Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అగ్రి బిజినెస్‌ నైపుణ్యాలకో కోర్సు

వ్యవసాయం అంటే పొలంలో పని. వ్యవసాయ డిగ్రీ పూర్తిచేస్తే గ్రామాల్లో వ్యవసాయాధికారి ఉద్యోగం... ఇంతే కదా అనుకుంటున్నారా. అక్కడితో అయిపోలేదు. వ్యవసాయం, దాని అనుబంధ కోర్సుల్లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి జాతీయస్థాయి గుర్తింపున్న పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రికల్చర్‌) కోర్సు అందుబాటులో ఉంది. వ్యవసాయంలో అద్భుతాలు చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య విలువలు జోడించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఉపాధి అవకాశాలకు ఢోకాలేని ఈ పీజీడీఎంఏలో ప్రవేశానికి ప్రసిద్ధ సంస్థ నుంచి ప్రకటన వెలువడింది. ఆ వివరాలు తెలుసుకుందాం...
ఎక్కడ: ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ అకాడమీ’ (నార్మ్‌) హైదరాబాద్‌
ఎవరికోసం: అగ్రికల్చర్‌, అనుబంధ కోర్సుల్లో గ్రాడ్యుయేట్లకు
ఏమిటా కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రికల్చర్‌)
ఎంపిక ఎలా: క్యాట్‌ లేదా సీమ్యాట్‌ స్కోర్‌కు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌కు 25, మౌఖిక పరీక్షకు 20, ప్రెసీ రైటింగ్‌కు 15, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌కు మరో 10 మార్కులు ఇస్తారు. వీటన్నింటిని కలిపి మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఎన్ని సీట్లు: 30
కోర్సు వ్యవధి: రెండేళ్లు
ప్రయోజనం ఏమిటి: వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య విలువను పెంచడమెలాగో నేర్పుతారు. దీంతో వ్యవసాయ వాణిజ్య వేత్తలగా మారవచ్చు లేదా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం పొందవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28
వెబ్‌సైట్‌: https://naarm.org.in/pgdma/

ఎందుకు చేరాలి?
మనదేశంలో ఇప్పటికీ 60 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పండిన పంటలకే కాకుండా పంటల సాగుకు అవసరమైన సామగ్రి, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీటి పరికరాలు ఇలా అనేక పరిశ్రమలకు నైపుణ్యమున్న మానవ వనరుల కొరత బాగా ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సులున్నాయి గానీ, వ్యవసాయ వాణిజ్య, వ్యవసాయ రంగంలో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ పెంచే కోర్సులు పెద్దగా లేవు. అగ్రి బిజినెస్‌ అంటే రైతులు పండించే పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి లాభాలార్జించడం. దీనివల్ల ఆయా పరిశ్రమలు పెట్టిన వారికే కాకుండా ఆ పంటలు పండించే రైతులకు కూడా మంచి ధరలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ తెలివితేటలు నేర్పడానికే పీజీడీఎంఏ కోర్సు ఉపయోగపడుతుంది. వ్యవసాయ డిగ్రీ చేసిన విద్యార్థిని పెద్ద కంపెనీలో పనిచేసే ఉన్నత ఉద్యోగిగా లేదా అగ్రి బిజినెస్‌ చేసే వ్యాపారవేత్తలా మార్చే నైపుణ్యం కల్పించడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. దేశం నలుమూలల నుంచి ఏటా ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.
కోర్సు పూర్తవడానికి 6 నెలల ముందు నుంచే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు మొదలవుతాయి. 2017లో ఈ కోర్సులో చేరిన వారికి వచ్చే మే నెలతో రెండేళ్ల కోర్సు పూర్తవుతోంది. వీరిని ఇప్పటికే టీసీఎస్‌, ఐటీసీ, ర్యాలీస్‌ ఇండియా, మహీంద్ర రైస్‌, టఫే, రాశి, నాగార్జున, నెటాఫిం, ఈఫ్రెష్‌, భారత్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ వంటి కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా చేర్చుకున్నాయి. మేలో కోర్సు పూర్తవగానే ఉద్యోగంలో వచ్చి చేరండని ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయి. గరిష్ఠంగా రూ.10 లక్షల వరకూ తొలి ఏడాది వేతనాన్ని ఇవ్వడానికి చాలా కంపెనీలు ముందుకొచ్చాయి.
ప్రాంగణ నియామకాల ద్వారా ఏదైనా ప్రముఖ కంపెనీలో చేరి 2, 3 ఏళ్లు జాబ్‌ చేస్తే ఆ అనుభవంతో సొంతంగా కంపెనీలు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిందు, తుంపర్ల సేద్యం విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ పరికరాల తయారీ పరిశ్రమలకు డిమాండు ఉంది. వీటి తయారీ కంపెనీలో ఉద్యోగంలో చేరారనుకోండి. నీటి వినియోగంపై పరిశోధన, నిర్వహణ బాగా చేయగలరు. మేనేజ్‌మెంట్‌, వ్యాపార నైపుణ్యం వీరికి ఉంటుంది. ఆ తరవాత లభించే అనుభవంతో రైతులకు ఇంకా సులభంగా ఈ పరికరాలు అందించే సంస్థనే సొంతంగా ప్రారంభించి వ్యాపారవేత్తలా ఎదగవచ్చు. ఇలాంటి స్థైర్యాన్ని ఈ కోర్సు ఇస్తుంది.

ఇతర రాష్ట్రాల నుంచీ..
హైదరాబాద్‌లోనే నార్మ్‌ క్యాంపస్‌ ఉన్నా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ కోర్సులో పెద్దగా చేరడంలేదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వారు ఎక్కువగా ఈ కోర్సులో చేరుతున్నారు. యూపీ, బిహార్‌ వంటి సుదూర రాష్ట్రాల వారూ వస్తున్నారు. తెలుగు విద్యార్థుల్లో వ్యవసాయ డిగ్రీ కాగానే ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలని ఎదురుచూసేవారు ఎక్కువగా ఉంటున్నారు. వాస్తవానికి తెలంగాణకు చెందిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలోనే నార్మ్‌ క్యాంపస్‌ కూడా ఉంది. అక్కడే తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కూడా ఉంది. రాష్ట్ర విభజనకు ముందే ఇదే క్యాంపస్‌లో ఉమ్మడి ఏపీకి చెందిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అయినా ఇక్కడ వ్యవసాయ డిగ్రీలు చదివిన తెలుగు విద్యార్థులు ఈ పీజీడీఎంఏలో పెద్దగా చేరడం లేదు. ఈ కోర్సులో చేరాలంటే జాతీయస్థాయి పరీక్షల ద్వారా పోటీ పడాల్సి రావడం కూడా ఇందుకొక కారణం. నార్మ్‌ కోర్సు ద్వారా లభించే ఉద్యోగాలు, మెరుగైన వేతనాలపై అవగాహన అంతగా లేకపోవడం మరో కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ కాలేజీలకు వెళ్లి ఈ కోర్సుపై అవగాహన పెంచటానికి నార్మ్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల బాపట్ల వ్యవసాయ కాలేజీలో దీన్ని నిర్వహించింది.
- మంగమూరి శ్రీనివాస్‌, ఈనాడు, హైదరాబాద్‌

ప్రాజెక్టుల ద్వారా అనుభవం
వ్యవసాయంలో అద్భుతాలు ఎలా చేయాలో పీజీడీఎంఏ కోర్సు చెపుతుంది. పంటలు ఎలా పండించాలనే సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఏజీ బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులో చదువుతారు. కానీ పంటలు పండాక వాటి నిర్వహణ, వ్యవసాయాన్ని వాణిజ్యంగా ఎలా మార్చాలనేది ఈ కోర్సులో నేర్పుతాం. అగ్రి బిజినెస్‌ ఓరియేంటేషన్‌ ఎక్కువ. పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, విక్రయాలు, వ్యాపారం పెంపుపై శిక్షణ, అవగాహన తరగతులుంటాయి. కోర్సులో భాగంగా ప్రతి విద్యార్థికీ శీతాకాలం, వేసవి కాలాల్లో వేర్వేరు ప్రాజెక్టులుంటాయి. వీటిలో భాగంగా విద్యార్థులు పెద్ద కంపెనీలకు వెళ్లి అక్కడ పనిచేసి నైపుణ్యం పొందుతారు. కంపెనీల నిర్వహణలో లోపాలను గుర్తించి, నివారణకు ప్రాజెక్టులు తయారుచేస్తారు. దీనివల్ల నేరుగా వ్యవసాయ వాణిజ్యంపై అవగాహన ఏర్పడుతుంది. నాణ్యమైన ఉత్పత్తులు ఎలా పెంచాలి, లాభాలు ఎలా ఆర్జించాలి అనే కోణంలో ఆలోచిస్తూ చదువుకోవడం వల్ల వీరు భ¡విష్యత్తులో వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా ఎదగడానికి అవకాశముంటుంది.
- సీహెచ్‌, శ్రీనివాసరావు, డైరక్టర్‌, నార్మ్‌, రాజేంద్రనగర్‌


Back..

Posted on 05-02-2019