Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆంగ్లంపై పట్టు ..జీవితానికి మెట్టు!

* తెవివి ఆధ్వర్యంలో ఇంగ్లిష్‌ క్లబ్‌ పేరిట వినూత్న కార్యక్రమం
న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌ (డిచ్‌పల్లి): పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రావీణ్యం తప్పని సరైంది. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంత ముఖ్యమో ఆంగ్ల భాష విజ్ఞానం అంతకంటే అవసరం. ఆంగ్ల భాషపై పట్టు ఉంటే ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా బతక వచ్చు.. భాషపై పరిజ్ఞానం లేకుంటే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గడం అసాధ్యం. అందుకే రోజు రోజుకు భాష ప్రాధాన్యం, ప్రాముఖ్యత పెరుగుతోంది. సర్కారు కూడా ఆంగ్ల భాషాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ భాషపై పూర్తి పట్టు ఉండటం లేదు. ఐఐటీ, ఇంజినీరింగ్‌ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులు చాలా మంది ఆంగ్లంలో ఫెయిల్‌ అవుతున్నారని గతంలో ఓ సర్వేలో వెల్లడైంది. ఈ క్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగం ‘ఇంగ్లిష్‌ క్లబ్‌’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో విద్యార్థులకు ఆంగ్ల బోధనకు ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టిన తొలి విశ్వవిద్యాలయంగా నిలుస్తోంది.
గ్రామీణ నేపథ్యమే అధికం
విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న వారు అధిక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే. వీరిలో దాదాపు అందరు తెలుగు మాధ్యమంలో చదివిన వారే. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఆంగ్ల మాధ్యమం కావడంతో విద్యార్థులు చాలా సతమతం అవుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను ఆంగ్ల విభాగం గుర్తించింది. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల భాషను మరింత చేరువ చేసి.. మక్కువతో నేర్చుకునేలా గత నవంబరు మాసంలో ‘ఇంగ్లీష్‌ క్లబ్‌’కు అంకురార్పన చేశారు. విద్యార్థుల భవితవ్యానికి తొలి మెట్టును నిర్మించారు. తొలి విడతగా వర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో పది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడమే కాదు..వాళ్ల జీవితాన్ని నిర్మించుకోవడానికి ఎలా దోహదపడుతుందో చెప్పగలిగారు..!
ఇంగ్లిష్‌ క్లబ్‌ లక్ష్యం.!
విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల విద్యార్థులకు ఆంగ్ల భాషపై పూర్తిస్తాయి పరిజ్ఞానం కల్పించడమే ధ్యేయంగా ఇంగ్లీష్‌ క్లబ్‌ లక్ష్యాన్ని పెట్టుకుంది. క్లబ్‌ ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషను సులభ పద్ధతిలో మాట్లాడంపై అవగాహన కల్పిస్తోంది. అన్ని విభాగాల విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా, రోజు వారి తరగతులకు ఇబ్బంది లేకుండా వారంలో ఒక రోజు సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు శిక్షణ ఇవ్వడం ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఆంగ్లంలో నిపుణులైన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి ఆచార్యులను పిలిపించి అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.
క్లబ్‌లో ఏముంటుంది..!
ఆంగ్లంలో సాధారణంగా బోధించే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆక్టీవిటీ బేస్‌డ్‌, విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేలా బోధిస్తున్నారు. ఛాయచిత్రాలు, ఆడియో క్యాసెట్‌, పత్రికలు ద్వారా, రకరకాల ఆటల ద్వారా భాషను నేర్పడం ప్రధానంగా సాగిస్తున్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు భాష పట్ల ఆసక్తి కలిగించడంతో భాషను నేర్చుకోవడం సులభం అవుతోంది. ప్రతిష్ఠాత్మకంగా ఇటీవల అమెరికాలోని చికాగో యూనివర్సిటీ అవగాహన ఒప్పందానికి ఎంపికైన వారికి వరంలా మారుతుంది. తద్వారా విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ముంబాయిలోనూ విద్యా సంస్థతో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ విద్యా సంస్థలతో అనుసంధానం చేసే దిశగా అడుగులు వేస్తోంది..ఈనేపథ్యంలో విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు పెంచుతోంది.
భవిష్యత్తు ప్రణాళిక ఇలా...!
ఆంగ్ల క్లబ్‌లో వారానికి ఒక రోజు నిర్వహిస్తున్న తరగతులను వారంలో రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం లాంగ్వేజ్‌ ల్యాబ్‌ అందుబాటులో ఉంది. మునుముందు హెడ్‌ ఫోన్స్‌, కాలర్‌ మైక్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి ఈ మద్యనే అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేశారు. ప్రధానంగా విద్యార్థులకు బోధించడం కాకుండా వారితోనే బోధన, మాట్లాడించడం తప్పనిసరి చేసి భాషను ఎలా వ్యక్తీకరించాలో సవరణలు చేయడానికి ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నారు.
ఆంగ్ల భాషపై పరిజ్ఞానం ముఖ్యం -డా. కె. రమణాచారి, ఆంగ్ల విభాగాధిపతి
ప్రస్తుత కాలంలో ఆంగ్ల భాష పరిజ్ఞానం ఎంతో అవసరం. ఈ భాష పరిజ్ఞానాన్ని కేవలం బోధించడం ద్వారానే కాకుండా ఆక్టీవిటీ బేస్‌డ్‌గా శిక్షణ ఇస్తే సత్ఫలితాలుంటాయి. విశ్వవిద్యాలయంలో దాదాపు గ్రామీణ ప్రాంత విద్యార్థులే అధికంగా ఉన్నారు. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌ క్లబ్‌ ప్రారంభించాం. భవిష్యత్తులో క్లబ్‌ లక్ష్యాలను మరింత విద్యార్థులకు చేరువ చేస్తాం.
నిత్య జీవితంలో ఉపయోగపడే భాషను నేర్పిస్తున్నాం. -డా. సమత, ఆంగ్ల విభాగం బీవోఎస్‌
విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానం అత్యంత కీలకం. విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల విద్యార్థులకు అన్ని రకాల పోటీ పరీక్షలతో పాటు నిత్య జీవితంలో ఉపయోగపడే భాష పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ క్లబ్‌ను ప్రారంభించాం. రాబోవు రోజుల్లో ఈ క్లబ్‌ పనితీరును ఇంకా అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాం
స్టేజ్‌ ఫియర్‌ తొలగింది. -ఎం. అక్షర, ఆంగ్లం ప్రథమ ఏడాది
ఇంగ్లిష్‌ క్లబ్‌ ద్వారా నా స్టేజ్‌ ఫియర్‌ తొలగించుకున్నాను. నాకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో చాలా అవసరం అయింది. వొకాబులరీ, గ్రామర్‌పై ఒక పట్టు వచ్చింది. ఆచార్యులతో స్టూడెంట్స్‌ ఇంట్రాక్షన్‌ బాగుంటుంది. ఈ ఇంగ్లిష్‌ క్లబ్‌ ద్వారా కేవలం ఆ విభాగం విద్యార్థులకే కాకుండా అన్ని విభాగాల వారికి అవకాశం దొరికింది. ఈ క్లబ్‌ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఆంగ్లంపై భయం పోయింది. -వి. క్రిష్ణారావు విద్యార్థి
ఇంగ్లిష్‌ క్లబ్‌తో స్పీకింగ్‌ స్కిల్స్‌ పెంపొందించుకున్నాం. ఈ క్లబ్‌ ప్రారంభించడంతో కళాశాల విద్యార్థులకు ఆంగ్ల భాష మీద ఉన్న భయం పోయింది. ధైర్యంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం. గ్రూప్‌ డిస్కస్‌ స్కిల్స్‌ పెంపొందుతున్నాయి. ఉద్యోగ అవకాశాలకు ఇది మంచి అవకాశం. భాష పదాల పట్టు పెరిగింది. సాఫ్ట్‌ స్కిల్స్‌ అభివృద్ధి చేసుకుంటున్నాం
అనర్గళంగా మాట్లాడం నేర్పిస్తున్నారు. -పి. అంబయ్య, ఆంగ్లం ప్రథమ ఏడాది
ఇంగ్లిష్‌ క్లబ్‌ ఎంతో ఉపయోగంగా ఉంది. ఇంగ్లిష్‌ భాషను అనర్గళంగా మాట్లాడం నేర్పిస్తున్నారు. అనేక పోటీ పరీక్షల ఉద్యోగాల్లో నిర్వహించే ఇంటర్వ్యూ కొరకు ఈ స్కిల్స్‌ ఉపయోగపడతాయి. ఇందులో అన్ని విభాగాల విద్యార్థులకు అవకాశం ఉంది. ఇది అదృష్టంంగా భావిస్తున్నాను. ఇంగ్లీష్‌ భాషపై అవగాహన ఏర్పడుతోంది.
భాషపై పట్టు సాధిస్తున్నాం. -కె. రమణ, విద్యార్థి
ఇంగ్లిష్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి భాషపై పట్టు పెంపొందిస్తున్నారు. దీంతో భాషపై ఉన్న భయం పోయింది. ధైర్యంగా ఆంగ్లంను నేర్చుకోవాలనే ఆసక్తి, అభిరుచి పెరుగుతోంది. ఇది మంచి అవకాశం. కేవలం ఇంగ్లిష్‌ నేర్పించడమే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. భాషను సులువుగా నేర్పిస్తున్నారు.

Posted on 21-12-.2015