Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సంసిద్ధత.. ఆపై సాధన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో నిర్వహించిన ఎస్‌ఐ నియామక పరీక్ష ఫలితాల్లో అగ్రశ్రేణిలో నిలిచిన ఘనత ఆదిలాబాద్‌ జిల్లా తంగెళ్లపల్లికి చెందిన బుద్దేస్వామిది. ప్రతికూల పరిస్థితులకు ఎదురీది లక్ష్యం సాధించిన ఆయన దీక్ష పోటీ పరీక్షార్థులకు స్ఫూర్తిదాయకం. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలూ రాయబోయే అభ్యర్థులు విజయాన్ని ఎలా కైవసం చేసుకోవాలో ఆయన మాటల్లోనే...!
ఏ ఉద్యోగం కోసమైతే పరీక్షకు సిద్ధం అవుతున్నారో ముందుగా ఆ ఉద్యోగం సాధించటానికి మానసికంగా సిద్ధం కావాలి. ఇది చాలా ముఖ్యం. అవరోధాలు వస్తూనేవుంటాయి. వాటికి తలొగ్గితే చేరాల్సిన లక్ష్యం దూరమవుతుంది.
అర మార్కుతో నాకు ఉపాధ్యాయ ఉద్యోగం అందకుండా పోయింది. ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఈ పరిస్థితుల్లోనూ పట్టుదలగా చదవబట్టే మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం లభించింది.
మొదటి నుంచీ చదువులో ముందంజలోనే ఉన్నాను. ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌), బీఈడీ చదివి 2008లో జరిగిన డీఎస్సీలో ఉపాధ్యాయ వృత్తి కోసం పరీక్ష రాసి అర మార్కులో ఆ వృత్తిని అందుకోలేకపోయాను. తర్వాత ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి పట్టణాల్లోని జూనియర్‌ కళాశాలల్లో కొంతకాలంపాటు అధ్యాపకుడిగా పనిచేశాను. ఆర్థికంగా నిలదొక్కుకున్నా. 2007లో పెళ్ళి కూడా అయింది. తర్వాత రెండేళ్ళకు జరిగిన ఎస్సై రాత పరీక్షల్లో మొత్తం 400 మార్కులకుగాను 320 తెచ్చుకున్నాను. అలా మొదటి ర్యాంకు సొంతమయింది. ప్రస్తుతం తిర్యాణి మండలంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాను.
పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన విషయాలు...
* నిర్దేశించిన సిలబస్‌ను వివరంగా పరిశీలించాలి. ఒక్కో సబ్జెక్టుకు ఎన్ని మార్కులు కేటాయించారో స్పష్టంగా తెలుసుకోవాలి.
* సమగ్రంగా మెటీరియల్‌ సమకూర్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. తెలుగు అకాడమీ పుస్తకాలనే ఎక్కువగా చదవాలి. దినపత్రికలను ప్రతిరోజూ చదువుతూ అవసరమైన అంశాలను రాసుకోవటం ప్రయోజనకరం.
* ఏ సబ్జెక్టు మీద ఎక్కువ పట్టుఉందో దాన్ని మరింత చదివి పూర్తిస్థాయి పట్టు సాధించాలి. మిగిలిన సబ్జెక్టుల మీద దృష్టిసారించి ఎక్కువగా చదవాలి.
* పరీక్షకు కనీసం 10 రోజుల ముందు చదివిన అన్ని సబ్జెక్టులనూ పునశ్చరణ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతవరకూ చదవని కొత్త అంశాల మీద ఆ తరుణంలో సమయం వెచ్చించకూడదు. అలా చేయడం వల్ల ఉపయోగం లేకపోగా.. అంతవరకూ చదివిన పాఠ్యాంశాల పరిజ్ఞానం ఎంతోకొంత దెబ్బతినే ప్రమాదం ఉంది.
* పోటీపరీక్షలు రాసే అభ్యర్థులతో వివిధ అంశాలపై బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌) చేయటం ఉపయోగకరం. ఈ సందర్భంగా అనవసర విషయాలకు సమయం వృథా అవకుండా మాత్రం జాగ్రత్తపడాలి.
* పోటీ పరీక్షల అభ్యర్థులు ఒంటరిగా సిద్ధమవటం వల్ల ప్రయోజనం తక్కువనే చెప్పాలి.
* వివిధ అధ్యయనాంశాలను అవగాహన చేసుకోకుండా యాంత్రికంగా బట్టీ పట్టే పద్ధతి ఏ సందర్భంలోనూ మంచిది కాదు.
* ‘మిగతావాళ్ళు నాకంటే ఎక్కువగా చదువుతున్నారు’ అనే అభద్రతాభావం పెంచుకోకూడదు.
* కోచింగ్‌ కేంద్రాలవారు నిర్వహించే నమూనా పరీక్షలు ఎక్కువ రాయాలి. ప్రతి పరీక్షలో సాధించిన ప్రగతిని అంచనా వేసుకుంటూ తక్కువ మార్కులు వస్తున్న సబ్జెక్టుల మీద ఎక్కువ శ్రద్ధ కనబరచాలి.
* ఎంత సాధన చేస్తే అంత మంచిది. పోటీపరీక్షల్లో ఉండే అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ టెస్టుల కోసం ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.

Back..

Posted on 12-04-2016