Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బీమా కోర్సులకు ఐఐఆర్‌ఎం

* ప్రవేశాలకు ప్రకటన విడుదల

బీమా రంగంలో ఉద్యోగాలు చాలెంజింగ్‌గా ఉంటాయి. అనుభవంతో సంబంధం లేకుండా అవకాశాలు దొరుకుతాయి. మంచి వేతనాలూ అందుతాయి. అందుకే యువత ఆ కొలువులకు సంబంధించిన కోర్సులు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారి కోసం ఐఐఆర్‌ఎం కొన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

దేశంలో బీమా కోర్సులకు పేరు పొందిన సంస్థల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఆర్‌ఎం), హైదరాబాద్‌ ఒకటి. దీన్ని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌, యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువరించింది. గ్రాడ్యుయేట్లు వీటికి అర్హులు. మేనేజ్‌మెంట్‌ పరీక్షల స్కోర్‌, ఇంటర్వ్యూల ద్వారా అర్హులకు అడ్మిషన్లు ఇస్తారు.

ఇక్కడ రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల వ్యవధితో రెసిడెన్షియల్‌ విధానంలో వీటిని అందిస్తున్నారు. పీజీ డిప్లొమాల వ్యవధి రెండేళ్లు. పీజీ సర్టిఫికెట్‌ల వ్యవధి ఏడాది. ఇవన్నీ ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కోర్సులు. ఆర్థిక సేవలు, బీమా, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, పెన్షన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, యాక్చూరియల్‌ సైన్స్‌, ఎనలిటిక్స్‌ విభాగాల్లో సంస్థల అవసరాలు తీర్చడానికి వీటిని రూపొందించారు. మంచి అకడమిక్‌ నేపథ్యంతోపాటు జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ స్కోర్‌ సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఇక్కడ చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులను పలు సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, ఆర్థిక సంస్థలు, కన్సల్టెన్సీలు, క్రెడిట్‌ కంపెనీలు, మదింపు సంస్థలు వీరికి అవకాశాలను అందిస్తున్నాయి.

కోర్సులు
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌
స్పెషలైజేషన్లు: ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఫైనాన్స్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, యాక్చూరియల్‌ సైన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పరిమిత సీట్లతో అందిస్తున్నారు.
అర్హత: ఈ కోర్సులకు ఏదైనా డిగ్రీతోపాటు క్యాట్‌, మ్యాట్‌, జాట్‌, జీమ్యాట్‌, ఆత్మా, సీమ్యాట్‌, ఐసెట్‌ వీటిల్లో ఏదో ఒక స్కోర్‌ ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం యూజీ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు

పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌
స్పెషలైజేషన్లు: ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, యాక్చూరియల్‌ సైన్స్‌, ఎనలిటిక్స్‌ అండ్‌ యాక్చూరియల్‌ సైన్స్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
దరఖాస్తులు: సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్ఛు
వెబ్‌సైట్‌: https://www.iirmworld.org.in/

ఈ సంస్థ దూరవిద్యలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.. జూన్‌ 30లోగా వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు.

Back..

Posted on 04-04-2020