Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉన్నత నైపుణ్యాలకు ఐపీఎం

* ఇంటర్మీడియట్‌ అర్హతతో ఐఐఎం, రోహ్‌తక్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్‌ కోర్సు

వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో రోజు రోజుకీ కొత్త కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. వీటి నిర్వహణకు సరికొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ డిమాండ్‌ను గుర్తించిన రోహ్‌తక్‌లోని ఐఐఎం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మొదటిసారిగా ఒక ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.

పారిశ్రామిక, వ్యాపార రంగాల అవసరాల మేరకు నాయకత్వ సామర్థ్యాలు ఉన్న మేనేజ్‌మెంట్‌ నిపుణులను అందించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), రోహ్‌తక్‌ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సును కొత్తగా ప్రవేశపెట్టి 2019-24 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎవరు అర్హులు?
ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2019 నాటికి వయసు 20 సంవత్సరాలు మించకూడదు. ఇదే తేదీ నాటికి ఇంటర్మీడియట్‌ పూర్తిచేయనున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక ఎలా?
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వీరంతా ఐఐఎం రోహ్‌తక్‌ నిర్వహించే ఐపీఎం ఆప్టిట్యూడ్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరు కావాలి. ఇందులో ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల అకడమిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.

ఐపీఎం విధానం
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లో 15 టర్మ్‌లు ఉంటాయి. మూడు నెలలకి ఒకటి చెప్పున సంవత్సరానికి 3 టర్మ్‌లు ఉంటాయి. ప్రోగ్రామ్‌ మొత్తాన్ని ఫౌండేషన్‌ కోర్సెస్‌, మేనేజ్‌మెంట్‌ అని రెండు భాగాలుగా విభజించారు. ప్రతి విద్యాసంవత్సరం ఆఖరులో ఒక ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి ప్లేస్‌మెంట్‌ విషయంలో సహాయ సహకారాలను అందిస్తారు. అయిదు సంవత్సరాలు విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎంఎంఎస్‌) పట్టాను ప్రదానం చేస్తారు. మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసి మధ్యలోనే వెళ్లాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) డిగ్రీని ఇస్తారు.

కోర్సు వివరాలు
ప్రధానంగా గణితం, అర్థశాస్త్రం, స్టాటిస్టిక్స్‌, హ్యుమానిటీస్‌ ఉంటాయి. వీటితో పాటు, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం, బిజినెస్‌-ఫారిన్‌ లాంగ్వేజెస్‌ వంటి ఇతర కోర్సులూ ఉన్నాయి. పీజీ స్థాయి (4, 5 సంవత్సరాల్లో)లో ఇచ్చే కోర్సులు పీజీపీ పాఠ్యాంశానికి సమానంగా ఉంటాయి. మొదటి మూడు సంవత్సరాల్లో ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, స్టాటిస్టిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిలాసఫీ, సైకాలజీ, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, సస్టేనబిలిటీ, ప్రిన్స్‌పల్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, మీడియా అండ్‌ జర్నలిజమ్‌, అడ్వర్‌టైజింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ హిస్టిరీ ఉంటాయి. చివరి రెండేళ్లు (పీజీపీ లెవెల్‌) జనరల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, హెచ్‌ఆర్‌ఎం అండ్‌ ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ ఉన్నాయి. వీటితోపాటు పబ్లిక్‌ స్పీకింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, రూరల్‌/ సోషల్‌ ఎమర్షన్‌ ప్రాజెక్ట్‌, ఇమ్మర్సివ్‌ లర్నింగ్‌, బిజినెస్‌ ఇంటర్న్‌షిప్‌ అదనంగా ఉంటాయి. ఇక్కడ విద్యార్థికి అకడమిక్‌ కోర్సులతోపాటు వారి ఇష్టానికి తగిన కో-కర్‌క్యులర్‌, ఎక్స్‌ట్రా కర్‌క్యులర్‌ యాక్టివిటీస్‌ను అందిస్తారు.
ఐఐఎం రోహతక్‌ అధ్యాపకులు, భారత్‌, ఇతర దేశాల ప్రముఖ సంస్థలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు ఈ కోర్సును బోధిస్తారు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 10
ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: మే 17
వ్యక్తిగత ఇంటర్వ్యూ: జూన్‌ 14 నుంచి 16
ఎంపిక జాబితా ప్రకటన: జులై 2019
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.3540
ఇండక్షన్‌ అండ్‌ ఓరియంటేషన్‌ ఆఫ్‌ ది ప్రోగ్రామ్‌: ఆగస్టు 2019
http://iimrohtak.ac.in/

నాయకత్వం.. ఆత్మవిశ్వాసం
పరిశ్రమల్లో వస్తున్న వేగవంతమైన మార్పు కారణంగా రాబోయే కాలంలో నిపుణుల పనితీరు గణనీయంగా మారబోతోంది. నిరంతరం వారు అప్‌-స్కిల్లింగ్‌, క్రాస్‌-స్కిల్లింగ్‌ను నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా ఐఐఎం రోహ్‌తక్‌ ఐపీఎం కోర్సును రూపొందించింది. దేశంలో అత్యుత్తమ నిర్వహణ ప్రతిభను పెంపొందించి వ్యాపార రంగంలో మంచి నాయకులను తయారుచేయడానికి ఈ కోర్సు తోడ్పడుతుంది. కోర్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలతోపాటు వివిధ సామాజిక అంశాలపై ఆధారపడిన విషయాలను జోడించి కొత్త ప్రయత్నం చేశాం. విద్యార్థులు బహుముఖ వ్యాపార ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సహాయపడేలా ఈ కోర్సు ఉంటుంది. ఉన్నత నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులకు అందిస్తాం.

- ప్రొఫెసర్‌ ధీరజ్‌ శర్మ, డైరెక్టర్‌, ఐఐఎం రోహ్‌తక్‌


Back..

Posted on 24-04-2019