Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధికి ఉపకరించే.. ‘ఇగ్నో’ డిప్లొమాలు

ఆధునిక మార్కెట్‌ పరిస్థితులకూ, అవసరాలకూ అనుగుణంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) వివిధ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వ్యవసాయం, వైద్యవిద్య, పర్యాటకం, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ మొదలైన పరిశ్రమలకు సంబంధించిన ఈ కోర్సులను విజయవంతంగా పూర్తిచేస్తే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు జులై 31 లోగా దరఖాస్తులు పంపుకోవచ్చు.

1. డిప్లొమా ఇన్‌ డెయిరీ టెక్నాలజీ :
వ్యవసాయ రంగంతోపాటు అనుబంధ రంగాలైన డెయిరీ (పాడి పరిశ్రమ) రంగంలో యువతకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. దీన్ని ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. దీనిలో చేరే గ్రామీణ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఫీజులో 50 శాతం రాయితీని ఇస్తున్నారు.
డిప్లొమా కనీస వ్యవధి ఏడాది. గరిష్ఠ వ్యవధి 4 సంవత్సరాలు. ఇంటర్‌ ఉత్తీర్ణులు లేదా ఇగ్నో బ్యాచిలర్‌ ప్రిపరేటరీ ప్రోగ్రామ్‌ (బీపీపీ) పూర్తిచేసినవారు చేరవచ్చు. పదో తరగతి పూర్తిచేసినవారు ఒకేసారి బీపీపీలో, డిప్లొమాలో చేరవచ్చు.
2. డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌:
మేనేజ్‌మెంట్‌ రంగంలో పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డిప్లొమా ఎంతో ఉపయోగకరం. దీనిలో ఉన్న 5 కోర్సుల్లో మూడు కంపల్సరీ, రెండు ఎలక్టివ్స్‌.
డిప్లొమా కనీస వ్యవధి ఏడాది. గరిష్ఠ వ్యవధి 8 సంవత్సరాలు. 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు లేదా ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌/లా/ సీఏ/ సీఎంఓ మొదలైన వృత్తివిద్యా కోర్సులు 50 శాతం మార్కులతో పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డిగ్రీలు ఉన్నవారు ప్రవేశపరీక్ష -ఓపెన్‌మ్యాట్‌ తో సంబంధం లేకుండానే నేరుగా ప్రవేశాలు పొందేవిధంగా 2018 జనవరి నుంచి నిబంధనలను సడలించారు. ఇగ్నో ఓపెన్‌ మ్యాట్‌ పూర్తిచేసినవారు కూడా అర్హులు.
3. డిప్లొమా ఇన్‌ టూరిజం స్టడీస్‌:
పర్యాటక రంగంలో, హోటల్‌ పరిశ్రమల్లో వివిధ ఉద్యోగావకాశాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ కోర్సును ప్రారంభించారు. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో బోధన ఉంటుంది. 36 క్రెడిట్లు ఉంటాయి.
డిప్లొమా కనీస వ్యవధి ఏడాది. గరిష్ఠ వ్యవధి 4 సంవత్సరాలు. ఇగ్నో బీపీపీ చేసినవారు గానీ, 10+2 (ఇంటర్‌) పూర్తిచేసినవారు గానీ ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు.
4. పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌:
మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలు ఏటా పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్‌ నిర్వహణకు ప్రత్యేక నిపుణుల అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాంలో 32 క్రెడిట్లుంటాయి (థియరీ 18, ప్రాక్టికల్‌ 14).
పీజీ డిప్లొమా కనీస వ్యవధి ఏడాది. గరిష్ఠ వ్యవధి 3 సంవత్సరాలు. మెడికల్‌/డెంటల్‌ గ్రాడ్యుయేట్లు ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు. హోమియో, నర్సింగ్‌, ఫార్మసీ వారికీ, వైద్యశాలలపరంగా అనుభవమున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లకూ అవకాశం ఉంది.
5. పీజీ డిప్లొమా ఇన్‌ అనలిటికల్‌ కెమిస్ట్రీ:
ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలను అందించగలిగిన ప్రోగ్రాం. దీన్ని పూర్తి చేసినవారు దేశవిదేశాల్లో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ పట్టా స్వయంఉపాధికి కూడా వీలు కల్పిస్తుంది.
పీజీ డిప్లొమా కనీస వ్యవధి ఏడాది. గరిష్ఠ వ్యవధి 3 సంవత్సరాలు. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదివిన సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు. బీఎస్‌సీ (బయోటెక్‌), బీ ఫార్మా, బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) చదివినవారికి కూడా అవకాశం ఉంది.
మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా..
దూరవిద్య అంటే కేవలం డిగ్రీల కోసం కాదు. ఆ చదువు ఉపాధి అవకాశాలను కల్పించాలి, ఉద్యోగభద్రతను ఇవ్వాలి. స్వయం ఉపాధికి తోడ్పడాలి. వీటితోపాటు వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనుకునేవారికి మార్గదర్శకంగా ఉండాలి. ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఇగ్నో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఈ కోర్సుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరవచ్చు. శ్రద్ధగా చదివి, తమకు ఆసక్తి ఉన్నరంగంలో పట్టాను పొందవచ్చు.

- డా. ఎస్‌. ఫయాజ్‌ అహ్మద్‌, ఇగ్నో ప్రాంతీయ కేంద్ర సంచాలకులు‌

 
Back..

Posted on 30-07-2018