Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ట్రిపుల్‌ ఐటీలో పంచతంత్రం

కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు ప్రసిద్ధికెక్కిన సంస్థల్లో ఐఐఐటీ-హెచ్‌ ముఖ్యమైంది. బీటెక్‌, ఎంఎస్‌ అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ; జనరల్‌ బీటెక్‌, లేటరల్‌ ఎంట్రీ విధానంలో బీటెక్‌, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ ప్రకటన విడుదలచేసింది. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు లభిస్తాయి.

ఐఐఐటీ హైదరాబాద్‌లో మొత్తం 5 రకాల డ్యూయల్‌ డిగ్రీ కోర్సులున్నాయి. ఎంపీసీ గ్రూప్‌లో ఇంటర్‌ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరం కోర్సు చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

ఈసీడీ: ఈ విభాగంలో చేరినవారు బీటెక్‌తో పాటు ఎంఎస్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంటారు. 25 సీట్లు ఉన్నాయి.
సీఎస్‌డీ: కోర్సులో భాగంగా అయిదేళ్లూ బీటెక్‌, ఎంఎస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తారు. 35 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సీఎల్‌డీ: బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఎంఎస్‌లో కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌ గురించి నేర్చుకుంటారు. ఈ విభాగంలో 15 సీట్లు కేటాయించారు.
సీఎన్‌డీ: బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఎంఎస్‌లో కంప్యుటేషనల్‌ నేచురల్‌ సైన్సెస్‌ ఉంటాయి. ఇందులో 15 సీట్లు ఉన్నాయి.
సీహెచ్‌డీ: ఈ విభాగంలో చేరినవాళ్లు బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఎంఎస్‌లో కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్సెస్‌ అభ్యసిస్తారు. మొత్తం 10 సీట్లు ఉన్నాయి.

అభ్యర్థులను అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (యూజీఈఈ) ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టు ప్రొఫిషియన్షీ టెస్టు, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఉంటాయి. సబ్జెక్టు ప్రొఫిషియన్సీ గంట, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌ వ్యవధి రెండు గంటలు. ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ఉంటాయి. రీజనింగ్‌ విభాగంలో అభ్యర్థుల్లోని క్లిష్టతా నైపుణ్యాలు, సృజనాత్మక సామర్థ్యం పరిశీలిస్తారు. నమూనా ప్రశ్నలు, మాక్‌ టెస్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒలింపియాడ్‌/ కేవీపీవైకి ఎంపికైనవారు సీఎస్‌డీ, సీఎన్‌డీ, సీఎల్‌డీ కోర్సుల్లో చేరవచ్చు.

హామీ లేని బ్యాంకు రుణం
అభ్యర్థులు ఏ విభాగం ద్వారా చేరినప్పటికీ తొలి సంవత్సరం కోర్సు ఫీజు రూ.2,80,000 ఉంటుంది. సీటు పొందినవారు ఎలాంటి హామీ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణం పొందే సౌలభ్యం ఉంది. ఐఐఐటీ-హెచ్‌ పూర్వ విద్యార్థుల సంఘం అవసరమైనవారికి ఫీజు చెల్లిస్తుంది. అయితే ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నవారు కోర్సు పూర్తయి, ఉద్యోగంలోకి చేరిన తర్వాత మరో విద్యార్థికి ఫీజు చెల్లించాలి. రూ.8 లక్షల కంటే తక్కువ వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

స్పెషల్‌ ఛానెల్‌ అడ్మిషన్‌
ఈ విధానంలో బీటెక్‌ సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులు చదువుకోవచ్చు. ఒక్కో విభాగంలో పదేసి చొప్పున సీట్లు ఉన్నాయి. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఈ కోర్సుల్లో చేరాలంటే- సీబీఎస్‌ఈకి చెందిన ఉడాన్‌ పథకానికి ఎంపికవ్వాలి లేదా పదో తరగతి తర్వాత ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ చదువుతున్నవారై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు ద్వారా ఎంపికచేస్తారు. గంట వ్యవధితో సబ్జెక్టు ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ స్కోర్‌తోనూ ప్రవేశం లభిస్తుంది.

లేటరల్‌ ఎంట్రీ
ఈ విధానంలో ప్రస్తుతం బీటెక్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఎంపికైనవారు నాలుగేళ్లపాటు బీటెక్‌, ఎంఎస్‌ కోర్సులు చదువుకుంటారు. సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాల్లో అవకాశం ఉంది. జులై, 2019 నాటికి ద్వితీయ సంవత్సరం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఇందులో చేరవచ్చు.
* కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి బీటెక్‌ సీఎస్‌ఈ లేదా ఐటీ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ప్రవేశాలకు బీటెక్‌ ఈసీఈ/ ఈటీఈ/ ఈఐఈ/ ఈఈఈ ద్వితీయ సంవత్సర విద్యార్థులు అర్హులు.
ఈ రెండు కోర్సుల్లోనూ ప్రవేశాలకు మూడో సెమిస్టర్‌ వరకు 80 శాతం మార్కులు లేదా 8 సీజీపీఏ తప్పనిసరి. పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. రెండు కోర్సులకూ విడిగా పరీక్షలు ఉంటాయి. జనరల్‌ ఆప్టిట్యూడ్‌, డిజిటల్‌ లాజిక్‌ అంశాలు రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్నాయి. వీటితో పాటు డిస్క్రీట్‌ మ్యాథమెటిక్స్‌, కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌, డేటా స్ట్రక్చర్స్‌, సీ లాంగ్వేజ్‌ నుంచి సీఎస్‌ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. ఈసీఈ విభాగంలో సర్క్యూట్‌ థియరీ అండ్‌ నెట్‌వర్క్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అండ్‌ సర్క్యూట్స్‌, సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌ నుంచి పరీక్షలో అడుగుతారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 28 పరీక్ష కేంద్రాలు: ఏపీలో కడప, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌.
దరఖాస్తు ఫీజు: డ్యూయల్‌ డిగ్రీ, లేటరల్‌ ఎంట్రీ కోర్సులకు రూ. 2000.
స్పెషల్‌ ఛానెల్‌ అడ్మిషన్‌కు రూ.750 http://ugadmissions.iiit.ac.in


Back..

Posted on 25-02-2019