజీ డిప్లొమా కోర్సులు ఉచితంగా అందిస్తున్నాయి. ప్రతినెలా స్టయిపెండ్‌ సైతం చెల్లిస్తున్నాయి. గుడ్‌గావ్‌లోని ఐటీసీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐటీసీ హెచ్‌ఎంఐ) హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ ట్రెయినింగ్‌ (హెచ్‌ఎంటీ) ద్వారా వెల్‌ కం లీడ్‌, గ్రాడ్యుయేట్‌ హాస్పిటాలిటీ, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పేర్లతో కోర్సులు నిర్వహిస్తోంది.
వెల్‌ కం లీడ్‌: ఇది మూడేళ్ల డిగ్రీ కోర్సు. ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. కోర్సులో చేరినవారు ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. స్టయిపెండ్‌ సైతం ఐటీసీ గ్రూప్‌ చెల్లిస్తుంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఇగ్నో ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (టూరిజం స్టడీస్‌) డిగ్రీని అందుకోవచ్చు. దీంతోపాటు వెల్‌కం లీడ్‌ సర్టిఫికెట్‌, అనుభవ పత్రాన్ని ఐటీసీ జారీ చేస్తుంది. ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
గ్రాడ్యుయేట్‌ హాస్పిటాలిటీ ప్రోగ్రాం: పూర్తి రెసిడెన్షియల్‌ విధానంలో ఐటీసీ గ్రాడ్యుయేట్‌ హాస్పిటాలిటీ ప్రొగ్రాం (జీహెచ్‌పీ) అందిస్తోంది. ఉచితంగా అందించే ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలూ అర్హులే. ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాలు https://www.itchotels.in/hmi/programmes/welcomlead.html లింక్‌లో లభిస్తాయి.
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ప్రోగ్రాం: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు ఈ సంస్థ పలు విభాగాల్లో (కిచెన్‌, హౌస్‌ కీపింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, రెవెన్యూ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, ఇంజినీరింగ్‌) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. దీనికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాచిలర్‌ డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులు తప్పనిసరి.

ఒబెరాయ్ గ్రూప్
స్టెప్ పేరుతో మూడేళ్ల డిగ్రీ, ఓసీఎల్డీ పేరుతో రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులను ఒబెరాయ్ గ్రూప్ ఉచితంగా అందిస్తోంది. వీటిని విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న‌వారు ఒబెరాయ్ హోటళ్ల‌లోనే సేవ‌లు అందించ‌వ‌చ్చు.
స్టెప్
సిస్టమేటిక్ ట్రయినింగ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొగ్రాం (స్టెప్) పేరుతో ఒబెరాయ్ గ్రూప్ ఇంటర్ పూర్తిచేసుకున్నవారికి మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ టూరిజం స్టడీస్ కోర్సు అందిస్తోంది. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, కిచెన్ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. స్టెప్ ద్వారా కిచెన్, హోటల్ ఆపరేషన్స్ ప్రొగ్రామ్‌లు అందిస్తున్నారు. కిచెన్ ఆపరేష‌న్స్‌లో భాగంగా వెస్టర్న్, ఇండియన్ వంటకాలపై తర్ఫీదు ఉంటుంది. బేకరీ, పేస్ట్రీ, కోల్డ్ కిచెన్ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. హోటల్ ఆపరేషన్స్ ప్రొగ్రాంలో ఫ్రంట్ ఆఫీస్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్ విభాగాల్లో ప్రత్యేకమైన శిక్షణ అందిస్తారు. ఏటా ఆగస్టులో కోర్సు మొదలవుతుంది. కోర్సులో చేరినవారికి ప్రతి నెలా స్టయిపెండ్ చెల్లిస్తారు. వసతి, భోజనం, యూనిఫారం, మెడికల్ ఇన్సూరెన్స్ ఉచితం. మూడేళ్ల కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి బ్యాచిలర్ ఆఫ్ టూరిజం స్టడీస్ డిగ్రీని ఇగ్నో ప్రధానం చేస్తుంది. ఒబెరాయ్ గ్రూప్ హోటళ్లలో ఆపరేషన్స్ అసిస్టెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఫిబ్రవరి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభ సంవత్సరం ఆగస్టు 15 నాటికి 18-20 ఏళ్లలోపు వారు అర్హులు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి. పదో తరగతి ఇంగ్లిష్‌లో 61 శాతం (హౌస్ కీపింగ్ విభాగానికి 51 శాతం) మార్కులు తప్పనిసరి.
వెబ్ లింక్‌: http://www.oberoigroup.com/careers/join_us/step.htm
ఓసీఎల్‌డీ
ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లర్నింగ్ అండ్ డెవల‌ప్‌మెంట్ (ఓసీఎల్‌డీ) ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ కోర్సు అందిస్తున్నారు. ఈ కోర్సులో గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 19-25 ఏళ్లలోపువారు అర్హులు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారిని ఎగ్జిక్యూటివ్ హొదాతో ఒబెరాయ్ హోటళ్లలో విధుల్లోకి తీసుకుంటారు. ప్రతి ఏటా జులైలో కోర్సు మొదలవుతుంది. వ్యవధి రెండేళ్లు. పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్‌ ప్రొగ్రాం ఇన్ గెస్ట్ సర్వీస్ మేనేజ్‌మెంట్‌, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్‌, కిచెన్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నారు. గెస్ట్ సర్వీస్ మేనేజ్‌మెంట్‌ కోర్సులో భాగంగా అతిథితో ముడిపడి ఉండే ఫుడ్ అండ్ బేవరేజ్, ఫ్రంట్ ఆఫీస్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారిని ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరు కొన్నాళ్లుకు ఫుడ్ అండ్ బేవరేజ్ లేదా ఫ్రంట్ ఆఫీస్ విభాగాల్లో మేనేజర్లగా రాణిస్తారు. హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరినవారు శిక్షణ అనంతరం హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ హోదాతో సేవలందిస్తారు. కొన్నాళ్లకు వీరు ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ అవుతారు. కిచెన్ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరినవాళ్లు కలినరీ ఆర్ట్స్ (పాకవిద్య)లో ప్రావీణ్యం పొందుతారు. కోర్సు అనంతరం వీరిని కిచెన్ ఎగ్జిక్యూటివ్ గా విధుల్లోకి తీసుకుంటారు. కొన్నాళ్లకు వీరు ఎగ్జిక్యూటివ్ చెఫ్ హోదాతో రాణిస్తారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో యూజీ డిగ్రీ ఉన్నవాళ్లే కిచెన్ కోర్సులో చేరడానికి అర్హులు. ఓసీఎల్డీ సేల్స్ విభాగంలోనూ పీజీ ప్రొగ్రాం అందిస్తోంది. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. వీరిని ఒబెరాయ్ గ్రూప్ సేల్స్ విభాగంలో తీసుకుంటారు. ప్రస్తుతం ఒబెరాయ్ సంస్థల్లో జనరల్ మేనేజర్ హోదాతో సేవలు అందిస్తున్నవారిలో ఎక్కువ మంది ఓసీఎల్డీలో శిక్షణ పొందినవారే.
వెబ్ లింక్‌: http://www.oberoigroup.com/careers/join_us/ocld.htm

మరికొన్ని సంస్థలు, పరీక్షలు
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం), ఔరంగాబాద్‌ ఆనర్స్‌ విధానంలో నాలుగేళ్ల బీఏ - హోటల్‌ మేనేజ్‌మెంట్‌ / కలినరీ ఆర్ట్స్‌ కోర్సులు అందిస్తోంది. ఈ సంస్థ హడర్స్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీ, యూకేతో ఒప్పందం కుదుర్చుకుంది. అభ్యర్థులు ఇండియా/ యూకే కోర్సులు ఎంచుకోవచ్చు. భారత్‌లో అందించే కోర్సులను ఎంచుకుంటే నాలుగేళ్లకూ రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది.
* ఇకొలే హోటలైర్‌, పుణెలో అంతర్జాతీయ స్థాయిలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నారు. ఇక్కడ నాలుగేళ్ల హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం, ఏడాది వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ కలినరీ ప్రోగ్రాం అందుబాటులో ఉన్నాయి.
* ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు 8 క్యాంపస్‌లున్నాయి. వీటిలో ప్రవేశానికి ఐఐహెచ్‌ఎం ఎలక్ట్రానిక్‌ కామన్‌ హాస్పిటాలిటీ అడ్మిషన్‌ టెస్టు (ఈచాట్‌) రాయాలి. యూజీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ బీహెచ్‌ఎంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (యూగాట్‌) నిర్వహిస్తోంది. దీనిద్వారా వైఎస్‌ఆర్‌ నిథమ్‌, ఎస్‌ఆర్‌ఎంతోపాటు మరికొన్ని సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

Back..

Posted on 27-12-2018