Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరిశోధనలో ట్రి'ఫుల్' ఐటీ

* నిన్న టీ-హబ్... నేడు కృత్రిమ మేధ
* దూసుకెళ్తున్న విద్యాసంస్థ

హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ... క్లుప్తంగా ట్రిపుల్ఐటీ. ఈ సంస్థకు ఐటీలో లెజెండ్‌గా పేరుంది. బీటెక్‌లోనే పరిశోధన ఆధారిత విద్యను బోధిస్తూ సత్తా చాటుతున్న సంస్థలో కేంద్రాలు ప్రారంభించేందుకు పెద్ద పెద్ద సంస్థలే ముందుకు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ మరో ప్రతిష్ఠాత్మక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుతోంది. దేశంలోనే ఎన్నో ఐఐటీలు, ట్రిపుల్ఐటీలుండగా పలు సంస్థలు ఎందుకు ఈ విద్యాసంస్థనే ఎంచుకుంటున్నాయి? అసలు దీని బలమేంటి... విజయ రహస్యమేంటి.. తెలుసుకుందామా..
ఐటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యార్థులను తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకు విద్యార్థులను పరిశోధన వైపు నడిపిస్తేనే ఆ లక్ష్యం సాధ్యమవుతుందన్నది ప్రణాళిక. అలా దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు అలహాబాద్, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో ట్రిపుల్ఐటీని నెలకొల్పారు. నగరంలోని గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఇది డీమ్డ్ విశ్వవిద్యాలయం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత యూజీసీ గుర్తింపు లభించింది. ఇప్పుడు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా పేరుపొందింది. బోర్డు ఆఫ్ గవర్నర్స్‌లో దేశవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. బోర్డు ఛైర్మన్‌గా అంతర్జాతీయంగా కంప్యూటర్ సైన్స్‌లో పేరుపొందిన కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉన్న తెలుగువ్యక్తి రాజ్‌రెడ్డిని నియమించారు. పీజే నారాయణన్ సంచాలకుడిగా ఉన్నారు.
* బీటెక్‌లోనే ప్రారంభం
ఈసంస్థ స్థాపించడం వెనక ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ నుంచే పరిశోధనా ఆధారిత చదువును అందించడం. దానివల్ల విద్యార్థులు పరిశోధన వైపు మరలుతారన్నది ఉద్దేశం. అందుకే అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ అయిన మాస్టర్ ఆఫ్ సైన్స్ (నాలుగేళ్లు బీటెక్, ఒక ఏడాది ఎంఎస్)కోర్సుతోపాటు సాధారణ బీటెక్, ఎంటెక్ కోర్సులున్నాయి. అయితే కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన కోర్సులు మాత్రమే ఉంటాయి. జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తే విద్యా సంవత్సరం ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కులతో ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను సొంతంగా ఎంపిక చేసుకుంటోంది.
* ఎన్నో కేంద్రాలు
ఇక్కడి ఆచార్యులు పరిశోధనే ట్రిపుల్ఐటీ డీఎన్ఏగా చెబుతుంటారు. అంటే ఈ సంస్థ ఆవిర్భావం వెనుక ఉద్దేశమే ఐటీలో పరిశోధన చేయడం. అందుకే ఇక్కడ తరగతి గదులను చూస్తే ప్రయోగశాలలుగా కనిపిస్తాయి. రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీస్, ఐటీ ఇన్ ఎడ్యుకేషన్, స్పేషియల్ ఇన్‌ఫర్మేటిక్స్, ఈ-గవర్నెన్స్, ఓపెన్ సాఫ్ట్‌వేర్, ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్ లాంటి ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలున్నాయి. ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో ట్రిపుల్ఐటీ భాగస్వామిగా ఉంది. ఉదాహరణకు ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా విభాగాలను అప్రమత్తం చేయడం, బాధితులను గుర్తించే ప్రాజెక్టులో ఈ సంస్థ పాల్గొంటోంది. దీనికి జైకా నిధులిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులను విద్యార్థులు దగ్గరుండి చూడటం వల్ల అవగాహన పెంచుకుంటారు. బీటెక్ పూర్తి చేసుకొని ఏదో ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేసుకుందామని వచ్చే వారు ఇక్కడికి వచ్చిన ఏడాది తర్వాత అధిక శాతం మంది పరిశోధన చేయాలని...సొంత ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలన్న నిర్ణయానికి వస్తుంటారు. కనీసం 10- 20 శాతం మంది అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న నోబుల్ గ్రహీతల వద్ద శిష్యరికం చేయడానికి వెళ్తున్నారు.
* చేతులు కలిపిన టీసీఎస్
ఐటీ పరిశోధనలో మేటిగా నిలుస్తున్న ట్రిపుల్ఐటీతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చేతులు కలిపింది. రోబోటిక్స్, నాచురల్ లాంగ్వేజెస్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)పై పరిశోధనకు ప్రత్యేక కేంద్రాన్ని ట్రిపుల్ఐటీలో నెలకొల్పేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది. భారత సాఫ్ట్‌వేర్ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ పేరిట ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి టీసీఎస్ రూ.20 కోట్లు కేటాయించింది. ఈ కేంద్రానికి జులై 23న టీసీఎస్ ముఖ్యులు వచ్చి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
* టీ-హబ్ మొదటి దశ ఇక్కడే
ఈ సంస్థలో దక్షిణ భారత్‌లోనే పెద్దదైన ఇంక్యుబేటర్ కేంద్రం ఉంది. ఇక్కడ 60 స్టార్టప్ కంపెనీలున్నాయి. వాటిని ప్రారంభించిన వాటిల్లో కొందరు సీనియర్ విద్యార్థులు కూడా ఉన్నారు. దీని కోసం ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రం(సీఐఈ) ప్రత్యేకంగా ఉంది. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు కేంద్ర బిందువుగా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అందుకే ట్రిపుల్ఐటీలో టీ-హబ్ పేరుతో ఇంక్యుబేటర్ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. దీనికి గత జనవరిలో శంకుస్థాపన చేశారు. మొదటి దశ ఇక్కడ నెలకొల్పుతారు. అందుకు రూ.35 కోట్లు కేటాయించారు. మొదటి దశను 2017 నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశ టీ-హబ్‌ను రూ.200 కోట్లతో రాయదుర్గంలో నెలకొల్పుతారు. టీ-హబ్‌లో ట్రిపుల్ఐటీకి కీలక పాత్ర.
* సంస్థ ప్రతిభను చూస్తే... - ఆచార్య వాసుదేవ వర్మ, డీన్, పరిశోధన విభాగం
ట్రిపుల్ఐటీ ఏర్పాటు నుంచి ఈ సంస్థ సత్తా ఏమిటో.. పరిశోధన ఎలా ఉందో.. టీసీఎస్ గమనిస్తూనే ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి మా సంస్థలో జరుగుతున్న పరిశోధనను క్షుణ్నంగా తెలుసుకున్నారు. గతంలో టీసీఎస్ పరిశోధనా విద్యార్థులకు 200 స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెట్టగా వాటిల్లో 21 స్కాలర్‌షిప్‌లు మా సంస్థ విద్యార్థులే దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిఏటా నిర్వహించే పోటీల్లో మా విద్యార్థులు బహుమతులు గెలుచుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌ల్లో ఇక్కడి విద్యార్థులు ముందుంటున్నారు. ఇవన్నీ టీసీఎస్ కంపెనీకి తెలుసు. అందుకే రూ.20 కోట్లతో ఇక్కడ కృత్రిమ మేధపై పరిశోధనకు కేంద్రం నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. కచ్చితంగా ఫలితం చూపిస్తాం.
* గచ్చిబౌలిలో ప్రారంభం: 1998
* ట్రిపుల్ ఐటీ విస్తీర్ణం: 66 ఎకరాలు
* ప్రత్యేక పరిశోధన కేంద్రాలు: 20
* పీహెచ్‌డీ విద్యార్థులు సుమారు: 100
* స్టార్టప్ కంపెనీలు: 60
* టీహబ్ మొదటిదశ పూర్తి: 2017 నాటికి
* స్టార్టప్ కంపెనీలకు అవకాశం: 400.

posted on 28.07.2015