Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కష్టమన్నారు... ఫస్టొచ్చా!

     ''ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే జయం మనవెంటే. అది నా విషయంలో నిజమైంది'' అంటోంది దేవినేని తులజా భవాని. 2013 ఐసీడబ్ల్యూఏ కొత్త సిలబస్‌లో దేశవ్యాప్తంగా మూడో ర్యాంకు, మహిళా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన ఆమె తన ప్రయాణాన్ని ఇలా చెబుతోంది.
మాది గుంటూరు జిల్లా తెనాలి. నాన్న స్థిరాస్తి రంగంలో ఉన్నారు. నాకు పదేళ్ల వయసున్నప్పుడు ఓ కారు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అమ్మ గృహిణి. వాళ్లకి నేనొక్కదాన్నే కూతుర్ని. ఊహ తెలిసేప్పటికి నాన్న దూరమవడంతో అమ్మ అన్నీ తానై పెంచింది. మొదట్నుంచీ చదువు ప్రాధాన్యతను చెప్పేది. ఏం చేసినా మనదైన ముద్ర ఉండాలని ఉదాహరణలతో సహా వివరించేది. అలాని ఏ రోజూ 'ఇది చదువు, అది చదువు' అంటూ ఒత్తిడి చేయలేదు. నేను మొదట్నుంచీ డాక్టర్‌ని కావాలనుకున్నా. పదోతరగతికి వచ్చేప్పటికి మా కుటుంబంలో ఆ వృత్తిని స్వీకరించిన వారి సంఖ్య పెరిగింది. పైగా ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని కూర్చోవడం కూడా కష్టం అనిపించింది. దాంతో పదోతరగతి పూర్తయ్యాక నాకు ఆ రంగంలోకి వెళ్లాలనిపించలేదు. చాలామంది స్నేహితులకి ఇంజినీరింగ్‌ క్రేజ్‌. నేను దాన్నీ వద్దనుకుని, అందరికంటే భిన్నమైన దారిలో నడవాలనుకున్నా. ఎంఈసీ తీసుకుంటానన్నా. అందరూ డాక్టర్‌లూ, ఇంజినీర్లూ అవుతానంటే నువ్వేంటి ఇలా అని చాలామంది ప్రశ్నించారు. 'ఆ కోర్సు చదవడానికీ, పూర్తి చేయడానికీ చాలా కాలం పడుతుంది' అన్నారు. నేను మాత్రం సీఏ చేయడానికే మొగ్గు చూపా. ఇంటర్‌లో 966 మార్కులతో ఉమ్మడి రాష్ట్రంలో ఎంఈసీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాను. ఆ తరవాత సీఏ సీపీటీ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి అదే కాలేజీలో సీఏ పూర్తి చేశా.
ఇప్పుడు ఐసీఎమ్‌ఏ...
సీఏ పూర్తయ్యాక ఐసీడబ్ల్యూఏ చేయాలన్న నిర్ణయం సీఏ చేయాలనుకున్నప్పుడే తీసుకున్నా. ఐసీడబ్ల్యూఏగా ఉన్న ఈ కోర్సుని ఇప్పుడు ఐసీఎమ్‌ఏగా వ్యవహరిస్తున్నారు. రెండు వేర్వేరు కోర్సులు, ఒక్కోటి నాలుగేళ్ల పాటు చదవాలి. పరీక్షలు మాత్రం వేర్వేరు నెలల్లో జరుగుతాయి. సీఏ పరీక్షలు మేలో, ఐసీడబ్ల్యూఏవి డిసెంబర్‌లో జరుగుతాయి. చాలావరకూ కామన్‌గా ఉండే సబ్జెక్ట్‌లు అయినప్పటికీ నాలుగు కొత్త సబ్జెక్టుల కోసం చాలా కష్టపడాలి. చాలామంది ఒక్క సీఏ పూర్తి చేయడమే కష్టం అనుకుంటారు. కానీ రెండూ చేస్తే అన్ని అంశాల మీదా పట్టు వస్తుందని నా నమ్మకం. అందుకే సీఏ చదువుతూనే ఐసీడబ్ల్యూఏకి కూడా చదవడం ప్రారంభించా. రోజులో ఎనిమిది గంటల పాటు చదివేదాన్ని. నిజానికి గంటలు గంటలు చదవడం కంటే తరగతికి వెళ్లినప్పుడు, చెప్పే అంశం మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి వినేదాన్ని. ఏ రోజు సిలబస్‌ ఆ రోజే పూర్తి చేసేదాన్ని. కాలేజీకి డుమ్మా కొట్టిన రోజులూ తక్కువే. ఇంత చేసినా సీఏ ఫైనల్‌ పరీక్షలు రాసే సమయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. ఒకసారి రాత్రంతా కూర్చుని చదవడం వల్ల మర్నాడు కళ్లు తిరిగి పడిపోయా. ఇటువైపు వచ్చి తప్పు చేశానా అనిపించింది. అలాగని కష్టమని వెనుతిరిగితే నా ప్రత్యేకత ఏముంది! అందుకే ఎంత కష్టమైనా చదవాల్సిందే అని నిర్ణయించుకున్నా. పరీక్షలు రాశా. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేదాన్ని. సీఏ ఫైనల్‌ను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేశా. ఇక మిగిలిందల్లా ఐసీడబ్ల్యూనే. ఈలోగా నాకు పెళ్లయింది. మా వారూ చదువుకోమని ప్రోత్సహించారు. పెళ్లయిన నెలరోజులకే ఐసీడబ్ల్యూఏ పరీక్షలు రాయాలి. నేను ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా మా వారు వెన్నుతట్టి ప్రోత్సహించారు. అప్పుడు సీఏలో కామన్‌గా ఉండే సబ్జెక్ట్‌లు వదిలిపెట్టి కొత్తగా చదవాల్సిన అంశాలపై దృష్టిపెట్టా. ఎప్పటికప్పుడు చదివి వదిలేయడమే కాకుండా పునశ్చరణ చేసుకునేదాన్ని. దాంతో మంచి మార్కులొస్తాయన్న నమ్మకం కలిగింది. ఐసీడబ్ల్యూఏ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మూడో స్థానం, అమ్మాయిల్లో మొదటిస్థానం సాధించినందుకు ఆనందంగా ఉంది. త్వరలో జరిగే స్నాతకోత్సవ సందర్భంగా సీఎమ్‌ఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజిమెంట్‌ అకౌంటెన్సీ) నుంచి నేను నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నా.

posted on 27.1.2015