Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంటర్‌తో ఐఐటీలో ఆర్ట్స్‌ కోర్సులు

* కెరియర్‌ ట్రెండ్స్‌ 2020

ఇంటర్‌ తర్వాత ఐఐటీలో ఆర్ట్స్‌ కోర్సులు చదివే అరుదైన అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌, సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాలకు సంబంధించిన మైనర్‌ స్ట్రీమ్‌ ఎలక్టివ్‌లతో కూడి ఉండటం ఈ కోర్సు ప్రత్యేకత. ఇందులో చేరితే ఒక విదేశీభాషను నేర్చుకోడానికీ వీలుంటుంది.

ఐఐటీల్లో కేవలం ఇంజినీరింగ్‌ కోర్సులే కాదు.. ఇతర కోర్సులూ ఉంటాయి. మద్రాస్‌ ఐఐటీ ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా వీటికోసం పోటీ పడవచ్ఛు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా కోర్సులోకి తీసుకుంటారు. డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ స్టడీస్‌ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు.

మొదటి రెండేళ్లు అందరికీ ఉమ్మడిగా బోధిస్తారు. మూడో ఏట నుంచి రెండు విభాగాలకు విడిగా బోధన ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, తొలి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన కోర్సు కేటాయిస్తారు. ఒక్కో విభాగంలో 26 మందికి అవకాశం ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ కోర్సులను అందిస్తోంది. వీటిని పూర్తిచేసుకున్నవారు మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.

పరీక్ష విధానం
మొత్తం 3 గంటల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు భాగాలుంటాయి. తొలిభాగంలో ఆన్‌లైన్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వ్యవధి రెండున్నర గంటలు. రెండో భాగం వ్యవధి 30 నిమిషాలు. ఇందులో భాగంగా అడిగిన అంశంలో వ్యాసాన్ని రాయాలి. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌ స్కిల్‌; ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌ (ఇండియన్‌ ఎకానమీ, సొసైటీ, కల్చర్‌, వరల్డ్‌ ఎఫైర్స్‌), ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ 25 శాతం, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25 శాతం, జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంగ్లిష్‌ విభాగంలో ప్రామాణిక ఆంగ్లాన్ని ఉపయోగించే విధానంపై ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్‌ ప్రశ్నల ద్వారా రీడింగ్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. వాక్యనిర్మాణం, దాన్ని ఉపయోగించే విధానం, కాలాలు, క్రియలు, ఆర్టికల్స్‌, ప్రత్యక్ష, పరోక్ష ప్రశ్నలను వ్యాకరణంలో భాగంగా అడుగుతారు. ఎనలిటికల్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో భాగంగా అంకెలు, ఆల్జీబ్రా, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, క్యాలెండర్‌, సగటు, నిష్పత్తి, లాభనష్టాలు, శాతాలు, వడ్డీలు, పని, కాలం, డిస్కౌంట్‌, సరళ సమీకరణాలు, త్రికోణమితిలోని ప్రాథమికాంశాలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, బ్రెయిన్‌ టీజర్స్‌, ప్యాటర్న్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ స్టడీస్‌లో అర్థశాస్త్రం, భారతీయ సమాజం, సంస్కృతి, ప్రపంచ సంబంధాలు, పర్యావరణ అంశాలపై సాధారణ స్థాయి ప్రశ్నలు ఇస్తారు. వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌తో ముడిపడి ఉన్న వ్యాసాన్ని రాయమంటారు. దీనిద్వారా అభ్యర్థి ఆలోచనా విధానం, అవగాహన సామర్థ్యాలను పరిశీలిస్తారు.

ముఖ్యాంశాలు
కోర్సులు: డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ స్టడీస్‌
మొత్తం సీట్లు: 52 (26 + 26)
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం.
వయసు: అక్టోబరు 1, 1995 తర్వాత జన్మించిన ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1990 తర్వాత జన్మించినా అర్హులే.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 19
అందుబాటులోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌
అడ్మిట్‌ కార్డులు: మార్చి 18 నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్ఛు
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1200. మిగిలిన అందరికీ రూ.2400
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జనవరి 22

వెబ్‌సైట్‌: http://hsee.iitm.ac.in

Back..

Posted on 25-12-2019