Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరిశోధనలకు పక్కా రూటు!

* ఐదేళ్ల బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

పరిశోధనల దిశగా అడుగేయాలనుకుంటున్న ఇంటర్‌ సైన్సు విద్యార్థులను ఐఐఎస్‌ఈఆర్‌లు ఆహ్వానిస్తున్నాయి. ఈ సంస్థలు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌, కేవీపీవైల్లో ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. సగం సీట్లు పరీక్షలో చూపిన ప్రతిభతో భర్తీ చేస్తారు.

మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సుల్లో నాణ్యమైన బోధన, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ, వసతి సౌకర్యాలు అందించి విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపించడానికి ఏర్పాటుచేసినవే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో వీటిని తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు.

ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు సైన్స్‌లో ప్రాథమికాంశాల గురించి బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో విద్యార్థులు తీసుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. అయిదో సంవత్సరం పరిశోధన దిశగా అడుగులేస్తారు. ఇందులో భాగంగా పరిశోధన అభివృద్ధి సంస్థలు, సైన్స్‌ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలు మొదలైనవాటిని సందర్శిస్తారు. మొదటి రెండేళ్లు మాత్రం విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్‌ కోర్సులు, ఆర్ట్‌, ఎర్త్‌సైన్స్‌ల గురించి అభ్యసిస్తారు. అయిదేళ్ల కోర్సులో పది సెమిస్టర్లు ఉంటాయి.

ఐఐఎస్‌ఈఆర్‌- భోపాల్‌లో నాలుగేళ్ల వ్యవధితో బీఎస్‌ (ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌) కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరి.
బీఎస్‌ - ఎంఎస్‌ కోర్సులు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్సెస్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌

ప్రవేశ విధానం
కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో చూపిన ప్రతిభతో సగం సీట్లు భర్తీ చేస్తారు. మిగిలినవి పరీక్షలో చూపిన ప్రతిభతో నింపుతారు. ఈ మూడు మార్గాల్లో ఏ విధానంలో సీటు ఆశించినప్పటికీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో నిర్ణీత కటాఫ్‌ మార్కులను సాధించడం తప్పనిసరి. ద్వితీయ సంవత్సరం ఒక్కో సబ్జెక్టులో సాధించిన మార్కులను వందకు కుదించి 5 సబ్జెక్టులనూ 500కు లెక్కిస్తారు. ఈ లెక్కన జనరల్‌ విభాగంలో ఏపీ విద్యార్థులు 469, తెలంగాణకు చెందినవారు 468 మార్కులు సాధించాలి. ఆయా బోర్డుల వారీ ఈ కటాఫ్‌ మార్కులు గణిస్తారు. నిర్ణీత కటాఫ్‌ కంటే ఎక్కువ సాధించినవారే పరీక్ష రాయడానికి అర్హులు. జేఈఈ ర్యాంకర్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కి ఎంపికైనవాళ్లు సైతం ఐఐఎస్‌ఈఆర్‌ నిర్వహించే పరీక్షను రాసుకోవచ్చు. కేటాయించినవాటితోపాటు ఐఐటీ-జేఈఈ, కేవీపీవై విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉంటే వాటిని పరీక్షలో ప్రతిభ చూపినవారితో భర్తీ చేస్తారు. ఏడు సంస్థల్లోనూ కలిపి 1581 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతినెలా రూ.అయిదు వేలు స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.
సీట్ల వివరాలు: ఐఐఎస్‌ఈఆర్‌: బరంపురం -150, భోపాల్‌ - 325, కోల్‌కతా - 220, మొహాలీ - 225, పుణె - 256, తిరువనంతపురం - 220, తిరుపతి - 185
అర్హత: సైన్సు సబ్జెక్టులతో 2018, 2019లో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.(కటాఫ్‌ మార్కులు సాధించాలి)
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 6 ఉదయం 9 వరకు (కేవీపీవై విభాగంలో మే 26, ఐఐటీ--జేఈఈతో జూన్‌ 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు)
ఆప్టిట్యూడ్‌ పరీక్ష: జూన్‌ 6.
వెబ్‌సైట్‌: www.iiseradmission.in

పరీక్ష ఇలా...
ఒక్కో సబ్జెక్టు నుంచి 15 చొప్పున 4 సబ్జెక్టుల్లో 60 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ ఈ నాలుగు సబ్జెక్టులకూ పరీక్షలో సమాన ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌: ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (ఈఈసీఎస్‌) కోర్సు అందిస్తోంది. ఇందులో చేరిన విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) + కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) ఈ రెండు విభాగాల్లోని ముఖ్యాంశాలను నేర్చుకోవచ్చు. డేటా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు సైతం ఈ సంస్థ అందిస్తోంది. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు మాత్రమే అర్హులు. బీఎస్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌ పేరుతో నాలుగేళ్ల కోర్సు అందిస్తోంది. కోర్సు అనంతరం మరో ఏడాది చదువు పూర్తిచేస్తే ఎంఎస్‌ డిగ్రీని సైతం ప్రదానం చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్‌, గేమ్‌ థియరీ, కార్పొరేట్‌ ఫైనాన్స్‌, ఆప్షన్‌ ప్రైసింగ్‌, బిహేవియరల్‌ ఎకనామిక్స్‌, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌, ఎన్విరాన్మెంటల్‌ ఎకనామిక్స్‌ తదితరాంశాలు బోధిస్తారు. ఇంటర్లో మ్యాథ్స్‌ చదువుకున్నవారు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు.


Back..

Posted on 01-05-2019