Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

చేనేతలో శాస్త్రీయ శిక్షణ

* హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీలో డిప్లొమా

చేనేత పరిశ్రమకు మనదేశం ప్రసిద్ధి చెందింది. ఈ రంగం అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన ఉత్పత్తులే కీలకం. ఇందుకు అత్యుత్తమ మానవ వనరుల సేవలు అవసరం. ఈ దిశగా ఆలోచించి ఏర్పాటు చేసినవే హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లు. ఇవి మూడేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్ర సంస్థలు; నాలుగు రాష్ట్ర స్థాయివి. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సంబంధించి ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో 1992లో ప్రారంభించారు. ఇక్కడి ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సు అందిస్తున్నారు. ఇది రాష్ట్రస్థాయి సంస్థ. ఇక్కడి డిప్లొమా కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు 47 సీట్లు కేటాయించారు. మిగిలినవి ఇతర రాష్ట్రాలవారికి దక్కుతాయి.

వెంకటగిరితోపాటు హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ కోర్సు అందిస్తున్న సంస్థలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో తమిళనాడులోని సేలంలో 11, కర్ణాటకలోని గడగ్‌లో 4 సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. ఒడిశాలోని బరఘ్‌లో 8 సీట్లు తెలంగాణ విద్యార్థులకు చెందుతాయి. వీటన్నింటికీ ఉమ్మడిగా ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది రూ.1,000, రెండో సంవత్సరం రూ. 1,100, మూడో ఏట రూ. 1,200 ఉపకార వేతనంగా అందిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత టెక్స్‌టైల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్థాయి.

వివిధ అంశాలపై శిక్షణ
చేనేతకు సంబంధించి పరిశోధన, ప్రయోగాలు చేసి, నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థలు నెలకొల్పారు. ఇవి టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మూడేళ్ల డిప్లొమాలో స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్, డిజైన్, క్వాలిటీ పరీక్షలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడో సంవత్సరం కోర్సులో అదనంగా అపారెల్‌ గార్మెంట్రీ మేకింగ్‌ టెక్నాలజీ శిక్షణ ఇస్తున్నారు. పలు రకాలు వస్త్రాల తయారీలో మెలకువలు నేర్పుతారు. బ్యాగులు, ఇతర వస్తువుల తయారీలోనూ తర్ఫీదు అందిస్తారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చేనేత, జౌళి రంగంలోని పరిశ్రమల్లో కొలువులు సాధిస్తున్నారు. కోర్సు పూర్తికాగానే కళాశాలలోనే వివిధ చేనేత, జౌళి పరిశ్రమలు ప్రాంగణ నియామకాలు చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు అనుభవంతో విదేశాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జౌళి, చేనేత విభాగాలు, సహకార సంఘాలు... మొదలైనవాటిలో వీరికి ఉపాధి లభిస్తుంది.

ఎవరు అర్హులు?
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
ప్రవేశం: పదో తరగతి మార్కుల మెరిట్‌ లేదా పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఎంపిక విధానాన్ని తర్వాత ప్రకటిస్తారు.
వయసు: జులై 1, 2020 నాటికి బీసీ, జనరల్‌ కేటగిరీలకు 15 - 23 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది.
దరఖాస్తు: సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూరించాలి. దాంతోపాటు రూ. వంద డీడీ జతచేసి సంస్థ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబరు 19
వెబ్‌సైట్‌: http://iihtvgr.com/


Back..

Posted on 31-08-2020