Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
శిక్షణకు ముందు... సర్టిఫికెట్‌ కోర్సులు

సీఏ విద్యార్థులు ప్రాక్టికల్‌ శిక్షణ మొదలు కాకముందు రెండు సర్టిఫికెట్‌ కోర్సులను కచ్చితంగా పూర్తిచేయాలనేది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిబంధన. ఈ కోర్సుల ప్రాముఖ్యం ఏమిటి? వీటిలో నెగ్గేదెలా?
వ్యాపార రంగంలో జరిగే మార్పుల కారణంగా ఆర్థిక రంగ వృత్తినిపుణులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ట్రెయినింగ్‌ కోర్స్‌, ఓరియెంటేషన్‌ కోర్సులను ఐసీఏఐ శాఖల్లో నిర్వహిస్తారు.
సీపీటీ పూర్తయిన తర్వాత ఐపీసీసీలో చేరే విద్యార్థులు ప్రాక్టికల్‌ శిక్షణకు ముందే ఈ కోర్సులు పూర్తిచేయాలి. సీఏ ఐపీసీసీలో రిజిస్టర్‌ చేయించుకుంటే ఈ రెండు కోర్సులకూ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లే.
నేరుగా ప్రవేశించే (డైరెక్ట్‌ ఎంట్రీ) పథకం ద్వారా సీఏ ఐపీసీసీలో అడుగుపెట్టే విద్యార్థులు డిగ్రీ ఫైనల్‌ సంవత్సరంలో సీఏ ఐపీసీసీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. అటువంటి విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత ప్రాక్టికల్‌ శిక్షణ మొదలు కాకముందు ఈ రెండు కోర్సులూ పూర్తి చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఫైనలియర్‌లోనే ఇవి పూర్తి చేసుకునే వీలుంది.
ఈ సర్టిఫికేషన్‌ కోర్సుల వల్ల విద్యార్థులు కొత్త నైపుణ్యం పెంపొందించుకోవటమే కాకుండా ప్రపంచస్థాయి అకౌంటింగ్‌ కోర్సులకు సరిసమానంగా సీఏ కోర్సు మారిందని చెప్పవచ్చు.
చేయదల్చిన కోర్సు, కోరుకున్న సమయం వివరాలతో www.icaionlineregistration.org లో విద్యార్థులు పేరు నమోదు చేసుకోవాలి.

ఐటీ ట్రెయినింగ్‌ కోర్సు (ఐటీటీ)
దీనికి నిర్దేశించిన సమయం 100 గంటలు. విద్యార్థి రూ.4,000 ఫీజుగా చెల్లించాలి. ఈ కోర్సును 25 రోజుల్లో రోజుకు 4 గంటల చొప్పున పూర్తిచేయాలి. ప్రతి బ్యాచ్‌లో 45 మంది విద్యార్థులకు మించి ఉండరు.
కోర్సు లక్ష్యాలు: 1) సీఏ విద్యార్థులకు సాంకేతిక అంశాలపై పట్టు పెంపొందించటం 2) శిక్షణకు అవసరమైన కంప్యూటర్‌ పరిజ్ఞానం తరగతిలో నేర్పించటం 3) సీఏలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేయటం 4) ప్రాజెక్టు వర్క్‌ ద్వారా విశ్లేషణ ధోరణి అలవాటు చేయడం.
సిలబస్‌ వివరాలు: కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, డేటాబేస్‌, అకౌంటింగ్‌ ప్యాకేజి, వెబ్‌ సాంకేతికత, ఈ-ఫైలింగ్‌, ప్రాజెక్ట్‌వర్క్‌ వంటి అంశాలతో 11 టాపిక్స్‌గా విభజించారు.
పరీక్ష విధానం: ఐటీటీ సర్టిఫికేషన్‌ విధానం మూడు స్థాయుల్లో ఉంటుంది.
ఎ) మాడ్యూల్‌ పరీక్ష (వెయిటేజి 20 శాతం): సిలబస్‌లో ఉన్న అంశాలపై రెండు పరీక్షలు నిర్వహిస్తారు. 11 అంశాల్లో మొదటి ఐదు అంశాలపై ఒక పరీక్ష, 6 నుంచి 11 అంశాలపై రెండో పరీక్ష. ఉత్తీర్ణతకు కనీసం 50 శాతం రావాలి. ఒక్కో పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ప్రతి పరీక్షా 1 గంట వ్యవధితో జరుగుతుంది.
బి) ప్రాజెక్టు వర్క్‌: (వెయిటేజి 20 శాతం): శిక్షణలో నేర్చుకున్న ఒక అంశంపై సొంతంగా ఒక్క ప్రాజెక్టు 20-25 పేజీల్లో తయారుచేసుకుని ప్రెజెంట్‌ చేయాలి. ప్రాజెక్టు నివేదిక తయారుచేయాలి. నివేదికకు 70 శాతం, ప్రెజెంటేషన్‌కు 30 శాతం కేటాయించారు.
సి) ఫైనల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష (వెయిటేజి 60 శాతం): ఈ చివరి పరీక్ష రాయాలంటే 90 శాతం హాజరు తప్పనిసరి. గత రెండు పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు రావాలి. 300 మార్కులకు పరీక్ష. 200 ప్రశ్నలు అడుగుతారు. సమయం 3 గంటలు. కనీస ఉత్తీర్ణత 50 శాతం మార్కులు
ఉత్తీర్ణత, సర్టిఫికెట్‌: పైన చెప్పిన మూడు పరీక్షల్లో కలిపి అగ్రిగేట్‌లో 60 శాతం మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. ఇలాంటివారికి ఐసీఏఐ శాఖ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది.

ఓరియెంటేషన్‌ కోర్సు
ఈ కోర్సుకు నిర్దేశించిన సమయం 90 గంటలు. గతంలో 35 గంటలు ఉండే సమయం ఇటీవల 90 గంటలకు పెంచారు. 15 రోజుల్లో రోజుకు 6 గంటల చొప్పున నిర్వహిస్తారు. ఫీజు రూ.7,000ను విద్యార్థి చెల్లించాల్సివుంటుంది.
కోర్సు లక్ష్యాలు: 1) పరిపూర్ణ అకౌంటింగ్‌ వృత్తినిపుణులుగా విద్యార్థులు తయారవటానికి ప్రోత్సహించటం 2) భావవ్యక్తీకరణ, ప్రదర్శన నైపుణ్యం పెంపొందించటం 3) ప్రాక్టికల్‌ శిక్షణ ప్రాముఖ్యం తెలియజేయటం 4) నేటితరం అకౌంటింగ్‌ వృత్తినిపుణులుగా తయారుకావటానికి విద్యార్థుల్లో చిత్తశుద్ధి, పారదర్శకత, స్వాతంత్య్ర లక్షణాలు పెంపొందించటం
సిలబస్‌ వివరాలు: ఐసీఏఐ చరిత్ర వివరణ, బహిరంగ ప్రసంగం, సమయ నిర్వహణ, విలువలు, నైతికత, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, భావ వ్యక్తీకరణ, ఉచ్చారణ, పఠన నైపుణ్యం, బృంద చర్చలు, కార్యాలయ పద్ధతులు, మర్యాదలు, వ్యాపార వాతావరణం, ప్రాక్టికల్‌ శిక్షణలో నేర్చుకోవాల్సిన విషయాలు.
బోధన పద్ధతులు: ఉపన్యాసాలు, ప్రెజెంటేషన్లు, బృంద చర్చలు, కేస్‌ స్టడీస్‌, ప్రాజెక్టు వర్క్‌ వంటివి. ఎటువంటి పరీక్షా ఉండదు. నిర్దేశించిన 15 రోజుల్లో రెండుకు మించి గైర్హాజరులు లేకపోతే ఓరియెంటేషన్‌ కోర్సు పూర్తయిన సర్టిఫికెట్‌ ఇస్తారు.

సులువుగా పూర్తవాలంటే...
* విద్యార్థులు జాగ్రత్తగా తమ స్లాటును ముందుగా బుక్‌ చేసుకోవాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.
* తరగతి సెషన్లను జాగ్రత్తగా అర్థం చేసుకుని, ప్రతి అనుమానాన్నీ నివృత్తి చేసుకోవాలి.
* కంప్యూటర్‌లో ఆచరణాత్మకంగా చేయాల్సిన విషయాలన్నిటినీ సునిశిత పరిశీలనతో నేర్చుకోవాలి.
* ఈ కోర్సుల్లోని అంశాలు, నైపుణ్యాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి.
* హాజరు నూరు శాతం ఉండేలాగా జాగ్రత్తపడితే సర్టిఫికెట్‌తో పాటు జీవితంలో స్థిరపడటానికి అవసరమైన నైపుణ్యాలు సంపాదించవచ్చన్న వైఖరితో ఉండాలి.
* ఈ తరగతుల్లో కొత్త స్నేహితులు ఏర్పడతారు. దీనివల్ల నెట్‌వర్కింగ్‌ నైపుణ్యం పెరుగుతుంది.
ఈ రెండు కోర్సులూ సీఏ విద్యార్థులకు కొత్త నైపుణ్యంతోపాటు కొత్త ఆలోచనలను అందిస్తాయి. ఉత్సాహంతో నింపుతాయి. పరిపూర్ణ సీఏగా స్థిరపడటానికి దోహదపడతాయి. వీటిని నూరు శాతం ఉపయోగించుకోవటం విద్యార్థుల కర్తవ్యం.

Back..

Posted on 20-12-2016