Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరిశోధనలకు పిలుపు!

* ఐఐఎస్‌సీలో నాలుగేళ్ల బీఎస్‌సీ (రిసెర్చ్‌)

పరిశోధనలే కెరియర్‌గా జీవిత ప్రయాణాన్ని సాగించాలనుకునే వారికి ప్రఖ్యాత ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు నాలుగేళ్ల బీఎస్సీ (రిసెర్చ్‌) కోర్సును అందిస్తోంది. నిష్ణాతులైన అధ్యాపకులు, అత్యున్నతస్థాయి ప్రయోగశాలలు.. ఇంకా ఎన్నో రకాల సౌకర్యాలు ఐఐఎస్‌సీ ప్రత్యేకతలు.
ఐఐఎస్సీ ప్రపంచ స్థాయి సంస్థ. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ర్యాంకుల్లో స్థానం సంపాదించుకుంటోంది. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సును అందిస్తోంది. వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు. మొదటి మూడు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్లో అధ్యయనం కొనసాగుతుంది. నాలుగో ఏట పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్టులో లీనమవుతారు.
కోర్సులో చేరినవారు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌లో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. అలాగే స్పెషలైజేషన్‌, కోర్సుల కాంబినేషన్‌ ఆసక్తి ప్రకారం ఎంచుకోవచ్చు. అయితే అభ్యర్థి అభిరుచితోపాటు మొదటి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రకారం స్పెషలైజేషన్‌ను కేటాయిస్తారు. నాలుగు కోర్సులను మేజర్‌, మైనర్‌ డిసిప్లిన్లుగా ఎంచుకోవాలి. ఇంజినీరింగ్‌ నుంచి ఒక ఎలెక్టివ్‌ కోర్సు, హ్యుమానిటీస్‌ లో ఒక సెమినార్‌ కోర్సు తీసుకోవడం తప్పనిసరి.
కోర్సు పూర్తయిన తర్వాత అభ్యర్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో డిగ్రీలను ప్రదానం చేస్తారు. నాలుగేళ్ల తర్వాత ఐఐఎస్‌సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని పీజీ పట్టా అందుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు!
కోర్సులోకి మొత్తం 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఎంపికైనవారికి ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు.

ప్రవేశం ఇలా...
పరీక్షలేమీ నిర్వహించరు. కేవీపీవై, జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వీటిలో ఎందులోనైనా చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సంబంధిత స్కోరుతో ఐఐఎస్‌సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెలువడనివాళ్లు హాల్‌ టికెట్‌ వివరాలు ఇస్తే సరిపోతుంది. జేఈఈ మెయిన్‌ లేదా అడ్వాన్స్‌డ్‌ లేదా నీట్‌ యూజీలో జనరల్‌ అభ్యర్థులైతే 60 శాతం, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలైతే 54 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం మార్కులు సాధించాలి. కేవీపీవైలో ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశం కల్పిస్తారు.

ఎవరు అర్హులు?
ఎంపీసీ గ్రూప్‌తో 2018లో ఇంటర్‌ పూర్తిచేసినవారు, 2019లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. ఎంపీసీ సబ్జెక్టులతోపాటు బయాలజీ, ఎలక్ట్రానిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఏ ఒక్కటైనా చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
వెబ్‌సైట్‌: www.iisc.ac.in/ug


Back..

Posted on 12-03-2019