Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అరచేతిలో ఐఐటీ పాఠాలు

* హైస్కూలు నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరకు
* తక్కువ ఖర్చుతో ఆన్‌లైన్‌లో

కాలేజీల్లో సౌకర్యాలు లేకపోవడం... సరైన ఫ్యాకల్టీ కొరతతో ఎందరో తెలివైన విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. ఇంటర్‌నెట్‌ ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తోంది. కాజీపేట కుర్రోడు ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ పాఠాలు వినవచ్చు. అమలాపురం అమ్మాయి ఆస్ట్రోఫిజిక్స్‌లో అత్యున్నత స్థాయి లెక్చర్స్‌ చూడవచ్చు. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో పలు పోర్టళ్లు, ఛానల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లోనే అకడమిక్‌, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. అంతర్జాలంలోనే వర్చువల్‌ ల్యాబ్స్‌లో ప్రయోగాలూ చేసుకోవచ్చు.

అందరికీ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, పేరున్న సంస్థలు అందుబాటులో లేకపోవడం అనేది పాత మాట. ఇప్పుడు అన్నీ ప్రతి ఒక్కరికీ దగ్గరకావడం కొత్త బాట. ఆన్‌లైన్‌ అందరినీ, అన్నింటినీ దగ్గర చేస్తోంది. నాణ్యమైన విద్యను, అవకాశాలను విస్తృతం చేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా... నిపుణుల, ప్రొఫెసర్ల పాఠాలు, ప్రసంగాలను వినవచ్చు. అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ వీడియోల ద్వారా నేర్చుకోవచ్చు. మెటీరియల్‌ సేకరించుకోవచ్చు. వర్చువల్‌ విధానంలో ప్రయోగాలు చేసుకోవచ్చు. జేఈఈకి సిద్ధమవుతున్న ఇంటర్‌ విద్యార్థులు ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు ఆస్వాదించవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు అటు ఇంజినీరింగ్‌ పాఠాలు, ఇటు గేట్‌, ఐఈఎస్‌ కోచింగ్‌ రెండూ ఆన్‌లైన్‌లోనే పద్ధతి ప్రకారం పూర్తిచేసుకోవచ్చు. సాధారణ డిగ్రీ, పీజీ పాఠాలూ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ కోసం యూజీసీ, స్కూలు పిల్లల కోసం సీబీఎస్‌ఈ, ఓపెన్‌ స్కూల్‌ అభ్యర్థులకు ఎన్‌ఐఓఎస్‌, దూరవిద్యకు ఇగ్నో... ఇలా పలు సంస్థలు ఆన్‌లైన్‌ సేవలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలు కొన్ని టీవీ ఛానళ్ల కార్యక్రమాలను కేవలం విద్యార్థుల కోసం రూపొందిస్తున్నాయి. ఖర్చు లేకుండా వీటన్నింటినీ వినియోగించుకోవచ్చు. కేంద్ర మానవవనరుల శాఖ ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది.

ఎన్‌పీటీఈఎల్‌
‘ఎవరైనా, ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా’ అనే నినాదంతో ఎన్‌పీటీఈఎల్‌ (నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్‌ లెర్నింగ్‌) పనిచేస్తోంది. ఇది కేంద్ర మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ఏర్పడింది. ఏడు ఐఐటీలు, ఐఐఎస్సీ ఇందులో భాగస్వామ్య సంస్థలు. ఇందులో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌లకు సంబంధించి 269 కోర్సులు ఉన్నాయి. వీటిలో నచ్చిన కోర్సు ఎంచుకుని వీడియో పాఠాలు వినవచ్చు. జులై - అక్టోబరుల్లో వీటికి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కోర్సుల వ్యవధి, సెషన్ల సమయాలను అభ్యర్థి సౌకర్యానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. విద్యార్హతతో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌, సాఫ్ట్‌స్కిల్స్‌, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. సర్టిఫికేషన్‌ పొందాలంటే నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష రాసి కోర్సు పూర్తిచేసిన వారికి ఐఐటీలు, ఐఐఎస్సీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తాయి. విభాగాల వారీగా ప్రొఫెసర్ల పాఠాలతో సీడీలు సిద్ధం చేశారు. రూ. 200 చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు. ఈ పోర్టల్‌ ద్వారా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, గేట్‌ లాంటి వాటికి శిక్షణ కూడా ఉచితంగా పొందవచ్చు. వీడియోలను వీక్షించవచ్చు.
వెబ్‌సైట్‌: https://nptel.ac.in

టీవీలో స్వయంప్రభ
ఐఐటీల్లో చేరాలని, మెడిసిన్‌ సీటు కొట్టాలని ఆశించి, అవసరమైన సౌకర్యాలు లేక అల్లాడే అభ్యర్థుల కోసమే ‘స్వయంప్రభ’ ఉంది. ఎంహెచ్‌ఆర్‌డీ 32 డీటీహెచ్‌ ఛానళ్లను ‘స్వయంప్రభ’ పేరుతో ప్రారంభించింది. ఐఐటీల ఆధ్వర్యంలో నడిచే ఛానల్‌ 19లో బయాలజీ, ఛానల్‌ 20లో కెమిస్ట్రీ, 21లో మ్యాథ్స్‌, 22లో ఫిజిక్స్‌ బోధిస్తున్నారు. ఎన్‌పీటీఈఎల్‌, ఇగ్నో, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఓపెన్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌, ఇంజినీరింగ్‌, యూజీసీ - యూజీ, పీజీ కోర్సులను స్వయంప్రభలో అందిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 4 గంటలపాటు కొత్త కంటెంట్‌ ప్రసారమవుతుంది. దీన్ని అదేరోజు మొత్తంలో 5 సార్లు ప్రసారం చేస్తారు. అభ్యర్థులు తమకు వీలైన సమయంలో వీక్షించవచ్చు. ఒకవేళ దేన్నయినా చూడడం కుదరకపోతే స్వయంప్రభ వెబ్‌సైట్‌ నుంచి ఆ పాఠాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఛానెళ్లు డీడీ ఫ్రీ డిష్‌, డిష్‌ టీవీల్లో అందుబాటులో ఉన్నాయి. కన్సార్టియమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (సీఈసీ) ఆధ్వర్యంలో ఛానల్‌ 1 నుంచి 10 వరకు యూజీ, పీజీ (సైన్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌, సోషల్‌ సైన్సెస్‌) కోర్సుల సమాచారం ఉంటుంది. ఎన్‌పీటీఈఎల్‌ (ఐఐటీలు, ఐఐఎస్సీ) పర్యవేక్షణలో 11 నుంచి 18 వరకు ఛానళ్లను ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం కేటాయించారు. 19 నుంచి 22 వరకు ఛానళ్లను ఐఐటీ పాల్‌ పేరుతో నిర్వహిస్తున్నారు. ఐఐటీ ప్రొఫెసర్‌ అసిస్టెడ్‌ లెర్నింగ్‌ (ఐఐటీ పాల్‌)ను ఐఐటీ దిల్లీ పర్యవేక్షిస్తోంది. ఇంటర్‌ తర్వాత ప్రవేశ పరీక్షలకు ఇది ఉపయోగకరం. 23 నుంచి 26 వరకు ఛానళ్లలో ఇందిరా గాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) అందిస్తోన్న వివిధ కోర్సులను బోధిస్తారు. 27, 28 ఛానళ్లలో నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ బోధించే సెకండరీ, హయ్యర్‌ సెకండరీ కోర్సుల్లో పాఠాలు ఉంటాయి. ఛానల్‌ 29లో ఇంజినీరింగ్‌, టెక్నాలజీల్లో లైవ్‌ తరగతులు, 30లో మ్యాథ్స్‌ ఉంటాయి. ఈ రెండూ ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఛానల్‌ 31 ఎన్‌సీఈఆర్‌ ఆధ్వర్యంలో పాఠశాల, ఉపాధ్యాయ విద్యపై ఉంటుంది. ఛానల్‌ 32 ఉపాధ్యాయ విద్యలో ఇగ్నో, ఎన్‌ఐఓహెచ్‌ అందిస్తోన్న కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.
వెబ్‌సైట్‌: https://swayamprabha.gov.in/index.php/home

సర్టిఫికేషన్లకు స్వయం
స్వయం, స్వయం ప్రభ రెండూ వేర్వేరు. స్వయంప్రభలో కంటెంట్‌ ప్రసారం చేస్తారు. స్వయంలో సర్టిఫికేషన్లు ఉంటాయి. రెగ్యులర్‌ విద్యార్థులు, ఏ విద్యార్హత లేని పద్నాలుగేళ్లు మొదలు అన్ని వయసుల వారూ ఓపెన్‌ స్కూల్‌లో చేరి స్వయం ద్వారా విద్య నేర్చుకోవచ్చు. ఇందులో పాఠశాల స్థాయిలో 110, సర్టిఫికెట్‌ లెవెల్‌లో 70, డిప్లొమాలకు 38, అండర్‌ గ్రాడ్యుయేట్‌ 965, పోస్టు గ్రాడ్యుయేట్‌లకు 358 వీడియో పాఠాలు ఉన్నాయి. ఇంజినీరింగ్‌, యూజీ, పీజీ, ఇంటర్‌, హైస్కూలు విద్యార్థుల కోసం వివిధ ప్రోగ్రామ్‌లు సిద్ధం చేశారు. మేనేజ్‌మెంట్‌ విద్యకు ఐఐఎం- బెంగళూరు, టీచర్‌ ట్రెయినింగ్‌లో ఎన్‌ఐటీటీఆర్‌, చెన్నై కంటెంట్‌ సమన్వయకర్తలుగా చేస్తున్నాయి. ఏఐసీటీఈతో కలిసి మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక సహాయంతో ఎంహెచ్‌ఆర్‌డీ స్వయం పోర్టల్‌ను రూపొందించింది. ఇందులో రెండు వేల కోర్సులకు సంబంధించి ఎనభైవేల గంటల నిడివిగల వీడియో పాఠాలు ఉన్నాయి.
వెబ్‌సైట్‌: https://swayam.gov.in

77 పీజీలకు దారి ఈ-పీజ
పీజీ విద్యార్థుల కోసం 77 సబ్జెక్టుల్లో కంటెంట్‌ అందిస్తున్నారు. దీన్ని నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ త్రూ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఎంఈ - ఐసీటీ) ద్వారా ఎంహెచ్‌ఆర్‌డీ అందిస్తోంది. పీజీ కరిక్యులమ్‌కు అనుగుణంగా కంటెంట్‌ ఇస్తున్నారు. సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, ఫైన్‌ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌, లాంగ్వేజ్‌లు, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, లైఫ్‌ సైన్స్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ బేసిక్‌ సైన్సెస్‌ సబ్జెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులోనూ చాప్టర్లు, విభాగాలవారీ పాఠాలు ఉంటాయి. ప్రతి దానికీ ఈ- టెక్స్ట్‌, సెల్ఫ్‌ లర్నింగ్‌, లర్న్‌ మోర్‌ విభాగాలు ఉన్నాయి. రిఫరెన్స్‌ పుస్తకాలు, అదనపు సమాచారం కూడా పొందుపరిచారు. పీజీ సబ్జెక్టుల్లో పట్టు సాధించడానికి, నెట్‌ లాంటి వాటికి ఈ-పీజీ ఎంతో విలువైంది.
వెబ్‌సైట్‌: https://epgp.inflibnet.ac.in/index.php

లర్నర్స్‌ గేట్‌ వే...విద్యామిత్ర
ఎంహెచ్‌ఆర్‌డీకి చెందిన ఎన్‌ఎంఈ-ఐసీటీ ద్వారా విద్యామిత్ర పోర్టల్‌ రూపొందించారు. ఇందులో 44,450 ఇ-టెక్స్ట్‌లు, 66,174 ఈ ట్యుటోరియల్స్‌/ వీడియోలు ఉన్నాయి. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజ్‌లు, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఫిజికల్‌ అండ్‌ బేసిక్‌ సైన్సెస్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, సెకెండరీ, సీనియర్‌ సెకెండరీ పాఠ్యాంశాలు ఉంటాయి. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో రూపొందిన కంటెంట్‌ అంతా విద్యామిత్రలో లభిస్తుంది. అన్ని పోర్టళ్లకు ఇది ఇంటిగ్రేషన్‌. ఈ పోర్ట ల్‌లో హైస్కూల్‌, సీనియర్‌ హైస్కూల్‌, యూజీ, పీజీ కోర్సులకు చెందిన కావాల్సిన కంటెంట్‌ అంతా చూసుకోవచ్చు.
వెబ్‌సైట‌: http://content.inflibnet.ac.in

సాక్షాత్‌...
యాక్సెస్‌, ఈక్విటీ, ఈక్వాలిటీ ప్రాతిపదికన సాక్షాత్‌ ఆవిర్భవించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఎలక్ట్రానిక్‌ కంటెంట్‌ రూపొందించడానికి సాక్షాత్‌ వేదిక. దేశంలో ఉన్న మానవవనరులు వృథా కాకుండా ప్రతి ఒక్కరూ ప్రయోజకులుగా రూపొందాలనే లక్ష్యం సాక్షాత్‌ ఆవిర్భావానికి కారణం. ఇందులోనూ ఎన్టీపీఈఎల్‌, వర్చువల్‌ ల్యాబ్స్‌, ఇ-పీజీ పాఠశాలలతోపాటు వివిధ రకాల అవసరాలు తీర్చడానికి పలు పోర్టళ్లు ఉన్నాయి. బోధనాంశాలు నేర్చుకోవడం, కంప్యూటర్‌ ప్రొగ్రామ్లు, స్పోకెన్‌ ట్యుటోరియల్‌, ఉపాధ్యాయులతో మాట్లాడడానికి పలు పోర్టళ్లు సాక్షాత్‌లో భాగంగా ఉన్నాయి.
వెబ్‌సైట్‌: http://www.sakshat.ac.in

విద్యార్థులకు వరం వర్చువల్‌ ల్యాబ్స్‌
పాఠ్యాంశాలను చదవడం, నేర్చుకోవడం, వాటిని ఉపయోగించడం అన్నీ విద్యార్థులకు ముఖ్యమే. ముఖ్యంగా సైన్స్‌ విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా చాలా తెలుసుకుంటారు. ఎప్పటికీ మరచిపోని విధంగా గుర్తుంచుకోగలుగుతారు. కానీ మన విద్యాసంస్థల్లో చాలా వాటిలో అధ్యాపకులు, ప్రయోగశాలల కొరత ఉంది. ఈ ఇబ్బందులను అధిగమించి ఆశించినంత అధ్యయనం చేయడాన్ని ఇప్పుడు టెక్నాలజీ సాధ్యం చేస్తోంది. అవే వర్చువల్‌ ల్యాబ్స్‌. తక్కువ ఖర్చుతో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ కాన్సెప్టుల వరకు తెలుసుకోవచ్చు. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను కార్యరూపంలో పెట్టవచ్చు. ఈ వర్చువల్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్థుల్లో ప్రయోగ నైపుణ్యాలు మెరుగవుతాయి. కేంద్ర మానవవనరుల శాఖ వీటిని నెలకొల్పింది. ఐఐటీలు, మరికొన్ని సంస్థలకు ఇందులో భాగస్వామ్యం ఉంది. సైన్స్‌, ఇంజినీరింగ్‌లకు సంబంధించి ఈ ల్యాబ్స్‌లో కావాల్సినంత సమాచారం లభిస్తోంది. వీటిని ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా చూడగలిగే విధంగా రిమోట్‌ యాక్సెస్‌ ఇచ్చారు. అండర్‌ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పరిశోధక విద్యార్థులందరూ వీటిని వినియోగించుకోవచ్చు. వీడియో లెక్చర్లు, యానిమేటెడ్‌ డెమానుస్ట్రేషన్లు, అదనపు వెబ్‌ రిసోర్సులు తదితరాలన్నీ ఉంటాయి. పరికరాలకు సంబంధించి ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌ ఉండటం వల్ల ప్రయోగం నిజంగా చేసిన అనుభూతి కలుగుతుంది.
ఏయే విభాగాల్లో!
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బయో టెక్నాలజీ అండ్‌ బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌లో ల్యాబ్స్‌తోపాటు ముఖ్యమైన చాప్టర్లకు సంబంధించి రిఫరెన్స్‌ పుస్తకాలు, సిలబస్‌ మ్యాపింగ్‌ ఉంటాయి.
ఎలా ఉపయోగించుకోవచ్చు?
వర్చువల్‌ ల్యాబ్స్‌ను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే సరిపోతుంది. ఇందుకోసం http://vlab.co.in లోకి వెళ్లాలి. విభాగాలవారీ, సంస్థలవారీ ల్యాబ్స్‌ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిలో కావాల్సిన ల్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. ఈ ల్యాబ్స్‌లో రెండు రకాలు ఉన్నాయి. అవి సిమ్యులేషన్‌ బేస్డ్‌, రిమోట్‌ ట్రిగ్గర్డ్‌. సిమ్యులేషన్‌ ఆధారిత ల్యాబ్స్‌లో గణిత సమీకరణాలను ఉపయోగించిన ప్రయోగ నమూనాలు ఉంటాయి. రిమోట్‌ బేస్డ్‌లో పరిమితంగా ప్రవేశం లభిస్తుంది. నిర్ణీత వేళల కోసం ముందుగానే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. రియల్‌ టైమ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అనుభూతి కలుగుతుంది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమయాల్లోనే రిమోట్‌ ట్రిగ్గర్డ్‌ ల్యాబ్స్‌లో అవకాశం ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే వీక్షణ సాధ్యమవుతుంది. సిమ్యులేషన్‌ ఆధారిత ల్యాబ్స్‌ రోజు మొత్తం అందుబాటులో ఉంటాయి. చాలా వరకు వర్చువల్‌ ల్యాబ్స్‌కు లాగిన్‌ అవసరం ఉండదు. అయితే రిమోట్‌ ట్రిగ్గర్డ్‌ ల్యాబ్స్‌ కోసం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. థియరీ ఆధారిత ఉపన్యాసాలు, చిన్నచిన్న ప్రాజెక్టులు కొన్ని వర్చువల్‌ ల్యాబ్స్‌లో ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న తరగతులకు ల్యాబ్‌ డెమాన్‌స్ట్రేషన్‌ కోసం ఈ వర్చువల్‌ ల్యాబ్స్‌ ఉపయోగపడతాయి. విద్యార్థులు సులువుగా అర్థం కావడానికి మొదట ప్రాథమిక భావనలను అధ్యయనం చేయవచ్చు. ఆ తర్వాత అందులో అడ్వాన్స్‌డ్‌ కాన్సెప్టులకు వెళ్లవచ్చు.
భాగస్వామ్య సంస్థలు: ఐఐటీ - బాంబే, దిల్లీ, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, రూర్కీ, గువాహటి, హైదరాబాద్‌; అమృతా విశ్వవిద్యా పీఠం, దయాల్‌బాగ్‌ యూనివర్సిటీ, నిట్‌-కర్ణాటక, సీఓఈ-పుణే.
వివిధ విభాగాల్లో దాదాపు 1100కు పైగా ప్రయోగాంశాలు అందుబాటులో ఉన్నాయి. సొంతంగా ఇంటర్న్‌షిప్‌ నిర్వహణకు చేయూతనివ్వడం, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, సమస్యను పరిష్కరించటం, కొత్త ప్రయోగాలకు ఊతమివ్వడం వర్చువల్‌ ల్యాబ్‌ లక్ష్యం. ఖరీదైన ప్రయోగ పాఠాలను ఉచితంగా అందజేయటం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తారు. దీంతోపాటు కళాశాలలు స్వయంగా ఇంటర్న్‌షిప్‌ చేపట్టేందుకు వర్చువల్‌ ల్యాబ్‌ అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తుంది. ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన బోధన నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన తర్వాత ధ్రువపత్రాలు అందిస్తారు.
వెబ్‌సైట్‌: http://vlab.co.in

- లుకలాపు మోహనరావు‌

 
Back..

Posted on 02-08-2018