Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వీటిని ఇగ్నోర్‌ చేయవద్దు!

దూరవిద్యలో చదువులంటే- విద్యార్హతలు పెంచుకునే సర్టిఫికెట్ల కోసమేనని చాలామంది భావిస్తారు. అయితే నైపుణ్యాలు మెరుగయ్యేలా, ఉద్యోగాలకు బాటలు వేసే కోర్సులెన్నో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశపెట్టింది. సొంతంగా ఏదైనా చేసుకోవాలనే తపన ఉన్నవారికి దారిచూపే చదువులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, టూర్‌ ప్లానర్స్‌, అకౌంటెంట్స్‌...ఇలా అన్ని వృత్తులు, రంగాలకు ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయుల్లో అందుబాటులో ఉంచింది. విదేశీ భాషలు, ఆంగ్లంలో నైపుణ్యాలు, రచనలో సృజనాత్మకతకు మెరుగులద్దే కోర్సులు సైతం ఇగ్నో నిర్వహిస్తోంది. జనవరి, జులై సెషన్లలో ఇవి ప్రారంభమవుతాయి. తాజాగా జనవరి 2019 కోర్సుల ప్రకటన వెలువడిన సందర్భంగా పేరుపొందిన కొన్ని కోర్సుల వివరాలు చూద్దాం.

కళాశాలకు వెళ్లి చదవలేకపోవడానికి కారణాలెన్నో ఉండవచ్చు. అలా అని చదువులకు దూరం కానవసరం లేదు. వాటిని కొనసాగించడానికి దారులు సైతం ఎన్నో ఉన్నాయి. ఆసక్తి, అభిరుచి మేరకు ఎంచుకోవడానికి ఇగ్నో ఆధ్వర్యంలో ఎన్నో కోర్సులు రూపొందాయి. సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ స్థాయుల్లో ఎన్నో కోర్సులను ఇగ్నో అందిస్తోంది. కొత్తవారికి అవకాశాలు కల్పించడంతోపాటు ఇప్పటికే ఆ రంగంలో ఉన్నవారికి ఇవి ప్రయోజనం కలిగిస్తాయి.

విభిన్న కోర్సులు
మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్‌: ప్రస్తుతం వేగంగా మారుతోన్న సామాజిక పరిణామాలు కౌన్సెలర్ల అవసరాలను పెంచుతున్నాయి. పాఠశాలలు, కార్పొరేట్‌ కంపెనీలు, వైద్య శాలలు, సంక్షేమ సంస్థలు...ఇలా అన్నిచోట్ల నైపుణ్యమున్న వీరికి గిరాకీ ఉంది. ప్రభుత్వ రంగాలు, ఎన్జీవో సంస్థల్లోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించడం, కుటుంబ సభ్యుల కలహాలు తీర్చడం, విద్యార్థుల్లో భయాలు పోగొట్టడం, రోగుల్లో అవగాహన పెంచడం...ఇలా ప్రతి సందర్భంలోనూ కౌన్సెలర్ల సేవలు కీలకమవుతున్నాయి. పునరావాస కేంద్రాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, వృద్ధులు, మాదక ద్రవ్య బానిసలు...అందరిలోనూ స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత వీరిదే. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఇందులో చేరవచ్చు. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. రెండేళ్ల కోర్సుకు రూ.36,000 ఫీజుగా చెల్లించాలి. ఇందులో ఏడాది వ్యవధితో పీజీ డిప్లొమా కోర్సు సైతం ఉంది. ఫీజు రూ.15,000
పీజీ డిప్లొమా ఇన్‌ ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌: ఫార్మా రంగంలో.. ముఖ్యంగా మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా రాణించాలని ఆశించేవారికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియెట్‌లో సైన్స్‌ కోర్సు చదివి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఇందులో చేరవచ్చు. రెండేళ్ల పని అనుభవం ఉన్న నాన్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు కూడా ఇందులో చేరడానికి అర్హులే. ఆంగ్ల మాధ్యమంలో సిలబస్‌ ఉంటుంది. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.8400.
పీజీ డిప్లొమా ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌: ఈ కోర్సును ఇగ్నో మరికొన్ని సంస్థలతో కలిసి అందిస్తోంది. వాటిలో బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఒకటి. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.6600. పర్యావరణ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.
పీజీ డిప్లొమా ఇన్‌ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌: ప్రస్తుతం చాలా రంగాల్లో స్టాటిస్టిక్స్‌ అనువర్తనం పెరుగుతోంది. సమాచార విశ్లేషణలో స్టాటిస్టిక్స్‌ పాత్రే కీలకం. సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, ల్యాబొరేటరీలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు...ఇలా వివిధ విభాగాల్లో స్టాటిస్టీషియన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ రంగాలకు స్టాటిస్టిక్స్‌ ఎలా అనువర్తించాలి, టూల్స్‌ ఏ విధంగా ఉయోగించాలి, సమాచారాన్ని విశ్లేషించడం...మొదలైనవి కోర్సులో భాగంగా నేర్పుతారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఇందులో చేరవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు రూ.7200.
పీజీ డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ: బోధనలో సాంకేతికత పాత్ర పెరుగుతోంది. ఏ సమయంలోనైనా, ఎక్కడ నుంచైనా నేర్చుకోవడానికి టెక్నాలజీ తోడ్పడుతోంది. దీంతో బోధన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీని జోడించి బోధిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టపవచ్చు. ఇందుకోసం బోధకులు, శిక్షకులు, ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం రూపకర్తలకు ఎడ్యుకేషన్‌ టెక్నాలజీపై పట్టు తప్పనిసరి. విద్యార్థి తేలికగా అర్థం చేసుకుని సులువుగా నేర్చుకోవడానికి వీలుగా టెక్నాలజీని జోడిస్తున్నారు. డిగ్రీ చదివినవారు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.6600.
డిప్లొమా ఇన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌: ఇప్పుడు ప్రతీదీ ఓ వేడుకే. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఫ్రెషర్స్‌ డే, యాన్యువల్‌ డే, ఎంగేజ్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌...ఇలా ప్రతీ సందర్భాన్నీ అట్టహాసంగా జరుపుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. వీటిని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు ఈవెంట్‌ మేనేజర్లు. కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక విభాగాలు...సైతం వాటి పరిధిలో నిర్వహించుకునే కార్యక్రమాలకు ఈవెంట్‌ మేనేజర్లపైనే బాధ్యతలు పెడుతున్నాయి. బ్రాండ్‌ ప్రమోషన్‌, ప్రొడక్ట్‌ లాంచింగ్‌, ఆడియో ఫంక్షన్‌...ఇలా కార్యక్రమం ఏదైనా ప్రణాళిక ప్రకారం నిర్వహణ నైపుణ్యాలను ఈవెంట్‌ మేనేజర్లు ప్రదర్శిస్తారు.ఈ రంగంలో శిక్షణ పొందిన ఈవెంటర్ల కొరత తీర్చడానికి ఇగ్నో.. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సు అందిస్తోంది. కోర్సు ద్వారా కావాల్సిన నైపుణ్యాలు అలవర్చుకుని, నిర్వహణ నైపుణ్యాల్లో సృజనాత్మకతను పెంచుకోవచ్చు. అనంతరం ఏదైనా ఈవెంట్‌ సంస్థలో ఉద్యోగం లేదా సొంతగా ఈవెంట్స్‌ నిర్వహించడం చేసుకోవచ్చు. ఇంటర్‌ ఉత్తీర్ణులు ఇందులో చేరడానికి అర్హులు. ఆంగ్ల మాధ్యమంలో కోర్సు ఉంటుంది. ఈవెంట్‌ ప్లానింగ్‌, కోఆర్డినేషన్‌, మార్కెటింగ్‌...మొదలైనవి నేర్పుతారు. ఇంటర్న్‌ సైతం చేయిస్తారు. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.8000.

ఆహార రంగంలో...
సర్టిఫికెట్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌: ఎలాంటి విద్యార్హతలు లేకుండా 18 ఏళ్లు పైబడినవారు ఈ కోర్సులో చేరవచ్చు. ఆరోగ్య స్పృహ పెంపొందించడానికి దీన్ని రూపొందించారు. ఆహార పదార్థాలు ఎంచుకోవడం, ఆహార తయారీ, వివిధ వయసులవారికి కావాల్సిన పోషక పదార్థాలు, కిచెన్‌ గార్డెనింగ్‌, తక్కువ ఖర్చుతో పర్యావరణ అనుకూలంగా పోషకాలు ఉన్న ఆహారం తయారుచేసుకోవడంపై అవగాహన కల్పిస్తారు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.1400.
సర్టిఫికెట్‌ ఇన్‌ న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌కేర్‌: ఇంటర్‌ విద్యార్హతతో ఈ కోర్సులో చేరవచ్చు. పోషణ, శిశు వికాసానికి సంబంధించి ఈ కోర్సు పూర్తి అవగాహన కల్పిస్తుంది. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తయారుచేయడం, పోషణ లోపిస్తే వచ్చే సమస్యలు, ఆహారాన్ని ఎంచుకోవడం, భద్రపర్చడం, ఫుడ్‌ బడ్జెట్‌ సూత్రాలు...కోర్సులో భాగంగా నేర్పుతారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరేళ్ల చిన్నారి వరకు కావాల్సిన పోషణ, వికాస సంబంధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.1800.

భాషలపై ఆసక్తి ఉంటే...
విదేశీ భాషలు: ఇంటర్‌ ఉత్తీర్ణులు సర్టిఫికెట్‌ ఇన్‌ ఫ్రెంచ్‌/ ఆరబిక్‌ / జపనీస్‌/ కొరియన్‌/ స్పానిష్‌ లాంగ్వేజ్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఆంగ్లం వచ్చినవారు విద్యార్హతలు లేకుండానే రష్యన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేసుకోవచ్చు. వీటి వ్యవధి 6 నెలలు.
సర్టిఫికెట్‌ ఇన్‌ ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌: ఆంగ్ల భాషలో ప్రాథమిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. వివిధ సందర్భాల్లో ఆంగ్లంలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఇందులో చేరడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆంగ్లంలో సంభాషణ, రాత నైపుణ్యాలను మెరుగు పర్చుకోవచ్చు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.3000.

పౌల్ట్రీ, డెయిరీ, వ్యవసాయం...
పౌల్ట్రీ ఫార్మింగ్‌: చాలామంది ఔత్సాహికులు, నిరుద్యోగులు స్వయం ఉపాధిపై దృష్టిసారించడం మనకు తెలిసిందే. అయితే ఏమి చేయాలనుకున్నా ఆ రంగంలో ప్రాథమికావగాహన తప్పనిసరి. తక్కువ పెట్టుబడితో ఏడాది పొడువునా చేతికి ఆదాయం అందించడం పౌల్ట్రీ ప్రత్యేకత. అయితే ఈ రంగంలో సిరులు కురవాలంటే కోళ్ల పెంపకం, వాటి పోషణ, ఫారాల నిర్వహణపై శాస్త్రీయ అవగాహన తప్పనిసరి. ఆ దిశగా తెలుగు మాధ్యమంలో ఇగ్నో ‘పౌల్ట్రీ ఫార్మింగ్‌’ కోర్సు అందిస్తోంది. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.3600. ఎనిమిదో తరగతి విద్యార్హతతో ఇందులో చేరవచ్చు.
బీ కీపింగ్‌: ఇదే విద్యార్హతతో తేనె తయారీ కోసం ‘బీ కీపింగ్‌’ కోర్సును ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. 6 నెలల వ్యవధి గల ఈ కోర్సు ఫీజు రూ.1400.
డెయిరీ ఫార్మింగ్‌ అవేర్‌నెస్‌: ఈ కోర్సును కూడా తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. పాడిపరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు. జంతువుల పెంపకం, రోగాల బారినుంచి వాటిని సంరక్షించడం, పాల దిగుబడి పెంచడం, దాణా ఎంచుకోవడం..తదితరాలు ఇందులో నేర్పుతారు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. కోర్సు వ్యవధి 2 నెలలు. ఫీజు రూ.1100.
సర్టిఫికెట్‌ ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌: వ్యవసాయంలో రసాయనాలు, ఎరువుల వినియోగం బాగా పెరుగుతోంది. ఈ పరిణామాలు ఆరోగ్యం, పర్యావరణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యవసాయదారుల్లో సేంద్రియ సాగుపై అవగాహన కల్పించడం, ఆ విధానంలో పండించిన ఉత్పత్తులకు గుర్తింపు (సర్టిఫికేషన్‌) తెచ్చుకోవడంపై అవగాహన కల్పించేలా కోర్సు రూపొందించారు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఇంటర్‌ ఉత్తీర్ణులు చేరవచ్చు. ఫీజు రూ.4800.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2019
వెబ్‌సైట్‌: http://ignou.ac.in

Back..

Posted on 20-12-2018