Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఐటీల్లోనూ ఆర్ట్స్‌ సీట్లు!

* హ్యుమానిటీస్‌, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ప్రత్యేక కోర్సులు

శ్రేష్ఠమైన విద్యను అంతర్జాతీయ స్థాయిలో అందించే ఐఐటీల్లో చేరాలంటే... మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపులవారికే సాధ్యమనుకుంటారు చాలామంది. కానీ ఐఐటీలంటే బీటెక్‌, ఎంటెక్‌ మాత్రమే కాదు; ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ కూడా చదవొచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ కోర్సు కూడా మొదలవుతోంది. పాతతరం ఐఐటీలు వివిధ కోర్సులను అందిస్తుండటంతో అన్ని గ్రూపుల విద్యార్థులకూ ఐఐటీల గడప తొక్కే అవకాశం ఏర్పడుతోంది.

నాణ్యమైన ఇంజినీర్లే కాదు; లాయర్లు, వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, చరిత్రకారులు, వైద్యులు... ఇలా అన్ని రంగాల్లోనూ నిష్ణాతులు ఆవిర్భవించడానికి ఐఐటీలు వేదికలవుతున్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేక కోర్సులున్నాయి. అభిరుచీ, ఆసక్తీ ఉన్నవారు ప్రవేశ పరీక్షలు రాసి ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీయన్లుగా అవ్వాలనే అభిలాషను నెరవేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేట్ల కోసం ఐఐటీల్లో వివిధ ఎమ్మెస్సీ కోర్సులున్నాయి. ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియాలజీ, బయలాజికల్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో రెండేళ్ల ఎమ్మెస్సీతోపాటు జాయింట్‌ ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. వీటిని ఉమ్మడి ప్రవేశ పరీక్ష జామ్‌ ద్వారా భర్తీ చేస్తారు.
ప్రకటన: ఇప్పటికే వెలువడింది. అక్టోబరు 10 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.

పాతతరం ఐఐటీల్లో ఎంబీఏ
పాతతరం ఐఐటీలైన దిల్లీ, బాంబే, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, రూర్కీ, కాన్పూర్‌, ధన్‌బాద్‌లు ఎంబీఏ కోర్సు అందిస్తున్నాయి. ఒకప్పుడు జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (జేమెట్‌) ద్వారా ప్రవేశం కల్పించేవారు. 2011 నుంచి దాని స్థానంలో క్యాట్‌ స్కోర్‌, జీడీ, ఇంటర్వ్యూల ద్వారా కోర్సుల్లోకి చేర్చుకుంటున్నారు. ఫీˆజు రూ.2 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటోంది. ఈ సంస్థల్లోని విద్యార్థులు సగటున రూ.8 లక్షల నుంచి 18 లక్షల వరకు వార్షిక వేతనంతో క్యాంపస్‌ అవకాశాలు అందుకుంటున్నారు. బాంబే, దిల్లీ, ఖరగ్‌పూర్‌ ఐఐటీలు ప్లేస్‌మెంట్ల పరంగా ముందున్నాయి. ఇక్కడి ఎంబీఏ విద్యార్థులు గరిష్ఠ ప్యాకేజీ రూ.21 లక్షల నుంచి 27 లక్షల వరకు పొందుతున్నారు.
వీటిలో ప్రవేశానికి క్యాట్‌లో 95+ పర్సంటైల్‌ తప్పనిసరి. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. ఐఐటీ దిల్లీ ఎంబీఏతోపాటు ఎంబీఏ (టెలికమ్యూనికేషన్‌ సిస్టమ్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు అందిస్తోంది. ఐఐటీ బాంబే మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో కోర్సు నిర్వహిస్తోంది. క్యాట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
బీటెక్‌ లేదా ఏదేని పీజీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఐఐటీని బట్టి అర్హతల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. కొన్ని ఐఐటీలు సాధారణ గ్రాడ్యుయేట్లకూ అవకాశం కల్పిస్తున్నాయి.

ఐఐటీ మద్రాస్‌లో ఎంఏ
2006లో ఐఐటీ-మద్రాస్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఎంఏ ఇంగ్లిష్‌ స్టడీస్‌ అందిస్తున్నారు. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) ద్వారా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ పరీక్ష రాసుకోవచ్చు. ఏటా ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకీ 23 మంది చొప్పున మొత్తం 46 మంది విద్యార్థులను చేర్చుకుంటారు.
మూడు గంటల వ్యవధిలో 2 పేపర్లు రాయాలి. పేపర్‌- 1 వ్యవధి రెండున్నర గంటలు. ఇది కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌. ఇందులో ఇంగ్లిష్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌ (స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక రంగం, భారత సమాజం, వర్తమాన ప్రపంచం, పర్యావరణం...) ప్రశ్నలడుగుతారు. ఇంగ్లిష్‌ నుంచి 25 శాతం, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 25 శాతం, జనరల్‌ స్టడీస్‌ నుంచి 50 శాతం ప్రశ్నలొస్తాయి. పేపర్‌-2 వ్యాసరూపంలో ఉంటుంది. వ్యవధి అరగంట. పేపర్‌ పైనే రాయాల్సి ఉంటుంది. అవసరమైతే పేపర్‌ పరీక్ష బదులు చర్చ కూడా నిర్వహిస్తారు.
ప్రకటన: డిసెంబరులో వెలువడుతుంది.
వెబ్‌ సైట్‌: http://hsee.iitm.ac.in/index.html

ఐఐటీ గువాహతిలో డెవలప్‌మెంట్‌ స్టడీస్‌
ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ కోర్సును ఐఐటీ గువాహతి 2009 నుంచి అందిస్తోంది. మొత్తం 48 సీట్లు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. జూన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువతున్న విద్యార్థులూ అర్హులే.
రాత పరీక్షలో: ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ విధానాల్లో ప్రశ్నలుంటాయి. వర్తమాన వ్యవహారాలు, అర్థశాస్త్రం, రాజకీయాలు, సమాజం...తదితరాంశాల్లో తాజా సమాచారంపై ప్రశ్నలుంటాయి. వీటితోపాటు లాజికల్‌ రీజనింగ్‌ లోనూ అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు.
ప్రకటన: ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ప్రకటన వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: www.iitg.ac.in/hss

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో...
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం
ఎల్‌ఎల్‌బీ (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా) కోర్సును ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందిస్తోంది. ఇది మూడేళ్ల బ్యాచిరల్‌ డిగ్రీ కోర్సు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఇంజినీరింగ్‌ లేదా మెడిసిన్‌ లేదా సమాన కోర్సులో ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్‌ లేదా ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ శ్రేణితో పీజీ పూర్తిచేసినవాళ్లూ ఈ కోర్సుకు అర్హులే. పై రెండు కోర్సుల్లో వేటినైనా చదివి, 60 శాతం మార్కులతో ఎంబీఏ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్షలో వివిధ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఇంగ్లిష్‌ నుంచి 60, లాజికల్‌ రీజనింగ్‌ 20, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 15, బేసిక్‌ సైన్స్‌ (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్‌ సైన్స్‌) 35, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 70, ఎస్సే 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
ప్రథమ శ్రేణితో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసినవారు ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. లీగల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
ప్రకటన: రెండు కోర్సుల్లోనూ ప్రవేశానికి జనవరిలో ప్రకటన వెలువడవచ్చు.
వెబ్‌సైట్‌: www.iitkgp.ac.in/topfiles/ law.php

ఎంహెచ్‌ఆర్‌ఎం
మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం) కోర్సును ఖరగ్‌పూర్‌ ఐఐటీ అందిస్తోంది. ఇంజినీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఏదైనా సబ్జెక్టులో పీజీ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. క్యాట్‌ స్కోర్‌, రిటన్‌ ఎబిలిటీ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం లభిస్తుంది.
కోర్సు వ్యవధి రెండేళ్లు. 30 సీట్లు ఉన్నాయి. కోర్సులో చేరినవారు ప్రముఖ సంస్థల్లో మానవవనరుల విభాగంలో ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఫీజు ప్రతి సెమిస్టర్‌కు రూ.75,000 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు లభిస్తుంది.
ప్రకటన: ఫిబ్రవరిలో ప్రవేశ ప్రకటన వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: ‌www.iitkgp.ac.in

ఎంఎంఎస్టీ
మాస్టర్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎంఎంఎస్టీ) కోర్సును ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందిస్తోంది. ఈ కోర్సులో చేరాలంటే 55 శాతం మార్కులతో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించాలి. దీనితోపాటు ఇంటర్లో మ్యాథ్స్‌ చదవడం తప్పనిసరి. (గణితాన్ని అదనపు సబ్జెక్టుగా చదివినవారూ అర్హులే).
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇందులో 120 ప్రశ్నలుంటాయి. 75 ప్రశ్నలు ఎంబీబీఎస్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. మిగిలినవి ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు.

పీజీడీబీఏ
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ (పీజీడీబీఏ) కోర్సు ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఎం కోల్‌కతా, ఐఎస్‌ఐ కోల్‌కతా మూడూ కలిపి అందిస్తున్నాయి. ఇది రెండేళ్ల పూర్తి వ్యవధితో కూడిన రెసిడెన్షియల్‌ కోర్సు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సంస్థలోనూ ఒక్కో సెమిస్టర్‌ కోర్సు ఉంటుంది. చివరి సెమిస్టర్‌ ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌కు కేటాయించారు.
బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో రాణించాలని కోరుకునేవారికి ఇది అత్యుత్తమ కోర్సు. మొదటి సెమ్‌లో ఐఎస్‌ఐ ఎనలిటిక్స్‌కు సంబంధించి స్టాటిస్టిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ థియరీని అందిస్తారు. అనంతరం ఐఐటీ ఖరగ్‌పూర్‌ లో ఎనలిటిక్స్‌లోని సాంకేతిక అంశాలపై రెండో సెమిస్టర్‌ మొత్తం బోధిస్తారు. మూడో సెమిస్టరు ఐఐఎం కోల్‌కతాలో ఎనలిటిక్స్‌ అనువర్తనాలు, ఫంక్షనల్‌ విభాగాల గురించి అవగాహన కల్పిస్తారు. 50+ సీట్లు ఉన్నాయి. కోర్సు ఫీజు రూ.20 లక్షలు. ఈ కోర్సులో చేరినవారికి వంద శాతం ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి. సగటున ప్రతి విద్యార్థీ రూ.17 లక్షలకు పైగా వార్షిక వేతనంతో దేశీయంగా అవకాశాలు పొందుతున్నారు.
ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల యూజీ కోర్సులు లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏ సాధించాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డేటా విజువలైజేషన్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి.
ప్రకటన: డిసెంబరులో వెలువడుతుంది.
ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి.

ఎంబీబీఎస్‌
వచ్చే (2019) విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ కోర్సును అందించడానికి ఐఐటీ ఖరగ్‌పూర్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎంబీబీఎస్‌ విద్యార్థుల కోసం ఇక్కడ ఎంఎంఎస్టీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ ఐఐటీలో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాలంటే ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నిర్వహించే టెస్ట్‌ లేదా యూజీ నీట్‌ రాయాల్సి ఉంటుంది.
ప్రవేశ విధానం, సీట్ల సంఖ్య గురించి వివరాలు ప్రకటించాల్సివుంది.

ఎకనామిక్స్‌
ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ పేరుతో ఐఐటీ ఖరగ్‌పూర్‌ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు అందిస్తోంది. ఐఐటీ-జేఈఈ ద్వారా ఇందులో ప్రవేశం లభిస్తుంది.
ఐఐటీ రూర్కెలా ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ రెండేళ్ల కోర్సు అందిస్తోంది. డిగ్రీలో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదువుకున్నవారు దీనికి అర్హులు. జామ్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది. 30 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరినవారికి ప్రముఖ సంస్థల్లో ప్రాంగణ నియామకాలు లభిస్తున్నాయి.

ఐఐటీ గాంధీనగర్‌లో...
ఎంఏ సొసైటీ అండ్‌ కల్చర్‌
ఎంఏ సొసైటీ అండ్‌ కల్చర్‌ రెండేళ్ల కోర్సుని ఐఐటీ గాంధీనగర్‌ అందిస్తోంది. ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 15 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరిన అర్హులకు నెలకు రూ.5000 చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తున్నారు. పరీక్షలో ఇంగ్లిష్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్లు ఇచ్చి వాటిపై ప్రశ్నలడుగుతారు.
ప్రకటన: డిసెంబరులో ప్రకటన వెలువడుతుంది.
మార్చిలో పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: http://hss.iitgn.ac.in/masc

ఎమ్మెస్సీ కాగ్నెటివ్‌ సైన్స్‌
రెండేళ్ల ఎమ్మెస్సీ కాగ్నెటివ్‌ సైన్స్‌ కోర్సు ఐఐటీ గాంధీనగర్‌లో ఉంది. ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్షలో ఇంగ్లిష్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్లు ఇచ్చి వాటిపై ప్రశ్నలడుగుతారు.
ఈ కోర్సులో చేరిన అర్హులకు నెలకు రూ.5000 చొప్పున స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. 15 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చిలో పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి.
ప్రకటన: డిసెంబరులో ప్రకటన వెలువడుతంది.
వెబ్‌సైట్‌: http:// cogs.iitgn.ac.in

Back..

Posted on 01-10-2018