Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఐఎస్సీలో బీఎస్సీ రిసెర్చ్‌

పరిశోధనలపై ఆసక్తి ఉన్న ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సులు అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

గణితం, సైన్స్‌, పరిశోధన కోర్సులకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన సంస్థ బెంగళూరులోని ఐఐఎస్సీ. నిపుణులు, శాస్త్రవేత్తలతో బోధన, అధునాతన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఉన్నత ప్రమాణాలకు ఈ సంస్థ చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడ నాలుగేళ్ల బీఎస్సీ రిసెర్చ్‌ కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్ఛు ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని పీజీ పట్టా అందుకోవచ్ఛు ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్ఛు.

ఎవరు అర్హులు?
ఎంపీసీ గ్రూప్‌తో 2019లో ఇంటర్‌ పూర్తిచేసినవారు, 2020లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు అర్హులు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లతోపాటు బయాలజీ, స్టాటిస్టిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌.. తదితర సబ్జెక్టులు చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.

స్పెషలైజేషన్లు
బీఎస్సీ రిసెర్చ్‌ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు. మొదటి మూడు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్‌ ఉంటుంది. నాలుగో ఏట పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. కోర్సులో చేరినవారు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌.. వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్ఛు స్పెషలైజేషన్‌, కోర్సుల కాంబినేషన్‌ ఆసక్తి ప్రకారం ఎంచుకోవచ్ఛు అభ్యర్థి అభిరుచితోపాటు మొదటి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రకారం స్పెషలైజేషన్‌ను కేటాయిస్తారు. మేజర్‌, మైనర్‌ డిసిప్లిన్లుగా నాలుగు కోర్సులను ఎంచుకోవాలి. ఇంజినీరింగ్‌ నుంచి ఒక ఎలెక్టివ్‌ కోర్సు, హ్యుమానిటీస్‌లో ఒక సెమినార్‌ కోర్సు తీసుకోవడం తప్పనిసరి. కోర్సు పూర్తయిన తర్వాత అభ్యర్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో డిగ్రీలను ప్రదానం చేస్తారు. కోర్సులోకి మొత్తం 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఎంపికైనవారికి ఆగస్టు 1 నుంచి తరగతులు మొదలవుతాయి. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ట్యూషన్‌ ఫీజులు నామమాత్రంగా ఉంటాయి.

ప్రత్యేక ప్రవేశ పరీక్షలు లేవు
ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలేమీ నిర్వహించరు. కేవీపీవై, జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ యూజీ వీటిలో ఎందులోనైనా చూపిన ప్రతిభ ద్వారా సీట్లు కేటాయిస్తారు. సంబంధిత స్కోరుతో ఐఐఎస్సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెలువడకపోతే హాల్‌టికెట్‌ వివరాలు ఇస్తే సరిపోతుంది. మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. www.iisc.ac.in

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈబీసీలకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.

Back..

Posted on 13-02-2020