Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అత్యున్నతం.. ఐఐఎస్‌సీ

* విశ్వవిద్యాలయాల్లో ఐదో ఏడాదీ అగ్రస్థానమే!

దేశంలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని విద్యాసంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు ముందుంటుంది. సైన్సు కోర్సుల్లో బోధన, పరిశోధనల్లో ఈ సంస్థ కీర్తి ప్రపంచాన్ని తాకింది. తాజాగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఈ సంస్థ మరోమారు ప్రథమ స్థానంలో నిలిచింది. తన స్థాయీ, ప్రమాణాలూ చెక్కుచెదరలేదని నిరూపించింది. మరి ఐఐఎస్‌సీ అందించే కోర్సులూ, ప్రవేశ మార్గాలూ ఏమిటి? తెలుసుకుందాం...

విశ్వవిద్యాలయాల విభాగంలో 2016 నుంచి 2020 వరకు అంటే వరుసగా అయిదో ఏడాదీ దేశంలో నంబర్‌ వన్‌ విద్యాసంస్థగా ఐఐఎస్‌సీ నిలిచింది. ఈ సంస్థ పాటిస్తోన్న ప్రమాణాలే ప్రథమ స్థానానికి కారణం. ఇక్కడి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల ప్రతిభ, ఫ్యాకల్టీ సభ్యుల నైపుణ్యాలు, ప్రయోగశాలలు, పరిశోధలు, వసతులు, వనరులు...ఇవన్నీ అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఇక్కడ బీఎస్‌ రిసెర్చ్, ఎంటెక్, ఎంఆర్క్, ఎం డిజైన్, మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

బోధన, అభ్యసన వనరులు, పరిశోధనలు, ప్రవేశం పొందుతున్న విద్యార్థుల్లో వైవిధ్యం, పట్టాలు పుచ్చుకుంటున్నవారు, విద్యా నిపుణులు, పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయం... తదితర అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు కేటాయించింది.

టాప్‌ టెన్‌ సంస్థలు ఇవీ: ఐఐఎస్సీ- బెంగళూరు; జేఎన్‌యూ- న్యూదిల్లీ; బీహెచ్‌యూ- వారణాసి, అమృతా విశ్వ విద్యాపీఠం, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కలకత్తా యూనివర్సిటీ, మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, సావిత్రీ బాయ్‌ ఫులే పుణె యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా.

తెలుగు రాష్ట్రాల్లో: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 6, ఆంధ్రా యూనివర్సిటీ 19, ఉస్మానియా 29, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 38, కేఎల్‌ యూనివర్సిటీ 41, గీతం యూనివర్సిటీ 71, సత్య సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ 75, ఐఐఐటీ హైదరాబాద్‌ 78, విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ 100 స్థానాల్లో నిలిచాయి.

ఐఐఎస్‌సీ కోర్సులు
* బీఎస్‌ రిసెర్చ్‌: నాలుగేళ్ల వ్యవధితో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, మెటీరియల్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి వివిధ మార్గాలు ఉన్నాయి. కేవీపీవై, ఐఐటీ-జేఈఈ, నీట్‌ల ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు. నాలుగేళ్ల చదువులు పూర్తిచేసుకున్నవారికి బీఎస్‌ రిసెర్చ్‌ డిగ్రీ ఇస్తారు. అయితే మరో ఏడాది ఇదే సంస్థలో కొనసాగితే ఎమ్మెస్సీ పట్టా చేతికందిస్తారు. పరిశోధనల్లో పాలు పంచుకోవాలని ఆశించే ఇంటర్‌ సైన్స్, మ్యాథ్స్‌ గ్రూపుల విద్యార్థులకు బీఎస్‌ రిసెర్చ్‌ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీరికి నెలనెలా స్ట్టైపెండ్‌ అందుతుంది.
* ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ తర్వాత నేరుగా పీజీ, పీహెచ్‌డీ రెండూ కలిపి అయిదేళ్లకే పూర్తిచేసుకునే అవకాశం ఈ సంస్థ అందించే ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలతో లభిస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ఐఐఎస్‌సీ, ఐఐటీలు కలిసి నిర్వహిస్తున్న జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ (జామ్‌), జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జస్ట్‌) వీటిలో ఎందులో మెరిసినా ఈ కోర్సుల్లో చేరిపోవచ్చు. ప్రతి నెలా స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.
* ఎంటెక్, ఎంఆర్క్, ఎం డిజైన్, ఎంబీఏ: బీటెక్, బీఆర్క్, బీడిజైన్‌ కోర్సులు చదివిన విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచీలో ఎంటెక్, ఎంటెక్‌ రిసెర్చ్, ఎంఆర్క్, ఎం డిజైన్‌ చదువుకునే అవకాశం ఉంది. గేట్, జస్ట్, సీడ్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో సంబంధిత కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సుల్లో చేరినవారికి స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇక్కడి మేనేజ్‌మెంట్‌ పీజీ (ఎంబీఏ) కోర్సులో చేరవచ్చు. గేట్‌/ క్యాట్‌ / జీమ్యాట్‌ స్కోర్‌తో అవకాశం లభిస్తుంది.
* పీహెచ్‌డీ: ఈ సంస్థ వివిధ సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీలు అందిస్తోంది. పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్, గేట్, ఇన్‌స్పైర్‌.. వీటిలో ఎందులోనైనా ప్రతిభ చూపితే ఐఐఎస్‌సీలో పరిశోధనలు చేసుకుంటూ నెల నెలా స్ట్టైపెండ్‌ పొందవచ్చు. పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలు, పరిశ్రమలు, బోధన రంగాల్లో పనిచేస్తున్న నిపుణుల కోసం ఐఐఎస్‌సీ ఎక్స్‌టర్నల్‌ పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తోంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో వీరికి అవకాశం ఉంటుంది.

Back..

Posted on 17-06-2020