Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంజినీరింగ్‌ సర్వీసులకు సిద్ధమేనా?

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉజ్వల భవితను అందించే పోటీ పరీక్షల్లో ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌కు ఎంతో ప్రాధాన్యముంది. యూపీఎస్‌సీ ఈ పరీక్ష విధానంలో కొన్ని మార్పులను చేసింది. సిలబస్‌, పరీక్ష విధానం, మార్కులు, కాలవ్యవధిలో జరిగిన మార్పులను శ్రద్ధగా గమనించి అభ్యర్థులు ఈ పరీక్షకు సంసిద్ధం కావాలి!
జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు వంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీకి ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది.
ఇండియన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగ్‌, నావల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికాం, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో దీని ద్వారా నియామకాలు జరుగుతాయి.
సమాజంలో మంచి గౌరవం, అత్యున్నత స్థాయికి చేరుకునే క్రమం తప్పని పదోన్నతులు, ఉద్యోగ భద్రత ఉంటాయి. ఏడో పే కమీషన్‌తో మొదటి నెలజీతం రూ.70 వేల నుంచి రూ. 75వేల వరకు ఉండే అవకాశముంది.

నోటిఫికేషన్‌ వివరాలు
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ)- 2017 ప్రకటన ప్రకారం..
దరఖాస్తు ప్రక్రియ
* అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్‌లో www.upsconline.nic.in వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే పూరించాలి.
* అర్హత గల అభ్యర్థులకు ఈ- అడ్మిషన్‌ సర్టిఫికెట్‌ను పరీక్షకు మూడు వారాల ముందు జారీచేస్తారు. దీనిని యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పోస్టు ద్వారా పంపరు.
* నమోదు చేసేటపుడు వాడుకలో, చెల్లుబాటులో ఉన్న ఈ-మెయిల్‌ ఐడీని మాత్రమే పొందుపరచాలి.
* అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నపుడు పరీక్ష కేంద్రాన్ని, ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశం లేదు.
* దరఖాస్తు ఫారం హార్డ్‌కాపీని/ ప్రింటవుట్‌ను యూపీఎస్‌సీ కమీషన్‌కు పంపాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ ద్వారా రుసుము చెల్లింపు: డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ- 03.11.2016 (సాయంత్రం 6 గంటల వరకు). ఈ సమయం తరువాత సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పనిచేయదు.
* ఆఫ్‌లైన్‌లో రుసుము చెల్లింపు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తరువాత సంబంధించిన పే స్లిప్‌ ద్వారా ఎస్‌బీఐ బ్యాంకులో మరుసటి పనిదినంలో డబ్బు చెల్లించాలి.
* ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌/ స్టేజ్‌-1 పరీక్షను జనవరి 8, 2017న నిర్వహిస్తారు.
* ఈస్‌ఈ మెయిన్స్‌/ స్టేజ్‌-2 పరీక్షను మే 14, 2017న నిర్వహిస్తారు.
* పరీక్ష రుసుము రూ.200. మహిళ, ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్ష రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

విద్యార్హతలు
ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ/ తత్సమాన అర్హత ఎంఎస్‌సీ/ తత్సమానం. కానీ ప్రతిపాదించిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి. బీఈ/ బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే.
వయసు: పరీక్ష రాసే సంవత్సరపు జనవరి 1వ తేదీకి 21 నుంచి 30 సంవత్సరాలుండాలి (అంటే పరీక్ష రాసే అభ్యర్థి జనవరి 2, 1987 తరువాత; జనవరి 1, 1996 ముందు జన్మించి ఉండాలి). కొన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు కొంత సడలింపు ఉంది.
గమనిక: అభ్యర్థులు దరఖాస్తుకు సంబంధించిన వివరాలకు, సలహాలకు పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా యూపీఎస్‌సీ ఫెసిలిటేషన్‌ కౌంటర్‌ దగ్గర సంప్రదించవచ్చు.
అభ్యర్థులు పరీక్షకు రెండు వారాల ముందువరకు తమ ఈ-అడ్మిషన్‌ సర్టిఫికెట్‌ వెబ్‌సైట్‌లో లభించకపోయినా లేదా యూపీఎస్‌సీ నుంచి ఎటువంటి సమాచారం లభించకపోయినా వెంటనే యూపీఎస్‌సీ ఫెసిలిటేషన్‌ కౌంటర్‌ దగ్గర సంప్రదించాలి.

సిలబస్‌
స్టేజ్‌-1 (ప్రిలిమినరీ)
పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌):
* పేపర్‌-1లో కూడా కనీస అర్హత మార్కులు సాధించాలి. కాబట్టి టెక్నికల్‌ సబ్జెక్టుతోపాటు ఈ జనరల్‌ స్టడీస్‌ కూడా కీలకం. ఇప్పటినుంచే జనరల్‌స్టడీస్‌పై తగిన శ్రద్ధవహించి సన్నద్ధమవడం మంచిది.
* జనరల్‌ స్టడీస్‌ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా, ఆ స్థానంలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలను చేర్చారు.
* పేపర్‌-1లోని 200 మార్కులు అంతిమంగా సాధించే ర్యాంకులో కీలకపాత్ర పోషిస్తాయి.

స్టేజ్‌-2 (మెయిన్స్‌)
* స్టేజ్‌-1లోని ఇంజినీరింగ్‌ సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు.
* ఈ రెండు పేపర్లు అభ్యర్థి సంబంధిత కోర్‌ సబ్జెక్టులకు సంబంధించినవే.
* కొత్త విధానంలో మార్కులతోపాటు సమయం కూడా పెరిగింది. కాబట్టి ప్రాథమికాంశాలతో (బేసిక్స్‌) పాటు అడ్వాన్స్‌డ్‌ విషయాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉండవచ్చు. కొత్తగా చేర్చిన కొన్ని సబ్జెక్టులు బీటెక్‌లో ఎలక్టివ్‌గా లేదా ఎంటెక్‌ ప్రథమ సంవత్సరంలో చదివే విషయాలున్నాయి. కానీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమబద్ధంగా, పటిష్ఠ ప్రణాళికతో నాలుగు సంవత్సరాల బీటెక్‌ సిలబస్‌ చదివితే సరిపోతుంది.

స్టేజ్‌-3 (మౌఖిక పరీక్ష)
* దీనిలో అభ్యర్థి ఆలోచనా విధానాన్ని, శక్తి సామర్థ్యాలను, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి ఈఎస్‌ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలకు, హాబీలకు కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు.
* ఉద్యోగం చేస్తున్నా లేదా ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత విషయాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశముంది. సామాజిక, వర్తమాన అంశాల గురించి కూడా అడగవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం వెళితే ఈ మౌఖిక పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశముంది.

ఎలా సన్నద్ధమవాలి?
2016 ఈఎస్‌ఈ వరకూ అభ్యర్థులందరూ జనవరి/ ఫిబ్రవరిలో గేట్‌ జరిగేదాకా కామన్‌ సబ్జెక్టులను అధ్యయనం చేసేవారు. తరువాత అదనపు ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు, జనరల్‌స్టడీస్‌, ఇంగ్లిష్‌ల్లో శ్రద్ధ పెట్టేవారు. కానీ ఆ పద్ధతి ఇప్పుడు చెల్లదు.
ఎందుకంటే స్టేజ్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో ఉంది. మొత్తం సిలబస్‌ (జనరల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు) ముందుగానే చదవాలి. కాబట్టి స్టేజ్‌-1 వరకు పూర్తి కాన్సెప్టులతోపాటు, ముఖ్యమైన డెరివేషన్స్‌, వివిధ రకాల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, కొన్ని ఎక్కువ నిడివిగల ప్రశ్నలు సాధన చేయడం ఎంతైనా మంచిది. స్టేజ్‌-1 తరువాత స్టేజ్‌-2 వరకు ఉన్న మూడు లేక నాలుగు నెలల సమయంలో ఎక్కువ నిడివిగల అన్ని రకాల ప్రశ్నలు సాధన చేయవచ్చు.
ఈఎస్‌ఈ 2017 ప్రిలిమినరీ పరీక్షకు మూడు నెలల వ్యవధి ఉంది. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని రోజుకు 8- 9 గంటలు సాధన చేయాలి. గత సంవత్సరపు ప్రశ్నపత్రాలను సాధన చేయడం, చదివినవి పునశ్చరణ చేయడం ఈ పరీక్ష విజయసాధనలో ఎంతో కీలకం.
* ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు మార్క్‌ చేయడానికి బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నును మాత్రమే ఉపయోగించాలి. ఇతర రంగుల పెన్నులు, పెన్సిళ్లను అనుమతించరు.
* ప్రతి తప్పు సమాధానానికీ 1/3 (0.33) రుణాత్మక మార్కులుంటాయి.
* పై రెండు పేపర్లలో కనీస క్వాలిఫయింగ్‌ మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది. ఇది క్వాలిఫయింగ్‌ స్టేజ్‌ మాత్రమే కాదు. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలోనూ పరిగణనలోకి తీసుకుంటారు.

స్టేజ్‌-1+ స్టేజ్‌-2 = 1100 మార్కులు
రెండు పేపర్లలో కనీస క్వాలిఫయింగ్‌ మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది. కొత్తవిధానంలో కన్వెన్షనల్‌ ప్రశ్నపత్రాలకు 600 మార్కులు. కన్వెన్షనల్‌ ప్రశ్నలు డిజైన్‌ ఆధారిత ఎక్కువ నిడివిగలవిగా ఉంటాయి. వీటికోసం చదవడంతోపాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి.
ఈ రాత పరీక్షల ఫలితాలు వెలువడిన తరువాత యూపీఎస్‌సీ అర్హత పొందిన అభ్యర్థుల వివరణాత్మక దరఖాస్తు ఫారం (డీఏఎఫ్‌)ను ఆన్‌లైన్‌ ద్వారా పంపడానికి సమాచారం అందిస్తుంది.

స్టేజ్‌-2 మౌఖిక పరీక్ష (200 మార్కులు)
మొదటి రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులకుగానూ) అభ్యర్థులను 1:2 నుంచి 1:2.5 నిష్పత్తిలో స్టేజ్‌-3 (పర్సనల్‌ ఇంటర్వ్యూ)కి అనుమతిస్తారు.
తుది జాబితా: తుది ఎంపిక 3 దశల్లో కలిపి 1300 మార్కులకుగానూ వచ్చిన మార్కుల ఆధారంగా, ఉన్న ఖాళీలకు అనుగుణంగా జాబితా రూపొందుతుంది.

నోటిఫికేష‌న్

సిల‌బ‌స్‌


Back..

Posted on 03-10-2016